ఇండియా - ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌ రికార్డులు: మెల్‌బోర్న్‌లో 37 ఏళ్ల 10 నెలల తర్వాత భారత జట్టుకు మళ్లీ విజయం

కోహ్లీ

ఫొటో సోర్స్, EPA

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును ఆదివారం 137 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యం అందుకుంది.

టెస్ట్ సిరీస్‌లో మరొక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మాత్రం భారత్ వద్దే ఉండనుంది. ఎందుకంటే గత సిరీస్‌లో భారత జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. మిగిలిన ఒక మ్యాచ్‌ను భారత్ గెలిచినా, ఆస్ట్రేలియా గెలిచినా, డ్రా అయినా, ఫలితం తేలకున్నా భారత జట్టు ట్రోఫీని మాత్రం కోల్పోదు.

మెల్‌బోర్న్ టెస్ట్ విజయంతో పాటు భారత జట్టు, జట్టులోని పలువురు క్రికెటర్లు పలు రికార్డులు నెలకొల్పారు.

ఈ విజయం టెస్టుల్లో భారత జట్టుకు లభించిన 150వ విజయం.

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాను భారత్ ఓడించటం ఇదే తొలిసారి. మెల్‌బోర్న్ టెస్ట్‌ కంటే ముందు భారత జట్టు ఆస్ట్రేలియాలో గత 33 ఏళ్లలో ఏడుసార్లు బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌ ఆడింది. అందులో ఐదుసార్లు ఓడిపోయింది. రెండుసార్లు డ్రా అయ్యింది.

ఇది భారత జట్టుకు 532వ టెస్ట్ మ్యాచ్. ఇందులో భారత్ 165 టెస్టుల్లో పరాజయం పాలైంది. మరో 216 టెస్టులు డ్రా అయ్యాయి. ఒక మ్యాచ్ టైగా ముగిసింది.

మెల్‌బోర్న్‌లో 37 ఏళ్ల 10 నెలల తర్వాత భారత జట్టు మళ్లీ విజయం సాధించిందని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు.

‘‘ఇరు జట్లలో ఇప్పుడున్న ఆటగాళ్లెవ్వరూ అప్పటికి పుట్టలేదు. ఈ విజయం చాలాకాలం పాటు గుర్తుండిపోతుంది. ఈ విజయంలో పాలుపంచుకున్నందుకు ప్రతి ఒక్క ఆటగాడూ గర్వపడాలి’’ అని లక్ష్మణ్ పేర్కొన్నారు.

1981 ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగిన ఆ మ్యాచ్‌లో భారత జట్టు 59 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది.

గంగూలీ రికార్డును సమం చేసిన కోహ్లీ

ఈ టెస్టు విజయంతో.. విదేశాల్లో అత్యధిక టెస్టుల్లో విజయాలు అందుకున్న భారత కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు.

సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా విదేశాల్లో 11 టెస్టు మ్యాచుల్లో భారత జట్టుకు విజయం అందివ్వగా.. కోహ్లీకి మెల్‌బోర్న్ టెస్టు విజయం కెప్టెన్‌గా విదేశాల్లో పదకొండోది.

కాగా, సౌరవ్ గంగూలీ విదేశాల్లో మొత్తం 28 టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించగా.. కోహ్లీకి ఇది కెప్టెన్‌గా 24వ టెస్టు.

రిషబ్ పంత్ రికార్డు

వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఒక రికార్డు సాధించాడు. ఒక టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు వికెట్ కీపర్‌గా అత్యుత్తమ ప్రదర్శనను అతను నమోదు చేశాడు.

ఈ సిరీస్‌లో పంత్ ఇప్పటి వరకూ 20 క్యాచ్ ఔట్‌లు సాధించాడు.

ఇప్పటి వరకూ ఈ రికార్డు సయ్యద్ కీర్మాణీ (19 క్యాచ్ ఔట్‌లు) పేరిట ఉండేది.

ఈ సిరీస్‌లో నాల్గవది, చివరిది అయిన టెస్ట్ మ్యాచ్ 2019 జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సిడ్నీలో జరుగనుంది.

జస్‌ప్రీత్ బుమ్రా రికార్డు

ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, రెండో ఇన్సింగ్స్‌లో 3 వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకూ ఒక టెస్ట్ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు.

ఈ ఏడాది భారత ఫాస్ట్ బౌలర్లు.. జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీలు ముగ్గురూ టెస్టుల్లో 136 వికెట్లు పడగొట్టారు. ఇది కూడా ఒక రికార్డు. 1984లో 130 వికెట్లు పడగొట్టిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల త్రయం రికార్డును వీళ్లు బద్దలుగొట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)