ఈస్టిండియా కంపెనీ: చరిత్రలోనే అత్యంత బలమైన కంపెనీ తన ఉద్యోగులను ఎలా చూసుకుంది?
- అమండా రుగ్గెరి
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, HERITAGE IMAGE PARTNERSHIP LTD ALAMY
భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ అధికారి వైభవం
ఈరోజు మీకు ప్రపంచంలోనే అత్యంత బలమైన కంపెనీ కథ చెప్పబోతున్నాం.
ఆ కంపెనీ పేరు 'ఈస్టిండియా కంపెనీ'. అది భారత్ సహా ప్రపంచంలో ఒక పెద్ద భాగంపై సుదీర్ఘ కాలంపాటు పెత్తనం చెలాయించింది. దాని దగ్గర లక్షల మంది ఉన్న సైన్యం ఉండేది. సొంత నిఘా ఏజెన్సీ ఉండేది. దానికి పన్నులు వసూలు చేసే అధికారం కూడా ఉండేది.
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆపిల్, గూగుల్ లాంటి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. కానీ అప్పటి ఈస్టిండియా కంపెనీతో పోలిస్తే ఈ కంపెనీలేవీ అసలు లెక్కలోకి కూడా రావు.
ఈస్టిండియా కంపెనీని 1600లో స్థాపించారు. ఆ సమయంలో క్వీన్ ఎలిజబెత్ 1 బ్రిటన్ రాణిగా ఉండేవారు. ఆమె ఈస్టిండియా కంపెనీకి ఆసియాలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోడానికి అనుమతించారు. అదే ఏడాది డిసెంబర్ 31న ఈస్టిండియా కంపెనీ బ్రిటన్ రాణి నుంచి వ్యాపారం చేసుకోడానికి చార్టర్ అందుకుంది.
కానీ కాలం ఎలాంటి మలుపు తీసుకుందంటే వ్యాపారం కోసం వచ్చిన అదే కంపెనీ ఆ తర్వాత తమ ప్రభుత్వాలే ఏర్పాటు చేయగలిగే స్థాయికి చేరింది.
ఒకప్పుడు ఆసియాలో ఉన్న అన్ని దేశాలూ ఈస్టిండియా కంపెనీ అధీనంలో ఉండేవి. ఈ కంపెనీ దగ్గర సింగపూర్, పెనాంగ్ లాంటి పెద్ద ఓడరేవులు ఉండేవి. ముంబై, కోల్‌కతా, చెన్నై లాంటి మహానగరాలకు పునాదులు వేసింది ఈస్టిండియా కంపెనీనే. ఈస్టిండియా కంపెనీ బ్రిటన్ పౌరులకు ఉపాధి కల్పించే అతిపెద్ద సంస్థగా ఎదిగింది.
ఫొటో సోర్స్, North Wind Picture Archives/Alamy
19వ శతాబ్దంలో లండన్ రేవులో తేయాకు సరుకులు దించుతున్న ఈస్టిండియా కంపెనీ సిబ్బంది
ఎక్కడైనా ఈస్టిండియా కంపెనీ ఆడిందే ఆట
భారతదేశంలో ఈ కంపెనీ దగ్గర రెండున్నర లక్షలకు పైగా సైన్యం ఉండేది. ఇది ఇంగ్లండ్‌లో మాత్రమే కాదు, యూరప్‌లోని అన్ని దేశాల ప్రజల జీవితాల్లో జోక్యం చేసుకునేది. జనం టీ తాగాలంటే అది ఈస్టిండియా కంపెనీ నుంచే కొనాలి, బట్టలు వేసుకోవాలంటే వాటిని ఈస్టిండియా కంపెనీ నుంచే కొనాలి అనేలా అన్నీ వారు ఆడిందే ఆటగా సాగింది.
ఈస్టిండియా కంపెనీపై పుస్తకం రాసిన నిక్ రాబిన్స్ "ఈ కంపెనీని ఈరోజుల్లో ఉన్న పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలతో పోల్చి చూడవచ్చు. ఈస్టిండియా కంపెనీ ప్రారంభం నుంచే తమకంటూ ఒక సైన్యం ఏర్పాటు చేసుకోడానికి అనుమతిని పొందింది" అని చెప్పారు.
ఆ కంపెనీలో కూడా ఇన్సైడర్ ట్రేడింగ్, షేర్ మార్కెట్ లాభనష్టాలు లాంటి ఇప్పటి ప్రభావం, జోక్యం ఉండేది. ఇప్పటి కంపెనీలు తమ ప్రయోజనాల కోసం బ్యూరోక్రాట్స్-నేతలతో ఎలా లాబీయింగ్ చేస్తాయో, అలాగే ఈస్టిండియా కంపెనీ కూడా అప్పట్లో అన్ని ప్రభుత్వాలతో సన్నిహితంగా మెలిగేది. ఆయా ప్రాంతాల నేతలు, రాజులను సంతోషపరిచే ప్రయత్నాల్లో మునిగి ఉండేది.
ఫొటో సోర్స్, Granger, NYC./Alamy
డెన్మార్కులో ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యాలయం(1844)
రెకమండేషన్ ఉంటేనే ఉద్యోగం
కానీ ఈస్టిండియా కంపెనీ అసలు ఎలా ఉండేది? దీని ప్రధాన కార్యాలయం ఇప్పటి గూగుల్ లేదా ఫేస్‌బుక్‌లాగే అద్భుతంగా ఉండేదా? దీనిలో పనిచేసేవారికి ఎలాంటి వేతనాలు అందేవి?
అయితే, మనం చరిత్ర పేజీలు తిప్పి ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సి ఉంటుంది.
అప్పట్లో ఈస్టిండియా కంపెనీలో పని చేయడానికి జనం తీవ్రంగా పోటీపడేవారు. కానీ ఉద్యోగం దొరకడం చాలా కష్టం అయ్యేది. కంపెనీలో ఎవరైనా డైరెక్టర్ సిఫారసు చేసినప్పుడు మాత్రమే ఎవరికైనా ఉద్యోగం ఇచ్చేవారు. ఈ కంపెనీలో ఎక్కువగా పురుషులే పనిచేసేవారు. శుభ్రం చేయడానికి మాత్రమే మహిళలను పెట్టుకునేవారు.
బ్రిటిష్ లైబ్రరీలో ఈస్టిండియా కంపెనీకి సంబంధించిన పత్రాలు ఉన్నాయి. మార్గరెట్ మెక్పీస్ వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. "కంపెనీలో చిన్న చిన్న పనులకు కూడా డైరెక్టర్ల సిఫారసు అవసరమయ్యేది" అని ఆమె చెప్పారు.
ఫొటో సోర్స్, CLASSIC IMAGE ALAMY
సూరత్‌లో ఈస్టిండియా కంపెనీ ఫ్యాక్టరీ(1680)
ఉద్యోగాల కోసం ఎదురు డబ్బులు
కంపెనీలో మొత్తం 24 మంది డైరెక్టర్లు ఉండేవారు. కంపెనీలో ఉన్న ఉద్యోగాల కంటే, ఎన్నో రెట్లు ఎక్కువగా వారికి దరఖాస్తులు వచ్చేవి. డైరెక్టర్ సిఫారసు చేయకపోతే ఎవరికైనా ఉద్యోగం దొరకడం అసాధ్యం అయ్యేది.
లండన్‌లో కంపెనీ హెడ్ క్వార్టర్లో అకౌంటెంట్ లేదా రైటర్ ఉద్యోగం కావాలన్నా సిఫారసు కావాల్సి వచ్చేది. ఎవరు రెకమండ్ చేశారనేదాన్ని బట్టి ఆ ఉద్యోగం లభించేది. సమర్థత కంటే ఎక్కువగా కనెక్షన్ వల్ల ఉద్యోగాలు లభించేవి.
ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం పొందడానికి సిఫారసు మాత్రమే సరిపోయేది కాదు. దాని కోసం కంపెనీకి డబ్బులు కూడా ఇవ్వాల్సి వచ్చేది. ఆ సమయంలోనే సుమారు 500 పౌండ్లు ఇచ్చేవారు. అంటే ఈరోజుల్లో దాని విలువ దాదాపు 52 వేల డాలర్లు, లేదా 33 లక్షల రూపాయలు. హోదా ఎంత పెద్దదైతే అంత ఎక్కువ గ్యారంటీ డబ్బు ఇవ్వాల్సి వచ్చేది. అది కాకుండా తమ ప్రవర్తన బాగుంటుందనే గ్యారంటీ కూడా ఇవ్వాల్సి వచ్చేది.
ఫొటో సోర్స్, Contraband Collection/Alamy
పట్నాలో ఈస్టిండియా కంపెనీ ఓపీయం గోడౌన్
వేతనం లేకుండానే పనిచేసేవారు
ఈరోజుల్లో వేతనం లేకుండా పని చేయడం, ఉద్యోగం కోసం డబ్బులివ్వడాన్ని చాలా నీచంగా భావిస్తారు. కొన్ని కంపెనీలైతే దీని కోసం పరిహారం కూడా చెల్లించాయి.
కానీ ఈస్టిండియా కంపెనీలో కెరీర్ ప్రారంభం అంటే వేతనం లేని ఉద్యోగంతోనే మొదలయ్యేది. ఎవరైనా మొదట ఐదేళ్లు జీతం లేకుండా పనిచేయాల్సి వచ్చేది. కానీ 1778లో ఆ కాలాన్ని మూడేళ్లుగా మార్చారు.
కొన్నేళ్లు ఉచితంగా పనిచేసిన తర్వాత కంపెనీ పది పౌండ్ల జీతం ఇవ్వడం ప్రారంభించేది. 19వ శతాబ్దం ప్రారంభం కాగానే సిఫారసుతో ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కంపెనీకి స్వయంగా తెలిసొచ్చింది.
1806లో కంపెనీ తమ కోసం ఉద్యోగులను సిద్ధం చేయడానికి ఈస్టిండియా కాలేజ్ ప్రారంభించింది. హెల్బరీలో స్థాపించిన ఆ కాలేజిలో కంపెనీలోని అధికారులు ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇక్కడ కాబోయే ఉద్యోగులకు చరిత్ర, చట్టం, సాహిత్యంతోపాటు హిందీ, సంస్కృతం, పార్శీ, తెలుగు భాషలు కూడా నేర్పించేవారు.
ఇప్పటి ఫేస్బుక్, గూగుల్ అద్భుత హెడ్ క్వార్టర్స్ ప్రపంచంలో ఉదాహరణలుగా నిలిచిపోయాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత పెద్ద కంపెనీ అయిన ఈస్టిండియా కంపెనీ ప్రధాన కార్యాలయం ఎలా ఉండేది.
లండన్‌లో ఉన్న ఈస్టిండియా కంపెనీ ప్రధాన కార్యాలయం నిజానికి ఈనాటి ఫేస్బుక్, గూగుల్ హెడ్ క్వార్టర్స్లా ఉండేది కాదు. కానీ అప్పటి కాలంతో పోలిస్తే అది చాలా అద్భుతమైన భవనమే. లండన్‌లోని లీడెన్‌హాల్ ప్రాంతంలో ఉన్న కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని 1790లో పునర్నిర్మించారు. దీని తలుపులపై ఇంగ్లండ్ రాజు కింగ్ జార్జ్-3 యుద్ధం చేస్తున్నట్టు విగ్రహాలు ఉండేవి.
ఫొటో సోర్స్, HERITAGE IMAGE PARTNERSHIP LTD ALAMY
లండన్‌లో ఈస్టిండియా కంపెనీ ప్రధాన కార్యాలయం(1850)
ప్రధాన కార్యాలయంలో వైభవం
భవనం లోపలి భాగం పెద్ద రాజమహల్లా ఉండేది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన రాళ్లతో మెరిసిపోతున్న హాల్, గదులు ఉండేవి.
కంపెనీ అధీనంలో ఉన్న వివిధ నగరాల చిత్రాలు కూడా అక్కడ తగిలించి ఉండేవి. యుద్ధంలో గెలిచిన సామానులను కూడా కంపెనీ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా ప్రదర్శించేవారు.
ఒక దగ్గర సింహాన్ని వేటాడే విగ్రహం ఉంటే, ఇంకోచోట సిల్క్, మరోచోట బంగారు తాపడం చేసిన టిప్పు సుల్తాన్ సింహాసనం కనిపించేది.
లండన్‌లో ఈ కంపెనీకి ఎన్నో గోడౌన్లు ఉండేవి, అవి కూడా కంపెనీలాగే అద్భుతంగా ఉండేవి. వాటిని ఇంగ్లండ్ ప్రజలపై తమ ప్రభావాన్ని చూపించేలా ఆ స్థాయిలో నిర్మించారు.
ఇప్పుడు చాలా కంపెనీలు తమ ఉద్యోగులు కునుకు తీయడానికి స్పెషల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాయి. కానీ ఈస్టిండియా కంపెనీ అప్పట్లో తమ ఉద్యోగులు నివసానికి కూడా ఏర్పాట్లు చేసేది. చాలా మంది ఉద్యోగులు, లండన్ ఆఫీసు కంపౌండ్‌లోనే ఉండేవారు. కొంతమంది దానికోసం డబ్బులు చెల్లిస్తే, కొందరు ఉచితంగా అక్కడ ఉండేవారు. కానీ, కంపెనీ సౌకర్యాల కోసం అతి తెలివి చూపించేవారికి శిక్షలు పడేవి.
కంపెనీ ఇంగ్లండ్ బయట కార్యాలయాల్లో పనిచేసేవారికి కూడా ఉండడానికి ఏర్పాట్లు లభించేవి. ఉద్యోగులు ఎప్పుడూ తమ సీనియర్ల నిఘాలో ఉండేవారు. పాలన కఠినంగా ఉండేది. మద్యం తాగి ఎవరితో అయినా అమర్యాదగా ప్రవర్తిస్తే వారికి జైలు శిక్ష విధించేవారు.
ఫొటో సోర్స్, DINODIA PHOTOS ALAMY
భారతదేశంలో భోజనం చేస్తున్న బ్రిటిష్ వారు
ఉద్యోగులకు విందు భోజనం
విదేశాల్లో ఈస్టిండియా కంపెనీ స్థావరాలు రకరకాలుగా ఉండేవి. అంటే సూరత్‌లో కంపెనీకి ఫ్యాక్టరీతోపాటు చర్చి, లైబ్రరీ అన్నీ ఉండేవి. ఇటు జపాన్‌లోని హిరాడోలో తోట, స్విమ్మింగ్ పూల్ కూడా ఉండేవి.
ఈస్టిండియా కంపెనీలో పనిచేసే వారికి భోజనం కూడా ఏర్పాటు చేసేవారు. అంటే దూతలు కార్యాలయానికి వచ్చినపుడు వారికి అల్పాహారం అందించేవారు. విదేశాల్లో కంపెనీ స్థావరాల్లో ఉన్న వారికి భోజనం అందించేవారు. అయితే కాస్ట్ కటింగ్ పేరుతో 1834లో వీటిని నిలిపేశారు.
1689లో సూరత్ ప్యాక్టరీలో పర్యటించిన ఆంగ్లేయ మతాధికారి జాన్ ఓవింగ్టన్ "అక్కడ వంటవాళ్లుగా ఒక భారతీయుడు, ఆంగ్లేయుడు, పోర్చుగీసు వ్యక్తి ఉన్నారు" అని తన పుస్తకంలో రాశాడు. అంటే అందరికీ వారి వారికి నచ్చిన భోజనం అందించేందుకే ఆ ఏర్పాట్లు చేశారని చెప్పారు. అందరికీ శాకాహారం, మాంసాహారం అందించేవారు.
ఆదివారం ఈ వెరైటీలు పెరిగేవి. పిస్తా, బాదం లాంటి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినేవారు. బయటి నుంచి ఎవరైనా ప్రముఖులు వస్తే వారికోసం చాలా డబ్బు ఖర్చుపెట్టేవారు.
ఈస్టిండియా కంపెనీలో పనిచేసేవారికి మద్యం కూడా భారీగా సరఫరా చేసేవారు. ఇండోనేషియాలోని సుమత్రాలో ఉన్న కంపెనీలోని 19 మంది ఉద్యోగుల కోసం ఏడాదికి 894 సీసాల వైన్, 600 సీసాల ఫ్రెంచ్ మద్యం, 294 సీసాల బర్టన్ ఎలె ఇంకా ఎన్నో పంపేవారు.
ఫొటో సోర్స్, LORDPRICE COLLECTION ALAMY
లండన్‌లో ఈస్టిండియా ఓట రేవు(1808)
పనిచేసేవారికి ఫారిన్ ట్రిప్స్
ఈస్టిండియా కంపెనీ లండన్ రేవులో ఒక చిన్న పబ్ కూడా తెరిచింది. అక్కడ కొన్ని షరతులతో బీర్, మద్యం అమ్మేవారు. లండన్‌లో కంపెనీకి సొంత జైలు కూడా ఉండేది.
ఇప్పుడు అన్ని కంపెనీలు ఉద్యోగులకు రకరకాల సౌకర్యాలు అందిస్తున్నాయి. కొన్ని విదేశీ యాత్రకు కూపన్ ఇస్తే, కొన్ని కంపెనీలు కాన్సర్ట్ టికెట్ ఉచితంగా అందిస్తాయి.
అలాగే ఈస్టిండియా కంపెనీ కూడా విదేశాలకు వెళ్లే తమ ఉద్యోగులకు తమ వ్యాపారం విడిగా చేసుకోడానికి అనుమతి ఇచ్చేది. కంపెనీ నౌకపై తమ వ్యక్తిగత సామానులు నింపి స్వదేశానికి తీసుకు వెళ్లడానికి కూడా వారికి అనుమతి ఇచ్చేది. ఇప్పటి టూర్ ప్యాకేజ్ లేదా కన్సర్ట్ టికెట్‌తో పోలిస్తే వాటిని చాలా ఖరీదైన సౌకర్యాలనే చెప్పుకోవాలి.
ఇలాంటి సౌకర్యాలతో ఉద్యోగులకు ఒక ప్రయోజనం లభించేది. ఒక్క విదేశీ టూర్‌తో కంపెనీ ఉద్యోగులు తమ జీవితాలే కాదు, ముందు తరాలకు కూడా సరిపడినంతగా సంపాదించేవారు. కానీ, వేతనాలు, బోనస్ విషయంలో మాత్రం కంపెనీ చాలా తక్కువ డబ్బు ఖర్చు చేసేది.
కంపెనీ ఉద్యోగులకు కంపెనీ వ్యాపారంలో షేర్ తీసుకోడానికి కూడా అనుమతి ఉండేది. దీనివల్ల వారికి చాలా ప్రయోజనం లభించేది. ఉద్యోగుల దగ్గర సామాన్యుల కంటే ఎక్కువ సమాచారం ఉండడంతో షేర్ల కొనుగోళ్లు-అమ్మకాలలో వారు బాగా లాభాలు సంపాదించేవారు.
ఫొటో సోర్స్, HERITAGE IMAGE PARTNERSHIP LTD ALAMY
నృత్యం, సంగీతం ఆస్వాదిస్తున్న ఈస్టిండియా కంపెనీ అధికారులు
విలాసాలకు భారీగా వ్యయం
ఈస్టిండియా కంపెనీ అధికారులు వినోదం కోసం చాలా డబ్బు ఖర్చు చేసేవారు. 19వ శతాబ్దంలో కంపెనీకి చెందిన కొంతమంది ఉద్యోగులు సుమారు 29 వేల డాలర్ల ఖర్చుతో డిన్నర్ చేసినట్లు చెబుతారు.
ఇక కంపెనీ చైర్మన్‌కు వినోదం కోసమే ప్రతి ఏటా ఒక లక్షా 32 వేల పౌండ్లు లభించేవి.
1834లో ఈ ఖర్చుల్లో కోత వేశారు. కానీ 1867లో కంపెనీకి చెందిన సర్ జాన్ అనే అధికారి "కంపెనీ కంటే మంచి డిన్నర్ ఎవరూ ఇవ్వరని" రాశాడు. విదేశీ దూతలకు కూడా ఇలాంటి సౌకర్యాలు అందించేవారు.
తమ ఫ్యాక్టరీల కెప్టెన్‌కు కేవలం డిన్నర్ కోసమే ఏడాదికి సుమారు 33 వేల పౌండ్లు చెల్లించేవారు.
విదేశీ ఉద్యోగులకు తరచూ ఆభరణాలు, సిల్క్ దుస్తులు లాంటి విలువైన బహుమతులు ఇచ్చేవారు. వాటితోపాటు జమిందార్లు, నవాబులు లాంటి వారు కూడా ఈ ఉద్యోగులకు విలువైన బహుమతులు ఇచ్చేవారు.
తమ సుదీర్ఘ చరిత్రలో ఈస్టిండియా కంపెనీ మంచి, చెడ్డ రోజులు రెండూ రుచిచూసింది. అవినీతి, అవకతవకలతో చెత్త మేనేజ్మెంట్ ఆరోపణలు కూడా ఎదుర్కుంది.
1764 తర్వాత కంపెనీ ఒక నిర్ణీత ధరను మించి విలువైన బహుమతులు అందుకోవడంపై నిషేధం విధించింది.
ఫొటో సోర్స్, THE PRINT COLLECTOR ALAMY
లక్నోలో కోడి పందాలు చూస్తున్న ఈస్టిండియా కల్నల్(1790)
అప్పట్లోనే రికార్డు వేతనాలు
18వ, 19వ శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులు, బ్రిటన్‌లోనే అత్యధిక వేతనాలు పొందిన వారిలో నిలిచారు. ఎంత ఎక్కువ సమయం కంపెనీలో గడిపితే, వారికి అంత ఎక్కువ శాలరీ లభించేది.
1815లో క్లర్క్ వేతనం ఏడాదికి 40 పౌండ్లు ఉండేది. అంటే ఈరోజుల్లో అది 29 వేల పౌండ్లతో ప్రారంభం అవుతోంది(దాదాపు 28 లక్షలు). కంపెనీలో 11 నుంచి 15 ఏళ్లు పనిచేసిన తర్వాత ఇదే శాలరీ ఐదు రెట్ల కంటే ఎక్కువగా పెరిగేది. 1840 నాటికి ఈస్టిండియా కంపెనీ క్లర్క్ వేతనం ఒక సామాన్యుడి వేతనం కంటే 12 రెట్లు ఎక్కువగా ఉండేది.
అంతే కాదు, ఈస్టిండియా కంపెనీ తమ ఉద్యోగులకు మంచి పెన్షన్ కూడా అందించేది. 40 ఏళ్లు పనిచేసినవారి జీతంలో మూడో బాగం పెన్షన్‌గా ఇచ్చేవారు. అదే 50 ఏళ్లు పనిచేసిన వారికైతే పూర్తి జీతం పెన్షన్‌గా వచ్చేది.
సాధారణ ఉద్యోగులతో పోలిస్తే, ఈస్టిండియా కంపెనీ డైరెక్టర్లకు తక్కువ డబ్బు లభించేది. ఇప్పటి సీఈఓలకు ఉన్నట్టు వారికి భారీ వేతనాలు ఉండేవి కాదు. కానీ విలాసాలు, బహుమతుల ద్వారా వారికి దానిని భర్తీ చేసేవారు. ఎందుకంటే ఈ డైరెక్టర్ల దగ్గర బలమైన హక్కులు ఉండేవి.
అన్ని సౌకర్యాలనూ కలిపి చూస్తే, అప్పట్లో ఈస్టిండియా కంపెనీ డైరెక్టర్లకు అందే మొత్తం, ఈరోజు ఖరీదైన సీఈఓల శాలరీతో సమానంగానే ఉంటుంది.
ఫొటో సోర్స్, THE ART ARCHIVE ALAMY
కంపెనీ సెలవులను ఆస్వాదిస్తున్న ఉద్యోగులు(1751
సెలవు కావాలంటే కష్టపడాల్సిందే
ఇప్పుడు కంపెనీలు, తమ ఉద్యోగులకు రకరకాల సెలవులు ఇస్తుంటాయి. కానీ ఈస్టిండియా కంపెనీలో సెలవుల కోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎవరైనా ఉద్యోగి సెలవు పెట్టాలంటే దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. కానీ, ఆ సమయంలో ఇప్పటికంటే ఎక్కువగా ప్రభుత్వ సెలవులు ఉండేవనేది మరో విషయం.
అయితే 1817లో ప్రభుత్వ సెలవుల్లో భారీ కోత విధించారు. ఉద్యోగులకు కేవలం క్రిస్మస్ సెలవు మాత్రమే అనుమతించేవారు. దానితోపాటు ఉద్యోగులు పనిచేసిన సంవత్సరాలను బట్టి ఒకటి నుంచి నాలుగు రోజులు సెలవులు ఇచ్చేవారు.
ఈస్టిండియా కంపెనీలో పనిచేసేవారు రోజూ 12 నుంచి 13 గంటలు పనిచేయాల్సి వచ్చేది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఉద్యోగులు కార్యాలయాల్లోనే ఉండేవారు. మధ్యలో లంచ్ కోసం రెండు గంటల విరామం లభించేది. శనివారం కూడా పనిచేయాల్సి వచ్చేది.
అయితే పెద్దగా నిఘా లేకపోవడంతో ఉద్యోగులు దాన్ని తమకు అనుకూలంగా తీసుకునేవారు. 1727లో జాన్ స్మిత్ అనే ఒక ఉద్యోగి 16 నెలలుగా పనిచేయలేదని, జీతం మాత్రం పూర్తిగా తీసుకున్నాడని డైరెక్టర్లు గుర్తించారు.
విదేశాల్లో ఉన్న ఫ్యాక్టరీల్లో పనిచేయడం సులభంగా ఉండేది. జనం ప్రశాంతంగా పనిచేసుకునేవారు.
ఫొటో సోర్స్, HERITAGE IMAGE PARTNERSHIP LTD ALAMY
మొఘల్ దర్బారులో హుక్కా సేవిస్తున్న ఈస్టిండియా అధికారి
విదేశీ ప్రయాణాల్లో పొంచిన ప్రమాదాలు
ప్రస్తుతం అమెరికాలో కేవలం సగం మంది మాత్రమే తమ ఉద్యోగాల గురించి సంతృప్తితో ఉన్నారు. అదే ఫ్రాన్సులో 43 శాతం, జర్మనీలో 34 శాతం మంది తమ ఉద్యోగాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, 200 ఏళ్ల క్రితం తమ ఉద్యోగం గురించి జనం ఎలా అనుకుని ఉంటారో ఊహించగలరా? ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులు వారి పనిపట్ల ఎంత సంతృప్తితో ఉండేవారు?
ఈస్టిండియా కంపెనీలో విదేశీ యాత్రలు చేసే ఉద్యోగుల జీవితం నరకంగా ఉండేది.
ప్రమాదాలు, జబ్బులు, యుద్ధాలు లాంటి వాటి వల్ల చాలామంది చనిపోతే, కొందరు మృత్యువుకు సమీపంగా వెళ్లేవారు.
ఒక అంచనా ప్రకారం ఈస్టిండియా కంపెనీ ఆసియాలో నియమించిన ఉద్యోగుల్లో సగం మంది తమ విధుల్లో ప్రాణాలనే పణంగా పెట్టేవారు.
ఫొటో సోర్స్, William Daniell/Lebrecht Music and Arts Photo Libr
1825లో బెంగాల్ వెళ్తూ సముద్రం మధ్యలో తగలబడుతున్న నౌక
సిపాయిల తిరుగుబాటు తర్వాత పతనం
ఇటు, ఇంగ్లండ్‌లో పనిచేసే ఉద్యోగులు మాత్రం తమ పనిని బోర్ ఫీలయ్యేవారు. కొంతమంది బోర్ వల్ల పని చేసేవారు కాదు.
దీని గురించి కంపెనీలో ఒక ఉద్యోగి అయిన చార్లెస్ లాంబ్, ఇంగ్లిష్ కవి విలియం వర్డ్స్ వర్త్‌కు ఒక లేఖ రాశాడు.
తన బోర్ గురించి అదులో చెప్పాడు. "ఉద్యోగం బోరు కొట్టినా తను మూడేళ్లు ఎక్కువ పనిచేశానని, 8 ఏళ్లు పెన్షన్ తీసుకున్నానని" తెలిపాడు.
ఇవన్నీ ఈస్టిండియా కంపెనీ ఒక బహుళజాతి కంపెనీ అనేది స్పష్టం చేస్తుంది. కానీ అది ఇప్పటి ఎంఎన్సీల్లా కాదు. వారి దగ్గర బలం ఉండేది. డబ్బు ఉండేది. సైన్యం, నిఘా విభాగం కూడా ఉండేది. ఇది భారత్ సహా ఎన్నో దేశాల్లో అంగ్లేయుల పాలనను అమలు చేసింది.
కానీ ప్రతి దానికీ ఒక సమయం ఉంటుంది. 1857లో భారత్‌లో సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈస్టిండియా కంపెనీకి కష్టకాలం మొదలైంది.
1874లో ఇంగ్లిష్ ప్రభుత్వం ఈ కంపెనీని పూర్తిగా మూసేసింది.
ఇవి కూడా చదవండి:
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఠాక్రే ట్రైలర్: దక్షిణ భారతీయులంటే బాల్ ఠాక్రేకు ఎందుకు నచ్చదు?
- స్మార్ట్ ఫోన్ వాడే పిల్లల తెలివితేటలు పెరుగుతాయా? తగ్గుతాయా?
- 30 ఏళ్లుగా ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నాను: రాకేశ్ శర్మ
- మన్మోహన్ సింగ్‌ను రాజకీయాల్లోకి తెచ్చింది పీవీ నరసింహరావే
- పోర్నోగ్రఫీ సమస్యకు దక్షిణ కొరియా పోలీసుల షాక్ థెరపీ
- భారత్‌లో పెరుగుతున్న పోర్న్ వీక్షణ
- మహిళల అవయవాలకు ‘మగ’ పేర్లే ఎందుకున్నాయి?
- రోమన్లు మూత్రం మీద పన్ను వసూలు చేసేవారు.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)