E69: ఈ హైవే ఎక్కితే ప్రపంచం అంచులకు వెళ్తాం

  • 1 జనవరి 2019
నార్వే హైవే

చలికాలం, పర్వతాలపై తీవ్రంగా మంచు కురుస్తుంటుంది. చెప్పాలంటే ఉత్తరార్ధ గోళం అంతా చలి దుప్పట్లో కప్పుకుపోతుంది.

ఈ చలి గాలులన్నీ ఉత్తర ధ్రువం నుంచి వీస్తుంటాయి.

భూమికి పూర్తిగా ఉత్తరంగా ధ్రువం దగ్గరకు వెళ్లడమంటే చంద్రుడి దగ్గరకు వెళ్లొచ్చినట్టే అనుకోవాలి.

యూరప్ ఖండం ఉత్తర ధ్రువానికి చాలా దగ్గరగా ఉంటుంది.

ఈ ఖండం చివరి ప్రాంతం నార్వేలో ఉంటుంది. ఈ ప్రాంతంలో మిగతా ప్రపంచానికి దూరంగా శతాబ్దాల నుంచీ చాలా మంది జీవిస్తున్నారు.

ఇక్కడ ఉన్న వారంతా సముద్రంలోని చేపలు, తిమింగలాలు, పీతలు లాంటివి పట్టుకుని బతుకుతుంటారు.

ప్రపంచంలోని మారుమూల ప్రాంతాన్ని మిగతా ప్రపంచంతో కలిపే జాతీయ రహదారి ఈ-69.

ఈ మార్గం ఉత్తర ధ్రువానికి దగ్గరగా అంటే ప్రపంచం ముగిసే తుది చివర వరకూ వెళ్తుంది.

భూమిపై అత్యంత ఉత్తరంగా చివరి వరకూ వెళ్లే హైవే ఇది మాత్రమే. దీనిని ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు.

మంచుతో గడ్డకట్టిన ఈ ప్రాంతంలో ఒక హైవే నిర్మించాలని శతాబ్దం కంటే ముందు అంటే 1908లో అనుకున్నారు. కానీ ఈ-69 పూర్తైంది మాత్రం 1999లోనే.

ఇది నార్వేలోని ఓల్డర్‌ఫ్యోర్డ్‌ను నార్డ్‌కాప్ ప్రాంతంతో కలుపుతుంది.

వైరుధ్యాలను కలిపే రహదారి

పశ్చిమ యూరప్ తీర ప్రాతం నుంచి వెళ్లే ఈ-69ను వైరుధ్యాలను కలిపే రహదారిగా వర్ణిస్తారు.

ఇది శతాబ్దాల నుంచి ఈనాటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా వేరువేరుగా ఉన్న ఎన్నో ప్రాంతాలను ఇప్పటి ఆధునిక యూరప్‌కు కలుపుతుంది.

ఇక్కడున్న వారికి మిగతా ప్రపంచంతో ఎలాంటి సంబంధాలూ లేకపోయినా హాయిగా, ఆనందంగా జీవించగలరు.

వారికి ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఇక్కడి ప్రజలు కొయ్యతో చేసిన పడవలపైనే ఆధారపడి జీవిస్తున్నారు.

ఈ రహదారిలో ప్రయాణించాలనేవారికి ప్రకృతిలో ఉన్న రకరకాల రూపాలను చూసే అవకాశం లభిస్తుంది.

దారి పొడవునా కనిపించే కొండలు మిమ్మల్ని తనలోకి తీసుకోడానికి ముందుకు వస్తున్నట్టు అనిపిస్తుంది.

కోతలకు గురైన ఈ మార్గం అంతా మంచు గడ్డకట్టి ఉంటుంది. ఎన్నో లోయలు, ఎత్తైన గుట్టలు కనిపిస్తాయి.

ఈ-69 హైవేలో కొన్ని ప్రాతాలలో ఒంటరిగా కారు డ్రైవ్ చేయడం నిషేధం. గుంపుగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడి నుంచి వెళ్లడానికి అనుమతి ఉంటుంది.

వందల కిలోమీటర్ల పాటు సముద్ర తీరంపైనే ఈ రహదారిపై వెళ్తుంటే.. పక్కనే ఉన్న చిన్న చిన్న గ్రామాలు సముద్రంలో కలిసిపోతున్నాయేమో అనే అనుభూతి కలుగుతుంది.

1930లో రహదారి అభివృద్ధి

ఈ-69 రహదారిని 1930లో అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో ఇక్కడ స్థిరపడిన వారి చేపల వ్యాపారం మందగించింది.

మొదట్లో నార్డ్‌కాప్ ప్రజలకు మాత్రమే సముద్రంలో వేటాడ్డానికి హక్కులు ఉండేవి. కానీ 1930వ దశకంలో ఈ హక్కులను మిగతా వారికి కూడా ఇచ్చారు.

ఆ తర్వాత 1934లో ఈ ప్రాంతం వారంతా హానింగ్స్‌వాంగ్ అనే ఒక గ్రామంలో సమావేశం అయ్యారు.

రేవు యాజమాన్యాలు అక్కడి వరకూ వచ్చేందుకు ఒక రహదారి ఏర్పాటు చేయాలని భావించాయి. రహదారితో పర్యాటకులు కూడా వస్తారని, ఆదాయం పెరుగుతుందని అనుకున్నారు.

ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ వేసవి కాలంలో సూర్యుడు అస్తమించడు. అలాగే చలికాలం అంతటా చీకటి ఉంటుంది.

స్థానికులు మిగతా వారికి దూరంగా ఉండడాన్నే ఇష్టపడతారు. పెద్ద నగరాలు వారికి నచ్చవు. కానీ ఈ హైవే ఇప్పుడు వారికి ఒక లైఫ్‌లైన్‌లా మారింది.

చేపల వ్యాపారమే జీవనం

ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఇలాంటి ప్రతికూల వాతావరణంలో ఉండడం అంత సులభం కాదు. కానీ వేసవి సమయంలో పర్యాటకుల కోసం నార్డ్‌కాప్ వైపు వచ్చే ఈ-69 రహదారిలోని చివరి 14 కిలోమీటర్లు 1956లో నిర్మించారు.

ఈ-69 ఎక్స్‌ప్రెస్‌ వే డెడ్ ఎండ దగ్గర ఒక సొరంగం ఉంది. దాన్ని సముద్రంలో నిర్మించారు. ఈ-69 ఈ భాగాన్ని మెగెరోయా అనే ద్వీపాన్ని కలుపుతుంది. ఈ సొరంగాన్ని 1999లో నిర్మించారు.

20వ శతాబ్దం ప్రారభంలో మిగతా దేశాల మత్స్యకారులకు ఇక్కడ చేపల వేటకు అనుమతి లభించినపుడు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు చేపలు పట్టడానికి వచ్చారు. కానీ ఇప్పుడు ఆ జనాభా తగ్గిపోతూ వస్తోంది.

చేపలు వేటాడే గుంపులు కూడా తగ్గిపోతున్నాయి. ఇక్కడ చేపలు పట్టే వారు కూడా వాటిని వెంటనే ఐస్ లో ప్యాక్ చేసి చైనా పంపించేస్తున్నారు. అక్కడి నుంచి వాటిని మిగతా ప్రపంచమంతా సరఫరా అవుతాయి.

నార్వేలోని ఈ ప్రాంతం నుంచి కింగ్ పీతలను ఉత్తర యూరప్‌లోనే అత్యధికంగా ఎగుమతి చేస్తారు. ఇప్పుడు కూడా ఇక్కడ రేవుల్లో చేపలు పట్టుకునే పడవల వరుసలు కనిపిస్తాయి.

ప్రకృతికి అత్యంత సమీపం

ఈ-69లో చేపల వేట జరిగే అత్యంత కీలకమైన రేవు హాన్గింస్వాంగ్. దీన్ని ప్రపంచంలో అత్యంత ఉత్తరంగా ఉన్న ప్రాంతంగా భావిస్తారు.

ఇక్కడ మనకు రేవులో రంగురంగుల పడవలు కనిపిస్తాయి. చలికాలంలో ఇక్కడ కాడ్ చేపను, వసంతంలో సాల్మన్, కోల్ ఫిష్, శరత్కాలంలో హేడాక్ అనే చేపను పడుతుంటారు.

హైవే డెడ్ ఎండ్ ఇదే

దట్టమైన దేవదారు చెట్లు, తీరం అంతటా చేపలు పట్టే పెద్ద పెద్ద ట్రాలర్లు ఉండే నార్డ్‌కాప్ ఈ-69 చివర్లో ఉంటుంది.

ఇక్కడ రెయిన్ డీర్లు గుంపులు గుంపులుగా కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతం తర్వాత సముద్రమే కనిపిస్తుంది.

ఈ డెడ్ ఎండ దగ్గర భూమిలోపల ఒక చర్చి, ఒక మ్యూజియం కూడా ఉన్నాయి.

ఒకప్పుడు హైవేపై ఇక్కడికి వచ్చిన వారు అక్కడితో తమ ప్రపంచ యాత్ర ముగిసిందని భావించేవారు.

నార్డ్‌కాప్‌లో ప్రకృతే మనిషికీ పాఠం నేర్పినట్టు అనిపిస్తుంది.

ఈ-69 రహదారి ప్రతి ప్రయాణానికి ఒక అంతం ఉంటుందని చెబుతుంది.

చలికాలంలో గట్టకట్టిన బంజరు భూముల్లో వేసవిలో వచ్చే మొలకలు కొత్త జీవితంపై ఎప్పటికీ ఆశలు వదులుకోకూడదంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

పాకిస్తాన్‌ను టార్గెట్ చేసిన మోదీ.. ‘సొంత దేశాన్నే చూసుకోలేకపోతున్న వారు, భారత్‌లో ఏం చేసినా ఇబ్బంది పడిపోతున్నారు’

'మా అమ్మను, తోబుట్టువులను నా ముందే చంపేశారు.. చనిపోయినట్లు నటించి నేను బయటపడ్డా'

కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు... అయినా 130కి పైగా దేశాలు చుట్టేశారు ఈయన

ప్రెస్ రివ్యూ: 'బాహుబలి' తీయకపోతే 'సైరా' వచ్చేది కాదు: చిరంజీవి

Howdy Modi: ‘ట్రంప్ కోసం ఎన్నికల ప్రచారం చేసిన పీఎం మోదీ’ - కాంగ్రెస్ పార్టీ విమర్శ

అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ పెచ్చు ఊడిపడి మహిళ మృతి

హూస్టన్‌లో మోదీ సభా ప్రాంగణం ఎదుట ఆర్టికల్ 370 సవరణకు వ్యతిరేకంగా నిరసనలు

గులాలాయీ ఇస్మాయిల్: పాకిస్తాన్ నుంచి అమెరికా పారిపోయిన మానవహక్కుల కార్యకర్త