‘తాలిబన్ల ఆదాయం ఏటా రూ.లక్ష కోట్లు’.. నిజమేనా? అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది?

  • 2 జనవరి 2019
అఫ్ఘానిస్తాన్‌, తాలిబన్లు, నల్లమందు Image copyright AFP

అఫ్గానిస్తాన్‌లో ప్రధాన తిరుగుబాటు బృందమైన తాలిబన్లలో సుమారు 60 వేల మంది ఉన్నారు.

అఫ్గానిస్తాన్‌ ప్రభుత్వానికి అమెరికా మిలటరీ, ఆర్థిక సహకారం అందిస్తున్నా.. తాలిబన్లకు, అఫ్గాన్ బలగాలకు మధ్య ఇప్పటికీ పోరు ఉధృతంగా, తీవ్రంగా కొనసాగుతోంది.

నిజానికి తాలిబన్లు తమ తిరుగుబాటును కొనసాగించడానికి దేశం లోపల నుంచి, బైటి నుంచి వారికి చాలా పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతాయి.

మరి తాలిబన్లకు ఈ నిధులు ఎక్కడి నుంచి లభిస్తున్నాయి?

Image copyright AFP
చిత్రం శీర్షిక తాలిబన్ల కారణంగా అఫ్గాన్ బలగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి

తాలిబన్లు ఎంత ధనవంతులు?

1996 నుంచి 2001 వరకు అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు పాలించారు. ఆ సమయంలో షరియా చట్టాలను కఠినంగా అమలు చేశారు.

అయితే అధికారం కోల్పోయిన నాటి నుంచి వాళ్లు తీవ్రమైన తిరుగుబాటు చేస్తున్నారు.

బీబీసీ అఫ్గానిస్తాన్‌ లోపల, బయట విస్తృతంగా నిర్వహించిన ఇంటర్వ్యూల ద్వారా తాలిబన్లు తమ తిరుగుబాటు కార్యకలాపాల కోసం ఆధునికమైన ఆర్థిక నెట్‌వర్క్, పన్నుల వ్యవస్థను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

2011 నుంచి ఇప్పటివరకు తాలిబన్ల వార్షికాదాయం సుమారు రూ.2,800 కోట్లు. కానీ ఇటీవలి కాలంలో అది సుమారు లక్ష కోట్ల రూపాయలకు చేరినట్లు భావిస్తున్నారు.

అఫ్గానిస్తాన్‌, అమెరికా ప్రభుత్వాలు తాలిబన్ల నెట్‌వర్క్‌ను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాయి. సుమారు ఒక ఏడాది క్రితం అమెరికా ప్రభుత్వం తాలిబన్లకు చెందిన డ్రగ్ లేబరేటరీలపై బాంబు దాడులు చేయడానికి ఒక వ్యూహం రచించింది.

2012లో ఐక్యరాజ్య సమితి తాలిబన్ల ప్రధాన ఆదాయం నల్లమందు ద్వారానే వస్తున్నట్లు గుర్తించింది. అయితే, ఇప్పుడు తాలిబన్లకు ఆదాయం కేవలం మాదక ద్రవ్యాల వ్యాపారం నుంచి మాత్రమే లభించడం లేదు.

Image copyright Getty Images

నల్లమందు, పన్నులు, బలవంతపు వసూళ్లు

అఫ్గానిస్తాన్‌ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా నల్లమందును ఉత్పత్తి చేస్తున్న దేశం. ఆ దేశం ఏటా సుమారు 1-2 లక్షల కోట్ల రూపాయల నల్లమందు ఎగుమతి చేస్తోందని భావిస్తున్నారు.

తాలిబన్ల ఆధీనంలోని ప్రాంతాలలో నల్లమందును ఎక్కువగా పండిస్తున్నారు. తాలిబన్లు పలు దశలలో నల్లమందుపై పన్నుల రూపేణా వసూలు చేస్తున్నారు.

నల్లమందును పండించే రైతుల నుంచే మొదట 10 శాతం పన్ను వసులు చేస్తున్నారు. ఆ తర్వాత ఓపియమ్‌ను నల్లమందుగా మార్చే లేబరేటరీల నుంచి, వాటిని డ్రగ్ రూపంలో స్మగ్లింగ్ చేసే వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు.

మాదక ద్రవ్యాల నుంచి తాలిబన్లకు సుమారు రూ.700-2800 కోట్ల వరకు వార్షికాదాయం లభిస్తోందని భావిస్తున్నారు.

అయితే తాలిబన్లు మాత్రం నార్కోటిక్స్‌తో తమకు ఏ మాత్రం సంబంధం లేదని.. తాము పాలనలో ఉండగా, 2000 నుంచే దాని పెంపకంపై నిషేధం విధించినట్లు చెబుతున్నారు.

Image copyright Getty Images

లేబరేటరీలపై బాంబుల దాడులు

అఫ్గానిస్తాన్‌లో తిరుగుబాటుదారులపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా ట్రంప్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతోంది. వాటిలో భాగంగా తాలిబన్ల ఆర్థిక నెట్‌వర్క్, ఆదాయ వనరులను లక్ష్యంగా చేసుకుంది.

తాలిబన్ల ఆదాయంలో సుమారు 60 శాతం మాదకద్రవ్యాల ద్వారానే లభిస్తున్నట్లు చెబుతున్న అమెరికా సైన్యం.. వాటిని తయారు చేసే లేబరేటరీలను లక్ష్యంగా చేసుకుంది. 2018, ఆగస్టు నాటికి అఫ్ఘనిస్తాన్‌లోని 400-500 లేబరేటరీలలో సుమారు 200 లేబరేటరీలను ధ్వంసం చేసినట్లు అమెరికా చెబుతోంది. దీని వల్ల తాలిబన్ల ఆదాయంలో పావుభాగానికి గండి పడింది.

అయితే లేబరేటరీల పునర్నిర్మాణం చాలా సులభం కాబట్టి, ఈ దాడుల దీర్ఘకాల ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ప్రశ్నార్ధకం.

Image copyright Getty Images

ఇంకా ఎక్కడెక్కడి నుంచి..?

తాలిబన్ల ఆదాయ వనరులు నల్లమందు వ్యాపారంపై పన్నులు విధించడంతో ఆగిపోలేదు.

2018 ప్రారంభంలో బీబీసీ చేపట్టిన ఒక పరిశోధనలో అఫ్ఘానిస్తాన్‌లోని 70 శాతం ప్రాంతాలలో తాలిబన్లు ఉన్నట్లు గుర్తించారు.

ఈ ప్రాంతాలలో తాలిబన్లు పన్నులు వసూలు చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో బీబీసీ చేతికి అందిన ఒక లేఖ ప్రకారం.. తాలిబన్ ఆర్థిక కమిషన్ తమ ఆధీనంలోని ప్రాంతాలలో సరుకు రవాణా చేసేటప్పుడు తమకు పన్నులు చెల్లించాలని హెచ్చరించింది.

అంతే కాకుండా తాలిబన్లు టెలికమ్యూనికేషన్స్, మొబైల్ ఫోన్ ఆపరేటర్ల నుంచీ బలవంతపు వసూళ్లు చేస్తున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాలలో తాలిబన్లు ఈ ఏడాది ప్రారంభంలో విద్యుత్ వినియోగదారుల నుంచి సుమారు రూ.14 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అఫ్ఘానిస్తాన్‌ విద్యుత్ సంస్థ వెల్లడించింది.

చిత్రం శీర్షిక మైనింగ్‌పై పన్నుల ద్వారా తాలిబన్లు చెప్పుకోదగ్గ ఆదాయాన్ని పొందుతున్నారు

ఖనిజాలు

ఖనిజాలు, విలువైన రాళ్లపరంగా అఫ్ఘానిస్తాన్‌ సుసంపన్నమైనది. దేశంలోని మైనింగ్ పరిశ్రమ వార్షిక విలువ సుమారు రూ.7 వేల కోట్లు.

అయితే మైనింగ్ ఎక్కువభాగం అక్రమంగానే జరుగుతోంది.

ఖనిజ ప్రాంతాలను ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ జరిగే మైనింగ్ కార్యకలాపాల ద్వారా భారీ ఎత్తున బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు.

2014లో ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి తాలిబన్లు దక్షిణ హెల్మండ్ ప్రాంతంలోనే ఏటా సుమారు రూ.70 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాల నుంచి తాలిబన్లు సుమారు రూ.350 కోట్ల ఆదాయం పొందుతున్నారు.

Image copyright NOORULLAH SHIRZADA

విదేశీ నిధులు

పాకిస్తాన్, ఇరాన్, రష్యా ప్రభుత్వాలు తాలిబన్లకు ఆర్థిక సాయం చేస్తున్నాయని అఫ్గాన్, అమెరికా అధికారులు ఎన్నేళ్లుగానో ఆరోపిస్తున్నా, ఆయా ప్రభుత్వాలు దానిని తోసిపుచ్చుతున్నాయి.

పాకిస్తాన్‌తో పాటు, గల్ఫ్ దేశాలకు చెందిన అనేక మంది పౌరులు పెద్ద ఎత్తున తాలిబన్లకు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.

2008లో సీఐఏ నివేదిక ఒకటి.. విదేశాలు, మరీ ప్రత్యేకించి గల్ఫ్ దేశాల నుంచి తాలిబన్లు రూ.740 కోట్లు అందుకున్నట్లు వెల్లడించింది.

ఒక అంచనా ప్రకారం తాలిబన్ల వార్షికాదాయం ఏటా సుమారు రూ.3,500 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)