చైనా - తైవాన్: ఆ రెండు దేశాలు ఎందుకు విడిపోయాయి?

  • 3 జనవరి 2019
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, తైవాన్ అధ్యక్షురాలు ట్సాయ్ ఇంగ్-వెన్ Image copyright AFP/Getty
చిత్రం శీర్షిక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, తైవాన్ అధ్యక్షురాలు ట్సాయ్ ఇంగ్-వెన్

‘తైవాన్ కూడా చైనాలో భాగమే. అది కచ్చితంగా మళ్లీ చైనాలో కలిసి తీరుతుంది. తైవాన్ ప్రజలు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొని తీరాల్సిందే. లేని పక్షంలో సైనిక బలగాలను ఉపయోగించేందుకూ వెనకాడం’... ఇది ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చేసిన హెచ్చరిక.

తైవాన్‌ను తనలో శాంతియుతంగా కలుపుకోవడానికి చైనా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ తైవాన్ ప్రజలు, ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు.

తైవాన్ ప్రస్తుతం స్వయం పాలనలో ఉంది. అది స్వతంత్ర రాజ్యంలానే కనిపిస్తున్నా, అధికారికంగా చైనా నుంచి దానికి స్వతంత్రం లభించలేదు. చైనా ఇప్పటికీ దాన్ని తమ రాష్ట్రాల్లో ఒకటిగానే పరిగణిస్తోంది.

దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం కారణంగా నిత్యం రెండు దేశాల మధ్య హింస చెలరేగే ప్రమాదం పొంచే ఉంటుంది. ఆ వివాదంలో అమెరికా కూడా కల్పించుకునే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

Image copyright AFP
చిత్రం శీర్షిక తైవాన్‌ను చైనా ఎప్పుడూ తమ దేశంలోని ఒక రాష్ట్రంలాగే పరిగణిస్తుంది

వివాదం ఎందుకు, ఎప్పుడు మొదలైంది?

దక్షిణ చైనా సముద్రంలోని ఒక ద్వీపమే తైవాన్. అక్కడ మొదట చైనా నుంచి వలస వెళ్లిన ‘ఆస్ట్రోనేసియన్’ గిరిజన ప్రజలు స్థిరపడినట్లు భావిస్తున్నారు.

చైనా రికార్డుల ప్రకారం క్రీ.శ.239లో చైనాకు చెందిన దండయాత్రికులు తైవాన్‌ను మొదట గుర్తించారు. ఆ కారణంగానే తైవాన్ తమ దేశంలో భాగమని చైనా వాదిస్తుంది.

కొద్ది కాలంపాటు (1624-1661) డచ్ పాలకుల అధీనంలో ఉన్న తైవాన్, ఆ తరువాత 200 ఏళ్లకు పైగా(1683-1895) చైనాకు చెందిన క్వింగ్ సామ్రాజ్యం పాలనలోనే కొనసాగింది.

17వ శతాబ్దం మొదట్లో చైనాలోని కఠిన పరిస్థితులను తాళలేక ప్రధానంగా ఫూజియన్, గ్వాంగ్‌డాంగ్ ప్రావీన్సులకు చెందిన ప్రజలు తైవాన్‌కు భారీ సంఖ్యలో వలస వెళ్లారు. ప్రస్తుతం తైవాన్‌లో నివసిస్తున్న ప్రజల్లో ఎక్కువ మంది ఆ ప్రావీన్సుల నుంచి వలస వెళ్లిన వారి వారసులే.

1895లో మొదటి సైనో-జాపనీస్ యుద్ధంలో క్వింగ్‌ ప్రభుత్వం ఓడిపోయింది. దాంతో తైవాన్, జపాన్ అధీనంలోకి వెళ్లిపోయింది.

రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక తైవాన్‌పై నియంత్రణను జపాన్ వదులుకుంది. అమెరికా, యూకే‌ల అనుమతితో తైవాన్‌ను మళ్లీ చైనా పాలించడం మొదలుపెట్టింది.

కానీ, ఆ తరువాత కొన్నేళ్లకే చైనాలో అంతర్యుద్ధం మొదలైంది. నాటి చైనా నాయకుడు షియాంగ్ కై-షెక్ బలగాలను మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు బలగాలు చిత్తు చేశాయి. దాంతో 1949లో షియాంగ్‌తో పాటు ఆయనకు అనుకూలంగా ఉన్న దాదాపు 15లక్షల మంది ప్రజలు తైవాన్‌కు వెళ్లిపోయారు.

తైవాన్ జనాభాలో వాళ్ల సంఖ్య 14శాతమే అయినా, చాలా ఏళ్ల పాటు వాళ్లే అక్కడి రాజకీయాలను శాసించారు.

చనిపోయేవరకు షియాంగ్‌ తైవాన్‌ను పాలించాడు. ఆ తరువాత షియాంగ్ కొడుకు షియాంగ్ చింగ్-కో అధికారం చేపట్టాడు. కానీ, తైవాన్‌లో ప్రజాస్వామ్య ఉద్యమ ఒత్తిడికి తలొగ్గి ఆయన 2000 సంవత్సరంలో ఎన్నికలకు అనుమతిచ్చాడు. అలా తైవాన్‌లో తొలిసారి షియాంగ్ కుటుంబ పాలన ముగిసింది.

Image copyright CENTRAL PRESS
చిత్రం శీర్షిక 1949లో షియాంగ్‌తో పాటు ఆయనకు అనుకూలంగా ఉన్న దాదాపు 15లక్షల మంది ప్రజలు తైవాన్‌కు వెళ్లిపోయారు

ప్రస్తుతం పరిస్థితి ఏంటి?

దశాబ్దాల పాటు కొనసాగిన శతృత్వం, యుద్ధ హెచ్చరికల అనంతరం 1980ల్లో చైనా, తైవాన్ మధ్య సంబంధాలు మెరుగవ్వడం ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ‘ఒక దేశం- రెండు వ్యవస్థల’ సూత్రాన్ని చైనా తీసుకొచ్చింది. చైనాతో మళ్లీ కలిసిపోవడానికి తైవాన్ ఒప్పుకుంటే, ఆ ద్వీపానికి పాలనలో స్వతంత్రతను కల్పిస్తామని చైనా చెప్పింది.

తైవాన్ ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. 1991లో చైనాతో యుద్ధాన్ని సైతం తైవాన్ ప్రకటించింది. రెండు ప్రభుత్వాల ప్రతినిధుల మధ్య చర్చలు కూడా పరిమితంగానే ఉంటాయి.

2000 సంవత్సరంలో తైవాన్ ప్రజలు షెన్ షుయ్-బియాన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు చైనా మరింత అప్రమత్తమైంది. షెన్ మొదట్నుంచీ స్వతంత్ర తైవాన్‌కు కట్టుబడి ఉన్నారు. 2004లో కూడా మళ్లీ ఆయనే తైవాన్ అధ్యక్షుడయ్యారు.

దాంతో, 2005లో చైనా వేర్పాటు వ్యతిరేక చట్టాన్ని రూపొందించింది. తైవాన్ గనుక చైనా నుంచి వేరు పడటానికి ప్రయత్నిస్తే సైనిక చర్యను ఎంచుకునే వెసులుబాటును ఆ చట్టంలో పొందుపరిచింది.

Image copyright EPA
చిత్రం శీర్షిక తైవాన్ సైన్యం

2008లో మా ఇంగ్-యూ తైవాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వాణిజ్య ఒప్పందాల ద్వారా ఆయన చైనాతో సంబంధాలను మెరుగుపరచుకునే ప్రయత్నం చేశారు.

2016లో ట్సాయ్ ఇంగ్-వెన్ తైవాన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె నేతృత్వంలోని డెమొక్రాటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ కూడా చైనా నుంచి స్వతంత్రంగా ఉండేందుకే కట్టుబడి ఉంది.

2016లో డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక, ట్సాయ్ ఇంగ్-వెన్ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. అలా 1979లో అమెరికా-తైవాన్ మధ్య తెగిపోయిన సంబంధాలు మళ్లీ చిగురించాయి.

తమ వెబ్‌సైట్లలో తైవాన్‌ను చైనాలో భాగంగా గుర్తించాలని అనేక అంతర్జాతీయ సంస్థలపై చైనా ఒత్తిడి పెంచింది. లేని పక్షంలో తమ దేశంలో వ్యాపారం చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించింది.

గత నవంబర్‌లో స్థానిక ఎన్నికల్లో తైవాన్ అధ్యక్షురాలు ట్సాయ్ పార్టీకి ఎదురుదెబ్బ తగలింది. ఆమె చైనా వ్యతిరేక వైఖరికి ఆ ఫలితాలు దెబ్బకొట్టాయని చైనా భావిస్తోంది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక గత నవంబర్‌లో స్థానిక ఎన్నికల్లో తైవాన్ అధ్యక్షురాలు ట్సాయ్ పార్టీకి ఎదురుదెబ్బ తగలింది

అసలు ఇంతకీ తైవాన్ ఏంటి?

తైవాన్‌ను ఏమని పిలవాలనే దానిపై ఇప్పటిదాకా గందరగోళమే తప్ప ఎలాంటి స్పష్టతా లేదు.

1949లో తైవాన్‌కు వలసపోయిన షియాంగ్ కై-షెక్, తమ ప్రభుత్వమే మొత్తం చైనాకు ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రకటించారు. ఐరాస భద్రతా మండలిలో చైనా స్థానానికి ఆ పార్టీనే ప్రాతినిధ్యం వహించింది. అనేక పాశ్చాత్య దేశాలు షియాంగ్ ప్రభుత్వాన్నే, అధికారిక చైనా ప్రభుత్వంగా గుర్తించాయి.

కానీ, 1971లో బీజింగ్‌లోని ప్రభుత్వాన్నే ఐరాస అధికారికంగా గుర్తించడం మొదలుపెట్టింది. దాంతో తైవాన్‌లోని ఆర్‌వోసీ (రిపబ్లిక్ ఆఫ్ చైనా) ప్రభుత్వాన్ని గుర్తించే దేశాల సంఖ్య 20కి పడిపోయింది.

తైవాన్‌ను చైనా విడిపోయిన ప్రావిన్సుగా గుర్తిస్తుంది. అవసరమైతే సైనిక చర్య ద్వారా అయినా దాన్ని మళ్లీ తనలో కలుపుకోవడానికి చైనా సిద్ధంగా ఉంది. కానీ, తైవాన్ నాయకులు మాత్రం దాన్ని స్వతంత్ర అధికారం గల రాజ్యమని చెబుతారు.

తైవాన్‌కు సొంత రాజ్యాంగంతో పాటు, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నాయకులున్నారు. 3లక్షల సైనిక బలం కూడా ఉంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక తైవాన్‌లోని కౌసంగ్ నగరం

స్వాతంత్ర్యంపై తైవాన్ ప్రజలు ఏమంటారు?

రాజకీయంగా ఎక్కువ పురోగతి లేనప్పటికీ రెండు పక్షాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగయ్యాయి. తైవాన్ కంపెనీలు దాదాపు 60బిలియన్ డాలర్లను చైనాలో పెట్టుబడిగా పెట్టాయి. దాదాపు పది లక్షల మంది తైవాన్ ప్రజలు చైనాలో నివసిస్తున్నారు.

తమ ఆర్థిక వ్యవస్థ చైనాపై ఆధారపడి ఉందని కొందరు తైవాన్ ప్రజలు ఆందోళన చెందుతారు. కానీ, అదే మంచిదని, దానివల్ల చైనా తైవాన్‌పై సైనిక చర్యకు పాల్పడే అవకాశం ఉండదని ఇంకొందరు చెబుతారు.

అధికారికంగా తైవాన్‌లోని డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ తైవాన్ స్వతంత్రతకే మద్దతిస్తుంది. కానీ, అక్కడి కేఎంటీ పార్టీ చైనాతో కలవాలని కోరుకుంటోంది. ఒపీనియన్ పోల్స్‌లో కొన్ని చైనాతో కలవడానికి అనుకూలంగా, ఇంకొన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. ఎక్కువ శాతం మాత్రం ప్రస్తుత స్థితికే కట్టుబడి ఉండేందుకు మొగ్గు చూపాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఎక్కువ మంది తైవాన్ ప్రజలు ప్రస్తుత స్థితికే మొగ్గు చూపుతున్నారు

ఈ వివాదంలో అమెరికా పాత్ర ఏంటి?

తైవాన్‌కు ఏకైక నేస్తం అమెరికా. రెండో ప్రపంచ యుద్ధం, కోల్డ్ వార్ సమయంలో తైవాన్‌తో అమెరికా సంబంధాలు దెబ్బతిన్నా ఇటీవలి కాలంలో అవి మెరుగుపడ్డాయి.

‘తైవాన్ రిలేషన్స్ యాక్ట్’‌ను సైతం అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చింది. అందులో భాగంగా తైవాన్‌కు రక్షణ ఆయుధాలను అమెరికా సరఫరా చేయసాగింది. తైవాన్‌పై చైనా ఎలాంటి దాడి చేసినా అది తమను ‘తీవ్రమైన ఆందోళన’కు గురిచేస్తుందని అమెరికా ప్రకటించింది.

అప్పట్నుంచీ చైనా ప్రాంతీయ శక్తిగా ఎదగడాన్ని ఎదుర్కొనేందుకు, తైవాన్ ఆర్థిక విజయంలో అమెరికా వ్యూహాత్మకంగానే కీలక పాత్ర పోషిస్తోందని చెబుతారు.

తైవాన్ విషయంలో అమెరికా కీలక పాత్ర 1996లో స్పష్టంగా కనిపించింది. తైవాన్ మొదటి అధ్యక్ష ఎన్నికకు సిద్ధమైనప్పుడు, దాన్ని ప్రభావితం చేసేందుకు చైనా మిసైల్ పరీక్షలను నిర్వహించింది. దానికి బదులుగా, నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆసియాలో అమెరికా సైనిక శక్తిని ప్రదర్శనకు పెట్టారు. నేరుగా తమ యుద్ధ నౌకలను తైవాన్‌కు పంపి, చైనాకు స్పష్టమైన సందేశాన్ని పంపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు