నాసా పరిశోధన: భూమికి 640 కోట్ల కిలో మీటర్ల దూరంలో 'స్నో మ్యాన్'

  • 4 జనవరి 2019
అల్టిమా టూలే

నాసాకు చెందిన స్పేస్ క్రాఫ్ట్ సౌరవ్యవస్థలో గతంలో ఎప్పుడూ చేరుకోనంత సుదూర ప్రాంతానికి చేరుకుంది.

న్యూ హోరైజన్స్ తన ప్రయాణంలో వేరుశెనగ కాయ లేదా స్నో మ్యాన్ ఆకారంలో ఉన్న ఒక మంచు ప్రపంచాన్ని గుర్తించింది.

'అల్టిమా టూలే' అని పిలిచే ఈ ప్రాంతం భూగ్రహం నుంచి నాలుగు వందల కోట్ల మైళ్ల దూరంలో ఉంది.

తమ స్పేస్ క్రాఫ్ట్ ఈ ప్రాంతానికి చేరుకోగానే నాసా మిషన్ కంట్రోల్ రూమ్ లో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionసుదూర పదార్థాన్ని ఫొటో తీసిన నాసా

నాసా సంబరాలు

న్యూ హోరైజన్స్ మంచు ప్రపంచమైన అల్టిమా టూలే దగ్గరకు చేరుకున్నట్టు ధ్రువీకరించగానే క శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.

మానవుడు ఇప్పటిదాకా శోధించని సుదూర ప్రాంతంలో అల్టిమా టూలే ఉంది.

నాలుగు వందల కోట్ల మైళ్ల దూరం అంటే ఈ ప్రాంతం దాదాపు ఆరు వందల నలభై కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇక్కడ కనిపించే రాతి పదార్థం ద్వారానే అనేక గ్రహాలు తయారయ్యాయని సైంటిస్టులు అంటున్నారు.

దీని గురించి వివరించిన న్యూ హోరైజన్స్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఆలన్ స్టర్న్ "సోమవారం అర్ధరాత్రి దాటాక అమెరికాకు చెందిన న్యూ హోరైజన్స్ వ్యోమనౌక మనిషి చరిత్రలో ఇప్పటిదాకా శోధించని ప్రాంతానికి చేరుకుందని తెలియజేస్తున్నాం. ఈ స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్న వేలాది వ్యవస్థలు అన్నీ కలిసికట్టుగా సరిగ్గా పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది" అని చెప్పారు.

ఆసక్తి రేపుతున్న అల్టిమా టూలే

ప్రస్తుతానికి ఇది లో-రెసొల్యూషన్ ఫోటోలను మాత్రమే పంపించగలిగింది. కానీ ముందు ముందు ఇది మరింత స్పష్టమైన చిత్రాలు పంపించనుంది.

కొన్ని గిగా బైట్ల కెపాసిటీ గల ఫోటోలను ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికే చిత్రీకరించిందని నాసా ప్రకటించింది.

చివరగా ఇది నిన్న ఒక ఫోటోను పంపించింది. ఆ ఫొటోలో ఈ అల్టిమా టూల్ వేరుశనగ కాయ, లేదా స్నోమ్యాన్ ఆకారంలో కనిపిస్తోంది.

"ఇది ఎంత అద్భుతమైన రోజు. అల్టిమా టూలే తనలో దాచుకున్న రహస్యాలను ఇపుడు బయటపెడుతోంది. ఫోటోలు కాస్త అస్పష్టంగా ఉన్నాయి. కానీ ఆ అస్పష్టత కూడా అందంగానే ఉంది" అని న్యూ హోరైజన్స్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ హాల్ వీవర్ చెప్పారు.

శాస్త్రవేత్తల విశ్లేషణ ద్వారా ఇదొక ప్రొపెల్లర్ లాగా తిరుగుతోందని అర్థమవుతోంది.

అల్టిమా టూల్ గురించి, అది ఉన్న ప్రాంతం గురించి శాస్త్రవేత్తల్లో చాలా ఆసక్తి ఏర్పడుతోంది.

Image copyright NASA/JHU-APL/SWRI

గడ్డకట్టిన స్థితిలో అల్టిమా టూలే

నాసా స్పేస్‌క్రాఫ్ట్ పంపిన డేటా ప్రకారం ఇవి చాలా చీకటిగా కనిపిస్తున్నాయి. వాటిపై 13 శాతం కాంతి మాత్రమే పడుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ ప్రాంతంలో సూర్యుడి కిరణాలు చాలా తక్కువగా పడుతాయి. అదుంకే ఇక్కడ ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువ.

అందుకే ఇక్కడ రసాయన ప్రక్రియలు దాదాపు జరగకపోయుండచ్చవి భావిస్తున్నారు. అల్టిమా టూలే ఏర్పడినప్పటి నుంచి అలా గడ్డకట్టిన స్థితిలో ఉందని అంటున్నారు.

అల్టిమా టూల్ పరిమాణం చిన్నగా (కేవలం 33 కిలోమీటర్లు) ఉంది. అలాంటప్పుడు ప్రారంభం నుంచీ దానిలో పెద్దగా మార్పులు కూడా జరగకపోయి ఉండచ్చని భావిస్తున్నారు.

ఇక దీని గురించిన మూడో ముఖ్యమైన విషయం ఇది కైపర్ బెల్టులో ఉంది. సోలార్ సిస్టంలో ఉన్న గ్రహాలు పరస్పరం గుద్దుకున్న ఘటనలు చాలా జరిగాయి. కానీ కైపర్ బెల్టులో ఇలాంటి ఘటనలు చాలా తక్కువ జరుగుతాయి.

మరోవైపు మన సౌర వ్యవస్థ అంచులకు ప్రయాణిస్తున్నప్పుడు ప్లూటోకు సంబంధించిన చిత్రాలను కూడా న్యూ హోరైజన్స్ చిత్రీకరించింది. ఆ ఫొటోలు స్పష్టంగా ఉన్నాయి.

ఇవి ఎంత స్పష్టంగా ఉన్నాయో ముందు ముందు అల్టిమా టూలేకు సంబంధించిన చిత్రాలు కూడా అంతే స్పష్టంగా ఉండబోతున్నాయి.

Image copyright NASA/JHU-APL/SWRI

మరింత ముందుకు న్యూ హోరైజాన్స్

అంతే కాదు, న్యూ హోరైజాన్స్ అల్టిమా టూలేను దాటి ఇంకా సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

మొదట శాస్త్రవేత్తలు అల్టిమా డేటాను సేకరించే పనిని పూర్తి చేయనున్నారు. కానీ వారు ఈ మిషన్‌ను మరింత పొడిగించాలని కూడా నాసాను అడగనున్నారు.

వచ్చే దశాబ్ద కాలంలో కైపర్ బెల్టులో కనీసం మరో ఆబ్జెక్ట్ గుర్తించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

దాన్ని చేయడానికి న్యూ హోరైజన్స్‌లో తగినంత ఇంధన నిల్వలు కూడా ఉండాలి.

అయితే ఇది 2030 వరకూ తనలోని పరికరాలను ఉపయోగించడానికి వీలుగా విద్యుత్ నిల్వలు ఉపయోగించగలగాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)