చైనా, ఆపిల్, ట్రంప్... ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చనున్న ఏడు కీలక శక్తులు

  • 5 జనవరి 2019
చైనా, ఆర్థిక వ్యవస్థ Image copyright Getty Images
చిత్రం శీర్షిక మరో దశాబ్దంలో చైనా ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించొచ్చు

చైనా, ఆపిల్, ట్రంప్, టెక్నాలజీ, పట్టణాల పెరుగుదల భవిష్యత్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయనున్న అతి ముఖ్యమైన అంశాలని ఒక కొత్త పుస్తకం అంటోంది.

జెఫ్ డెస్జార్డిన్స్ సంపాదకులుగా వ్యవహరించిన 'విజువలైజింగ్ ఛేంజ్: ఎ డేటా డ్రివెన్ స్నాప్‌షాట్ ఆఫ్ అవర్ వరల్డ్' అన్న పుస్తకం, ప్రపంచంలో వస్తున్న మార్పులను స్థూలంగా పరిశీలించింది.

రానున్న రోజుల్లో మానవ జీవితంలో రాబోయే మార్పుల గురించి ఈ పుస్తకంలో చర్చించారు.

Image copyright Getty Images

15వ శతాబ్దంలో ఈ విశ్వానికి భూమి కేంద్రం అన్న వాదనకు వ్యతిరేకంగా నికోలస్ కోపెర్నికస్ ప్రపంచం సూర్యుని చుట్టూ తిరుగుతోందని అన్నపుడు ఎంత అలజడి మొదలైందో, వెబ్ కూడా మన జీవితంలో అంతే అలజడి తీసుకువచ్చిందని జెఫ్ అంటారు.

వెబ్ రాకతో ప్రజల ఆలోచనల్లో, వాణిజ్య నమూనాల్లో, వినియోగదారుల ఆలోచనల్లో, భౌగోళిక రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి.

''గొప్ప మార్పులు ఎక్కడి నుంచైనా రావచ్చు. రేపు జరగబోయే అతి పెద్ద మార్పునకు నేడు ఎక్కడో నాంది ఉంటుంది'' అంటారు డెస్జార్డిన్స్.

Image copyright Getty Images

డెస్జార్డిన్స్, ఆయన టీమ్ ప్రకారం భవిష్యత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చే ఏడు ముఖ్యాంశాలు:

1. సాంకేతిక సంస్థలు

అనేక దశాబ్దాలుగా ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీలు పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి మీద లేదా సహజ వనరులను తవ్వి తీసి, వాటిని శుద్ధి చేయడం మీద దృష్టి కేంద్రీకరించాయి.

ఫోర్డ్, జనరల్ ఎలెక్ట్రిక్, ఎక్సాన్‌లాంటి సంస్థలు చేసిన పని ఇదే.

ఆ తర్వాత ఆర్థిక సేవలు, టెలికమ్యూనికేషన్స్, రిటైల్ సంస్థలు రంగం మీదకు వచ్చాయి.

ప్రస్తుతం సమాచారం అన్నది అన్నిటికన్నా విలువైనది. గత ఐదేళ్లుగా ప్రపంచంలోని అన్ని స్టాక్ మార్కెట్లలో అత్యంత విలువైన కంపెనీలు టెక్ సంస్థలే.

అయిదేళ్ల కిందట ప్రపంచంలోని అయిదు అగ్రశ్రేణి సంస్థల్లో టెక్ కంపెనీ ఆపిల్ ఒక్కటే ఉండేది. 2018 మొదటి మూడు నెలల్లో ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెన్సెంట్‌లు టాప్ ఫైవ్ సంస్థలుగా నిలిచాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక షాంఘై ఆకాశ హర్మ్యాలు

2. చైనా అభివృద్ధి రేటు

చైనా ఆర్థిక వ్యవస్థ ప్రభావం కొత్తదేమీ కాదు. కానీ డెస్జార్డిన్స్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానాల ఉమ్మడి వేగాలను ప్రస్తావిస్తారు.

చైనాలో కొన్ని నగరాల ఆర్థిక ఉత్పత్తి దేశాల ఆర్థికోత్పత్తికన్నా ఎక్కువగా ఉంది.

ప్రస్తుతం చైనాలో పదిలక్షలకు పైగా జనాభా కలిగిన నగరాలు వందకుకు పైగా ఉన్నాయి.

యాంగ్జీ నది చుట్టూ ఉన్న షాంఘై, సుజౌ, హాంగ్‌జౌ, వుషి, నాన్‌టాంగ్, నింగ్‌బో, నాన్‌జింగ్, చాంగ్‌జౌలాంటి నగరాలు ఇలా అభివృద్ధి చెందిన నగరాలు.

వాటి ఆర్థిక వృద్ధి ఎంత పెరుగుతుందో వాటి పరిణామం కూడా అలాగే పెరుగుతోంది.

2030 నాటికి చైనా అమెరికాను దాటి ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని భావిస్తున్నారు.

Image copyright Getty Images

3. పెరుగుతున్న మెగా సిటీల ప్రాధాన్యం

ఇలా నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం చైనా ఒక్కటే కాదు.

రాబోయే దశాబ్దాలలో పెరగనున్న పట్టణ జనాభా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేయనుంది.

ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం చైనా, ఇంకా ఇతర పాశ్చాత్య దేశాలలో జనాభా రేటు స్థిరంగా ఉంటే.. ఆఫ్రికా, ఇతర ఆసియా దేశాలలో జనాభా పెరిగి, పట్టణీకరణ కూడా వేగవంతం అవుతుంది.

దీని కారణంగా కోటికి పైగా జనాభా కలిగిన మరిన్ని మెగా సిటీలు పుట్టుకొస్తాయి. గత ఏడాది నాటికి అలాంటి నగరాలు 47 ఉన్నాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

ఈ శతాబ్దాంతానికి ఆఫ్రికాలో న్యూయార్క్ కన్నా పెద్దవైన అలాంటి మెగా సిటీలు కనీసం 13 ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక న్యూయార్క్‌లో దేశానికి ఉన్న అప్పులను సూచించే గడియారం

4.పెరుగుతున్న రుణభారం

ప్రపంచవ్యాప్తంగా రుణభారం మొత్తం విలువ రూ.168 కోట్ల కోట్లు. దీనిలో సుమారు నాలుగో వంతు ప్రభుత్వాల ఖాతాల్లోనే ఉన్నాయి.

జీడీపీలో శాతం రూపేణా లెక్కేస్తే జపాన్ రుణాలు 253 శాతం, అమెరికా రుణాలు 105 శాతం ఉన్నాయి.

అమెరికా, చైనా, జపాన్‌ల మొత్తం రుణాలు ప్రపంచ మొత్తం రుణాలలో 58 శాతం ఉన్నాయి.

గత కొన్నేళ్లుగా అమెరికా, యూరప్, అభివృద్ధి చెందుతున్న కొన్ని ఆర్థిక వ్యవస్థలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సలహాలకు విరుద్ధంగా ఇటీవలి కాలంలో తమ రుణ స్థాయిలను పెంచాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక నూతన సాంకేతిక పరిజ్ఞానాలు అతి వేగంగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి

5. వేగవంతమైన సాంకేతిక మార్పులు

ఆధునిక చరిత్రలో అనేక గొప్ప సాంకేతిక ఆవిష్కరణలు ఉన్నాయి. ఉదాహరణకు విద్యుత్ ఉత్పత్తి, టెలిఫోన్ ఆవిష్కరణ, ఆటోమొబైల్, విమానం మొదలైనవి.

అయితే, ఇవి సామాన్య ప్రజల వద్దకు చేరడానికి అనేక దశాబ్దాలు పట్టింది.

ఉదాహరణకు, అమెరికాలో ఆటోమొబైల్స్ 90 శాతం ప్రజల వద్దకు చేరడానికి 80 ఏళ్లు పట్టింది. ఇంటర్నెట్ అదే స్థాయిలో ప్రజల వద్దకు చేరడానికి 23 ఏళ్లు పట్టింది. ఆరేళ్లలో టాబ్లెట్ వినియోగం 3 నుంచి 51 శాతానికి పెరిగింది.

భవిష్యత్తులో ఇలా సాంకేతిక పరిజ్ఞానం జనం వద్దకు చేరే సమయం కేవలం నెలల్లోనే ఉంటుందని డెస్జార్డిన్స్ అంచనా వేస్తున్నారు.

Image copyright Getty Images

6. వాణిజ్యపరమైన అడ్డంకులు

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రభుత్వాలు క్రమక్రమంగా వాణిజ్యపరమైన అడ్డంకులు తొలగించుకోవాలని భావించాయి.

కానీ, క్రమక్రమంగా అమెరికాలాంటి దేశాలు స్వేచ్ఛా వాణిజ్య భావనను తోసిపుచ్చుతున్నాయి. గత ఏడాది ట్రంప్ అనేక చైనా ఉత్పత్తులపై పన్నులు పెంచడంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది.

'విజువలైజింగ్ ఛేంజ్: ఎ డాటా డ్రివెన్ స్నాప్‌షాట్ ఆఫ్ అవర్ వరల్డ్' దీనిని వాణిజ్యపరమైన వైరుధ్యంగా భావించింది. ప్రపంచం స్వేచ్ఛా వాణిజ్యం వైపు మరలవచ్చు లేదా కొత్త నిబంధనలు పుట్టుకురావచ్చు.

Image copyright Getty Images

7. హరిత విప్లవం?

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కారణంగా గత కొన్నేళ్లుగా పునరుద్ధరణీయ వనరుల వినియోగం పెరుగుతోంది.

అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే శక్తిలో సౌరశక్తి మొదటి స్థానంలో ఉంటుందని వెల్లడించింది.

అంతర్జాతీయ సుస్థిరాభివృద్ధి సంస్థ కూడా పునరుద్ధరణీయ ఇంధన వనరులపై పెట్టుబడులు రాబోయే 20 ఏళ్లలో సుమారు రూ. 5 కోట్ల కోట్లకు చేరవచ్చని అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)