స్మార్ట్ ఫోన్ తెరలకు పిల్లలు అతుక్కుపోతున్నారా... మరీ అంత టెన్షన్ పడకండి

  • 6 జనవరి 2019
child Image copyright venugopal

స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ల తెరల మీద ఏవేవో వీక్షిస్తూ గడిపే పిల్లలకు.. దానికదే హానికరమనేందుకు పెద్దగా ఆధారాలు లేవని ప్రముఖ పిల్లల వైద్యులు చెప్తున్నారు.

పిల్లలు ఈ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ల స్క్రీన్లు చూడటానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు పాటించే తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాజా మార్గదర్శకాలు చెప్తున్నాయి.

ఎంతసేపు ఉపయోగించవచ్చు అనే పరిమితులేవీ విధించనప్పటికీ.. నిద్రపోవటానికి గంట ముందు నుంచీ అవి వాడవద్దని ఆ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.

అలాగే.. నిద్ర, వ్యాయామం, కుటుంబంతో గడిపే సమయాన్ని.. ఈ పరికరాలు భర్తీ చేయకుండా చూసుకోవాలని కూడా నిపుణులు చెప్తున్నారు.

చిన్నారులు టీవీ, ఫోన్లు, కంప్యూటర్లు వంటి స్క్రీన్లను ఉపయోగించే సమయం (స్క్రీన్ టైమ్) మీద పరిమితులు విధించాలా అనే అంశం మీద బీఎంజే ఓపెన్ మెడికల్ జర్నల్‌లో తాజాగా ఒక సమీక్ష ప్రచురించారు.

Image copyright Getty Images

'ప్రమాదకరమనేందుకు ఆధారం లేదు'

పిల్లల వైద్య నిపుణుల శిక్షణను పర్యవేక్షించే రాయల్ కాలేజ్ ఆఫ్ పీడియాట్ర్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్ (ఆర్‌సీపీసీహెచ్).. 18 ఏళ్ల లోపు చిన్నారులు, టీనేజర్ల కోసం ఈ మార్గదర్శకాలను రూపొందించింది.

స్క్రీన్ ముందు గడిపే సమయం ఆరోగ్యానికి ప్రమాదకరమని చెప్పటానికి సరైన ఆధారాలు లేవని అది చెప్తోంది.

యూనివర్సిటీ కాలేజ్ లండన్ నిపుణులు ఈ సమీక్ష నిర్వహించారు.

ఎక్కువగా స్క్రీన్ ముందు గడిపే వారికి.. ఊబకాయం, డిప్రెషన్ సమస్యలకు ఉన్న సంబంధం ఉందని చెప్తున్న ఆధారాలను సమీక్షించింది. అయితే ఈ ఆధారాలను చూస్తే.. ఎక్కువ సమయం తెర ముందు గడపటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయా లేక ఈ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తెర ముందు గడుపుతున్నారా అనేది స్పష్టం కావటం లేదని పేర్కొంది.

Image copyright Getty Images

పిల్లలు తెర ముందు గడిపే సమయం గురించి తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవటానికి వీలుగా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలని సూచించింది:

  • కుటుంబం స్క్రీన్ ముందు గడిపే సమయం నియంత్రణలోనే ఉందా?
  • కుటుంబం చేయాలనుకునే పనులకు తెర ముందు గడిపే సమయం ఆటంకంగా ఉందా?
  • తెర ముందు గడిపే సమయం నిద్రకు ఆటంకంగా ఉందా?
  • తెర ముందు గడిపే సమయంలో చిరుతిళ్లు నియంత్రణలో ఉన్నాయా?

నిజానికి.. ప్రపంచాన్ని తెలుసుకోవటానికి ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు ఓ ఉత్తమ మార్గమని ఆర్‌సీపీసీహెచ్ అధికారి డాక్టర్ మాక్స్ డేవీ అంటున్నారు.

పై ప్రశ్నలకు మీ సమాధానాలు మీకు సంతృప్తికరంగా ఉన్నట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఆ సమాధానాలు సంతృప్తికరంగా లేనట్లయితే తెర ముందు గడిపే సమయాన్ని సమీక్షించుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

''ఈ తెరలు ఆధునిక జీవితంలో ఒక భాగం.. సీసాలో నుంచి జెనీ (భూతం) బయటకు వచ్చింది. దానిని మళ్లీ సీసాలో బంధించలేం'' అని ఆర్‌సీపీసీహెచ్ అధ్యక్షుడు డాక్టర్ రసెల్ వైనర్ వ్యాఖ్యానించారు.

''అందరికీ ఒకటే పరిష్కారం ఉండదు. సమస్యలు, ప్రయోజనాల మధ్య సంతులనం సాధించాలి. తమ పిల్లలకు ఏది మంచిదో తల్లిదండ్రులు ఆలోచించాలి'' అని సూచించారు.

Image copyright Getty Images

తల్లిదండ్రులు ఏమంటున్నారు?

అయితే.. ఈ సమీక్ష, మార్గదర్శకాలు లోతుగా లేవని కొందరు తల్లిదండ్రులు బీబీసీతో పేర్కొన్నారు.

''తెర ముందు గడిపే సమయం పిల్లలు స్కూలులో ఆటల్లో రాణించటాన్ని దెబ్బతీస్తుందనటంలో నాకు ఎటువంటి సందేహం లేదు'' అని ఓ 14 ఏళ్ల బాలుడి తల్లి ఆండీ చెప్పారు.

తన కుమారుడు తెర ముందు గడిపే సమయాన్ని తాను శుక్రవారం స్కూలు తర్వాతి నుంచి శనివారం వరకూ పరిమితం చేశానని.. తన కుమారుడు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ స్కూలు చదువులో మెరుగుపడ్డాడని తెలిపారు.

అయితే.. నిద్ర పోయే ముందు వరకూ తెర ముందు గడపటం పిల్లల నిద్రకు చేటు చేస్తుందని ఆధారాలు లభించటంతో.. నిద్రపోయే గంట ముందు నుంచీ తెర చూడటం మానేయాలని సూచిస్తున్నారు.

ఈ పరికరాలు మెదడును ఉత్తేజరుస్తాయి. వాటి నుంచి వెలువడే నీలి కాంతి.. శరీరం నుంచి నిద్ర హార్మోన్ మెలటోనిన్‌ విడుదలను ఆటంక పరుస్తుంది.

Image copyright Getty Images

చాలా ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్లలో నైట్ మోడ్ ఉన్నా కూడా... అవి ప్రభావవంతంగా ఉంటాయనే దానికి ఆధారాలు లేవని ఈ కాలేజీ చెప్తోంది.

మొత్తంగా.. నిద్ర, శారీరక కార్యకలాపాలు, తిండి, బెదిరింపులు, పేదరికం వంటి ఇతర అంశాలతో పోలిస్తే.. పిల్లల ఆరోగ్యం మీద స్క్రీన్ టైమ్ చూపే ప్రభావం తక్కువేనని ఈ అధ్యయనం చెప్తోంది.

అదే సమయంలో ఈ స్క్రీన్ టైమ్ పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తుందనే దానికీ ఆధారం లేదని పేర్కొంది.

స్క్రీన్ టైమ్ పరిమితుల మీద కుటుంబాలు తమ పిల్లలతో చర్చలు జరపాలని సూచిస్తోంది.

అయితే.. పసిపిల్లలు, చిన్న పిల్లల స్క్రీన్ టైమ్ విషయంలో తల్లిదండ్రులే నిర్ణయం తీసుకుంటారు. పిల్లలు పెరిగే కొద్దీ.. వారు సొంతంగా నిర్ణయం తీసుకునే దిశగా పయనించాలి. కానీ ఈ ప్రయాణం ఒక క్రమపద్ధతిలో పెద్దల మార్గదర్శకత్వంలో సాగాలని సూచించింది.

తల్లిదండ్రులకు చిట్కాలు:

  • ఆహారం తీసుకునే సమయంలో స్క్రీన్ జోక్యం లేకుండా చూసుకోవచ్చు.
  • పిల్లల స్క్రీన్ టైమ్ అదుపు తప్పినట్లు కనిపిస్తే తల్లిదండ్రులు జోక్యం చేసుకోవచ్చు.
  • తల్లిదండ్రులు కూడా తాము ఎక్కువగా తెర ముందు గడుపుతున్నామా అనేది ఆలోచించుకోవాలి.
  • చిన్న పిల్లలకి ముఖాముఖి సంభాషణలు ఎక్కువగా అవసరం. దీనిని స్క్రీన్ టైమ్ భర్తీ చేయదు.

ఆధారం: ఆర్‌సీపీసీహెచ్

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionమొబైల్ ఎక్కువ సేపు వాడే పిల్లల్లో కుంచించుకుపోతున్న మెదడు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు