చాలా మతాలు అంతరించినా క్రైస్తవం ఎలా విస్తరించింది?

  • 10 జనవరి 2019
క్రైస్తవ మతం Image copyright Getty Images

జీసస్ ఆఫ్ నజరేత్ అనే కార్మికుడి చుట్టూ గుమిగూడిన ఒక చిన్న బృందం నుంచి రెండు వేల ఏళ్ళలో 200 కోట్ల మందికి పైగా నమ్మకస్థులు ఉన్న ప్రపంచ మతంగా విస్తరించింది క్రైస్తవం.

క్రైస్తవ మతం ఆరంభమైన తొలి శతాబ్దాల్లోనూ అనూహ్య వృద్ధి రేటు సాధించింది. క్రీస్తు శకం 350 నాటికే మూడు కోట్ల మంది క్రైస్తవ మతస్తులు ఉన్నట్లు భావిస్తున్నారు.

కానీ, అప్పట్లో పరిస్థితులు మరోలా ఉండే అవకాశం లేకపోలేదు. ప్రాచీన కాలంలో డజన్లు, వందల మంది ప్రబోధకులు, ప్రచారకర్తలు వివిధ సందర్భాలలో కొత్త మత ఉద్యమాలను స్థాపించి, ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నాలు చేసి ఉంటారని అధ్యయనవేత్తలు విశ్వసిస్తున్నారు.

వాటిలో చాలా మతాలు కొంత కాలం వరకూ వర్ధిల్లినా అనంతరం అంతరించిపోయాయి. క్రైస్తవ మతం మాత్రం పురోగమించింది.

Image copyright Getty Images

ఒక చక్రవర్తి విశ్వాసం...

నాలుగో శతాబ్దంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన క్రైస్తవమతం భవిష్యత్తును నిర్ణయించిందని చరిత్రకారులు అంచనావేశారు. అది రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటైన్ మతమార్పిడి.

రోమన్ చక్రవర్తి ఒకసారి క్రైస్తవాన్ని తన మతంగా స్వీకరించిన తర్వాత అది ఒక సంస్థాగత నిర్మాణంగా వేగంగా అభివృద్ధి చెందింది. రోమ్ రాజ్యం అంతరించినా ఆ మతం పురోగమించింది.

అయితే, రోమ్ చక్రవర్తి గుర్తించే, స్వీకరించే మతంగా మారటం ఒక్కటే క్రైస్తవం విస్తరించటానికి కారణం ఏకైక కారణం కాదు.

ఇదెలా జరిగిందనేది తెలుసుకోవాలంటే, ప్రపంచ మతంగా మారటానికి చాలా ముందు క్రైస్తవ ఉద్యమం తొలి శతాబ్దాల్లోకి మనం వెళ్లాలి.

Image copyright Thinkstock

జూదియా పట్టణాల నుంచి...

క్రీస్తు శకం 30వ సంత్సరం కాలానికి జీసస్ మరణించినప్పటికీ, ఆయన బోధనలు ఆగిపోలేదు.

జీసస్ అనుచరులు ఆయనను దేవుడి కుమారుడిగా, రక్షకుడిగా పరిగణించారు. ఆయన చనిపోయి పునరుజ్జీవుతుడైనట్లు విశ్వసించారు.

జీసస్ మరణానంతరం ఆయన బోధనలను ప్రపంచ దేశాలన్నిటికీ వినిపించాలని ఆయన శిష్యులు ప్రేరేపితులయ్యారు.

అలా మొదటి క్రైస్తవ బోధకులు ఒక సమాజం నుంచి మరొక సమాజానికి తిరుగుతూ జీసస్ బోధనలు వినిపించేవారు.

తొలి సంవత్సరాల్లో... కొత్త నిబంధనలోని సువార్తలు, ఇతర భాగాలను ఇంకా రాయలేదు. కాబట్టి ఆ బోధకులు తమకు వినిపించిన, ప్రార్థనల్లో తమకు అందిన రచనల్లో నుంచి జీసస్ గురించి కథలు చెప్పేవారు.

Image copyright Getty Images

''భాగస్వామ్య పిరమిడ్లు''

ఈ కొద్ది మంది బోధకులు ఎలా పెరిగిపోయారు?

మత ఉద్యమాల మీద జరిగిన ఆధునిక సామాజిక పరిశోధనలు.. అత్యధిక వృద్ధి సాధించిన బృందాలు 'భాగస్వామ్య పిరమిడ్ల' ద్వారా దానిని సాధించాయని సూచిస్తున్నాయి. అంటే, ఒక్కో సభ్యుడు కనీసం మరో ఇద్దరు కొత్త సభ్యులను చేర్చుకుంటే వారి సంఖ్య వేగంగా హెచ్చింపు అవుతూ పోతుంది.

క్రైస్తవం తొలి సంవత్సరాల్లో ఈ విధంగా పెరిగి ఉండవచ్చు. తొలి నాళ్ల క్రైస్తవ సమూహాలు తమ సమాజ సభ్యుల ఇళ్లలో సామూహిక ప్రార్థనలు, భోజనాలు నిర్వహించినట్లు అందుబాటులో ఉన్న ఆధారాలు చెప్తున్నాయి.

ఇళ్లలో నిర్వహించే ఇటువంటి సమావేశాలు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఈ కొత్త మతాన్ని పరిచయం చేయటానికి సహజమైన వాతావరణం అందించింది.

క్రైస్తవం వర్ధిల్లిన ఆ కాలపు రోమన్ ప్రపంచం భిన్న సంస్కృతులు గల సమాజంగా విస్తరించింది.

వ్యాపారులు, చేతివృత్తుల వారు.. ఉమ్మడి భౌగోళిక, మత, జాతి వారసత్వాలు భూమికగా విశ్వసనీయమైన వ్యవస్థలను నిర్మించేవారు.

ఈ వ్యవస్థల్లో మహిళా వ్యాపారవేత్తలు కీలక పాత్ర పోషించారు. క్రైస్తవం విస్తరించటానికి ఈ వ్యవస్థలు ఒక ముఖ్యమైన వాహికగా ఉపయోగపడినట్లు కనిపిస్తోంది.

Image copyright Getty Images

సామాజిక మనస్తత్వం

ఇటీవలి కాలంలో ట్యునీసియాలో పోలీసుల దాడికి గురైన మొహమ్మద్ బౌజిజి అనే పండ్ల విక్రేత కథ.. సోషల్ మీడియాలో ప్రతిధ్వనించటంతో మధ్య ప్రాచ్యమంతటా 'అరబ్ వసంతం' విస్తరించింది.

ఆలోచనలు వ్యాప్తి చెందటానికి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం దోహదపడుతోంది.

భావోద్వేగాలను కదిలించే, సహానుభూతిని కానీ ఆగ్రహావేశాన్ని కానీ రగిలించగలిగే.. లేదా ఆశ్చర్యచకితులను చేసే ఆలోచనలను సాధారణంగా పంచుకోవటం జరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

అలాగే, ఉపయోగపడతాయని జనం భావించే ఆలోచనలను కూడా పంచుకుంటారు.

తొలి నాటి క్రైస్తవ సమాజాలు కథలను మౌఖికంగా ప్రచారం చేసినట్లు మనకు తెలుసు. ఆ కథలను క్రమంగా లిఖిత రూపంలో కొత్త నిబంధన, తదితర తొలినాటి రచనలుగా క్రోడీకరించారు.

ఈ రూపాల్లో నిక్షిప్తం చేసిన కథలకు, వాటిని ప్రజలు ఇతరులతో విస్తృతంగా పంచుకోవటానికి ప్రోత్సహించేటువంటి భావోద్వేగ లక్షణాలు ఉన్నాయి. స్ఫూర్తి, అద్భుతం, న్యాయమైన ఆగ్రహాన్ని ప్రతిబించించే కథలతో పాటు సంఘర్షణలను ఎలా పరిష్కరించుకోవాలి, ఒక సమాజాన్ని ఎలా నిర్వహించాలి అనే అంశాలపై ఆచరణాత్మక సలహాలు కూడా వీటిలో ఉన్నాయి.

రోమన్ సామ్రాజ్యం చివరి శతాబ్దాల్లో అత్యధిక సంఖ్యలో ప్రజలు క్రైస్తవమతస్తులుగా మారటానికి.. ఈ లిఖిత పూర్వక ఆలోచనలు, నిర్మాణ వ్యవస్థలు కారణమని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

Image copyright Getty Images

అంతర్థానమైన మూడు మతాలు

క్రైస్తవమతం పుట్టిన సమయంలోనే ఇతర మతాలు కూడా రూపొందుతున్నాయి. వాటిలో చాలా మతాలు అంతరించినప్పటికీ వాటి ప్రభావాన్ని కొంతమేరకు మిగిల్చాయి.

వాటిలో మూడు మతాలు ఇవి:

మిత్రేయిజం: మిత్రాస్ అనే దేవుడిని పూజించే రోమన్ మతమిది. ఇది కేవలం పురుషులకే పరిమితం. జీసస్ కన్నా 600 సంవత్సరాల ముందు డిసెంబర్ 25వ తేదీనే మిత్రాస్ అనే దేవుడు జన్మించాడని వీరి విశ్వాసం. క్రైస్తవమతం వృద్ధి చెందుతుండటంతో మిత్రాస్ అంతర్ధానమయ్యాడని పరిశోధకులు భావిస్తున్నారు.

మానిచాయిజం: మూడో శతాబ్దంలో మాని అనే ఇరాన్ ప్రబోధకుడు స్థాపించిన మతం ఇది. క్రైస్తవంలో లాగానే మంచి - చెడు అనేవి ఇందులోనూ కేంద్ర బిందువులు. మాని అనుచరులను రోమ్‌లోనూ చైనాలోనూ అణచివేశారు. చివరకు ఈ మతం మాయమైపోయింది.

ఈసిస్ మతం: ప్రాచీన ఈజిప్టు దేవత ఈసిస్. ఆమె కొడుకు హోరుస్. వీరిద్దరిదీ.. వర్జిన్ మేరీదీ ఒకే కథ. రోమన్ చక్రవర్తి జస్టీనియన్ నిషేధించే వరకూ ఈసిస్ మతం కూడా కొనసాగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)