ట్విటర్ సంచలనం: ఒక్క ట్రిక్కుతో 50 లక్షల రీట్వీట్లు

  • 11 జనవరి 2019
యుసాకు

ఎంత పెద్ద సెలెబ్రిటీల ట్వీట్లనైనా రోజుకో లక్ష మంది రీట్వీట్ చేస్తే గొప్పే. కానీ, ఓ జపాన్ కుబేరుడి ట్వీట్‌ను మాత్రం కేవలం రెండు రోజుల్లో 50 లక్షల మందికి పైగా రీట్వీట్ చేశారు. దాంతో, ప్రస్తుతం ఆయన ట్విటర్ సెన్సేషన్‌గా మారిపోయారు.

ట్విటర్ చరిత్రలో అత్యధిక రీట్వీట్లు పొందిన ట్వీట్ చేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు. ఒక్క చిన్న ట్రిక్కు ఉపయోగించి ఆయన ఈ ఘనతను దక్కించుకోగలిగారు.

ఇంతకీ విషయమేంటంటే, జపాన్‌కు చెందిన యుసాకు మేజవా అనే సంపన్న వ్యాపారికి చెందిన ఆన్‌లైన్ దుస్తుల వ్యాపారం ‘జోజోటౌన్’, క్రిస్మస్, న్యూఇయర్ సీజన్‌లో 10 బిలియన్ యెన్‌ల( దాదాపు రూ.640 కోట్ల) విలువైన అమ్మకాల మార్కును దాటింది.

ఆ సంతోషాన్ని ఆయన ట్విటర్ ద్వారా పంచుకుంటూ తన లాభంలో 100 మిలియన్ యెన్‌లు (దాదాపు 6.4 కోట్లు) 100 మంది ట్విటర్ యూజర్లతో పంచుకుంటానని చెప్పారు. కాకపోతే, తన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన వారిలో నుంచి వంద మందిని ఎంపిక చేసి ఆ డబ్బు అందిస్తానని షరతు పెట్టారు.

అంతే... ఇక ఆ ట్వీట్‌కు రీట్వీట్ల మోత మొదలైంది. జనవరి 5న యుసాకు ఆ ట్వీట్ చేస్తే, జనవరి 7 నాటికి దాన్ని 51 లక్షల మందికిపైగా రీట్వీట్ చేశారు. దాంతో 2017లో కార్టర్ విల్కిన్‌సన్ అనే కుర్రాడు నెలకొల్పిన రికార్డును యుసాకు అధిగమించారు.

కార్టర్ విల్కిన్‌సన్‌కు అమెరికా ఫాస్ట్ ఫుడ్ చెయిన్‌ ‘వెండీస్’ చికెన్ నగెట్స్ అంటే చాలా ఇష్టం. ఒక ఏడాదంతా ఉచితంగా నగెట్స్ కావాలంటే ఎన్ని రీట్వీట్స్ కావాలని అతడు వెండీస్‌ను అడిగాడు. దానికి ‘1.8 కోట్లు’ అని ఆ సంస్థ ట్వీట్ చేసింది.

‘నాకు సాయం చేయండి, నాకు నగెట్స్ కావాలి’ అంటూ కార్టర్ మళ్లీ ట్వీట్ చేశాడు. దానికి స్పందిస్తూ అతడి ట్వీట్‌ను 35 లక్షల మందికిపైగా రీట్వీట్ చేశారు. కార్టర్ లక్ష్యాన్ని చేరుకోనప్పటికీ, అతడి ట్వీట్‌కు వచ్చిన స్పందనను చూసి ఏడాది పాటు ఉచితంగా నగెట్స్ ఇవ్వడానికి వెండీస్ అంగీకరించింది.

Image copyright ElonMusk
చిత్రం శీర్షిక ఎలాన్ మస్క్‌తో యుసాకు

జపాన్ నుంచి మూన్ వరకు

యుసాకు మేజవాకు గతంలో జపాన్‌లో ప్రముఖ డ్రమ్మర్‌గా పేరుండేది. ‘పంక్’ బృందంలో ఆయన డ్రమ్మర్‌గా ఉండేవారు. కానీ, ఆయన ఫ్యాషన్ ప్రపంచంలోనే సంపదను పోగేశారు. ‘జోజోటౌన్’ పేరుతో ఆయన నెలకొల్పిన ఆన్‌లైన్ దుస్తుల వ్యాపారం అక్కడ బాగా క్లిక్ అయింది.

‘ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ సాయంతో చంద్రుడిపైకి మొట్టమొదట ప్రయాణించబోయే పర్యటకుడిని నేనే’ అని కొన్ని నెలల క్రితం యుసాకు మేజవా ప్రకటించి అంతర్జాతీయ మీడియా దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.

మస్క్‌ కూడా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ యుసాకుతో దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. చంద్రుడిపైకి వెళ్లేందుకు ఎంత డబ్బు చెల్లించారో యుసాకు చెప్పకపోయినా, ‘అది చాలా భారీ మొత్తం’ అని మస్క్ పేర్కొన్నారు.

చంద్రుడి విషయంలో యుసాకుకు పెద్ద ప్రణాళికలే ఉన్నాయి. 2023 నాటికి తాను చంద్రుడిపైకి ప్రయాణిస్తే అక్కడ కళాకారులతో ఒక కాలనీని ఏర్పాటు చేయాలనుందుని యుసాకు గతంలో చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)