‘నేను ఇస్లాం మతాన్ని వదిలేశా.. నా కుటుంబమే నన్ను చంపాలనుకుంటోంది’ అన్న సౌదీ యువతి రహాఫ్ మొహమ్మద్ అల్ కునన్ కథ సుఖాంతం

  • 8 జనవరి 2019
తన కుటుంబం నుంచి తన ప్రాణాలకు ప్రమాదం ఉందంటున్న రహాఫ్ Image copyright AFP
చిత్రం శీర్షిక తన కుటుంబం నుంచి తన ప్రాణాలకు ప్రమాదం ఉందంటున్న రహాఫ్

ఇస్లాం మతాన్ని, స్వదేశాన్ని, అయిన వాళ్లను విడిచి దూరంగా వెళుతూ.. బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన 18 ఏళ్ల యువతి ఎట్టకేలకు ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ ఆశ్రయాన్ని పొందారు.

ఆస్ట్రేలియాలో ఆశ్రయం పొందేందుకు వెళుతున్న సౌదీ అరేబియా యువతి రహాఫ్ మొహమ్మద్ అల్ కునన్ కనెక్టింగ్ ఫ్లయిట్ కోసం థాయ్‌ల్యాండ్‌లో దిగారు.

దీంతో ఆమె వద్ద సరైన పత్రాలు లేవంటూ థాయ్‌ల్యాండ్ ఇమిగ్రేషన్ అధికారులు రహాఫ్‌ను సౌదీ అరేబియాలోని ఆమె కుటుంబం చెంతకు తిప్పి పంపేందుకు ప్రయత్నించారు.

అయితే సోమవారం విమానం ఎక్కడానికి నిరాకరించిన ఆ యువతి తనను తాను ఎయిర్‌పోర్టులోని హోటల్ రూంలో బంధించుకున్నారు.

తాను ఇస్లాం మతాన్ని వదిలేశానని, కాబట్టి తన కుటుంబమే తనను చంపేస్తుందని రహాఫ్ ఆందోళన వ్యక్తం చేశారు.

''నా జీవితం ప్రమాదంలో ఉంది. నా కుటుంబం నన్ను చంపాలనుకుంటోంది'' అని ఆమె రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపారు.

హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థతో పాటు పలు మానవ హక్కుల సంస్థలు రహాఫ్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి.

రహాఫ్ పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, ఆమె ఆరోపణలు చాలా తీవ్రమైనవని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది.

దీంతో దిగివచ్చిన థాయ్ ఇమిగ్రేషన్ అధికారులు రహాఫ్‌ను థాయ్‌ల్యాండ్‌లోనే ఉండేందుకు అనుమతించినట్లు, ఆమె ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్) ప్రతినిధితో కలిసి ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడించారు.

అంతకు ముందు రహాఫ్.. తన తండ్రి థాయ్‌ల్యాండ్ వచ్చారని, తనకు చాలా భయంగా ఉందని ట్వీట్ చేశారు. అయితే ఐక్యరాజ్య సమితి ఆశ్రయం లభించడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు.

థాయ్‌ల్యాండ్ ఐక్యరాజ్య సమితి శరణార్థి ఒప్పందంలో భాగస్వామి కాదు. శరణార్థులకు ఆ దేశం న్యాయపరమైన రక్షణా కల్పించదు.

అంతకు ముందు థాయ్ న్యాయవాదులు కొందరు ఆమెను స్వదేశానికి పంపే ప్రయత్నాలను ఆపాలని కోర్టును ఆశ్రయించినా, కోర్టు దానిని తోసిపుచ్చింది.

వివాదం ఎలా మొదలైంది?

ముస్లిం అయిన రహాఫ్ తన మతాన్ని విడనాడడంతో సమస్య మొదలైంది.

సౌదీ అరేబియా చట్టం ప్రకారం మహిళలు పురుషుల సంరక్షణలో ఉండాలి. ఆమె ఉద్యోగం చేయాలన్నా, ప్రయాణించాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, చివరికి బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా కుటుంబానికి చెందిన పురుషుల అనుమతి కావాల్సిందే.

అయితే రహాఫ్‌కు చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని కోరిక.

''నాకు స్వేచ్ఛ కావాలి. నేను నా దేశంలో నాకిష్టం వచ్చిన చదువు చదువుకోలేను, ఉద్యోగం చేయలేను. అందుకే నేను దేశం విడిచివెళ్లాలనుకున్నాను. మా నాన్న నాపై కోపంతో ఉన్నారు. అందుకే నేను నా విషయాలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నాను'' అని రహాఫ్ తెలిపారు.

తనకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ ఆమె ప్రపంచంలోని అనేక దేశాలకు విజ్ఞప్తి చేశారు. చివరకు ఆస్ట్రేలియా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులో తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారని రహాఫ్ అంటున్నారు

ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు కనెక్టింగ్ ఫ్లయిట్ కోసం బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులో దిగినప్పుడు తనతో పాటు విమానంలో వస్తున్న సౌదీ దౌత్యవేత్త తన పాస్‌పోర్టును లాక్కున్నారని రహాఫ్ ఆరోపిస్తున్నారు.

ఆమె వద్ద థాయ్ వీసా లేనందుకు ఆమెను వెనక్కి పంపుతున్నట్లు థాయ్‌ల్యాండ్ మొదట పేర్కొంది.

అయితే తనకు థాయ్‌లో ఉండే ఉద్దేశం లేదని రహాఫ్ స్పష్టం చేశారు.

రహాఫ్ వ్యవహారంపై హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ఆసియా డైరెక్టర్ ఫిల్ రాబర్ట్‌సన్ బీబీసీతో మాట్లాడుతూ, ''ఆమె వీసాకు అప్లై చేసుకున్నట్లు, దానికి నిరాకరించినట్లు థాయ్‌ల్యాండ్ కథను అల్లుతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఆమె వద్ద ఆస్ట్రేలియాకు వెళ్లడానికి ఫ్లయిట్ టికెట్ ఉంది. ఆమెకు థాయ్‌ల్యాండ్‌లో ఉండే ఉద్దేశం లేదు'' అని తెలిపారు.

ప్రపంచానికి రహాఫ్ గురించి ఎలా తెలిసింది?

తన పరిస్థితి గురించి రహాఫ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పోస్టుల ద్వారా వెల్లడిస్తుండడంతో ఆమె అందరి దృష్టినీ ఆకర్షించారు.

తాను ఇస్లాం మతాన్ని విడనాడినట్లు రహాఫ్ బీబీసీకి తెలిపారు. తనను సౌదీకి తిప్పి పంపితే తన కుటుంబం తనను హతమారుస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

సౌదీలో మతమార్పిడికి అవకాశం లేదు. అది నేరంతో సమానం. ఆ నేరానికి మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

Image copyright EPA/THAI IMMIGRATION BUREAU
చిత్రం శీర్షిక బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులో రహాఫ్ మొహమ్మద్ అల్ కునన్

జుట్టు కత్తిరించుకుందని 6 నెలలు ఇంట్లో బంధించారు

బీబీసీ రహాఫ్ స్నేహితురాలు నౌరాతో మాట్లాడినప్పుడు, తన స్నేహితురాలు సౌదీ యూనివర్సిటీలో చదువుతోందని, రహాఫ్ తండ్రి సౌదీ ప్రభుత్వ ఉద్యోగి అని ఆమె వెల్లడించారు.

రహాఫ్ జుట్టు కత్తిరించుకుందన్న కారణంతో ఆమెను ఆరు నెలల పాటు ఇంట్లో బంధించారని నౌరా బీబీసీకి తెలిపారు.

సౌదీ నుంచి పారిపోవాలనుకున్న వారిలో రహాఫ్ మొదటివారు కాదు.

గతంలోనూ ఒక మహిళ విషయంలో ఇలాగే జరిగింది.

24 ఏళ్ల దినా అలీ లస్లూమ్ కూడా సౌదీ నుంచి ఆస్ట్రేలియా వెళుతుండగా, ఆమెను మనీలా ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి తీసుకెళ్లారు.

తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆమె ట్విటర్‌లో పోస్టు చేశారు.

సౌదీ అరేబియాకు తిరిగి వెళ్లిన లస్లూమ్ పరిస్థితి ఏమిటో ఇప్పటివరకు తెలియడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం