NTR కథానాయకుడు సినిమా రివ్యూ: సృజనాత్మకత లోపించినా... క్రిష్ కష్టం కనిపించింది.

  • 9 జనవరి 2019
ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా పోస్టర్ Image copyright NBKFilms

ఒక సామాన్యుడు వెండితెరపై విశ్వవిఖ్యాతనటసార్వభౌముడు ఎలా అయ్యాడన్న కథే ఈ 'కథానాయకుడు' సినిమా.

రామారావు అనే మధ్యతరగతి ఉద్యోగి ఒక సబ్ రిజిస్ట్రార్‌గా పని చేయడంతో సినిమా మెదలవుతుంది. బసవరామతారకంతో ఆయన అనుబంధం, దాంపత్యంలో అన్యోన్యత ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కథ మద్రాసు చేరుతుంది.

తమ్ముడు త్రివిక్రమరావు, రూమ్మేట్లతో జీవితం, సినిమా రంగంలో తొలి అడుగులు, తడబాట్లు ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు.

Image copyright NBKFilms

దక్షిణాదిన సినిమా రంగానికి పునాది వేసిన వారిలో ప్రఖ్యాత దర్శకుడు, తొలి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద నిర్మాత హెచ్.ఎం. రెడ్డిగా సత్యనారాయణను చాలా రోజుల తర్వాత చూస్తాం. నాగిరెడ్డి-చక్రపాణిల పరిచయం, కె.వి.రెడ్డి 'పాతాళ భైరవి'తో ధృవతారగా ఎదిగే క్రమం అన్నీ ఆసక్తికరంగా చిత్రీకరించారు. అందరు మహామహుల పాత్రలకు తగ్గ నటులే దొరికినా, యాజ్ య్యూజువల్‌గా ప్రకాష్ రాజ్'నాగిరెడ్డి'గారి పాత్రలో మరిపించాడు.

Image copyright NBKFilms

ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య సన్నివేశాలు

కానీ ఇక్కడి నుంచీ నటించిన సినిమా పాత్రలు చూపించే క్రమంలో కాస్త డాక్యుమెంటరీ ఫీల్ వస్తుంది. ఇక ఏ.ఎన్.ఆర్‌గా సుమంత్ చక్కగా కుదిరాడు, వీరిద్దరి మధ్యన చాలా సన్నివేశాలే రాసుకున్నారు దర్శక-రచయితలు. కరువు కాలంలో రాయలసీమలో పర్యటించటం, దివిసీమ ఉప్పెనకు జోలె పట్టడం, ఇద్దరికీ పద్మశ్రీ ఒకేసారి రావడం.. ఇలా చాలా సన్నివేశాలు ఉన్నాయి.

వీరిద్దరి మధ్యన ఓ సన్నివేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కురుక్షేత్రానికి పోటీగా దానవీరశూరకర్ణ తీయాలని నిశ్చయించుకున్న ఎన్టీయార్, నాగేశ్వరరావు ఇంటికి భోజనానికి వచ్చి కృష్ణుడి పాత్ర వేయమనడం, తన భార్య అన్నపూర్ణకు ఇచ్చిన మాట చూపుతూ ఏఎన్నార్ సున్నితంగా దాన్ని తిరస్కరించడం, తర్వాత ఇద్దరూ సిగరెట్ తాగుతూ తన కోసం రాసుకున్న చాణుక్యుడి పాత్రను ఏఎన్నార్‌కిచ్చి తను చంద్రగుప్తునిగా 'చాణక్య-చంద్రగుప్త' తీయాలని నిశ్చయించుకోవడం ఎన్టీయార్ పట్టువిడుపులకు ఓ ఉదాహరణగా చూపారనుకోవచ్చు. వారిద్దరి మధ్య అనుబంధానికి కూడా గుర్తుగా చూడొచ్చు.

బాలయ్య నటన ఎలా ఉంది?

అయితే, చాలామంది భయపడినట్లే బాలయ్య ప్రథమార్థంలో అతికీ అతకనట్లు అనిపించారు కానీ, రెండో భాగంలో మాత్రం ఎన్టీఆర్ పాత్రలో బాగానే కనిపించారు.

ఒక్కసారి యాభైల్లోని నిజజీవితపు ఎన్టీఆర్‌ను మన కళ్ల ముందు నిలపడంలో బాలకృష్ణ తపన, కష్టం అభినందించ తగింది.

కృష్ణుడి పాత్ర ఇంట్రడక్షన్ సీన్ పరంగా బాగున్నా.. ఎన్టీఆర్‌ను కృష్ణుడు పాత్రలో చూసినప్పుడు కలిగిన అనుభూతి ఇప్పుడు కనిపించలేదు. ఆ దివ్యత్వంలో కొంత లోటు కనిపించింది.

పెద్దాయన కంటి చూపుల్లో తేజం, నొసటి విరుపుల్లో నైజం, డైలాగు చెప్పడంలో వేగం బాలయ్యలో కొంచెం కొరవడ్డాయి.

విద్యాబాలన్ పాత్ర ఎలా ఉంది?

బసవ రామ తారకం పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయింది. ఆమె విద్యాబాలన్‌లా కనపడకపోవడం.. బసవ రామ తారకం ఇలాగే ఉంటుందేమో అన్నట్లు కనిపించటం ఆమె నటనకు కొలమానం. కొన్ని సన్నివేశాల్లో కంటిచూపుతో అనునయం, అలక, చిరుకోపం అన్నీ అభినయించింది.

Image copyright NBKFilms

కథ, కథనం, సాంకేతిక అంశాలు

కథ, కథనం వరకూ వస్తే... 'మహానటి'లోని డ్రామా ఈ సినిమాలో లేదు. కానీ రెండో సగంలో కథలో కాస్త చలనం కలగడమే కాకుండా, అక్కడక్కడా కదిలించే సన్నివేశాలు పడ్డాయి.

రెండో ఇన్నింగ్స్‌లో అడవిరాముడుతో మొదలుపెట్టి, వేటగాడు పాట, యమగోల డైలాగు, కొండవీటి సింహం మేకప్పు, బొబ్బిలిపులి క్లైమాక్స్ సన్నివేశం ఇలా బాగానే వాడుకున్నారు.

సర్దార్ పాపారాయుడి షూటింగ్ సన్నివేశం నుంచి, న్యూ ఎమ్యెల్యే క్వార్టర్స్‌లో పార్టీ ప్రకటన వరకూ సన్నివేశాలు చకచకా పరిగెడతాయి, ఆసక్తికరంగానూ ఉంటాయి.

సాయిమాధవ్ బుర్రా సంభాషణలు కథకు తగినట్లుగా ఉంటూనే అక్కడక్కడా పటాకుల్లా పేలి హాస్యం పండించాయి.

Image copyright NBKFilms

వెలుగునీడలను కెమెరామెన్ జ్ఞానశేఖర్ బాగా ఉపయోగించుకున్నాడు. కొన్ని సన్నివేశాలు నటుల ప్రతిభ కన్నా కెమెరా పనితనంతో వెలుగులీనాయి.

కీరవాణి నేపథ్య సంగీతం ఫరవాలేదనిపించింది. పాటలన్నీ ఓ వైపైతే, 'చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా!' అన్న పల్లవి మాత్రం రక్తం ఉరకలెత్తించింది.

తెలుగువారి ఆత్మగౌరవం కారణం చూపుతూ రాజకీయ ప్రవేశం, భవనం వెంకట్రాం ముఖ్యమంత్రిగా పదవీస్వీకార కార్యక్రమానికి హాజరవడం, నాదెండ్లతో పరిచయం, పార్టీ ప్రకటనతో 'మహానాయకుడి'కి నాంది పలుకుతూ ‘కథానాయకుడు’ సినిమా ముగుస్తుంది.

క్రిష్ దర్శకత్వం...

సృజనాత్మకత కాస్త లోపించినప్పటికీ దర్శకుడు క్రిష్ గట్టిగా కష్టపడినట్లే అనిపించింది.

క్రిష్ దర్శకత్వ ప్రతిభ కొన్ని సన్నివేశాలలో కనపడినా, మహానటిలోని సృజనాత్మకత ఇందులో కొంత లోపించింది. అది కథలో లోటు కావచ్చు, మొత్తానికి దర్శకునికి పాస్ మార్కులే!

Image copyright NBKFilms

చివరి మాట

ఎన్టీఆర్ జీవితం ఓ తెరిచిన పుస్తకమే అయినా, కొన్ని సంఘటనలను కథాక్రమం కోసం ఎన్నుకున్నట్లు గమనించవచ్చు. కథానాయకుడి సినిమాలో మనకు తెలిసిన కథను నిజాయితీగానే చూపించే ప్రయత్నం చేసారు.

సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం వెళితే నిరాశపడతారు కానీ, ఎన్టీఆర్‌ను అభిమానించేవారికి మాత్రం నచ్చే సినిమానే అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)