డోనల్డ్ ట్రంప్ రష్యా కోసం పనిచేస్తున్నారా?... విచారణ మొదలుపెట్టిన అమెరికా - న్యూయార్క్ టైమ్స్ కథనం

  • 13 జనవరి 2019
2018 నవంబర్ 11వ తేదీన పారిస్‌లో మొదటి ప్రపంచ యుద్ధం వందేళ్ల కార్యక్రమం సందర్భంగా జరిగిన విందులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఎదురుగా కూర్చుని కన్ను కొడుతున్న డోనల్డ్ ట్రంప్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2018 నవంబర్ 11వ తేదీన పారిస్‌లో మొదటి ప్రపంచ యుద్ధం వందేళ్ల కార్యక్రమం సందర్భంగా జరిగిన విందులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఎదురుగా కూర్చుని కన్ను కొడుతున్న డోనల్డ్ ట్రంప్

అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రహస్యంగా రష్యా కోసం పనిచేస్తున్నారేమో కనుగొనేందుకు అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) విచారణను ప్రారంభించిందంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. అయితే, ఈ కథనాన్ని అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ ఖండించింది.

2017లో ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీని పదవి నుంచి తొలగించినప్పుడు ట్రంప్ ప్రవర్తన పట్ల అధికారులు ఆందోళన చెందారని ఆ కథనంలో పత్రిక పేర్కొంది.

దేశ భద్రతకు ట్రంప్ ప్రమాదకారా? అన్న కోణంలో ఈ విచారణ జరిగిందని తెలిపింది.

ఇలాంటి విచారణ జరపడానికి ఎలాంటి కారణం కానీ, ఆధారం కానీ లేవని ట్రంప్ అన్నారు.

''ఇది అర్థంపర్థం లేనిది'' అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా హుకబీ సాండ్రెస్ అన్నారు.

''పక్షపాత బుద్ధి చూపటం వల్లనే జేమ్స్ కోమీ పదవిని కోల్పోయారు. ఆయనకు డిప్యూటీగా.. అప్పట్లో ఇన్‌ చార్జిగా ఉన్న ఆండ్రూ మెక్‌కాబ్ ఒక అబద్ధాలకోరు. అందుకే అతడిని కూడా ఎఫ్‌బీఐ తొలగించింది'' అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

''అమెరికాను అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లకు గురి చేస్తున్న రష్యా, ఇతర విదేశీ విరోధులపై చర్యలు తీసుకోకుండా వదిలేసిన ప్రెసిడెంట్ ఒబామాలాగా కాకుండా.. ప్రెసిడెంట్ ట్రంప్ నిజానికి రష్యాపై చాలా గట్టిగా వ్యవహరించారు'' అని ఆమె తెలిపారు.

2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్‌కు మేలు చేసేలా, ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు నష్టం చేకూర్చేలా రష్యా సైబర్ దాడులు జరిపిందని, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్టోరీలను ప్రచారం చేసిందని అమెరికా నిఘా సంస్థలు నివేదించాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2017 నవంబర్ 11వ తేదీన వియత్నాంలో జరిగిన ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ సదస్సులో ట్రంప్‌తో మాట్లాడుతున్న పుతిన్

అసలు ఎఫ్‌బీఐ చేసిన విచారణ ఏంటి?

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఎఫ్‌బీఐ జరిపిన ఈ విచారణ కౌంటర్ ఇంటెలిజెన్స్, క్రిమినల్ రెండింటినీ పరిశోధించేందుకు చేసిన సంయుక్త ఆపరేషన్.

అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకం అని తెలిసి కూడా రష్యాకు ట్రంప్ సహాయం చేస్తున్నారా? లేక తెలిసీ తెలియక ఆ దేశ ప్రభావానికి తలొగ్గారా? అన్న విషయాన్ని రుజువు చేసేందుకు కౌంటర్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది.

కోమీని పదవి నుంచి తొలగించడం న్యాయాన్ని అడ్డుకోవడమేనా? అన్న కోణంలో క్రిమినల్ విచారణ జరిగింది.

''నేను విధేయతను కోరుకుంటున్నా'' అని ట్రంప్ తనతో అన్నారని అమెరికా పార్లమెంటు జరిపిన విచారణ సందర్భంగా కోమీ చెప్పారు. అధ్యక్షుడికి గతంలో జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన మిచెల్ ఫ్లిన్‌పై జరుగుతున్న దర్యాప్తును ముగించాలని కూడా ట్రంప్ తనను ఒత్తిడి చేశారని తెలిపారు.

అమెరికాలోని రష్యా రాయబారితో తనకున్న సంబంధాల విషయంలో ఫిన్ అబద్ధాలు ఆడారని 2017 డిసెంబర్‌లో తేలింది. ఈ నేరాన్ని ఫిన్ అంగీకరించారు.

విచారణ ఏమయ్యింది?

ఈ విచారణను ఎఫ్‌బీఐ ప్రత్యేకాధికారి రాబర్ట్ ముల్లర్‌కు అప్పగించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక చెప్పింది.

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతున్న దర్యాప్తుకు ఆయనే నేతృత్వం వహిస్తున్నారు.

ఆ ఎన్నికల్లో ఆపద్ధర్మ ప్రభుత్వ యంత్రాంగం, ట్రంప్ ప్రచార యంత్రాంగం రష్యాతో కుమ్మక్కు అయ్యాయా? అన్న కోణంలో కూడా రాబర్ట్ ముల్లర్ దర్యాప్తు జరుపుతున్నారు.

Image copyright Getty Images

అయితే, రష్యాతో కలసి తాను ఎలాంటి తప్పుడు పనులకూ పాల్పడలేదని ట్రంప్ అన్నారు. ముల్లర్ జరుపుతున్న దర్యాప్తు చరిత్రలోనే అత్యంత గొప్ప రాజకీయ వేధింపు అని ట్రంప్ అభివర్ణించారు.

ఏదేమైనా, ఈ విచారణ ట్రంప్‌ సన్నిహిత వ్యక్తులను దోషులుగా తేల్చింది.

ట్రంప్ వ్యక్తిగత న్యాయవాదిగా పనిచేసిన మిచెల్ కోహెన్‌కు మూడేళ్లు జైలుశిక్ష పడింది. ప్రచార నిధుల్లో అవకతవకలకు సంబంధించి ఆయన తప్పు చేసినట్లు రుజువైంది. అలాగే ట్రంప్ ప్రచారానికి నేతృత్వం వహించిన పాల్ మనఫోర్ట్‌ కూడా నిధుల అవకతవకలకు సంబంధించి దోషిగా నిర్థరణ అయ్యింది.

ట్రంప్ వ్యక్తిగత, ప్రచార బృందంలోని రిక్ గేట్స్, అలెక్స్ వాన్ డెర్ జ్వాన్, జార్జ్ పాపడోపలస్, రిచర్డ్ పినేడోలు కూడా నేరాన్ని అంగీకరించారు.

అమెరికాను తప్పుదోవ పట్టించారనే నేరంతో 13 మంది రష్యా జాతీయులు, హ్యాకింగ్ నేరానికి మరో 12 మంది రష్యా అధికారులు, న్యాయాన్ని అడ్డుకున్నందుకు కోనస్టాటిన్ కిలిమ్నిక్‌ అనే మరొకరిపై అప్పట్లో ఎఫ్‌బీఐ అభియోగాలు నమోదు చేసింది.

కాగా, ట్రంప్‌ రష్యా కోసం పనిచేశారా? లేదా? అన్న అంశాన్ని తేల్చేందుకు ఎఫ్‌బీఐ ప్రారంభించిన దర్యాప్తు ఇంకా కొనసాగుతోందీ, లేనిదీ స్పష్టంగా తెలియలేదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.

పేరు చెప్పని మాజీ అధికారులు, విచారణతో సంబంధం ఉన్న ఇతరులు, ఎఫ్‌బీఐ జనరల్ కౌన్సెల్ జేమ్స్ ఎ బకర్‌ పార్లమెంటు విచారణకు సాక్షి అయిన ఒకరిని తమ కథనంలో పత్రిక ఉటంకించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)