కళ్లూ కళ్లూ కలిసినప్పుడు కరెంట్ పుడుతుందెందుకు? కళ్లలో కళ్లు పెట్టి చూడటం ఎందుకంత ముఖ్యం?

  • 14 జనవరి 2019
చూపుల కలయిక ప్రతీకాత్మక చిత్రం Image copyright Getty Images

అందరూ ఎవరి పనిలో వారున్నారు.. అంతమందిలోనూ మీ చూపులు తన చూపులతో కలిశాయి. మీరు చూస్తున్నట్లు తనకు తెలిసిపోయింది.. తనూ మిమ్మల్నే చూస్తున్నట్లు మీకూ అర్థమైంది.

ఆ చూపులు కలిసింది క్షణకాలమే అయినా మనసంతా ఏదో అయిపోయింది.

ఆ చూపులో ఏదో పవర్ ఉంది. చేస్తున్న పని మీద మనసు నిలవకుండా చేస్తోంది.

అయినా, మళ్లీ ఓ చూపు, అటువైపు. అదిగో మళ్లీ ఆ కళ్లు నన్నే చూస్తున్నాయి.

స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి మొదలయ్యే ఈ చూపుల కలయిక జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. కళ్ళు మారొచ్చు.. అది కాలేజీ కావొచ్చు, పనిచేసే ఆఫీసు కావొచ్చు.. మీరెక్కిన బస్సు, మీరెక్కాల్సిన అవసరమే లేని రైలు.. చివరకు మీ పక్కింటి బాల్కనీ.. ఏదైనా కావొచ్చు.

కానీ, కలిసే ఆ చూపులు మాత్రం వెంటాడడం మానవు. బహుశా బుచ్చిబాబు చెప్పిన అమలిన శృంగారం ఇదేనా? ఏమో అవన్నీ మనకెందుకు?

సింపుల్‌గా సినిమాల్లో చూపించినట్లే ఇలాంటిది ప్రతి సందర్భంలో ఎదురవుతుంది.

Image copyright Getty Images

అన్ని చూపులూ ఒకేలా ఉండవు

నిజానికి అన్నిసార్లూ ఈ చూపుల కలయిక ఉత్తేజానికి గురిచేయదు. కొన్నిసార్లు మాత్రమే అలాంటి అనుభూతి కలుగుతుంది.

ఒక్కోసారి ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అనేకసార్లు తదేకంగా ఒకరినొకరు చూసుకుంటారు.. కానీ, ఎలాంటి అనుభూతీ ఉండదు.

అవతలివారు చూసే తీరును బట్టే చాలాసార్లు వారిని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తాం. వారి పట్ల అభిప్రాయానికీ వచ్చేస్తాం.

నిత్య జీవితంలో తరచూ ఎదురయ్యే ఇలాంటి అనుభవాలను సైకాలజిస్ట్‌లు మాత్రం వేరే కోణంలో చూస్తారు.

ఈ చూపుల కలయికలపై సైకాలజిస్ట్‌లు, న్యూరోసైంటిస్ట్‌లు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు.

అవతలి వ్యక్తిని అంచనా వేయడంలో ఇవి ఎలాంటి పాత్ర పోషిస్తాయన్నది వారి అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

Image copyright Getty Images

ఎవరైనా మనల్ని చూస్తున్నట్లుగా గుర్తించామంటే వద్దనుకున్నా మన దృష్టి అటే వెళ్తుంది. మన ఏకాగ్రతా అటువైపే మళ్లుతుంది. చుట్టూ ఏమవుతుందో కొద్దిసమయం పాటు పట్టించుకోం. ఇలాంటి చూపుల కలయిన మన మెదడు ఉత్తేజితమవుతుంది. అవతలి వ్యక్తి చూపు మనపై నిలిచిందంటే మనసూ మన గురించి ఆలోచిస్తుందని అర్థమైపోతుంది. అంతే... మాట, రూపం, చర్యలు అన్నిటి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెడతాం.

దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి జపాన్‌కు చెందిన అధ్యయనకర్తలు కొందరు ఇటీవల ఓ ప్రయోగం చేశారు. ఒక వ్యక్తి ముఖం మాత్రమే కనిపించే వీడియోలో ఆ వ్యక్తి కళ్లనే చూసే కొద్దిసమయం పాటు చూసే పనిని కొందరికి అప్పగించారు.

వారు అలా తదేకంగా చూస్తున్న సమయంలో వారికొక టాస్క్ ఇచ్చారు.

అధ్యయనకర్తలు ఒక నామవాచకం చెబితే, దానికి సంబంధించిన క్రియను ఆ ప్రయోగంలో ఉన్నవారు చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకు, పాలు అంటే తాగడం అని చెప్పాలి.

కానీ, ఈ ప్రయోగంలో భాగంగా వీడియోలోని వ్యక్తి కళ్లనే చూస్తున్నవారు అలా వెంటనే చెప్పలేకపోయారట.

ముక్కూమొఖం తెలియని వ్యక్తి, అందులోనూ వీడియోలో చూస్తున్నప్పుడు కూడా కళ్లూ కళ్లూ కలిస్తే మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని వారు ఈ అధ్యయనంలో తెలుసుకున్నారు.

ఆ తరువాత నేరుగా ఇద్దరు వ్యక్తులను ఎదురెదురుగా ఉంచి కూడా ఇలాంటి ప్రయోగమే చేశారు. అప్పుడూ ఇదే ఫలితం.

అయితే, చూపును తిప్పుకున్న వెంటనే మళ్లీ వారు మెదడు చురుగ్గా పనిచేయడం మొదలైందట.

విద్యార్థులు వంటివారికి ఇలాంటి అనుభవం ఎదురైనప్పుడు చూపు తిప్పుకుంటే మళ్లీ వారు చేయాల్సిన పనిపై ఏకాగ్రత కుదురుతుందని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు.

Image copyright Getty Images

ఒక్కోసారి మనతో చూపులు కలిపిన వ్యక్తులపై ఏమాత్రం ఆసక్తి లేనప్పుడు మనకు ఆ చూపులు ఇబ్బంది కలిగిస్తాయి కూడా.

మరో అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఇదే విషయాన్ని నిర్ధారించారు. అంతేకాదు, అలా తదేకంగా ఒకరినొకరు చూసుకోవడాన్ని ఎంతసేపు భరించగలగరన్నది కూడా వీరు తెలుసుకోవాలనుకున్నారు.

దీనిపై వీరు చేసిన ప్రయోగంలో, ఇలాంటి చూపుల కలయిక సగటున మూడు సెకన్లు ఉంటుందని తేల్చారు. అంతేకాదు, 9 సెకన్ల కంటే ఎక్కువసేపు అలా చూపులు కలపడానికి ఇష్టపడరని కూడా గుర్తించారు.

Image copyright Getty Images

అయితే, ఒక్కోసారి ఈ చూపుల కలయిక అక్కడితోనే ఆగిపోకపోవచ్చు. ఈ నేత్ర బంధం సంభాషణకు దారి తీసే అవకాశం ఉంటుంది.

1960ల్లో సైకాలజిస్టులు జరిపిన పరిశోధనల్లో, ఇలాంటి చూపుల కలయికల సమయంలో కనుపాపలు విప్పారడానికి కారణలేమిటో తెలుసుకొనే ప్రయత్నాలు చేశారు. జిజ్ఞాసా? భావోద్వేగాలా? అందమా? లైంగిక ఆకర్షణా? ఏవి దీన్ని ప్రేరేపిస్తాయనేది కనుగొనే ప్రయత్నం చేశారు.

ఒక్కో సందర్భంలో ఒక్కోటి కారణమవుతుందని... అలాగే అవతలి వ్యక్తి ఎవరనేదానిపైనా ఇది ఆధారపడుతుందని తేల్చారు.

ఎక్కువ సందర్భాల్లో లైంగిక ఆకర్షణలు, ఆసక్తులు కారణమవుతాయని గుర్తించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు