ట్రంప్ వార్నింగ్: 'సిరియాలో కర్డిష్ దళాల జోలికి వెళితే టర్కీ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తాం'

  • 14 జనవరి 2019
కర్డులు Image copyright AFP
చిత్రం శీర్షిక మళ్ళీ దాడులు చేస్తామంటూ టర్కీ చేస్తున్న బెదరింపులను సిరియన్ కర్డులు తీవ్రంగా నిరసిస్తున్నారు

సిరియాలో కర్డిష్ దళాల మీద టర్కీ ఒక వేళ దాడులు చేస్తే, ఆ దేశ "ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం" చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

ఆదివారం నాడు రెండు ట్వీట్లు చేసిన ట్రంప్, కర్డులు కూడా టర్కీని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకూడదని సూచించారు.

అమెరికా సేనలను సిరియా నుంచి వెనక్కి రప్పిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర సిరియాలో అమెరికా సేనలు కర్డిష్ దళాలతో కలిసి ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ మీద యుద్ధం చేశాయి.

అయితే, పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్ (వైపీజీ)ని టర్కీ తీవ్రవాదులని అంటోంది.

ఆ గ్రూపునకు అమెరికా మద్దతు ఇవ్వడంపై టర్కీ అధ్యక్షుడు రిసెప్ తాయిప్ ఎర్దోగాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గ్రూపును అణచివేస్తామని కూడా ప్రతిజ్ఞ చేశారు.

అమెరికా బలగాలను సిరియా నుంచి ఉపసంహరిస్తున్నట్లు ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద ఇప్పటికే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఆయన చేసిన వ్యాఖ్యలతో ఆ విమర్శలు మరింత తీవ్రమయ్యాయి.

సౌదీ అరేబియా రాచ కుటుంబానికి చెందిన సీనియర్ వ్యక్తి ప్రిన్స్ టుర్కి అల్-ఫైజల్ బీబీసీతో మాట్లాడుతూ, ఆ నిర్ణయం "ప్రతికూల ప్రభావం" చూపిస్తుందని, ఇరాన్,రష్యా, సిరియా, సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కు అనుకూలంగా మారుతుందని వ్యాఖ్యానించారు.

అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపెయో ప్రస్తుతం సౌదీ రాజధాని రియాద్‌లో ఉన్నారు. మధ్య ప్రాచ్యంలో తమ మిత్ర పక్షాలను సంఘటితం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అసలు ట్రంప్ ఏమన్నారు?

అమెరికా బలగాలను వెనక్కి తీసుకోవడాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. ఇంకా అక్కడ ఐఎస్ అవశేషాలు ఏమైనా ఉంటే వైమానిక దాడులు చేస్తామని ఆయన అన్నారు.

టర్కీ కనుక వైపీజీ మీద దాడి చేస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా ఇబ్బందుల్లో పడేస్తారన్నది ఆయన చెప్పలేదు.

Image copyright EPA
చిత్రం శీర్షిక ఉత్తర సిరియాలో కర్డిష్ దళాల మీద దాడులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న టర్కీ-మద్దతు కలిగిన సేనలు

గత ఆగస్ట్ నెలలో టర్కీ మీద అమెరికా ఆంక్షలు విధించింది. వాణిజ్య సుంకాలు అమల్లోకి తెచ్చింది. అమెరికాకు చెందిన పాస్టర్‌ను నిర్బంధించిన వివాదం నేపథ్యంలో అమెరికా ఆ చర్యలు తీసుకుంది. దానివల్ల టర్కీ లీరా విలువ దారుణంగా పడిపోయింది. పాస్టర ఆండ్ర్యూ బ్రున్సన్‌ను గత అక్టోబర్‌లో విడుదల చేశారు.

"20 మైళ్ళ సురక్షిత ప్రాంతం" ఏర్పాటు చేయడం గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఇది మైక్ పాంపెయో సూచిస్తున్న పరిష్కార మార్గం లాంటిదేనని బీబీసీకి చెందిన బార్బరా ప్లెట్ అషర్ విశ్లేషించారు.

అంతేకాకుండా, సిరియాలో అమెరికా చేపట్టిన చర్యల వల్ల రష్యా, ఇరాన్, సిరియాలే లబ్ధిదారులని, ఇది అమెరికా సైనికులను వెనక్కి పిలిపించే సమయమని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు.

టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ అధికార ప్రతినిధి ఇబ్రహీం కలీన్, ట్రంప్ ట్వీట్ల మీద స్పందించారు. "మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అమెరికా గౌరవిస్తుందని" ఆశించామని ఆయన అన్నారు.

"తీవ్రవాదులు మీకు భాగస్వాములు, మిత్రపక్షాలు కాలేరు" అని కలీన్ అన్నారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక మధ్య ప్రాచ్యంలో తమ మిత్రపక్షాలను సంఘటితం చేసే పనిలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపెయో

వైపీజీ నేతృత్వంలోని సిరియన్ డెమాక్రటిక్ దళాల (ఎస్.డి.ఎఫ్) కూటమికి పట్టున్న 30 శాతం సిరియా భూభాగం నుంచి అమెరికా సేనలను ఉపసంహరిస్తూ ట్రంప్ గత నెలలో తీసుకున్న నిర్ణయం, మిత్ర పక్షాలను విస్మయానికి గురి చేసింది. చాలా మంది ఆయన నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు.

అమెరికా సేనలు గత వారం సిరియా నుంచి కొంత సైనిక సామగ్రిని తరలించారు. ఇంకా దళాలు మాత్రం అక్కడే ఉన్నాయి.

దాదాపు 2,000 మంది అమెరికా సైనికులు సిరియాలో నియుక్తులైనట్లు వార్తలు వచ్చాయి. వైపీజీ ఫైటర్లకు శిక్షణ ఇచ్చి, మార్గదర్శకత్వం చేసేందుకు 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదట గ్రౌండ్ ట్రూప్స్‌ను అక్కడికి పంపించారు. కాలక్రమంలో సిరియాలోని అమెరికా సైనికుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)