ఇన్‌స్టాగ్రామ్‌ కోడిగుడ్డు: 2.6 కోట్ల మంది ఎందుకు దీన్ని లైక్ చేశారు?

  • 14 జనవరి 2019
కోడిగుడ్డు Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన గుడ్డు ఇలాంటిదే

ఈ ప్రపంచంలో అద్భుతాలకు కొదవలేదు. సుందరమైన సూర్యోదయాలు, అప్పుడే పుడుతున్న పసిపాపలు... ఇదిగో ఈ గుడ్డు. ఇది మామూలు గుడ్డు కాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు స్థాయిలో 26000000 లైకులు పొందిన గుడ్డు ఇది.

అసలు ఈ గుడ్డు ఏంటి? ఈ రికార్డు ఏంటి? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? దీని వెనుక ఉన్నదెవరు? వాళ్ల ఉద్దేశం ఏంటి?

ప్రపంచంలోనే అత్యధికమంది ఇష్టపడిన (లైక్ చేసిన) గుడ్డు కథేంటో మీరూ చదవండి..

Image copyright @world_record_egg / Instagram
చిత్రం శీర్షిక ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన గుడ్డు ఇదే

@world_record_egg అనే అకౌంట్ ద్వారా జనవరి 4వ తేదీన ఒక గుడ్డు ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

ఈ ఫొటోతో పాటు... ‘అందరం కలసి ప్రపంచ రికార్డు సృష్టిద్దాం. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా లైక్ చేసిన పోస్ట్‌ను సృష్టిద్దాం. కెలీ జెన్నర్ (1.8 కోట్ల లైకులు) రికార్డును బద్దలు కొడదాం! మన వద్ద ఉంది ఇదే’ అని క్యాప్షన్ పెట్టారు.

అప్పటి నుంచి (జనవరి 14 సాయంత్రం 5 గంటల వరకు) ఈ పోస్టుకు 2.6 కోట్ల లైకులు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకూ ఇన్‌స్టాలో అత్యధిక లైకులు పొందిన ఫొటో రికార్డు బద్దలయ్యింది.

ఇదీ ఈ గుడ్(డ్డు) రికార్డు.

Image copyright @kyliejenner / Instagram
చిత్రం శీర్షిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో లైకులు పొందిన కెలీ జెన్నర్ పోస్ట్ చేసిన ఫొటో ఇది

ఇప్పటి వరకూ ఇన్‌స్టాలో రికార్డు ఫొటో ఏంటి?

అమెరికన్ రియాలిటీ టీవీ స్టార్ కెలీ జెన్నర్ తనకు ‘స్టోర్మీ’ అనే బిడ్డ పుట్టినట్లు 2018 ఫిబ్రవరి 6వ తేదీన ఒక ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫొటోకు కోటీ ఎనభై లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

ఈ రికార్డును జనవరి 13వ తేదీనే గుడ్డు తుడిచిపెట్టేసింది. పోస్ట్ చేసిన పది రోజుల్లోనే తన లక్ష్యం అయిన 1.8 కోట్ల లైకులను పొందేసింది.

ఇప్పుడు కెలీ జెన్నర్ బిడ్డ ఫొటోకు వస్తున్న కామెంట్లన్నీ గుడ్డు గురించి చేస్తున్నవే.

దీనికి కెలీ కూడా స్పందించారు.

వేడివేడి రోడ్డుపై గుడ్డును పగలకొడుతున్న వీడియోను ఆమె పోస్ట్ చేశారు.

ఆ గుడ్డు ఉడకలేదనుకోండి. అయితే ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారో మాత్రం అందరికీ అర్థమైంది.

Image copyright Instagram / @world_record_egg
చిత్రం శీర్షిక ఇన్‌స్టాగ్రామ్‌లో గుడ్డు ప్రొఫైల్ ఇది

ఇదంతా ఎవరు చేశారు? ఎందుకు చేశారు? గుడ్డు రహస్యం ఏంటి?

కొంతమందికి అసలు ఇది నిజంగా గుడ్డేనా? అని కూడా సందేహాలు వచ్చాయి. అయితే, అది నిజంగా గుడ్డే (గుడ్డు ఫొటోనే.)

అయితే, ఈ అకౌంట్‌కు యజమాని ఎవరు? అనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఎగ్ గ్యాంగ్ (గుడ్డు బృందం) పేరిట ఈ అకౌంట్ ఉంది. అయితే వారి లక్ష్యం మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైకులు పొందటమేనని తెలుస్తోంది.

వారు అనుకున్నది జరిగిపోయింది. మరి గుడ్డు ఏమవుతుంది? దాని భవిష్యత్తు ఏంటి? అనేది మాత్రం ఇప్పటి వరకు సమాధానాల్లేని ప్రశ్నలే.

గుడ్డు ఫొటోను పోస్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించిన ‘ఎగ్ గ్యాంగ్’ ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)