వర్జినిటీ కోల్పోవడానికి సరైన వయసంటూ ఒకటి ఉంటుందా

 • 17 జనవరి 2019
వర్జినిటీకి వయసు Image copyright Getty Images

బ్రిటన్‌లో లైంగిక ప్రవర్తనపై జరిగిన ఒక సర్వేలో చాలా చిన్న వయసులోనే లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, తమ వర్జినిటీ కోల్పోవడంపై యువతీయువకుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

మొదటిసారి లైంగిక సంబంధాలు పెట్టుకున్నప్పుడు, తమకు అది 'తగిన వయసు' కాదని అనిపించినట్టు టీనేజిలో ఉన్న మూడు వంతుల అమ్మాయిలు, నాలుగోవంతు అబ్బాయిలు చెప్పారు.

బ్రిటన్‌లో లైంగిక సంబంధాల పెట్టుకోవాలంటే చట్టప్రకారం 16 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. భారత్‌లో అయితే కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.

ఇటీవల సెక్సువల్ ఆటిట్యూడ్ అండ్ సెక్సువల్ ఆటిట్యూడ్ అండ్ లైఫ్‌స్టైల్ పోల్ పేరిట బ్రిటన్ వ్యాప్తంగా చేసిన ఒక సర్వేలో చాలా మంది ఆ వయసులో సిద్ధంగా ఉండరని తేలింది.

బ్రిటన్‌లో ఈ సర్వేను ప్రతి పదేళ్లకూ చేస్తారు. ఇది బ్రిటన్‌లోని లైంగిక ప్రవర్తనల గురించి పూర్తి వివరాలు అందిస్తుంది.

ఇటీవలి సర్వే ఫలితాలు లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లోని బీఎంజే సెక్సువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్‌లో ప్రచురితం అయ్యాయి.

3 వేల మంది యువతీయువకులతో చేసిన ఈ సర్వే 2010-2012లో పూర్తైంది.

Image copyright Getty Images

సర్వే ఏం చెబుతోంది?

లైంగిక సంబంధాల విషయంలో యువతీయువకుల స్పందనను బట్టి 40 శాతం మంది అమ్మాయిలు, 26 శాతం మంది అబ్బాయిలు తమ మొదటి అనుభవాన్ని సరైన వయసులో పొందలేదని భావించారు.

వారితో మరింత లోతుగా మాట్లాడినపుడు, చాలా మంది తాము దానికోసం ఇంకొంత కాలం వేచి ఉంటే బాగుండేదని చెప్పారు. వీరిలో కొంతమంది మాత్రం ఇంకా తక్కువ వయసులో ఆ అనుభవం రుచిచూసుంటే బాగుండేదని అన్నారు.

ఎక్కువ మంది లైంగిక సంబంధాలు పెట్టుకునే సమయానికి వారి వయసు 18 ఏళ్లుగా ఉంది. సగం మంది ఆ అనుభవాన్ని 17వ ఏట అడుగుపెడుతున్నప్పుడు పొందారు. వీరిలో మూడో భాగం 16 ఏళ్లకు ముందే లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు.

ఇష్టంతోనా, లేక ఒత్తిడిలోనా?

ఈ సర్వేలో లైంగిక సామర్థ్యం, ఆ కోరికను కూడా పరిశీలించారు. పార్ట్‌నర్స్ ఇద్దరూ బాగా ఆలోచించి, తమ ఇష్ట ప్రకారమే లైంగిక సంబంధాల్లో పాల్గొనాలనుకున్నారా, లేక స్నేహితుల ఒత్తిడి వల్ల అలా చేశారా అనేది కూడా గమనించారు.

దీనికి యువతీయువకుల్లో సుమారు సగం మంది అమ్మాయలు, 10 మందిలో నలుగురు అబ్బాయిలు సరిగా సమాధానం చెప్పలేకపోయారు.

సుమారు ఐదుగురిలో ఒక అమ్మాయి, 10 మందిలో ఒక అబ్బాయి మాత్రం తను, తన పార్ట్‌నర్ ఇద్దరూ ఆ సమయానికి ఆ అనుభవానికి సిద్ధంగా లేమని చెప్పారు. అలా చేయడానికి ఒత్తిడే కారణం అని మరి కొంతమంది అంగీకరించారు.

ఎన్ఎటీఎస్ఎఎల్ సర్వే వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్ కేయ్ వెలింగ్స్ "పరస్పర అంగీకారం వయసు ఉన్నంత మాత్రాన ఆ వయసులో వారు లైంగికంగా చురుగ్గా ఉండడానికి సిద్ధంగా ఉన్నట్లు కాదు. టీనేజిలో రకరకాలుగా ఉంటారు. ఒకరు 15 ఏళ్లకే దీనికోసం సిద్ధమైతే, కొందరు 18 ఏళ్లకు కూడా దానిని అసహజంగా భావించవచ్చు" అన్నారు

"లైంగిక సంబంధాల కోసం అబ్బాయిల కంటే అమ్మాయిలే తమ పార్ట్‌నర్‌పై ఎక్కువ ఒత్తిడి చేస్తున్నట్టు మా పరిశోధనలో తేలింది" అని దీనిపై అధ్యయనం చేసిన డాక్టర్ మెలిసా పాల్మర్ చెప్పారు.

డాక్టర్ మెలిసా ఈ సర్వే ద్వారా వెలుగులోకి వచ్చిన కొన్ని సానుకూల అంశాల గురించి గురించి కూడా చెప్పారు. "అయితే సర్వేలో కొన్ని సానుకూల ఫలితాలు కూడా లభించాయి. 10 మందిలో 9 మంది తాము మొదటి సారి లైంగిక సంబంధాలు పెట్టుకున్నప్పుడు విశ్వసనీయమైన గర్భనిరోధకాలు ఉపయోగించామని చెప్పారు".

స్కూల్లో చెబుతున్న సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా సురక్షిత లైంగిక సంబంధాల గురించి వారు మెరుగ్గా తెలుసుకోగలిగారని ఆమె చెప్పారు.

Image copyright Getty Images

సరైన సమయం ఏది?

లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని భావిస్తుంటే, దానికి ముందు మీకు మీరు ఈ ప్రశ్నలు వేసుకోవాల్సి ఉంటుంది.

 • అది సరైనదే మీకు అనిపిస్తోందా? మీ వయసు 16 ఏళ్లు దాటిందా? (భారత్‌లో అయితే 18 ఏళ్లు)
 • మీరు మీ పార్ట్‌నర్‌ను ప్రేమిస్తున్నారా?
 • ఆమె/అతడు కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నారా?
 • లైంగిక వ్యాధులు, హెచ్ఐవీ గురించి సురక్షితంగా ఉండడానికి కండోమ్ ఉపయోగించాలని మీరిద్దరూ మాట్లాడారా. ఆ సంభాషణ బాగానే జరిగిందా?
 • మీరిద్దరూ గర్భధారణ నుంచి కాపాడుకోడానికి గర్భనిరోధకాలు ఏర్పాటు చేసుకున్నారా?
 • ఎప్పుడైనా మీ మనసు మారితే, మీరు వద్దు అనగలరా, దానిని మీరిద్దరూ స్వీకరించగలరా?

ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అవును అయితే దానికి ఇది మీకు సరైన సమయమే అని అర్థం.

కానీ, కింద ఇచ్చిన ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే, అది అలాంటి సంబంధాలకు మీకు తగిన వయసు లేకపోవడమే కావచ్చు.

 • మీరు మీ పార్ట్‌నర్ లేదా స్నేహితుల ఒత్తిడిలో ఇలా చేస్తున్నారా?
 • మీకు ఆ తర్వాత ఏదైనా పశ్చాత్తాపం ఉంటుందా?
 • మీరు మీ స్నేహితులను ఇంప్రెస్ చేయడానికి, వారితో సమానం అనిపించుకోడానికి లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని అనుకంటున్నారా?
 • మీరు మీ పార్ట్‌నర్‌ను దూరం చేసుకోకూడదనే లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని అనుకుంటున్నారా?

మూలం: ఎన్‌హెచ్ఎస్ చాయిసెస్

సెక్సువల్ హెల్త్ చారిటీ బ్రూక్‌కు చెందిన ఇజాబెల్ ఇన్మాన్ "యువతీయువకులకు సరైన సమయంలో సానుకూల నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం వచ్చేలా లైంగిక విద్యను త్వరగా ప్రారంభిస్తారని మేం దృఢంగా నమ్ముతున్నాం" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు