పాకిస్తాన్ నుంచి తేనెటీగలు పారిపోతున్నాయ్ ఎందుకు?

  • 21 జనవరి 2019
తేనెటీగలు

తేనెటీగలు తియ్యని మకరందాన్ని సేకరించి పెట్టడమే కాదు. పంటల ఉత్పత్తిలోనూ వీటిది కీలక పాత్ర. అయితే, ఇప్పుడు పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇవి కనుమరుగవుతున్నాయి.

ఎడతెగని తుపాకుల మోత, కాలుష్యం, అనూహ్యంగా చోటుచేసుకునే వాతావరణ మార్పులే అందుకు కారణమని శాస్త్రవేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

తేనెటీగలు చాలా సున్నితమైనవి. టపాసుల శబ్దానికే వణికిపోతాయి. మరి, తుపాకుల మోతకు పాపం అవి ఇంకెంత భయపడతాయో ఒక్కసారి ఊహించండి.

తుపాకులు, బాంబుల శబ్దాల వల్ల వాయవ్య పాకిస్తాన్‌లో రెండు జాతుల తేనెటీగలు కనుమరుగైపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionపాకిస్తాన్ నుంచి తేనెటీగలు ఎందుకు పారిపోతున్నాయ్?

"స్వాత్ లోయలో సుదీర్ఘ కాలంపాటు సైనిక ఆపరేషన్ జరిగింది. దాంతో, తేనెటీగలు చెల్లాచెదురయ్యాయి. ఆ యుద్ధం ముగిసిన తర్వాత తేనెటీగల తిరిగి రావడానికి మూడేళ్లు పట్టింది. తేనెటీగలతో పాటు సీతాకోక చిలుకల్లాంటి ఇంకా ఎన్నో రకాల మిత్ర కీటకాల మీద కూడా ఆ ప్రభావం పడింది" అని పెషావర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి చెందిన డా. హుస్సేన్ అలీ, వివరించారు.

మందు గుండు పేలుళ్లు జరిగినప్పుడు వెలువడే పొగ వల్ల వాతావరణం కలుషితం అవుతుంది. ఆ కాలుష్యం వల్ల కూడా ఎన్నో కీటకాలు అంతరించి పోయే పరిస్థితి ఏర్పడుతోంది.

Image copyright UNIVERSITY OF READING

వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు కూడా కీటకాల కనుమరుగవ్వడానికి ఓ కారణంగా చెప్పొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

గత కొన్నేళ్లుగా చూస్తే పాకిస్తాన్ నుంచి తేనె ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి.

తేనెటీగలు కనుమరుగైతే మనిషి ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందో ఇదొక ఉదాహరణ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)