చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఈ మహిళలు ఎలా తప్పించుకున్నారంటే...

  • 18 జనవరి 2019
చైనా నుంచి బయటపడటానికి మీరా (ఎడమ), జియూన్ (కుడి)లు పర్వతాలు అధిరోహించాల్సి వచ్చింది
చిత్రం శీర్షిక చైనా నుంచి బయటపడటానికి మీరా (ఎడమ), జియూన్ (కుడి)లు పర్వతాలు అధిరోహించాల్సి వచ్చింది

ఇద్దరు యువతులు.. ఉత్తర కొరియాలో కరకు పాలన నుంచి పారిపోయారు. పొరుగున ఉన్న చైనా చేరుకున్నారు. కానీ అక్కడ తోడేళ్ల వంటి ట్రాఫికర్ల కోరలకు చిక్కారు. కొన్నేళ్ల పాటు సెక్స్‌క్యామ్ దందాలో బానిసలుగా మగ్గిపోయారు.

చైనాలోని యాంజీ నగరం. ఓ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తు కిటికీ నుంచి.. దుప్పట్లను చించి కట్టిన ఓ తాడు కిందికి వచ్చింది.

ఇద్దరు యువతులు దానిని వదిలారు. ఆ దుప్పట్ల తాడును మళ్లీ పైకి లాగారు. దానికి గట్టి తాడు ఒకటి కట్టి ఉంది.

యువతులిద్దరూ కిటికీ ఎక్కి బయటకు వచ్చారు. తాడు పట్టుకుని కిందికి దిగటం మొదలుపెట్టారు.

''త్వరగా.. మనకు ఎక్కువ టైం లేదు'' అని ఆందోళనగా చెప్పాడు కింద ఉన్న ఓ వ్యక్తి.

ఇద్దరూ క్షేమంగా కిందికి దిగారు. దగ్గర్లో వేచి ఉన్న ఓ వాహనం దగ్గరికి పరుగుతీశారు.

కానీ, వాళ్లు ప్రమాదం నుంచి బయటపడాలంటే ఆ పరుగు ఆపకూడదు. అధికారుల కంట పడకూడదు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionచైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ కోరల నుంచి యువతులు తప్పించుకుంటున్న దృశ్యాలు...

మీరా, జియూన్... ఇద్దరూ ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన యువతులు. ఉత్తర కొరియా నుంచి తప్పించుకోవటానికి ఆ యువతులకు సాయం చేసిన 'బ్రోకర్లు', చైనా చేరుకోగానే వారిని ఒక సెక్స్‌క్యామ్ నిర్వాహకులకు అప్పగించారు.

జియూన్ ఎనిమిదేళ్లుగా, మీరా ఐదేళ్లుగా ఆ సెక్స్‌క్యామ్ కబంధ హస్తాల్లో బందీలుగా ఉన్నారు. ఇప్పుడు తప్పించుకున్న భవనంలోనే ఇన్నేళ్లూ ఖైదీలుగా ఉన్నారు. లైవ్ వెబ్‌కామ్ ముందు పోర్నోగ్రఫీ కార్యకలాపాలు చేసే ''సెక్స్‌కామ్ గర్ల్స్''గా వారి చేత బలవంతంగా పని చేయించారు.

చిత్రం శీర్షిక ఉత్తర కొరియా నుంచి పొరుగున ఉన్న దక్షిణ కొరియాకు శరణార్థులుగా వెళ్లటానికి ప్రాణాలకు తెగించి ఇతర దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది

ఉత్తర కొరియా నుంచి బయటపడాలంటే ప్రాణాలకు తెగించటమే...

ఉత్తర కొరియా ప్రజలు ప్రభుత్వ అనుమతి లేకుండా దేశం వదిలి వెళ్లటానికి వీలు లేదు. అయినా చాలా మంది దేశం నుంచి తప్పించుకోవటానికి ప్రాణాలకు తెగిస్తూనే ఉన్నారు.

అలాంటి వారికి దక్షిణ కొరియాలో సురక్షితమైన ఆశ్రయం లభిస్తుంది. కానీ.. ఉత్తర - దక్షిణ కొరియాల మధ్య ఉన్న భూభాగమంతా భారీ సైనిక గస్తీతో మందుపాతరలతో నిండి ఉంటుంది. నేరుగా దక్షిణ కొరియాకు వెళ్లటం దాదాపు అసాధ్యం.

ఈ పరిస్థితుల్లో చాలా మంది ఉత్తర దిశలో ఉన్న చైనాలోకి ప్రవేశిస్తుంటారు. కానీ ఉత్తర కొరియా నుంచి ఫిరాయించిన ప్రజలను చైనాలో ''అక్రమ వలసలు''గా పరిగణిస్తారు. అధికారులకు పట్టిబడితే తిరిగి ఉత్తర కొరియా పంపించి వేస్తారు. అలా పట్టుబడి తిరిగి స్వదేశానికి వస్తే.. ''పితృభూమికి ద్రోహం'' చేసినందుకు గాను వారు హింసకు, నిర్బంధానికి గురవక తప్పదు.

1990ల మధ్యలో ఉత్తర కొరియాలో తీవ్ర కరవు తలెత్తి పది లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన కాలంలో ఫిరాయించేవారి సంఖ్య చాలా అధికంగా ఉండేది.

అయితే.. ఉత్తర కొరియాలో 2011లో కిమ్ జోంగ్ ఉన్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా ఫిరాయింపుదారుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది. సరిహద్దు వద్ద భద్రత పటిష్టం చేయటం, బ్రోకర్లు తమ రేట్లను పెంచేయటం దీనికి కారణమని చెప్తారు.

చిత్రం శీర్షిక జియూన్ తనకిక విముక్తి లభించదని ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేసింది

‘‘మగాళ్లంతా ఆ సినిమాల్లో వాళ్లలాగే ఉంటారనుకున్నా...’’

మీరా 22 ఏళ్ల వయసులో ఉత్తర కొరియా నుంచి బయట పడింది.

కరవు ముగిసే కాలంలో పుట్టిన మీరా, ఉత్తర కొరియా కొత్త తరంతో కలిసి పెరిగారు. దేశంలో విస్తరిస్తున్న రహస్య మార్కెట్ వ్యవస్థ 'జాంగ్మాదాంగ్' నుంచి డీవీడీ ప్లేయర్లు, సౌందర్య సాధనాలు, నకిలీ డిజైనర్ దుస్తులు, అక్రమ విదేశీ సినిమాలు ఉన్న యూఎస్‌బీ స్టిక్‌లు ఈ కొత్త తరం వారికి అందుబాటులోకి వచ్చాయి.

ఇలా బయటి దేశాల నుంచి వచ్చిన సమాచారం, వస్తువుల ప్రభావంతో చాలా మంది దేశం వదిలి వెళ్లాలని నిర్ణయించుకునే వారు. ముఖ్యంగా చైనా నుంచి దొంగతనంగా వచ్చే సినిమాల ద్వారా.. ఉత్తర కొరియా వెలుపలి ప్రపంచం గురించి వీరికి కొంత తెలిసేది. అలా ఉత్తర కొరియా వదిలి వెళ్లాలని ప్రేరణ కూడా లభించేది.

అలా ప్రభావితమైన వారిలో మీరా కూడా ఉంది.

''చైనా సినిమాలను చాలా ఇష్టంగా చూసేదాన్ని. చైనాలోని పురుషులందరూ ఆ సినిమాల్లో వాళ్లలాగానే ఉంటారని అనుకున్నాను. పెళ్లి చేసుకుంటే ఓ చైనా యువకుడిని పెళ్లి చేసుకోవాలని అనుకునేదాన్ని. ఉత్తర కొరియా వదిలి వెళ్లాలని కొన్నేళ్ల పాటు ఆలోచించాను'' అని ఆమె తెలిపింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు నేరుగా వెళ్లటం దాదాపు అసాధ్యం

దేశం దాటించే బ్రోకర్ కోసం నాలుగేళ్ల అన్వేషణ...

ఆమె తండ్రి మాజీ సైనికుడు. పార్టీ సభ్యుడు. చాలా స్ట్రిక్ట్. ఇంట్లో తీరిక లేనంతగా పనులు పెట్టేవాడు. అప్పుడప్పుడూ ఆమెను కొట్టేవాడు కూడా.

మీరా తాను డాక్టర్ శిక్షణ పొందాలని కోరుకుంది. కానీ ఆమె తండ్రి అందుకు ఒప్పుకోలేదు. ఆమెలో నిస్పృహ అంతకంతకూ పెరిగిపోయింది. చైనాలో కొత్త జీవితం గురించి కలలు కనింది.

''నా తండ్రి పార్టీ సభ్యుడు. నాకు ఊపిరి ఆడేది కాదు. విదేశీ సినిమాలు చూడనిచ్చేవాడు కాదు. రోజూ నిర్దేశిత సమయాల్లో నిద్రపోవటం, లేవటం చేయాలి. నాకంటూ సొంత జీవితం ఉండేది కాదు'' అని చెప్పిందామె.

పటిష్ట భద్రత ఉండే సరిహద్దులో టూమెన్ నది దాటటానికి తనకు సాయం చేసే బ్రోకర్ కోసం కొన్నేళ్ల పాటు వెదికింది మీరా.

అయితే ప్రభుత్వంతో ఆమె కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండటంతో.. చాలా మంది స్మగ్లర్లు ఆమె తమ గురించి అధికారులకు ఫిర్యాదు చేస్తారని భయపడేవారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉత్తర కొరియా నుంచి ఫిరాయించే వారు టుమెన్ నది దాటి చైనాలోకి ప్రవేశిస్తుంటారు

దేశం దాటించి యాంజీ నగరానికి తరలించి...

నాలుగేళ్ల పాటు ప్రయత్నించిన తర్వాత చివరికి ఒక వ్యక్తి ఆమెకు సాయం చేయటానికి ముందుకువచ్చాడు.

ఉత్తర కొరియా నుంచి ఫిరాయించే వారు చాలా మంది దగ్గర.. ఇలాంటి బ్రోకర్లకు నేరుగా చెల్లించటానికి సరిపోయినంత డబ్బులు ఉండవు. అలాంటి చాలా మంది లాగానే.. తనను ''అమ్మివేయటా''నికి.. అలా పని చేసి అతడి బాకీ తీర్చటానికి మీరా అంగీకరించింది. తాను ఏదైనా రెస్టారెంట్‌లో పని చేస్తానని అనుకుంది.

కానీ ఆమె మోసపోయింది. ఉత్తర కొరియా నుంచి బయటపడాలనుకునే యువతులకు వలవేసి సెక్స్ పరిశ్రమలోకి దించే స్మగ్లింగ్ ముఠా మీరాను లక్ష్యంగా చేసుకుంది.

టూమెన్ నది దాటి చైనాలోకి వచ్చిన తర్వాత మీరాను నేరుగా యాంజీ నగరానికి తరలించారు. అక్కడ 'డైరెక్టర్' అని వ్యవహరించే కొరియా సంతతికి చెందిన ఓ చైనా వ్యక్తికి ఆమెను అప్పగించారు.

Image copyright CHUN KIWON
చిత్రం శీర్షిక సెక్స్‌క్యామ్ వెబ్‌సైట్ స్క్రీన్‌షాట్

పెళ్లికూతుళ్లుగా, సెక్స్ సెక్స్‌క్యామ్ వర్కర్లుగా అమ్మేస్తారు...

యాన్‌బియాన్ ప్రాంతానికి గుండె కాయ వంటిది యాంజీ నగరం. బీజింగ్‌లోని చైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్థాయి స్వతంత్రం ఈ ప్రాంతానికి ఉంది.

కొరియా సంతతికి చెందిన జనాభా చాలా మంది ఇక్కడ నివసిస్తున్నారు. ఉత్తర కొరియాతో వ్యాపారానికి ఇది ఓ కేంద్రంగా కూడా మారింది. ఆ క్రమంలో ఉత్తర కొరియా ఫిరాయింపుదార్లు రహస్యంగా తలదాచుకునే ముఖ్యమైన చైనా నగరాల్లో ఒకటిగా మారింది.

నిజానికి ఉత్తర కొరియా నుంచి ఫిరాయించే జనంలో అత్యధిక భాగం మహిళలే ఉంటారు. కానీ చైనాలో వారికి చట్టపరంగా ఎలాంటి హోదా ఉండకపోవటంతో వారిని అన్నిరకాలుగా దోపిడీ చేయటం చాలా సులభం. కొందరిని గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లి కూతుళ్లుగా అమ్మేస్తారు. కొందరిని వ్యభిచార కూపంలోకి నెట్టేస్తారు. ఇంకొందరిని మీరా తరహాలో సెక్స్‌క్యామ్ పనిలో బందీలను చేస్తారు.

ఆ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్న తర్వాత సదరు డైరెక్టర్ చివరికి ఆమె ఉద్యోగం ఏమిటో వెల్లడించాడు.

ఆమెను ఒక 'శిక్షకురాలి'తో జత కలిపి ఆమె గదిలో ఉంచాడు. సెక్స్‌క్యామ్ యువతులు ఎలా పని చేస్తారో చూస్తూ నేర్చుకుంటూ అభ్యాసం చేయాలి.

Image copyright CHUN KIWON
చిత్రం శీర్షిక సెక్స్‌క్యామ్ సైట్‌లో మీరా స్క్రీన్ షాట్

‘‘నమ్మలేకపోయాను. వెక్కి వెక్కి ఏడ్చాను...’’

''నేను నమ్మలేకపోయాను. జనం ముందు దుస్తులు తీసేసి నగ్నంగా ఉండటం. ఒక మహిళగా చాలా అవమానకరం. నేను వెక్కి వెక్కి ఏడుస్తుంటే, ఇల్లు గుర్తొచ్చి ఏడుస్తున్నావా అని అడిగారు'' అని చెప్పింది మీరా.

ఆ సెక్స్‌క్యామ్ సైట్ దక్షిణ కొరియాది. దాని యూజర్లలో అధిక భాగం దక్షిణ కొరియా వాసులే. నిమిషానికి ఇంత అని వాళ్లు డబ్బులు చెల్లిస్తారు. కాబట్టి పురుషులను ఎంత ఎక్కువ సేపు వీలైతే అంత ఎక్కువ సేపు వీక్షించేలా చేయాలని ఈ యువతులకు నిర్దేశిస్తారు.

మీరా ఎప్పుడైనా భయపడినా, ఏమాత్రం తడబడినా... ఉత్తర కొరియాకు తిప్పి పంపించేస్తానని డైరెక్టర్ ఆమెను బెదిరించేవాడు.

''నా కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వంలో పని చేస్తారు. నేను తిరిగి వెళ్తే నా కుటుంబం పరువు పోతుంది. దానికన్నా పొగలా గాలిలో కలిసిపోయి చచ్చిపోతాను కానీ తిరిగి వెళ్లలేను'' అంటుంది మీరా.

Image copyright CHUN KIWON
చిత్రం శీర్షిక సెక్స్‌క్యామ్ వెబ్‌సైట్‌లో జియూన్ స్క్రీన్‌షాట్

పదహారేళ్ల ప్రాయంలో పారిపోయి వచ్చిన జియూన్‌...

ఆ అపార్ట్‌మెంట్‌లో ఎప్పుడు చూసినా కనీసం తొమ్మిది మంది యువతులు ఉంటారు. మీరాతో పాటు గదిలో ఉన్న మొదటి యువతి మరో యువతితో కలిసి తప్పించుకుపోయింది. అప్పుడు మీరాను ఇంకొందరు యువతులతో కలిపి ఉంచారు. అలా జియూన్‌ను కలిసింది మీరా.

జియూన్ 2010లో ఉత్తర కొరియా నుంచి తప్పించుకుని చైనా వచ్చింది. అప్పుడు ఆమె వయసు 16 ఏళ్ళే.

జియూన్‌కు రెండేళ్ల వయసు ఉన్నపుడు ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. ఆమె కుటుంబం పేదరికంలోకి దిగజారిపోయింది. పని చేసి డబ్బులు సంపాదించటం కోసం 11 ఏళ్ల వయసులో బడి మానేసింది. చివరికి చైనా వెళ్లి పని చేసి ఇంటికి డబ్బులు పంపించాలని ఆమె నిర్ణయించుకుంది.

కానీ, ఆమె కూడా మీరా లాగానే మోసపోయింది. చైనాలో సెక్స్‌క్యామ్ పని చేయాల్సి ఉంటుందని ఆమెను తప్పించిన బ్రోకర్ చెప్పలేదు.

జియూన్‌ను యాంజీకి తీసుకువచ్చి అదే ''డైరెక్టర్''కు అప్పగించారు. అయితే, ఆమె ''మరీ నల్లగా, వికారంగా ఉంది'' అంటూ ఆమెను ఉత్తర కొరియా తిప్పి పంపించేయాలని ఆ డైరెక్టర్ ప్రయత్నించింది.

చిత్రం శీర్షిక చైనాలో కొరియా స్వయంప్రతిపత్తి ప్రాంతాలు

‘‘అవ్వాతాతలకు ఓ ముద్ద అన్నం పెట్టాలని వచ్చా...’’

తాను ఉన్న పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నా కానీ తిరిగి ఉత్తర కొరియా వెళ్లటానికి జియూన్ ధైర్యం చేయలేదు.

''నేను చాలా తీవ్రంగా అసహ్యించుకునే పని ఇది. కానీ, చైనా రావటం కోసం నేను ప్రాణాలకు తెగించాను. వట్టి చేతులతో తిరిగి వెళ్లలేను'' అని ఆమె చెప్పింది.

''నా అవ్వాతాతలు చచ్చిపోయే ముందు వారికి కొంత అన్నం తినిపించాలన్నది నా కల. అందుకే నేను అన్నిటినీ తట్టుకుని బతకగలుగుతున్నా. నా కుటుంబానికి డబ్బులు పంపించాలన్నది నా ఆకాంక్ష'' అని వివరించింది.

జియూన్ కష్టపడి పని చేసింది. బాగా రాణిస్తే డైరెక్టర్ తనకు బహుమతి ఇస్తుందని నమ్మింది. ఆమె కుటుంబంతో మాట్లాడవచ్చని.. ఇంటికి డబ్బులు పంపించవచ్చని ఇచ్చిన హామీలను నమ్మింది. త్వరలోనే ఆ ఇంట్లో మిగతా యువతుల కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించి ఇవ్వటం మొదలుపెట్టింది.

''ఆ డైరెక్టర్ నన్ను గుర్తించాలని నేను కోరుకున్నా. నా కుటుంబంతో మాట్లాడాలని కోరుకున్నా. ఆ ఇంట్లో అందరి కన్నా బాగా రాణిస్తే నన్నే ముందుగా విడిచిపెడతారని అనుకున్నా'' అని చెప్పింది జియూన్.

Image copyright Science Photo Library

ఒక్కొక్కరు రోజుకు 177 డాలర్లు సంపాదించాలి...

ఒక్కో యువతి రోజుకు 177 డాలర్లు సంపాదించాలన్నది అక్కడ టార్గెట్. దానిని చేరుకోవటానికి ఆమె కొన్నిసార్లు రాత్రిపూట కేవలం నాలుగు గంటలే పడుకునేది. తన కుటుంబం కోసం డబ్బులు సంపాదించాలన్న తపన ఆమెను నిద్రపోనిచ్చేది కాదు.

జియూన్ కొన్నిసార్లు మీరాను ఓదార్చేది కూడా. డైరెక్టర్‌కు ఎదురు తిరగవద్దని, నచ్చచెప్పుకోవాలని సూచించేది.

''ముందు కష్టపడి పనిచేయి. ఆ తర్వాత డైరెక్టర్ నిన్ను ఇంటికి పంపించకపోతే అప్పుడు అతడితో మాట్లాడు'' అని మీరాను సముదాయించేది.

ఇతర యువతులకన్నా తాను ఎక్కువ డబ్బులు సంపాదించినన్ని సంవత్సరాలూ డైరెక్టర్ తనను చాలా ఇష్టంగా చూసుకున్నాడని జియూన్ చెప్పింది.

''అతడు నిజంగానే నా గురించి పట్టించుకునేవాడని నేను అనుకున్నా. కానీ నా సంపాదన తగ్గిపోతున్నపుడు అతడి ముఖంలో హావభావాలు మారిపోయేవి. కష్టపడి పనిచేయటం లేదని.. డ్రామాలు చూడటం లాంటి చెత్త పనులు చేస్తున్నారని మమ్మల్ని తిట్టేవాడు'' అని వివరించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చైనాలోని యాంజీ నగరం ఉత్తర కొరియా నుంచి ఫిరాయించిన వారికి తొలి మజిలీగా మారింది

ఆరు నెలలకోసారి బయటకెళ్లినా.. నోరు తెరిచే వీలు లేదు...

ఆ డైరెక్టర్ కుటుంబం ఆ అపార్ట్‌మెంట్‌కు కట్టుదిట్టమైన భద్రతగా ఉండేది. అతడి తల్లిదండ్రులు ముందు గదిలోనే పడుకుంటారు. ప్రధాన ద్వారం తలుపులు ఎల్లప్పుడూ తాళం వేసి ఉంటాయి.

యువతులకు డైరెక్టరే ఆహారం తీసుకొచ్చి ఇస్తాడు. చెత్తను శుభ్రం చేసి తీసుకెళ్లటానికి సమీపంలోనే నివసించే అతడి సోదరుడు రోజూ ఉదయాన్నే వస్తుంటాడు.

''అది మొత్తం ఓ బందిఖానా. జైలు కన్నా ఘోరం'' అంటుంది జియూన్.

ఈ ఉత్తర కొరియా యువతులను ప్రతి ఆరు నెలలకు ఒకసారి బయటకు వెళ్లటానికి అనుమతించేవారు. ఒకవేళ ఎక్కువ డబ్బులు సంపాదిస్తే నెలకు ఒకసారి కూడా పంపిస్తారు. ఆ అరుదైన క్షణాల్లో వాళ్లు షాపింగ్ చేయటానికి, జుట్టు బాగు చేయించుకోవటానికి వెళ్లేవారీ యువతులు. కానీ అప్పుడు కూడా ఎవరితో మాట్లాడనిచ్చే వాళ్లు కాదు.

''ఆ డైరెక్టర్ మాతో చాలా సన్నిహితంగా ఒక లవర్ తరహాలో నడుస్తూ ఉండేవాడు. మేం పారిపోతామని అతడి భయం'' అని చెప్పింది మీరా. ''నాకు నచ్చినట్లు తిరిగి రావాలని నేను కోరుకునేదాన్ని. కానీ ఆ వీలు లేదు. ఎవరితోనూ మాట్లాడటానికి వీలు లేదు. కనీసం ఒక వాటర్ బాటిల్ కొనాలన్నా మేం మాట్లాడకూడదు. నాకు నేను ఒక ఫూల్‌లా కనిపించేదాన్ని'' అని ఆమె వివరించింది.

Image copyright Getty Images

సెక్స్‌క్యామ్‌లో సంపాదించిన డబ్బులు ఎన్నడూ కళ్ల చూడలేదు...

ఆ అపార్ట్‌మెంట్‌లో 'మేనేజర్'గా వ్యవహరించటానికి ఉత్తర కొరియా నుంచే వచ్చిన ఒక మహిళను నియమించాడు సదరు డైరెక్టర్. డైరెక్టర్ లేనప్పుడు మిగతా యువతులందరి మీదా ఆమె నిఘా ఉంచేది.

మీరా కష్టపడి పనిచేస్తే ఆమెకు ఒక మంచి వ్యక్తితో పెళ్లిచేస్తానని డైరెక్టర్ ఆమెకు హామీ ఇచ్చాడు. జియూన్‌కు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడే వీలు కల్పిస్తానని మాట ఇచ్చాడు.

చివరికి తనను విడుదల చేయమని జియూన్ అతడిని అడిగింది. దానికి అతడు బదులిస్తూ ఆమెను విడుదల చేయాలంటే ఆమెను ఉత్తర కొరియా నుంచి చైనాకు రప్పించటానికి అయిన ఖర్చు 53,200 డాలర్లు సంపాదించాల్సి ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత బ్రోకర్లు ఎవరూ కనిపించటం లేదని కాబట్టి విడుదల చేయలేనని చెప్పాడు.

మీరా కానీ జియూన్ కానీ తమ సెక్స్‌క్యామ్ పని ద్వారా సంపాదించిన డబ్బులను ఎన్నడూ కళ్ల చూడలేదు.

Image copyright iStock

ఇక విముక్తి లేదనే భయంతో ఆత్మహత్యా ప్రయత్నాలు...

వారి పనితో వచ్చిన లాభాల్లో వారికి 30 శాతం ఇస్తానని ఆ డైరెక్టర్ మొదట అంగీకరించాడు. వారిని విడుదల చేసేటపుడు ఆ మొత్తం చెల్లిస్తానని భరోసా ఇచ్చాడు.

కానీ.. అసలు తమకు ఎన్నడూ విముక్తి లభించకపోవచ్చునని మీరా, జియూన్‌లకు అర్థమైంది. దీంతో వీరిలో ఆందోళన తీవ్రంగా పెరిగిపోయింది.

''ఆత్మహత్య చేసుకోవాలని నేను మామూలుగా అనుకోను. కానీ అధికంగా డ్రగ్ తీసుకుని, కిటికీ నుంచి దూకి చచ్చిపోవాలని నేను ప్రయత్నించాను'' అని చెప్పింది యువాన్.

అదే అపార్ట్‌మెంట్‌లో ఏళ్లు గడస్తూ పోయాయి. మీరా అయిదేళ్లు, జియూన్ ఎనిమిదేళ్లు అక్కడ బందీలుగా, సెక్స్‌క్యామ్ బానిస కార్మికులుగా మగ్గిపోయారు.

Image copyright CHUN KIWON
చిత్రం శీర్షిక సెక్స్‌క్యామ్ వెబ్‌సైట్‌లో ఒక క్లయింట్.. మీరాకు పాస్టర్ చున్‌ను పరిచయం చేశాడు

ఓ క్లయింట్‌ సాయంతో పాస్టర్ పరిచయం...

మీరా సెక్స్‌క్యామ్ క్లయింట్ ఒక వ్యక్తికి ఆమె మీద జాలి కలిగింది. అప్పటికి మూడేళ్లుగా మీరాకు సెక్స్‌క్యామ్‌లో అతడు పరిచయం. చున్ కివాన్ అనే పాస్టర్‌ను ఆమెకు పరిచయం చేశాడా క్లయింట్. ఉత్తర కొరియా నుంచి ఫిరాయించిన వారికి ఆ పాస్టర్ గత 20 సంవత్సరాలుగా సాయం చేస్తున్నాడు.

మీరా కంప్యూటర్‌లో ఒక మెసేజింగ్ అప్లికేషన్‌ను కూడా ఇంటర్నెట్ అనుసంధానం ద్వారా ఇన్‌స్టాల్ చేశాడా క్లయింట్. ఆ అప్లికేషన్ ద్వారా ఆమె పాస్టర్‌తో మాట్లాడేది.

ఉత్తర కొరియా నుంచి ఫిరాయించిన వారికి పాస్టర్ చున్ కివాన్ సుపరిచితుడు. అతడు ఓ 'కిడ్నాపర్' అని, 'మోసగాడు' అని ఉత్తర కొరియా టీవీ తరచుగా విమర్శిస్తూ ఉంటుంది.

1999లో దురిహానాలో తన క్రిస్టియన్ చారిటీని నెలకొల్పినప్పటి నుంచీ దాదాపు 1,200 మంది ఫిరాయింపుదారులను క్షేమంగా చేర్చినట్లు ఆ పాస్టర్ చెప్తాడు.

అతడికి ప్రతి నెలా రెండు, మూడు విజ్ఞప్తులు వస్తుంటాయి.. తమను రక్షించాలని కోరుతూ. అయితే మీరా, జియూన్ ఉదంతం అతడిని కలచివేసింది.

చిత్రం శీర్షిక మీరా, జియూన్‌లు క్షేమంగా చైనా సరిహద్దును దాటించారు పాస్టర్ చున్

కొరియా యువతుల ట్రాఫికింగ్ ఓ వ్యవస్థీకృత ముఠా పని...

''మూడేళ్ల పాటు నిర్బంధించిన యువతులను చూశాను. కానీ ఇంత కాలం బంధించిన యువతుల గురించి నాకు తెలియదు. ఇది నా గుండెను పండేస్తోంది'' అని ఆయన చెప్పాడు.

ఉత్తర కొరియా నుంచి ఫిరాయిస్తున్న యువతులను వ్యభిచారం, సెక్స్‌క్యామ్ వంటి వృత్తుల్లో బానిసలుగా మార్చుతున్న ముఠా చాలా వ్యవస్థీకృతంగా ఉందని.. సరిహద్దులకు కాపలా ఉండే ఉత్తర కొరియా సైనికులు కూడా కొందరు ఈ ముఠాలో భాగస్వాములని చెప్తున్నాడాయన.

ఉత్తర కొరియా నుంచి మహిళలను తెచ్చి అక్రమ రవాణా చేయటాన్ని.. చైనా సరిహద్దు ప్రాంతంలో నివసించే స్థానికులు ''కొరియా పంది వ్యాపారం (కొరియన్ పిగ్ ట్రేడ్)'' అని వ్యవహరిస్తుంటారు. ఆ మహిళల ధర వందల డాలర్ల నుంచి వేల డాలర్ల వరకూ ఉంటుంది.

దీనికి సంబంధించి అధికారిక లెక్కలు సంపాదించటం కష్టం. అయితే.. ఉత్తర కొరియా మహిళల అక్రమ రవాణా అత్యధిక స్థాయిలో ఉందంటూ ఐక్యరాజ్యసమితి ఆందోళనలు లేవనెత్తింది.

మనుషుల అక్రమ రవాణా మీద అమెరికా విదేశాంగ శాఖ వార్షిక నివేదిక.. మానవ అక్రమ రవాణా అత్యంత తీవ్రంగా ఉన్న దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి అని చాలా కాలంగా వర్గీకరిస్తోంది.

Image copyright CHUN KIWON
చిత్రం శీర్షిక సెక్స్‌క్యామ్ వెబ్‌సైట్‌లో జియూన్‌ క్లయింటుగా నటిస్తూ పాస్టర్ చున్ ఆమెను తప్పించే ప్రణాళిక రచించాడు

యువతులను తప్పించటానికి క్లయింట్ రూపంలో పాస్టర్ ప్రణాళిక...

మీరా, జియూన్‌ల క్లయింటు వేషంలో చున్ ఒక నెల రోజుల పాటు సెక్స్‌క్యామ్ వెబ్‌సైట్‌లో వారిని సంప్రదిస్తూ వచ్చాడు. అలా చేయటం ద్వారా.. ఆ యువతులు తాము తప్పించుకోవటానికి ప్రణాళిక రచిస్తూనే పని చేస్తున్నట్లు నటించే వీలు ఉంటుంది.

''సాధారణంగా ఇలా నిర్బంధించిన ఫిరాయింపుదార్లకు తాము ఎక్కడ ఉన్నామన్న వివరాలేవీ తెలియవు. ఎందుకంటే వారిని రాత్రిపూట కళ్లకు గంతలు కట్టి అపార్ట్‌మెంట్‌లోకి తీసుకెళతారు. అదృష్టవశాత్తూ తాము యాంజీలో ఉన్నామని.. అపార్ట్‌మెంట్ బయట ఒక హోటల్ పేరు ఉందని మీరా, జియూన్‌లకు తెలుసు'' అని పాస్టర్ చెప్పాడు.

వారు ఇచ్చిన వివరాలను బట్టి సరిగ్గా వారు ఎక్కడ ఉన్నారన్నది గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించిన చున్.. ఆ అపార్ట్‌మెంట్‌ పరిశరాలను పరిశీలించటానికి తన సంస్థ దురిహానా నుంచి ఒక వలంటీర్‌ను పంపించారు.

అయితే.. ఉత్తర కొరియా నుంచి ఫిరాయించి చైనాకు వచ్చిన వారు చైనా నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేయటం కూడా చాలా ప్రమాదకరమే.

చాలా మంది ఏదైనా మూడో దేశంలోకి వెళ్లి.. అక్కడ దక్షిణ కొరియా రాయబార కార్యాలయానికి వెళ్లాలని అనుకుంటారు. అక్కడికి చేరుకోగలిగితే దక్షిణ కొరియాలో ఆశ్రయం ఇచ్చి విమానం ద్వారా దక్షిణ కొరియాకు పంపిస్తారు.

కానీ, అధికారిక గుర్తింపు లేకుండా చైనాలో ప్రయాణించటం ప్రమాదకరం.

''గతంలో ఇలాంటి ఫిరాయింపుదార్లు నకిలీ గుర్తింపులతో ప్రయాణించి బయటపడగలిగేవారు. కానీ ఇప్పుడు గుర్తింపు కార్డులు అసలైనవా నకిలీవా అని తేల్చిచెప్పే ఎలక్ట్రానిక్ పరికరాలు అధికారుల దగ్గర ఉన్నాయి'' అని చున్ వివరించాడు.

చిత్రం శీర్షిక సెక్స్‌క్యామ్ బందిఖానా నుంచి బయటపడినపుడు మీరా వెంట తెచ్చుకున్న వస్తువులివి

రైళ్లు, రెస్టారెంట్లలో నిద్రపోతూ, అయిదు గంటలు కొండ ఎక్కి...

జియూన్, మీరాలు ఆ అపార్ట్‌మెంట్ నుంచి తప్పించుకున్న తర్వాత.. దురిహానా వలంటీర్ల సాయంతో చైనా నుంచి బయటపడటానికి సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించారు.

వీరు గుర్తింపు కార్డు లేకుండా ఏదైనా హోటల్‌లో కానీ, హాస్టల్‌లో కానీ బస చేయలేరు. దీంతో రాత్రిళ్లు రైళ్లలోనూ, రెస్టారెంట్లలోనూ నిద్ర పోవాల్సి వచ్చేది.

చైనాలో చివరి రోజు ప్రయాణంలో భాగంగా.. ఒక పర్వతాన్ని ఐదు గంటల పాటు అధిరోహించాల్సి వచ్చింది. ఎట్టకేలకు చైనా సరిహద్దు దాటి పొరుగున ఉన్న మరో దేశంలోకి అడుగుపెట్టగలిగారు జియూన్, మీరాలు. అయితే.. వీరు ప్రయాణించిన మార్గం, వీరు అడుగుపెట్టిన దేశం వివరాలు వెల్లడించలేదు.

అపార్ట్‌మెంట్ నుంచి తప్పించుకున్న పన్నెండు రోజుల తర్వాత మీరా, జియూన్‌లు మొదటిసారిగా చున్‌ను ప్రత్యక్షంగా కలిశారు.

చిత్రం శీర్షిక సెక్స్‌క్యామ్ బందిఖానా నుంచి బయటపడినపుడు జియూన్ వెంట తెచ్చుకున్న వస్తువులివి

‘‘నాకు స్వేచ్ఛ లభించిందన్న ఆలోచనతో ఏడ్చేశా...’’

''దక్షిణ కొరియా పౌరసత్వం లభించినప్పుడు మాత్రమే నేను పూర్తిగా సురక్షితంగా ఉన్నానన్న భావన నాకు వస్తుంది. అయితే చున్‌ను కలవటంతోనే నేను భద్రంగా ఉన్నానని అనిపించింది. నాకు స్వేచ్ఛ లభించిందన్న ఆలోచన రావటంతోనే బిగ్గరగా ఏడ్చేశాను'' అని చెప్పింది జియూన్.

వాళ్లందరూ కలిసి మరో 27 గంటల పాటు ప్రయాణించి దగ్గర్లోని దక్షిణ కొరియా రాయబార కార్యాలయానికి చేరుకున్నారు.

అయితే.. ఎక్కువ సమయం కారులో ప్రయాణం చేయటం అలవాటు లేని ఉత్తర కొరియా ఫిరాయింపుదార్లు కొందరికి.. ప్రయాణంలో ఈ చివరి అంకం చాలా కష్టంగా అనిపిస్తుందని చున్ చెప్పారు.

''వాళ్లు తరచుగా అస్వస్థతకు గురవుతారు. వాంతులు చేసుకుంటారు. స్పృహ తప్పుతారు. నిజానికి.. స్వర్గం వెదుక్కుంటూ బయల్దేరిన వారు ప్రయాణించే నరక మార్గమిది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఎట్టకేలకు దక్షిణ కొరియా రాయబార కార్యాలయానికి...

రాయబార కార్యాలయానికి చేరుకోవటానికి కొద్దిగా ముందు మీరా ఆదుర్దా పడుతూ నవ్వుతుంది. తనకు ఏడుపు వస్తోందని చెప్పింది.

''నరకం నుంచి బయటకు వచ్చినట్లు నాకు అనిపిస్తోంది'' అని పేర్కొంది జియాన్. ''చాలా రకాల భావనలు ముప్పిరిగొంటున్నాయి. నేను దక్షిణ కొరియా వెళితే నా కుటుంబాన్ని ఇక ఎన్నడూ చూడలేకపోవచ్చు. గిల్టీగా అనిపిస్తుంది. ఎందుకంటే.. నేను ఇల్లు వదిలి, దేశం వదిలి వచ్చింది ఇందుకోసం కాదు'' అని చెప్పిందామె.

పాస్టర్ చున్, మీరా, జియాన్‌లు దక్షిణ కొరియా ఎంబసీలో గేటు దాటి లోపలికి అడుగుపెట్టారు. కొన్ని క్షణాల తర్వాత చున్ ఒక్కడే తిరిగి వచ్చాడు. ఆయన పని పూర్తయింది.

మీరా, జియూన్‌లను నేరుగా విమానంలో దక్షిణ కొరియా పంపిస్తారు. వారు ఉత్తర కొరియా గూఢచారులు కాదని నిర్ధారించుకోవటానికి ఆ దేశ జాతీయ నిఘా సంస్థ క్షుణ్నంగా పరిశోధిస్తుంది. లోతుగా ప్రశ్నించి పరిశీలిస్తుంది.

చిత్రం శీర్షిక చైనా సరిహద్దులో ఐదు గంటల పాటు పర్వతం ఎక్కేటపుడు జియూన్ చేతులు గీసుకుపోయాయి

గూఢచారులు కాదని రూఢి చేసుకున్నాకే పౌరసత్వం...

అనంతరం ఉత్తర కొరియా ఫిరాయింపుదార్ల కోసం ఏర్పాటైన హనావన్ పునరావాస కేంద్రంలో వీరిని మూడు నెలలు ఉంచుతారు. దక్షిణ కొరియాలో కొత్త జీవితానికి అలవాటు పడటానికి అవసరమైన నైపుణ్యాలు వీరికి బోధిస్తారు.

ఇంటికి అవసరమైన నిత్యావసరాలు కొనుక్కోవటం ఎలా, స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించటం ఎలా అనేవి నేర్పుతారు. స్వేచ్ఛా విపణి ఆర్థిక వ్యవస్థ ప్రాధమిక సూత్రాలను బోధిస్తారు. ఉద్యోగానికి అవసరమైన శిక్షణ పొందటం ఎలాగో చెప్తారు. కౌన్సెలింగ్ కూడా అందిస్తారు. ఆ తర్వాత వారు అధికారికంగా దక్షిణ కొరియా పౌరులుగా మారతారు.

''ఇంగ్లిష్ లేదా చైనీస్ భాష నేర్చుకోవాలని నాకు ఉంది. ఒక టూర్ గైడ్‌గా పనిచేయటానికి అది ఉపయోగపడుతుంది'' అని చెప్పింది మీరా.. దక్షిణ కొరియాలో ఆమె జీవితం గురించి ఎలా కలగంటున్నావని అడిగినపుడు.

''కాఫీ తాగుతూ, ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్తూ సాధారణ జీవితం గడపాలని ఉంది. వర్షం ఏదో ఒక రోజు ఆగుతుందని ఎవరో ఒకసారి చెప్పారు నాతో. నాకైతే ఈ వర్షాకాలం ఎంత సుదీర్ఘ కాలం సాగిందంటే.. సూర్యుడు అనేవాడు ఉన్నాడన్న సంగతే నేను మర్చిపోయాను'' అని జియూన్ చెప్పారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఉత్తర కొరియాలో ఒకరు పారిపోతే మరొకరికి చిత్రహింస

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)