పీసీవోడీ: అమ్మాయిలకు మీసాలు, గడ్డాలు ఎందుకొస్తాయి? సంతాన లేమికి పీసీవోడీకి సంబంధం ఏమిటి? : నమ్మకాలు-నిజాలు

 • 20 జనవరి 2019
ఆడవారిలో మీసాలు, గెడ్డాలు Image copyright Getty Images

పొద్దున పదయినా పనిలోకి రాని అప్పలమ్మ గురించి తీవ్రంగా ఆలోచిస్తూ హైరానా పడిపోతోంది అరుణ.

అప్పలమ్మ మీదే ఇల్లంతా ఆధారపడి ఉంది. రోజూ పొద్దున్నే ఏడింటికే వచ్చి అంట్లు తోమి ఇల్లంతా థళ థళ లాడేట్టు చేసేది ఈరోజేమయిందో.. ఒంట్లో బాగా లేదో ఏమో అని ఆలోచిస్తుంటే ఈలోగానే వచ్చింది అప్పలమ్మ.

"ఏం అప్పలమ్మా ఇంత ఆలస్యమైంది ఒంటో బాగా లేదా" అడిగింది అరుణ. "నాక్కాదమ్మా నా కూతురికి" అని బావురుమంది.

‘‘అయ్యో ఏమయింది ఏడవకు చెప్పు కావాలంటే నాకు తెలిసిన డాక్టరమ్మ వుంది తీసికెళతాను" ఓదారుస్తూ అడిగింది అరుణ.

"మూడునెలలయిందంటమ్మా బయటజేరి, వయసులో వున్న పిల్ల కదా, ఏదైనా తేడా వచ్చిందంటే మా ఆయన బతకనివ్వడు ఇద్దరినీ చంపేస్తాడు" మరోసారి బావురుమంది.

"ఛ ఊరుకో డాక్టరమ్మ దగ్గరకెళతాం కదా, పరీక్ష చేసి ఆవిడేం చెబుతుందో చూద్దాం, నువ్వు కంగారు పడకు" ధైర్యం చెప్పింది అరుణ.

డాక్టరమ్మ పరీక్ష చేసి ఆ అమ్మాయి తప్పేమీ చెయ్యలేదనీ ఆమె అండాశయాలలో నీటిబుడగలు ఉన్నాయనీ, వాటివలనే అప్పలమ్మ మనవరాలికి పీరియడ్ రాలేదనీ, దీనినే పాలీ సిస్టిక్ ఓవరీ డిసీజ్ (పీసీఓడీ) అంటారనీ చెప్పింది. కొన్ని రకాలయిన మందులతోనూ ఇతర జాగ్తత్తలతోనూ పరిస్థితి అదుపులోకి వస్తుందని వివరించింది.

ఇది పెళ్లికాని పిల్లల సమస్యయితే పెళ్లయిన వాళ్లలో ఎలా వుంటుందో చూద్దామా?

Image copyright iStock

ఈ మధ్యనే పెళ్లయి రెండేళ్లు నిండిన ప్రేమకీ వాళ్లత్త గారికీ మధ్యవాగ్యుధ్ధం జరుగుతోంది పొద్దుటి నుండీ.పెళ్లయి రెండేళ్లయినా ఇంకా పిల్లల్లేరని సాధిస్తున్న ఆవిడతో భర్త తో పాటు హాస్పిటల్‌కి వెళతానంది ప్రేమ.

దానికావిడ "నీకే సరిగా నెలసరులు రావడంలేదు,పైగా మొహంనిండా మొటిమలతో పాటు మగరాయుడిలాగా మీసాలూ, గడ్డాలూ నువు చూపించుకో ముందు, నీలోనే ఏదో లోపం వుండి వుంటుంది" అంది.

ఆవిడ ఆడిన మాటలు బాణాల్లా తగిలి విలవిలలాడింది ప్రేమ. నిజమే మరి ఈ మధ్య తను విపరీతంగా బరువు పెరగడంతో బాటు ఆవిడ చెప్పిన లక్షణాలతో కూడా బాధపడి బయటకే రావడం లేదు సిగ్గుతో.

చివరికి ధైర్యం చేసి డాక్టర్ దగ్గరకు వెళ్లిన ప్రేమకు ఈ లక్షణాలన్నింటికీ అంటే లావవ్వడానికీ, నెలసరులు రాకపోవడానికు, మొటిమలకీ, అవాంఛిత రోమాలకి కారణం పి.సి.ఒ.డి. అని తేలింది.

ఈ కథలిలా వుంటే నడివయసు వారి కథ మరోలా వుంటుంది. నలభయ్యో పడిలో పడిన నాగమణి కొంతకాలంగా పి.సి.ఒ.డి.తో బాధపడుతూ సరిగా చికిత్స తీసుకోకుండా అశ్రధ్ధ చేసింది.

ఈ మధ్య చాలా నీరసంగా వుండి రక్త పరీక్షలు చేయించుకుంటే షుగర్ వ్యాధి వున్నట్టు తేలింది. దానితో పాటు బి.పి కూడా వున్నట్టూ, ఈ రెండింటికీ, నియంత్రణలో లేని పి.సి.ఒ.డి. కారణమయ్యుండొచ్చు అన్నారు డాక్టర్లు.

అంతేకాక అది గర్భాశయ కాన్సర్‌కి కూడా దారి తీయవచ్చని హెచ్చరించారు.

ఇలా యుక్త వయస్సులో వున్న పిల్లల దగ్గరనుండీ నడివయసు స్త్రీల వరకూ ఆరోగ్య పరంగానూ, మానసికంగానూ సమస్యలను సృష్టించే ఈ పి.సి.ఒ.డి. గురించి వైద్యశాస్త్రం ఏం చెబుతోందో చూద్దాం.

Image copyright Science Photo Library
చిత్రం శీర్షిక సింక్ అవుతున్న భావన.. కానీ అది కేవలం భావన మాత్రమే కావచ్చు

పి.సి.ఒ.డి. అంటే:

పాలీ సిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటే అండాశయంలో నీటి బుడగల్లాంటివి ఏర్పడటంతో పాటు ఆడవాళ్ల శరీరంలో కనపడే కొన్ని లక్షణాల సముదాయం.

ఆ లక్షణాలు యేమిటంటే...

 • పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, వచ్చినపుడు రక్తస్రావం తక్కువగా గానీ అధికంగా గానీ వుండటం
 • స్థూలకాయం
 • అవాంఛిత రోమాలు అంటే స్త్రీలలో మగవారి లాగా గడ్డాలూ, మీసాలూ రావడం, మొఖం మీదా, మెడ వెనుకా చర్మం నల్లబడటం
 • మొహం మీదా, మెడ వెనకా మొటిమలు రావడం
 • సంతాన లేమి
 • కొందరిలో తలనెప్పులూ, మానసిక ఆందోళన (యాంగ్జయిటీ, డిప్రెషన్ ) లాంటివి కూడా కనపడతాయి
Image copyright Getty Images

ఏ వయసు వారిలో కనపడుతుంది?

నేడు ప్రధానంగా యుక్త వయసు వారిని వేధిస్తున్న సమస్య. సాధారణంగా 15-44 సంవత్సరాల వయసులో ఉన్న వారు దీని బారిన పడుతూ ఉంటారు.

ప్రతి పది మంది స్త్రీలలో ఒకరికి అంటే నూటికి పది మందిలో ఈ సమస్య కనపడుతుంది.

కారణం: స్త్రీ శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లలో సమతౌల్యం దెబ్బతినడమూ, ముఖ్యంగా "ఆండ్రోజన్స్" స్థాయి పెరగడమూ (వీటినే మేల్ హార్మోన్స్ అంటారు) అని వైద్యశాస్త్రం చెబుతోంది. ఇలా జరగడానికి కారణం సరిగా తెలియదు.

అండాశయంలో నీటిబుడగలు లేదా కణుతులు ఎలా ఏర్పడతాయి?

అండాశయాలు ప్రతి స్త్రీ శరీరంలో గర్భాశయానికిరుపక్కలా రెండు సీమ బాదంకాయ ఆకారంలో ఉంటాయి. వీటిలోద్రవంతో నిండిన చిన్న చిన్న సంచుల్లాంటి నిర్మాణాలలో అపరిపక్వమయిన అండాలుంటాయి. ఈ సంచులనే "ఫాలికిల్స్ "అంటారు.

ప్రతీ నెలా ఒక ఫాలికిల్ ఎదిగి ఒక పక్వమయిన అండాన్ని విడుదల చేస్తుంది. ఇలా విడుదలయిన అండం, వీర్య కణంతో కలిస్తే ఫలదీకరణం చెంది, పిండంగా ఎదుగుతుంది లేని పక్షంలో బహిష్ఠు స్రావంతో కలిసి బయటకు వచ్చేస్తుంది.

ఈ కార్యక్రమమంతా మన శరీరరంలో తయారయే హార్మోన్ల నియంత్రణలో ఉంటుంది. అంటే ఫాలికిల్ ఎదుగుదలకీ, అండం పక్వమవడానికీ కొన్ని హార్మోన్లు అవసరం.

మన మెదడులో వున్న "హైపోథలామస్" అనే భాగం ఈ హార్మోన్ల విడుదలకీ, వాటిని నిర్ణీత స్థాయిలో ఉంచడానికి మూలకేంద్రం.

Image copyright Getty Images

హైపోథలామస్ నుండీ వచ్చే హార్మోన్లు "పిట్యూటరీ" గ్రంథిని ప్రేరేపిస్తాయి. పిట్యూటరీ నుండి వచ్చే FSH, LHఅనే హార్మోన్లు, ఓవరీ అంటే అండా శయం మీద పనిచేసి ఫాలికల్ ఎదుగుదలకీ, అండం విడుదలకీ తోడ్పడతాయి.

ఈ సమయంలో ఓవరీ నుండీ విడుదలయిన ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ల స్థాయి వెనక్కి తిరిగి మరల FSH, LHలు ఎంత మోతాదులో విడుదలవ్వాలో నిర్ణయిస్తుంది.

ఇదంతా ఒక సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడ యే హార్మోన్ల స్థాయిలో భేదం వచ్చినా శరీరంలో మార్పులు కనపడతాయి.

పి.సి.ఒ.డి.లో ఈ హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినడం వలన, ఫాలికిల్స్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యుటినైజింగ్ హార్మోన్ల స్థాయి పెరిగి (FSH, LH), ఎక్కవ ఫాలికిల్స్ పెరిగిపోతాయి. అవన్నీ పరిపక్వ దశకు రావు.

అంతేకాక ఎన్నటికీ పక్వంకాని అండాలతో నిండి ఉంటాయి. అండాశయాల పరిమాణం కూడా పెరిగి చిన్న సైజు బంగాళాదుంపల్లాగా తయారవు తాయి. ఇలా చిన్న చిన్న నీటి సంచుల్లాగా కనపడే అపరిపక్వ ఫాలికిల్స్‌తో నిండిన అండాశయాలనే "పాలీసిస్టిక్ ఓవరీస్ "అంటారు.

ఇంకా థీకల్ టిష్యూ అనే గట్టి పీచులాంటి కణజాలం ఎక్కువగా పెరుగుతుంది. ఈ మార్పులన్నింటితో పాటు తక్కువగా ఉండే "ఆండ్రోజన్ "హార్మోన్ల స్థాయి పెరిగి, స్త్రీలలో అవాంఛిత రోమాల్లాంటి పురుష లక్షణాలకి కారణమవుతుంది.

వీటితో పాటు "ఇన్సులిన్" అనే హార్మోన్ స్థాయి పెరగడమే కాక, ఆ హార్మోన్‌కి శరీరంలో ప్రతికూలత వస్తుంది. దీనినే "ఇన్సులిన్ రెసిస్టెన్స్" అంటారు. ఈ పరిణామం వలన షుగర్ వ్యాథి వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. స్థూలకాయం రావటం వలన బీపీ కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది.

Image copyright Getty Images

కాంప్లి కేషన్స్:

 • పీరియడ్స్ సరిగా రాకపోవడం
 • గర్భధారణ జరగక పోవడం, జరిగినా నిలవకపోవడం
 • స్థూలకాయం, అవాంఛిత రోమాలు
 • డయాబిటిస్ వ్యాథి రావడం
 • హైపర్ టెన్షన్ అంటే బీపీ పెరగడం
 • కొలెస్టరాల్, HDL, LDLపెరగడం వలన హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం పెరగడం
 • మానసికమైన సమస్యలు - డిప్రెషన్ లాంటి వాటికి గురయ్యే అవకాశాలు
 • చాలాకాలంగా ఉన్న పి.సి.ఒ.డితో గర్భాశయం లోపల జరిగిన మార్పుల వలన, ఎండో మెట్రియల్ కాన్సర్ కూడా వచ్చే ప్రమాదం

వ్యాధి నిర్ధారణ:

 • వ్యాధి లక్షణాలను కనిపెట్టడం
 • రక్తపరీక్షలు
 • అల్ట్రాసౌండ్ స్కానింగ్ వ్యాథిని కనిపెట్టడానికి బాగా ఉపకరిస్తుంది
 • లాపరోస్కోపీ - వ్యాధి నిర్థారణకీ, నివారణకీ కూడా ఉపయోగ పడే అధ్భుత పరికరం

చికిత్స:

ఈ వ్యాధి లో జీవనశైలిలో మార్పులు చేసుకోవడమనేది చికిత్సలో ప్రధాన భాగం.

దీనిలో మితాహారం, వ్యాయామం అనేవి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి.

మితాహారం అంటే తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు తీసుకోవడమే కాక, తక్కువ పిండిపదార్థం ఉండే, కాలరీలు తక్కువుండే ఆహారాన్ని - లోకార్బోహైడ్రేట్, లో కాలరీ డైట్ - తీసుకోవాలి.

ఇంకా పళ్లూ, ఆకుకూరలూ ఎక్కువ తీసుకోవాలి.

వ్యాయామం చేసేటప్పుడు బరువు తగ్గించే ఎక్సర్‌సైజెస్ మీద దృష్టి పెట్టాలి.

Image copyright Getty Images

ఇక మందుల విషయానికొస్తే డాక్టర్ సలహా మీద పెళ్లికాని పిల్లలు పీరియడ్స్ సరిగా వచ్చేందుకు హార్మోనల్ పిల్స్ వాడవచ్చు.

పెళ్లయి, పిల్లలు కావాలనుకునే వాళ్లు గర్భధారణ కోసం, అండం విడుదల చేసే మందులు వాడవచ్చు.

మందులతో ప్రయోజనం లేనపుడు, లాపరోస్కోపీతో అండాశయాలని అక్కడక్కడా పంక్చర్ చేయడం వలన అద్భుతమైన ఫలితాలను పొంద వచ్చు.

ఇంకా డయాబెటిస్, బీపీ లాంటి వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి.

పి.సి.ఒ.డి.కి చికిత్స తీసుకున్న వారు గర్భం ధరించినట్టయితే, డాక్టర్ సలహాతో కొన్ని మందులు కానుపయ్యే వరకూ కూడా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే వీరిలో గర్భస్రావమయ్యే అవకాశాలు, నెలలు నిండకుండా కానుపయ్యే అవకాశాలూ ఎక్కువ.

అవాంఛిత రోమాలని తొలగించటం పెద్ద సమస్య. దీనికి తాత్కాలిక పరిష్కారం షేవింగ్, కొన్ని క్రీముల్లాంటివి వాడటం అయితే శాశ్వత పరిష్కారం ఎలక్ట్రాలిసిస్.

చివరగా తెలుసుకోవాలిసిందేటంటే యుక్తవయసులో ఉన్న స్త్రీలలో హఠాత్తుగా బరువు పెరగడం, పీరియడ్స్ సరిగా రాకపోవడం, అవాంఛిత రోమాలు పెరగడం, సంతాన లేమి లాంటి సమస్యలు వచ్చినపుడు వాటికి "పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్" కారణమేమో డాక్టర్ దగ్గరకు వెళ్లి నిర్థారణ చేసుకుని, తమ జీవన శైలిలోనూ, ఆహారంలోనూ మార్పులు చేసుకుని సరైన సమయంలో సరైన మందులు వాడటం ద్వారా ఆ వ్యాథి వలన వచ్చే ప్రమాదాలను నివారించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు