అన్నం బదులు దీన్ని అధికంగా తిన్నవారు వందేళ్లు బతుకుతున్నారు’

  • 20 జనవరి 2019
చిలగడదుంప Image copyright Alamy

మనిషికి 'నిత్య యవ్వనాన్నిచ్చే అమృతం' కోసం అన్వేషణ శతాబ్దాలుగా సాగుతోంది. భూగోళమంతా సాగిన ఆ అన్వేషణ ఇప్పుడు ఒకినావా దీవుల దగ్గర కేంద్రీకృతమైంది. ఇక్కడి వారి ఆయుర్దాయం ప్రపంచంలోనే అత్యధికం. అంతేకాదు.. వందేళ్లు వచ్చినా సంపూర్ణ ఆరోగ్యవంతులుగానే ఉంటారు.

జపాన్‌లో అంతర్భాగమైన ఒకినావా దీవులు తూర్పు చైనా సముద్రంలో విస్తరించి ఉంటాయి. ఇక్కడి జనాభాలో ప్రతి లక్ష మందిలో నూరేళ్లు పూర్తి చేసుకున్న వాళ్లు 68 మంది ఉంటారు. ఇది అమెరికాలో ఈ జనాభా నిష్పత్తితో పోలిస్తే మూడు రెట్ల కన్నా ఎక్కువ. నిజానికి జపాన్ ప్రమాణాల ప్రకారం చూసినా.. ఇతర జపనీయుల కన్నా ఒకినావా జనం వందేళ్లు జీవించే అవకాశం 40 శాతం అధికంగా ఉంటుంది.

ఒకినావా వాసుల ఆయుర్దాయం రహస్యాన్ని కనిపెట్టటానికి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు. వారి జన్యువుల మీదా వారి జీవినశైలి మీదా పరిశోధనలు చేస్తున్నారు. ఆ క్రమంలో ఇటీవల ఒక అంశం శాస్త్రవేత్తల దృష్టిని విశేషంగా ఆకర్షించింది.

అది.. ఒకినావాల ఆహారంలో ప్రొటీన్ల (మాంసకృత్తులు) కన్నా కార్బొహైడ్రేడ్లు (పిండి పదార్థాలు) చాలా అధికంగా ఉండటం. మరీ ముఖ్యంగా స్వీట్ పొటాటో - అంటే చిలగడదుంప - విపరీతంగా తింటారు. ఈ ప్రజలకు అందే కేలరీల్లో అధికభాగం ఈ తీయని దుంప నుంచే లభిస్తుంటాయి.

Image copyright Getty Images

''ప్రొటీన్లు ఎక్కువగానూ కార్బొహైడ్రేడ్లు తక్కువగానూ తీసుకోవాలని చెప్పే ఈనాటి ఆహార నియమాలకు పూర్తిగా విరుద్ధమైన ఆహార శైలి వీరిది'' అని చెప్పారు ప్రొఫెసర్ సమంతా సోలోన్-బీట్. ఆమె యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీలో పోషకాహారం - వృద్ధాప్యం మీద పరిశోధన చేస్తున్నారు.

నిజానికి పిండి పదార్థాలు తక్కువగా, మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారాలకు చాలా ప్రజాదరణ కూడా ఉంది. కానీ మాంసకృత్తులు అధికంగా తీసుకోవటం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయనేదానికి సరైన ఆధారాలేవీ లేవు.

అలాగైతే.. ప్రొటీన్లు - కార్బోహైడ్రేడ్ల నిష్పత్తి 1:10 గా ఉండే ఒకినావా ఆహారంలో.. సుదీర్ఘ ఆయురారోగ్యాల రహస్యం దాగుందా? ఈ పరిశీలనల ఆధారంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని ఇప్పుడే సూచించటం కష్టం.

అయితే.. మనుషుల ఆయుర్దాయం మీద అధ్యయనాలు, జంతువుల మీద ప్రయోగాల నుంచి లభిస్తున్న తాజా ఆధారాలు ఒక విషయం చెప్తోంది. ప్రొటీన్లు తక్కువగా పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం వల్ల.. క్యాన్సర్, గుండె జబ్బులు, అల్జీమర్స్ వ్యాధి వంటి వివిధ వయసు సంబంధిత అనారోగ్యాల నుంచి రక్షణ కల్పించే మానసిక ప్రతిస్పందనలను కలిగిస్తాయి.

ఒకినావాల ఆహారం ఈ తరహాలో ప్రభావం చూపుతుండవచ్చు.

ఒకినావా వృద్ధ జనాభా ఆరోగ్యం మీద 1975 నుంచీ ఒకినావా సెంచూరియన్ స్టడీ (ఓసీఎస్) పరిశోధన చేస్తోంది. మొత్తం 150 పైగా ఉన్న ఒకినావా దీవులన్నిటిలో నివసిస్తున్న వారిని ఓసీఎస్ పరిశీలిస్తోంది. 2016 నాటికి ఈ ప్రాంతంలో వందేళ్లు వయసు పైబడిన 1,000 మందిని పరిశీలించింది.

ఒకినావా ప్రజలు వందేళ్లు మీద పడుతున్నా వృద్ధాప్యంతో వచ్చే చాలా ప్రభావాలకు దూరంగానే ఉన్నారు. వీరిలో మూడింట రెండు వంతుల మంది 97 ఏళ్ల వరకూ కూడా ఎవరి సాయం లేకుండా స్వతంత్రంగానే జీవిస్తున్నారు. ముఖ్యంగా గుండెజబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్, దిమెన్షియా వంటి వ్యాధుల రేటు వీరిలో అతి తక్కువగా ఉంది.

మరోవైపు జన్యుపరమైన అదృష్టం కూడా వీరి అధిక ఆయుర్దాయానికి కారణమై ఉండొచ్చు. పైగా వీరు దీవుల్లో ఉండటం వల్ల వీరిలో కొన్ని ప్రత్యేక జన్యువులు ఉండి ఉండొచ్చు.

వీరిలో గుండె సంబంధిత సమస్యలకు, అల్జీమర్స్ వంటి రోగాలకు సంబంధించిన APOE4 అనే జన్యువు తక్కువ మందిలో ఉంది. అలాగే క్యాన్సర్, వయో సంబంధిత రుగ్మతలకు కారణమైన, జీవ క్రియను క్రమబద్ధీకరించే FOXO3

అనే జీన్ కూడా ఇక్కడి వారిలో ఉండొచ్చని పలు అధ్యయనాల్లో తేలింది.

Image copyright Getty Images

అలాగే ఒకినావా ప్రజలకు పొగ తాగే అలవాటు కూడా తక్కువే. పైగా వీరు నిత్యం వ్యవసాయం, చేపల వేట చేస్తుంటారు. దీంతో వీరు చాలా చురుగ్గా ఉండటంతో పాటు శరీరాలు దృఢంగానూ ఉంటాయి.

ఆసియాలో అధికభాగం ప్రజలు అన్నం తింటారు. అయితే ఒకినావా ప్రజలు మాత్రం అన్నానికి బదులు అధికంగా చిలగడదుంపలు, తాజా కూరగాయలు, పళ్లు తింటారు. కాయగూరలతో పోల్చితే చేపలు, మాంసాన్ని తక్కువగానే తింటారు.

వీరు తీసుకునే ఆహారంలో అధిక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉండగా తక్కువ కెలొరీలు ఉంటాయి. వీరు సగటు మనిషికి అవసరమైన కెలొరీలకన్నా 11 శాతం తక్కువ కెలొరీల ఆహారాన్ని తింటారు.

తక్కువ కెలొరీల ఆహారాన్ని తినడం వల్ల శరీరం పెరగడం కూడా నెమ్మదిస్తుందని.. దీని వల్ల వృద్ధాప్యం అంత త్వరగా రాదనే వాదనకూ ఒకినావా ప్రజల ఆహారపు అలవాట్లు బలం చేకూరుస్తున్నాయి.

గతంలో కోతులపై 20 ఏళ్ల పాటు జరిపిన అధ్యయనంలో 30 శాతం కెలొరీలు తక్కువ తిన్న కోతుల్లో మరణ ముప్పు 63 శాతం తగ్గినట్లు తేలింది.

అయితే తక్కువ కెలొరీల ఆహారం ఆయుర్దాయం వృద్ధికి ఉపయోగపడుతోందో మాత్రం స్పష్టం కాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)