ఒకప్పుడు సింహాలను చంపేవారు.. ఇప్పుడు క్రీడల్లో రాణిస్తున్నారు

  • 21 జనవరి 2019
ఆఫ్రికా వ్యక్తి
చిత్రం శీర్షిక జోసెఫ్ లెకాటూ గతంలో సింహాలను వేటాడేవారు. కానీ, ఇప్పుడు వణ్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేస్తున్నారు.

"గతంలో నేను ఒక సింహాన్ని వేటాడి చంపాను. దాంతో నాకు యోధుడి (మొరాన్)గా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత, ఒకమ్మాయి నన్ను ప్రేమించింది. నా ధైర్య సాహసాలను ఊరంతా కీర్తించింది" అని జోసెఫ్ లెకాటూ అనే యువకుడు బీబీసీతో చెప్పారు.

ఆఫ్రికాలో ముఖ్యంగా కెన్యాలో ఆదివాసీ తెగల్లో మసాయ్ ఒకటి. ఈ తెగలో ఒక ప్రత్యేక ఆచారం ఉండేది. అదేమిటంటే.. ప్రతి యువకుడూ తప్పకుండా ఒక సింహాన్ని వేటాడాలి. అప్పుడే అతను 'మొరాన్‌' అంటే యోధుడిగా గుర్తింపు పొందుతాడు.

ఇది కేవలం సింహాన్ని చంపడం మాత్రమే కాదు, తమ పోరాట నైపుణ్యాలను భావితరాలకు అందించేందుకు అలా చేసేవారు.

అయితే ఇప్పుడు సింహాలు అంతరించే పోయే దశకు చేరుకోవడంతో, పోరాట నైపుణ్యాలను క్రీడల రూపంలో భావితరాలకు అందిస్తున్నారు. అందుకోసం 'మసాయ్ ఒలింపిక్స్' పేరిట సాహక క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు.

ఇక్కడి యోధుల ధైర్య సాహసాలకు ప్రతీకే మసాయ్ ఒలింపిక్స్. 2012లో ప్రారంభమైన ఈ క్రీడలకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఒకప్పుడు సింహాలను చంపేవారు.. ఇప్పుడు క్రీడల్లో రాణిస్తున్నారు

ఈ సాహస క్రీడాకారుల నైపుణ్యాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి.

ఈ సంప్రదాయ క్రీడలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. నిలబడి నిటారుగా ఎగరడం. ఈటెలను విసరడం. రుంగు అనే సుత్తిలాంటి ఆయుధంతో లక్ష్యాలను ఛేదించడం వంటివి ఉంటాయి. ఈ క్రీడల్లో పాల్గొనడాన్ని వీళ్లు ఎంతో గర్వంగా భావిస్తారు.

అంతరించిపోతున్న వన్యప్రాణులను కాపాడాలన్న ఆలోచనతో మసాయ్ తెగకు చెందిన ఒలింపిక్ విజేత డేవిడ్ రుడిషా సాయంతో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి.

"కెన్యాలో 2000 సింహాలు ఉన్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. అయిదారేళ్ల క్రితం ఉన్న సింహాలతో పోలిస్తే నేడు వాటి సంఖ్య సగానికి తగ్గిపోయింది. వణ్యప్రాణులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది" అని ఒలింపిక్స్ విజేత డేవిడ్ రుడిషా అంటున్నారు.

తొలుత ప్రాంతీయంగా జరిగే క్రీడల్లో గెలిచిన వారు, తుది పోటీల్లో పాల్గొంటారు. అక్కడ ఆరు రకాల క్రీడల్లో పోటీ పడి, డబ్బుతోపాటు పశువులను గెలుచుకుంటారు.

"గతంలో సింహాలను వేటాడేవాడిని. ఈ క్రీడలకు ముందు కూడా ఓ సింహాన్ని చంపాను. కానీ, ఇక వణ్యప్రాణులను చంపొద్దని చెప్పడంతో వేటను ఆపివేశాను. అటవీ రేంజర్‌గా ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇచ్చింది. ఇప్పుడు అదే అడవిలో వణ్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేస్తున్నాను" అని జోసెఫ్ లెకాటూ చెప్పారు.

ఈ క్రీడలు ప్రారంభమైన 2012 నుంచి చూస్తే ఈ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడి చంపడం చాలా వరకు తగ్గిపోయిందని స్థానిక ఆటగాళ్లు చెబుతున్నారు.

"ఇప్పుడు ఆటలో గెలిచేందుకు నేను ఈటెలను విసురుతున్నాను, సింహాలను చంపడానికి కాదు. ప్రపంచ విజేత కావాలన్నది నా ఆశయం. ఇప్పటికీ మా తెగవారు కొందరు సింహాలను వేటాడుతున్నారు. వాళ్లు ఆ సంప్రదాయాన్ని విడనాడి, సింహాలు అంతరించిపోకుండా చూడాలని కోరుతున్నాను" అని లెసాన్ ఇటా అనే క్రీడాకారుడు బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు