గోల్డెన్ బ్లడ్... ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం

ప్రపంచంలో అతికొద్ది మందిలో మాత్రమే ఉండే 'బ్లడ్ గ్రూప్' బాంబే బ్లడ్ గ్రూప్ అని చాలామంది అంటారు. కానీ, అంతకంటే అరుదైన మరో రక్త గ్రూపు కూడా ఉంది. అదే 'గోల్డెన్ బ్లడ్'.
'గోల్డెన్' అనే పేరు చూస్తేనే అది ఎంత ప్రత్యేకమో అర్థమైపోతుంది. ఈ రక్తం కలిగిన వారు ఇతరులకు రక్తాన్ని ఇవ్వొచ్చు. కానీ, వారికి రక్తం అవసరమైనప్పుడు మాత్రం దాతలు దొరకరు.
సాధారణంగా ఏ, బీ, ఎబీ, ఓ రక్తం గ్రూపుల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూపు అసలు పేరు ఆర్‌హెచ్ నల్(Rh null).
ఈ రక్తం ఎందుకంత ప్రత్యేకం? దీన్ని బంగారంతో ఎందుకు పోల్చుతారు? ఈ రక్తం కలిగి ఉండటం ఎందుకు ప్రమాదకరం?
ఈ విషయాలు అర్థం చేసుకోవాలంటే, ముందుగా రక్త సమూహాలను (గ్రూపు) ఎలా వర్గీకరించారో తెలుసుకోవాలి.
రక్త కణాలకు యాంటీజెన్ అనే ప్రోటీన్ పూత ఉంటుంది. 'ఏ' గ్రూపు రక్తంలో యాంటీజెన్ ఏ ఉంటుంది. 'బీ' గ్రూపు రక్తంలో యాంటీజెన్ బీ, ఏబీ గ్రూపు రక్తంలో ఏ, బీ రెండు యాంటీజెన్లు ఉంటాయి. ఓ గ్రూపులో ఏ, బీ రెండూ ఉండవు.
అలాగే, ఎర్ర రక్త కణాలు 61 Rh- రకానికి చెందిన RhD అనే మరో యాంటీజెన్‌ను కూడా కలిగి ఉంటాయి. రక్తంలో RhD ఉంటే + (పాజిటివ్), లేకుంటే - (నెగెటివ్) అంటారు.
Rh null అనే అరుదైన గ్రూపు రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో Rh యాంటీజెన్ ఉండదు.
- బాంబే బ్లడ్ గ్రూప్: ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్
- తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న గాలి: గతేడాది 71,000 మంది మృతి
వైద్య పరిశోధనల వివరాలను అందించే వెబ్సైట్ మొజాయిక్‌లో ప్రకారం, ఈ బ్లడ్ గ్రూపును తొలిసారిగా 1961లో ఆస్ట్రేలియాకు చెందిన మహిళలో గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో 43 మందిలో మాత్రమే ఈ రక్తం ఉందని వెల్లడైంది.
వంశపారంపర్యంగానే ఇలా జరుగుతుందని, దీనికి వారి తల్లిదండ్రులిద్దరూ కారణమవుతారని కొలంబియా జాతీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పరిశోధకులు నటాలియా విల్లార్రోయా వివరించారు.
ఈ రక్తం ప్రపంచంలో అత్యంత విలువైనది, అలాగే ప్రమాదం కూడా. ఎందుకంటే, ఈ రక్తం కలిగిన వారికి రక్తం అవసరమైనప్పుడు దాతలు దొరకడం అత్యంత కష్టమైన పని.
ఏ దేశంలో ఎక్కడ ఈ రక్తం కలిగిన వారు ఉన్నారో వెతికిపట్టుకోవడం కష్టం. ఒకవేళ దాత దొరికినా అరుదైన తమ రక్తాన్ని దానం చేసేందుకు వాళ్లు ముందుకు రాకపోవచ్చు.
మరోవైపు చూస్తే, "ఈ రక్తం కలిగిన వారిని కూడా విశ్వదాతలు అంటారు. వాళ్లు ఎవరికైనా రక్తం ఇవ్వొచ్చు. అంతేకాదు, ప్రాణాలను కాపాడటంలో ఇతర గ్రూపుల రక్తంతో పోల్చితే Rh null ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. కానీ, అది దొరకడం అంత సులువైన పనికాదు. అందుకే, దాన్ని 'గోల్డెన్ బ్లడ్' అంటారు" అని పారిస్‌లోని నేషనల్ రెఫరెన్స్ ల్యాబ్ ఇన్ ఇమ్యూనోహెమటాలజీ డైరెక్టర్ డాక్టర్. థియెర్రీ పెరార్డ్ వివరించారు.
అయితే, Rh null కలిగిన వారు కొద్దిపాటి రక్తహీనతతో బాధపడే అవకాశం ఉందని అమెరికాలోని అరుదైన రుగ్మతల సమాచార కేంద్రం పేర్కొంది.
ఈ రక్తాన్ని నిల్వ చేసే కేంద్రాలు ఎక్కడైనా ఉన్నాయో కూడా ఎవరికీ పెద్దగా తెలియలేదు. అత్యంత అరుదైన ఈ రక్తంపై పరిశోధనలు జరిపేందుకు నమూనాల కోసం కొందరు పరిశోధకులు దాతల కోసం తీవ్రంగా వెతికారు. అయినా, చాలామందికి నిరాశే ఎదురైంది.
ఇవి కూడా చదవండి:
- వీర్యం కావాలి... దాతల కోసం ఫేస్బుక్లో వెతుకుతున్న మహిళ
- #UnseenLives: బాలింతలైతే 3 నెలలు ఊరి బయటే: ఇదేం ఆచారం?
- 'తల్లి కాబోయే లక్షల మంది మహిళలకు ఇదో శుభవార్త'
- ప్రసవం: సిజేరియన్ కన్నా సహజకాన్పుతోనే శిశువుకు మేలు
- #HisChoice: వీర్యదాతగా మారిన ఓ కుర్రాడి కథ
- వీర్యకణాలు ప్రయాణించే దారిలో ఎన్ని ఆటంకాలో...!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)