అమ్మకానికి పౌరసత్వం: ఆస్ట్రేలియాలో ఇల్లు.. స్పెయిన్‌లో పాస్‌పోర్టు

  • 23 జనవరి 2019
పర్యాటకం, పాస్‌పోర్టు, పౌరసత్వం Image copyright others

జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తే, అందులో హీరో.. సీను సీనుకీ సూట్లతో పాటు పాస్‌పోర్టులు కూడా మారుస్తూ కనిపిస్తాడు. ఒక సీన్‌లో రష్యాలో ఉంటే, మరో సీన్లో ఏ మలేసియాలోనే ప్రత్యక్షమవుతాడు.

కానీ, ఇప్పుడు బాండ్‌ లాంటి గూఢచారులే కాదు, బాగా డబ్బున్న సాధారణ వ్యక్తులు కూడా వివిధ దేశాల్లో స్థిరపడి జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నారు. దాని కోసం కోట్లు ఖర్చు పెట్టి ఇతర దేశాల పౌరసత్వాలనూ కొనేస్తున్నారు.

ఏ దేశంలో పౌరసత్వం తక్కువ ధరకు లభిస్తుందో, ఏ దేశంలో అయితే ఖర్చు పెట్టిన డబ్బుకు ఎక్కువ లాభం దక్కుతుందో చెప్పేందుకు చాలా సంస్థలు పనిచేస్తున్నాయి.

ఏటా వేలాది మంది రెండు మూడు పాస్ పోర్టులు పొందేందుకు... అంటే రెండు మూడు దేశాల పౌరసత్వాన్ని కొనుక్కునేందుకు దాదాపు 15 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు.

Image copyright others

చాలా దేశాలు దీన్నో సదవకాశంగా భావిస్తున్నాయి. డబ్బున్నవారికి రకరకాల మార్గాల్లో తమ దేశ పౌరసత్వాన్ని కల్పిస్తున్నాయి.

ఆంటిగ్వా, బార్బడా, గ్రెనడా, మాల్టా, నెదర్‌లాండ్స్, స్పెయిన్ లాంటి దేశాలు పెట్టుబడుల ద్వారా ఆసక్తి ఉన్న వారికి తమ దేశ పౌరసత్వాన్ని కల్పిస్తాయి.

కానీ పౌరసత్వాన్ని అలా అమ్మకానికి పెట్టడం సరికాదనే విమర్శలూ ఉన్నాయి.

ఇప్పటి సంగతి చూస్తే, ఓ అర డజను దేశాలు తమ పౌరసత్వాన్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి.

Image copyright others

డామినికా

ఈ కరీబియన్ దీవిలో చాలా చీప్‌గా పౌరసత్వాన్ని కొనుక్కోవచ్చు.

భారతీయ కరెన్సీలో చూస్తే, ఓ 75లక్షల రూపాయల పెట్టుబడితో పాటు ఇతర ఫీజులు చెల్లించి, అక్కడ జరిగే అధికారిక ఇంటర్వ్యూను పూర్తి చేసి డామినికా పౌరసత్వాన్ని పొందొచ్చు.

కానీ, ఆ ఇంటర్వ్యూ కమిటీ నెలలో ఒకసారి మాత్రమే సమావేశమవుతుంది. కాబట్టి, డామినికన్ పాస్‌పోర్ట్ పొందడానికి కనీసం 5 నుంచి 14 నెలలు పడుతుంది.

డామినికా కామన్‌వెల్త్ దేశం కాబట్టి, ఆ దేశ పౌరులకు యూకేలో ప్రత్యేక హక్కులుంటాయి. డామినికన్ పౌరులు స్విట్జర్లాండ్‌తో సహా 50దేశాల్లో పర్యటించొచ్చు.

Image copyright others

సైప్రస్

యూరోపియన్ యూనియన్ దేశాల్లో నేరుగా పెట్టుబడుల ద్వారా పౌరసత్వాన్ని కల్పించే దేశాల్లో సైప్రస్ ఒకటి.

ఓ 17 కోట్ల రూపాయలను ఆ దేశంలో పెట్టుబడి పెడితే ఆ దేశ పౌరసత్వాన్ని కొనుక్కోవచ్చు. కాకపోతే ఒక కండిషన్. ఒక బృందం కానీ, సంస్థ కానీ కనీసం 100 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టినప్పుడు, ఆ బృందంలోని ఎవరో ఒక వ్యక్తి 17 కోట్ల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

అదే సంస్థలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా పౌరసత్వం పొందాలంటే, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ రంగాల్లో కనీసం 40కోట్లు పెట్టుబడిగా పెట్టాలి.

గత కొంతకాలంగా సైప్రస్‌లో పౌరసత్వం ధర తగ్గుతూ వస్తోంది.

Image copyright others

మాల్టా

యూరప్‌లో పౌరసత్వాన్ని అమ్మే దేశాల్లో మాల్టా ఒకటి. ఈ చిన్న దేశం కేవలం ఐదున్నర కోట్లకు తమ పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టి విమర్శలకు గురైంది. యూరోపియన్ యూనియన్ అధికారులు ఒత్తిడి చేయడంతో, కనీసం ఏడాది పాటు మాల్టాలో నివసించిన వారికే తమ దేశ పాస్‌పోర్టును కల్పిస్తామని షరతు పెట్టింది.

ఆంటిగ్వా, బార్బుడా కూడా ఈ "సిటిజన్‌షిప్‌ బై ఇన్వెస్ట్" ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టాయి. అక్కడి నిబంధనల ప్రకారం రియల్ ఎస్టేట్‌ రంగంలో రూ.3కోట్ల పెట్టుబడులు లేదా ఏదైనా దాతృత్వ సంస్థకు కోటిన్నర డొనేషన్ ఇవ్వడం ద్వారా అక్కడి పౌరసత్వాన్ని పొందొచ్చు.

Image copyright others

సెయింట్ కిట్స్, నెవిస్

కరీబియన్ దీవులైన సెయింట్ కిట్స్, నెవిస్‌లో సుదీర్ఘ కాలంగా అంటే 1984 నుంచి ఈ పౌరసత్వాన్ని అమ్మే ప్రోగ్రామ్ అమల్లో ఉంది. ఇక్కడ పౌరసత్వం పొందాలంటే రెండు మార్గాలున్నాయి.

ఒకటి... సెయింట్ కిట్స్ పబ్లిక్ చారిటీకి దాదాపు రూ.2కోట్లు డొనేషన్ ఇవ్వడం ద్వారా పౌరసత్వాన్ని పొందొచ్చు. రెండోది... అక్కడి రియల్ ఎస్టేట్‌ రంగంలో రూ.3కోట్ల పెట్టుబడి పెట్టి పౌరసత్వాన్ని పొందొచ్చు.

కొన్ని దేశాలు నేరుగా పౌరసత్వాన్ని కొనుక్కునే అవకాశం కల్పించవు. కాకపోతే సంపన్నులకు అక్కడ స్థిరపడటానికి పర్మిట్లు కల్పిస్తాయి. ఆ నివాస పర్మిట్లే క్రమంగా పౌరసత్వాన్ని పొందేందుకు ఉపయోగపడతాయి.

అలా నివాస పర్మిట్లను కల్పించే దేశాల్లో ఆస్ట్రేలియా, బెల్జియం, పోర్చుగల్, యూకే, యూఎస్, సింగపూర్, స్పెయిన్ కూడా ఉన్నాయి. ఆ పర్మిట్లను గోల్డెన్ విసాస్ అని కూడా పిలుస్తారు.

ఆర్థికంగా వెనకబడుతుండటంతో పాటు సంప్రదాయ మార్గాల్లో పెట్టుబడులు తగ్గిపోతుండటంతో కొన్ని దేశాలు ఇలా పౌరసత్వాన్ని ఎరవేసి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు