భారత్ వర్సెస్ కివీస్: ఆటను నిలిపివేసిన అనూహ్య కారణాలు ఇవీ

  • 23 జనవరి 2019
shikar Image copyright Getty Images

సూర్యుడి వెలుగు నేరుగా బ్యాట్స్‌మెన్ కళ్లలో పడటం వల్ల క్రికెట్ మ్యాచ్ నిలిపివేయడం, ఆలస్యం కావడం చాలా అరుదు. అలాంటి ఘటన బుధవారం భారత్, న్యూజీలాండ్ వన్డే మ్యాచ్‌లో జరిగింది.

వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిన సందర్భాలు చాలానే ఉన్నా పిచ్‌లోకి కారు రావడం, బార్బిక్యూలో బాల్ పడిపోవడం లాంటి కారణాల వల్ల మ్యాచ్‌లు ఆలస్యమవడం చాలా అరుదు. ఇలాంటి అనూహ్య కారణాలతో ఆలస్యమైన కొన్ని మ్యాచ్‌ల వివరాలు ఇవీ...

Image copyright Getty Images

బాల్స్ దాచిన కప్‌బోర్డు తాళాలు మరిచిపోయి..

1981-82లో దిల్లీలో భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నపుడు బాల్స్ దాచిన కప్‌బోర్డు తాళాలు మరిచిపోవడంతో మ్యాచ్ ఆలస్యమైంది.

టెస్ట్ మ్యాచ్‌లో 90 ఓవర్ల తర్వాత బంతిని మారుస్తారు. అయితే ఈ మ్యాచ్‌లో అలా మార్చాల్సి వచ్చినపుడు బాల్స్ పెట్టిన కప్‌బోర్డు తాళాలు ఎక్కడ పెట్టారో మరిచిపోయారు.

Image copyright Getty Images

బాల్ వంటలో పడిపోయి..

1995లో కర్రీ కప్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. టెస్ట్ బ్యాట్స్‌మన్ డారిల్ కలినాన్ ఓ బంతిని సిక్స్ కొట్టగా.. అది స్టేడియంలోని బార్బిక్యూలో పడింది. అక్కడ ఫ్రైయింగ్ స్క్విడ్‌లో (ఇదో వంటకం) బంతి పడిపోయింది.

దాన్ని తీసుకొచ్చి 10 నిమిషాలు ఆరబెట్టి మళ్లీ వినియోగించారు. ఆ బంతి జారిపోతోందని బౌలర్లు ఫిర్యాదు చేయడంతో తర్వాత మార్చారు.

Image copyright Getty Images

సూర్యగ్రహణం వల్ల

1980 ఫిబ్రవరిలో భారత్, ఇంగ్లండ్ మధ్య ప్రత్యేక టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అయితే మధ్యలో ఒకరోజు సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. దీంతో మ్యాచ్‌ని మర్నాటికి వాయిదా వేశారు.

ఫుడ్ డెలివరీ ఆలస్యమై..

ఇటీవల బంగ్లాదేశ్, దక్షిణాప్రికా మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఆలస్యమైంది. ఆటగాళ్లకు హలాల్ ఫుడ్ రావాల్సి ఉంది. అయితే క్యాటరర్‌కి పొరపాటున వేరే మెనూ ఇవ్వడంతో.. మరో ఆహారం వచ్చింది. దీంతో హలాల్ ఫుడ్ రావడానికి గంటన్నర అలస్యమైంది.

పిచ్‌లోకి కారొచ్చింది..

దిల్లీలో ఇటీవల దిల్లీ, యూపీల మధ్య రంజీ మ్యాచ్ జరుగుతుండగా ఒకతను పిచ్‌లోకి కారు తీసుకొచ్చాడు. ఎవరూ అడ్డుకోలేదు కూడా. దీంతో మళ్లీ పిచ్‌ని పరిశీలించి.. కాసేపటి తర్వాత మ్యాచ్‌ను కొనసాగించారు.

కారు తీసుకొచ్చిన అతను సెక్యూరిటీ సరిగ్గా లేదని చెప్పడానికే తానిలా చేశానని పేర్కొన్నాడు.

Image copyright Getty Images

కళ్లలో సూర్యుడి వెలుగు పడుతోందని..

తాజాగా న్యూజీలాండ్‌లో భారత్, న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ కళ్లలోకి సూర్యుడి వెలుగు నేరుగా వచ్చిపడుతోందని మ్యాచ్‌ను కాసేపు ఆపారు.

బ్యాటింగ్ చేస్తుండగా సూర్యుని వెలుగు నేరుగా తన కళ్లలో పడుతోందని శిఖర్ ధవన్ ఫిర్యాదు చేశారు. దీంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు.

ఇక తేనెటీగల దాడి, గ్రౌండ్‌లోకి పాములు రావడం వల్ల కూడా ఆలస్యమైన మ్యాచ్‌లున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం