చైనా జీడీపీ 6.6%: గత 28ఏళ్లలో ఇలా పడిపోవడం ఇదే తొలిసారి

  • 23 జనవరి 2019
చైనాలోని షాపు Image copyright Getty Images

స్థూల జాతీయోత్పత్తి రేటు (జీడీపీ) 2018లో పడిపోయినట్లు చైనా ప్రకటించింది. గత 28ఏళ్లలో అత్యంత తక్కువ జీడీపీ 6.6%గా నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో.. చైనా ఆర్థికాభివృద్ధి మసకబారుతోందా అన్న అనుమానాలు అంతర్జాతీయ మీడియా, వ్యాపార వర్గాల్లో తలెత్తాయి. చైనా జీడీపీ తగ్గుదల అంశం ప్రపంచాన్నే ఆలోచనలో పడేసింది.

అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపిన బ్రెగ్జిట్ అంశమే చైనా జీడీపీపై ప్రభావం చూపి ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తెలిపింది.

ఆర్థికరంగంలో ఒడిదొడుకులు ఏర్పడినపుడు ఎలా వ్యవహరించాలో ఇంతవరకూ లెక్చర్లు ఇచ్చిన చైనా, తాజా పరిణామంతో.. ఇది ముందుగా ఊహించినదే! అంటూ స్వరం మార్చింది.

కానీ చైనా మీడియా మాత్రం, జీడీపీ తగ్గుదల అంశం కాకుండా, జీడీపీలోని కొన్ని అంశాల గురించి మాత్రమే చర్చిస్తూ, వృద్ధిరేటుపై ఆశావహ దృక్పథం కల్పించే దిశగా ప్రయత్నిస్తోంది.

చైనా జాతీయ మీడియా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉంది. 2018 చివరి త్రైమాసికంలో చైనా జీడీపీ 6.4శాతం ఉంది. కానీ 2009లో ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంక్షోభ సమయం నుంచి, ప్రస్తుతం అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ సమయం వరకూ ఇంత తక్కువ జీడీపీ ఎప్పుడూ నమోదవ్వలేదనే వాస్తవాన్ని జాతీయ మీడియా చెప్పడం లేదు.

అమెరికాతో వాణిజ్య యుద్ధం మొదలవడానికి ముందే చైనా జీడీపీ పడిపోయింది అని సమర్థించుకోవడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలకు మరిన్ని కొత్త అంశాలు తోడయ్యాయి.

Image copyright Getty Images

పురోగతి ఉత్పత్తిలో కాదు.. నాణ్యతలో!

జీడీపీ రేటు తగ్గుదల నేపథ్యంలో, అంతర్జాతీయ మీడియా ఏవిధంగా ప్రవర్తిస్తుందో చైనా మీడియాకు బాగా తెలుసు. అందుకే తమ అస్త్రాలను ముందుగానే సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే, ఆర్థికాభివృద్ధి మీద కాకుండా తమ ఉత్పత్తుల నాణ్యతపై చైనా తన దృష్టి సారించిందని ఆ దేశపు మీడియా చెబుతోంది.

''చైనా జీడీపీలో తగ్గుదల కనిపించిన వెంటనే, 'గత 28ఏళ్లలో ఇదే అత్యంత తక్కువ జీడీపీ రేటు' అంటూ విదేశీ మీడియా కామెంట్ చేసింది. అది వాస్తవమే కావొచ్చు కానీ, వృద్ధి రేటు పడిపోవడం మీద మాత్రమే దృష్టి సారిస్తే, అసలు విషయం తప్పుదోవ పట్టే అవకాశం ఉంది'' అని చైనా జాతీయవాద పత్రిక 'గ్లోబల్ టైమ్స్' ఎడిటోరియల్ కథనం తెలిపింది.

పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమలపై చర్యలు తీసుకోవడం, సాంకేతిక రంగంపై దృష్టి సారించడం వల్లనే జీడీపీ వృద్ధి రేటు తగ్గిందని గ్లోబల్ టైమ్స్ కథనం పేర్కొంది.

''గతంలో చైనా వృద్ధి రేటు ఎక్కువగా ఉండేది. కానీ అందుకు తగ్గట్లుగానే మేం పర్యావరణానికి తగిన మూల్యం కూడా చెల్లించాల్సి వచ్చింది. చైనా సృష్టించిన సంపద.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో విఫలమైంది'' అని ఎడిటోరియల్ కథనం వివరించింది.

వృద్ధి రేటు ఎక్కువగా ఉండటం అందరూ ఆకాంక్షించేదే కానీ, 6.6% అత్యల్ప వృద్ధి రేటు నమోదవ్వడం అంటే చైనా సంక్షోభంలోకి వెళుతోందని కాదు. జటిలమైన సమస్యలను పరిష్కరిస్తూ, ప్రమాదాలను నియంత్రిస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తోందని అర్థం'' అని గ్లోబల్ టైమ్స్ తెలిపింది.

Image copyright Getty Images

‘ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది’

6.6% అంకె అన్నది చైనా ప్రభుత్వం అంచనాలో ఉన్నదేనని చైనా మీడియా చెబుతోంది. చైనాలోని ప్రధాన ఇంగ్లిష్ వార్తా పత్రిక జనవరి 21నాడు తన పత్రికలో 'చైనా జీడీపీ వృద్ధి రేటు 6.6%కు చేరుకుంది' అన్న హెడ్‌లైన్‌తో వార్తను ప్రచురించింది. అందులో చైనా జాతీయ గణాంకాల శాఖ వెలువరించిన లెక్కలను ప్రస్తావించింది.

''2018 సంవత్సరానికి నిర్దేశించుకున్న 6.5% జీడీపీ వృద్ధిరేటును చైనా చేరుకుంది'' అని జాతీయ గణాంకాల శాఖ తెలిపింది.

కానీ చైనా నేతలు మాత్రం ఈ వృద్ధి రేటుతో అంత సంతృప్తిగా ఉన్నట్లు లేరు. జీడీపీ శాతాన్ని ప్రకటించిన జనవరి 21న చైనా ప్రధాని మాట్లాడుతూ, ఒత్తిడిని తట్టుకోవడం కోసం దేశ వాణిజ్య రంగానికి ఊతమివ్వాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

Image copyright Getty Images

‘సరికొత్త వార్త’

కమ్యూనిస్టు పార్టీకి చెందిన 'పీపుల్స్ డైలీ' మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. చైనా జీడీపీ మొట్టమొదటిసారిగా 13.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందంటూ.. జాతీయ గణాంకాల శాఖ సమాచారం ఆధారంగా మరో వార్తను ప్రచురించింది.

6.6% జీడీపీతో ప్రపంచ ఆర్థికరంగానికి అందించే తోట్పాటులో 30%తో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుందని పీపుల్స్ డైలీ పేర్కొంది.

అంతర్జాతీయ మీడియా నిర్లక్ష్యం చేసిన ఓ అంశాన్ని పీపుల్స్ డైలీ ప్రముఖంగా ప్రస్తావించింది. ప్రతిష్టాత్మకమైన 'బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్' సమీప దేశాలతో ఎగుమతులు, దిగుమతులు ఏటా 13% పెరుగుతున్నాయని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)