పదేళ్లుగా కోమాలో ఉన్న మహిళ ప్రసవం... మగ నర్సుని అరెస్ట్ చేసిన పోలీసులు

  • 24 జనవరి 2019
కోమాలో ఉన్న మహిళ.. ప్రతీకాత్మక చిత్రం Image copyright iStock
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

దాదాపు పదేళ్లుగా కోమాలో ఉన్న ఒక మహిళ డిసెంబర్ 29న మగ బిడ్డకు జన్మనిచ్చారు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఫొనిక్స్ పట్టణానికి సమీపంలోని ఒక ప్రైవేటు నర్సింగ్ హోంలో ఈ ఘటన జరిగింది.

ఇన్నాళ్లూ అచేతన స్థితిలో బెడ్‌మీద పడి ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడిందెవరో గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేశారు.

ఇక్కడ పనిచేసే సిబ్బందిలోనే ఎవరైనా ఆ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉంటారన్న అనుమానంతో ఈ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న మగ సిబ్బంది డీఎన్‌ఏ నమూనాలు సేకరించి పరీక్షించారు.

ఇందులో నతన్‌ సుతర్‌లాండ్‌ అనే మగ నర్సు ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది.

అతని డీఎన్‌ఏ, శిశువు డీఎన్‌ఏతో మ్యాచ్ అయింది. అతను 2011 నుంచి ఆ ఆస్పత్రిలోనే పనిచేస్తున్నాడు.

ఐదు లక్షల డాలర్ల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.

మగ నర్సు అరెస్టు అయిన విషయం తమకు తెలుసని, కానీ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని బాధితురాలి కుటుంబ సభ్యులు చెప్పారు.

Image copyright MARICOPA COUNTY SHERIFF'S OFFICE

అసలేం జరిగింది?

29 ఏళ్ల ఆ మహిళ దాదాపు దశాబ్ద కాలంగా వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు.

ఆమె డిసెంబర్ 29న ప్రసవించినట్లు స్థానిక కేపీహెచ్‌వో-టీవీ తెలిపింది.

ఇన్నేళ్లుగా ఎలాంటి చలనం లేకుండా కోమాలో ఉన్న ఆమెలో ఆరోజు ఒక్కసారిగా కదలికలు కనిపించాయని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. పురుటి నొప్పులతో మూలుగుతుండగా గమనించి నర్సులు ఆమెకు ప్రసవం చేసినట్లు ఓ వ్యక్తి చెప్పారు.

"అప్పటి దాకా కోమాలో ఉన్న ఆమె ఒక్కసారిగా మూలగడం మొదలుపెట్టారు. ఆమెకు ఏం జరుగుతోందో సిబ్బందికి అర్థం కాలేదు. బిడ్డకు జన్మనిచ్చేదాకా ఆమె గర్భం దాల్చారన్న విషయం సిబ్బందిలో ఎవరికీ తెలియదు" అని ఆ వ్యక్తి వివరించారు.

ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Image copyright GOOGLE STREET VIEW

2013లో ఫిర్యాదులు

అరిజోనా రాష్ట్రంలో నేర రికార్డుల ప్రకారం, 2013లోనూ ఈ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే సిబ్బంది మీద ఫిర్యాదులు వచ్చాయి. నలుగురు రోగుల పట్ల ఓ ఉద్యోగి అసభ్యకరంగా మాట్లాడారని తేలింది. దాంతో అప్పుడు సదరు ఉద్యోగిని యాజమాన్యం విధుల నుంచి తొలగించింది.

నిబంధనలు కఠినతరం

తాజా ఘటనతో ఆరోగ్య కేంద్ర యాజమాన్యం నిబంధనలు కఠినతరం చేసింది. మహిళా రోగులు ఉన్న గదుల్లోకి మగ వైద్యులు తప్పనిసరిగా మహిళా సిబ్బందిని వెంటపెట్టుకుని వెళ్లాలని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)