వెనెజ్వేలా సంక్షోభం: 'నికోలస్ మడూరో కాదు... నేనే అధ్యక్షుడి'నన్న కువాన్ గ్వాయిడోకు ట్రంప్ మద్దతు.. అమెరికా పెత్తనం ఏంటన్న రష్యా

  • 25 జనవరి 2019
మడూరో, గ్వాయిడో Image copyright Getty Images
చిత్రం శీర్షిక నికోలస్ మడూరో, కువాన్ గ్వాయిడో

దక్షిణ అమెరికాలోని వెనెజ్వేలా దేశంలో రాజకీయ సంక్షోభం నానాటికీ తీవ్రమవుతోంది. ప్రతిపక్ష నేత అని కువాన్ గ్వాయిడో వెనెజ్వేలాకు తానే తాత్కాలిక అధ్యక్షుడినని బుధవారం ప్రకటించుకున్నారు. ఆయనను దేశాధ్యక్షునిగా గుర్తిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.

ట్రంప్ వ్యాఖ్యలపై వెనిజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మడూరో తీవ్రంగా స్పందించారు. వెనెజ్వేలాను అమెరికా దూరం నుంచే పాలించాలని చూస్తోందని, ప్రభుత్వాన్ని పడదోసేందుకు ప్రతిపక్షం కుట్ర పన్నిందని మడూరో ఆరోపించారు.

రష్యా కూడా ట్రంప్ ప్రకటనపై స్పందిస్తూ, వెనెజ్వేలా ప్రతిపక్షాన్ని సమర్థిస్తున్న విదేశీ శక్తుల ప్రయత్నాలను ఖండిస్తున్నామని ప్రకటించింది. ఇది అధికారాన్ని అక్రమంగా లాక్కోవడం కిందకే వస్తుందని రష్యా అధిక్షేపించింది.

ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకే వస్తుందని, "నేరుగా రక్తపాతానికి దారి తీసే చర్య" అని తీవ్రంగా విమర్శించింది.

తానే అధ్యక్షుడినని ప్రకటించుకున్న కువాన్ గ్వాయిడోను గుర్తిస్తున్నట్లు అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు కూడా ప్రకటించాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హ్యూగో చావెజ్ వారసుడిగా 2013లో అధికారం చేపట్టిన మడూరో

హ్యూగో చావెజ్ మరణానంతరం 2013లో అధికారం చేపట్టిన నికోలస్ మడూరో గత ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల తరువాత ఈ నెలలో రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ఎన్నికలను ప్రతిపక్షం బహిష్కరించింది. అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందనే ఆరోపణలు కూడా సర్వత్రా వినిపించాయి.

అధ్యక్షుడు లేనప్పుడు తాను తాత్కాలికంగా అధికారం చేపట్టవచ్చని రాజ్యాంగంలోని 233, 333 అధికరణలు సూచిస్తున్నాయని జాతీయ అసెంబ్లీ అధినేత అయిన గ్వాయిడో తన చర్యను సమర్థించుకుంటున్నారు. అసలు ఎన్నికలే చెల్లవు కాబట్టి మడూరో అధ్యక్షుడే కాదని ఆయన వాదిస్తున్నారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక కువాన్ గ్వాయిడో తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకోవడాన్ని సమర్థిస్తున్న జన సమూహం

దౌత్య వివాదం ఎలా రాజుకుంది?

గ్వాయిడో ప్రకటనకు స్పందిస్తూ, ఆయన వెనెజ్వేలా దేశ కొత్త అధ్యక్షుడిగా గుర్తిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతేకాకుండా, మిగతా దేశాలు కూడా ఈ విషయంలో తమను అనుసరించాలని ఆయన కోరారు. కానీ, ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

దక్షిణ అమెరికాలోని ఏడు దేశాలు - బ్రెజిల్, కొలంబియా, చిలీ, పెరూ, ఈక్వడార్, అర్జెంటీనా, పరాగ్వేలతో పాటు కెనడా కూడా అమెరికా పిలుపును సమర్థించాయి.

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్ మాత్రం గ్వాయిడోను గుర్తిస్తున్నట్లు ప్రకటించకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలని పిలుపునిచ్చారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionకప్పు కాఫీ తాగాలంటే నాలుగు కట్టల డబ్బు కావాలి

బ్రిటన్ కూడా, "గత మే నెలలో వెనెజ్వేలాలో జరిగిన ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగలేదని, ఆ ఎన్నికలు జరిగిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని వ్యాఖ్యానించింది.

మెక్సికో, బొలీవియా, క్యూబా దేశాలు మాత్రం మడూరోకు మద్దతు ఇచ్చాయి. టర్కీ అధ్యక్షుడు రిసెప్ తాయిప్ ఎర్డోగాన్ కూడా, "నా సోదరుడా మడూరో, బలంగా నిలబడు. మేం మీ వెంటే ఉన్నాం" అని ట్వీట్ చేశారు.

వెనెజ్వేలాలో ప్రధాన పెట్టుబడిదారు అయిన చైనా, బయటి శక్తుల జోక్యాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని ప్రకటించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఎన్నికల్లో అక్రమాలతో మడూరో అధికారంలోకి వచ్చారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది

రష్యాకు ఎందుకు కోపం వచ్చింది?

ఈ ప్రాంతంలో తమకు వెనెజ్వేలా అత్యంత సన్నిహిత మిత్ర దేశమని రష్యా భావిస్తోంది. రష్యా ఆ దేశానికి కోట్లాది డాలర్లు రుణంగా ఇచ్చింది. అక్కడి పరిశ్రమలకు, సైన్యానికి మద్దతు ఇస్తోంది. అంతేకాదు, వెనిజ్వెలాలోని సైనిక కార్యకలాపాలలో ఆ దేశం స్వయంగా పాల్గొంది కూడా.

"వెనెజ్వేలా సార్వభౌమ అధికారాన్ని బలవంతంగా లాక్కునే ఎలాంటి ప్రయత్నాలనైనా అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగానే భావిస్తాం" అని రష్యా అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ అన్నారు. మడూరోయే ఆ దేశ చట్టబద్ధమైన అధ్యక్షుడు అని కూడా డిమిత్రీ అన్నారు.

గ్వాయిడో తానే అధ్యక్షుడినని ప్రకటించుకోవడంపై రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, "అలాంటి ప్రకటన చట్టవ్యతిరేక కార్యకలాపాలకు, రక్తపాతానికే దారితీస్తుంది. తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు వెనెజ్వేలా ప్రజలకు మాత్రమే ఉంది" అని ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు, ఆ దేశ వ్యవహారాల్లో అమెరికా సైన్యం కనుక జోక్యం చేసుకుంటే, అది దుస్సాహసమే అవుతుందని, దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా రష్యా హెచ్చరించింది.

Image copyright AFP
చిత్రం శీర్షిక అధ్యక్ష భవనం వద్ద మద్దతుదారులతో మడూరో

అధ్యక్షుడు మడూరో ఏమన్నారు?

వెనెజ్వేలాను పరోక్షంగా పరిపాలించాని అమెరికా భావిస్తోందని మడూరో ఆరోపించారు.

"విదేశీ శక్తుల జోక్యాన్ని ఇంతకాలం భరించింది చాలు. మాకూ ఆత్మాభిమానం ఉంది" అని ఆయన అధ్యక్ష భవనం నుంచి టీవీలో మాట్లాడారు. మిరాఫ్లోర్స్‌లోని అధ్యక్ష భవనం వద్ద బుధవారం నాడు ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో గుమిగూడారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక తనను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న గ్వాయిడో

తానే అధ్యక్షుడినని గ్వాయిడో ఎలా ప్రకటించుకున్నారు?

బుధవారం నాడు జరిగిన ర్యాలీలో వేలాది మంది వెనెజ్వేలా ప్రజలు గ్వాయిడోకు మద్దతుగా నిలిచారు.

గ్వాయిడో తన కూడి చేతిని పైకెత్తి, "యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా జాతీయ అధికారాలను చేపడుతున్నానని నేను లాంఛనంగా ప్రమాణం చేస్తున్నాను" అని అన్నారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపిస్తూ, ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహిస్తానని ఆయన అన్నారు.

కాగా, మంగళ-బుధవారాల్లో జరిగిన నిరసన ప్రదర్శనల్లో 14 మంది కాల్పులకు బలయ్యారని వెనెజ్వేలాలోని ఎన్జీవోలు తెలిపాయి.

Image copyright Reuters
చిత్రం శీర్షిక మడూరో ప్రభుత్వమే ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి కారణమని చాలా మంది వెనిజ్వెలా ప్రజలు భావిస్తున్నారు

గత కొంత కాలంగా వెనెజ్వేలా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అలవి కాని ద్రవ్యోల్బణం, విద్యుత్ కోతలు, నిత్యావసరాల కొరత మూలంగా లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి వలసపోయారు.

ఈ దేశంలో 3.24 కోట్ల జనాభా ఉంటే, 2014 తరువాత దాదాపు 30 లక్షల మంది ప్రజలు స్వదేశంలో బతక లేక వెళ్ళిపోయారు. ప్రభుత్వ ఆదాయంలో 95 శాతానికి పైగా చమురు ఎగుమతుల ద్వారానే సమకూరుతోంది. గత 12 నెలల్లో ఈ దేశంలో వార్షిక ద్రవ్యోల్బణం 13,00,000 శాతానికి చేరుకుంది. ధరలు సగటున ప్రతి 19 రోజులకు ఒకసారి రెట్టింపు అవుతున్నాయి. ఫలితంగా, వెనెజ్వేలా ప్రజలు నిత్యావసరాల కోసం అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: వీళ్ల కష్టాలు చూస్తే అయ్యో అనకుండా ఉండలేరు

ఇవి కూడా చదవండి:

కంగనా రనౌత్: 'నా మణికర్ణిక చిత్రాన్ని కర్ణిసేన వ్యతిరేకిస్తే వారి అంతు చూస్తా'

డేటింగ్ చేయడానికి కూడా లీవులు ఇస్తారా...

ఇచట పౌరసత్వం, పాస్‌పోర్టులు అమ్మబడును

చంద్రుని మీద మొలకెత్తిన చైనా పత్తి విత్తనం

మద్రాసీ మూలాలున్న ఈమె అమెరికా అధ్యక్ష పీఠమెక్కే తొలి మహిళ అవుతారా?

పదేళ్లుగా కోమాలో ఉన్న మహిళ ప్రసవం... మగ నర్సుని అరెస్ట్ చేసిన పోలీసులు

'ఫిమేల్ వయాగ్రా'ను అనుమతించిన తొలి అరబ్ దేశం ఈజిప్టు

జనాభా 80 లక్షలు... మాట్లాడే భాషలు 800

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)