చిత్రహింసల జైలుగా మారిన హైటెక్ షాపింగ్ మాల్‌... వెనెజ్వేలా ఖైదీల దారుణ అనుభవాలు

  • 25 జనవరి 2019
వెనెజ్వేలా జైలు Image copyright ARCHIVO FOTOGRAFÍA URBANA / PROYECTO HELICOIDE

వెనెజ్వేలా రాజధాని కరాకస్ మధ్యలో ఆధునికతకు ప్రతీకగా భావించే చాలా భవనాలు కనిపిస్తాయి. అవి చుట్టుపక్కల మురికివాడల మధ్య తలెత్తుకుని నిలబడినట్లుంటాయి.

వీటిలో అత్యంత ఎత్తుగా నిలిచిన ఎల్ హెలికాయెడ్ ఒకప్పుడు నగరంలో ఆర్థిక ప్రగతికి ప్రతీకగా ఉండేది.

ఇప్పుడు ఈ భవనం ఈ దేశంలోనే అత్యంత భయంకరమైన జైలుగా మారింది. ఇప్పుడు లాటిన్ అమెరికా బలానికి కేంద్రంగా ఉన్న ఈ దేశంలో ప్రస్తుత సంక్షోభానికి ఇది నిశ్శబ్ద సాక్ష్యంగా నిలిచింది.

ఆధునికతకు ప్రతీక

ఈ భవనాన్ని 1950లలో నిర్మించారు. అప్పుడు ఈ దేశం దగ్గర చమురు వల్ల లభించే ఆదాయం గణనీయంగా ఉండేది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. వెనెజ్వేలాను నియంత మార్కోస్ పెరెజ్ జిమెనెజ్ ఆధునికతకు ఒక ఉదారహణగా నిలిపారు.

వెనెజ్వేలా జైలు Image copyright Getty Images

"ఆధునికత అనే ఈ స్వప్నం కోసం నిజంగా చాలా డబ్బు కుమ్మరించారు" అని 'డౌన్‌వర్డ్ స్పైరల్: ఎల్ హెలికాయెడ్స్ డిసెంట్ ఫ్రం మాల్ టు ప్రిజన్' పుస్తక సహ రచయిత, బ్రిటన్ ఎసెక్స్ విశ్వవిద్యాలయం లాటిన్ అమెరికన్ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్. లీజా బ్లాక్‌మోర్ చెప్పారు.

1948లో ఈ దేశం సైనిక పాలన అమలైంది. అప్పుడే ఈ భవన నిర్మాణం మొదలైంది.

దీనిని దేశంలో అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా రూపొందించాలని భావించారు.

ఈ భవనంలో 300లకు పైగా షాపులకు చోటుంది. జనం తమ కార్లు పై అంతస్తు వరకూ తీసుకెళ్లగలిగేలా 4 కిలోమీటర్ల ర్యాంప్ ఉంది.

ఈ భవనం ఎంత పెద్దదంటే కరాకస్ నగరంలో ఏ మూల నుంచి చూసినా ఇది కనిపించేది.

"ఇది వాస్తుకళకు ఒక అద్భుత నమూనాగా నిలిచింది. లాటిన్ అమెరికాలో ఇలాంటి భవనం ఇంకొకటి లేదు" అని బ్లాక్‌మోర్ అన్నారు.

వెనెజ్వేలా జైలు Image copyright ARCHIVO FOTOGRAFÍA URBANA / PROYECTO HELICOIDE

భవనానికి డోమ్ ఆకారం ఇచ్చారు. ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న హోటల్, థియేటర్, ఆఫీసులు ఏర్పాటు చేశారు.

వాటితోపాటు ఈ భవనంపై హెలికాప్టర్ దిగడానికి హెలిపాడ్, వియెన్నాలో తయారు చేసిన ప్రత్యేకమైన లిఫ్టులను ఏర్పాటు చేశారు.

కానీ, 1958లో పెరేజ్ జిమెనెజ్ అధికారం మారిపోయింది. ఆయన ఆ కల అసంపూర్తిగా మిగిలిపోయింది.

భయం రాజ్యమేలింది...

కొన్నేళ్ళు ఈ భవనం ఖాళీగానే పడి ఉంది. దీనికి ప్రాణం పోయడానికి చిన్నా పెద్ద ప్రణాళికలు కూడా తీసుకొచ్చారు. కానీ, అవి వారి ఉద్దేశాలను నెరవేర్చలేకపోయాయి.

1980వ దశకంలో ఖాళీగా ఉన్న ఎల్ హెలికాయెడ్‌లో కొన్ని ఆఫీసులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో బొలివారియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కూడా ఉండేది. దాన్ని సెబిన్ అని పిలిచేవారు.

ఆ తర్వాత ఈ నుంచి ఈ భవనాన్ని చిత్రహింసలకు, భయానికి ప్రతీకగా చూశారు.

ఎల్ హెలికాయెడ్‌లో జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోడానికి బీబీసీ అక్కడ కొన్ని రోజులు పర్యటించింది.

జైలులో ఉన్న మాజీ ఖైదీలు, వారి కుటుంబాలు, చట్ట నిపుణులు, ప్రభుత్వేతర సంస్థలతో మాట్లాడింది. మొదట్లో ఆ జైల్లో గార్డులుగా పనిచేసిన ఇద్దరితో కూడా సంభాషించింది.

ప్రభుత్వం తమపై, తమ కుటుంబాలపై చర్యలు తీసుకుంటుందనే భయంతో వారు తమ గుర్తింపు బయటపెట్టద్దని కోరారు.

2014 మేలో రోస్మిత్ మంటిలాను ఎల్ హెలికాయెడ్‌కు తీసుకొచ్చారు. దేశంలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల సమయంలో అరెస్టైన 3 వేలమందిలో మంటిలా ఒకరు.

32 ఏళ్ల మంటిలా రాజకీయ కార్యకర్త. ఆయన ఎల్జీబీటీల హక్కుల కోసం కూడా పోరాడేవారు.

ఆయన జైల్లో ఉన్నప్పుడే వెనెజ్వేలా జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీకి ఎన్నికైన దేశ తొలి స్వలింగ సంపర్కుడైన నేతగా నిలిచారు.

వెనెజ్వేలా జైలు Image copyright Reuters

ఆర్థిక, రాజకీయ సంక్షోభం

వెనెజ్వేలాలో మెల్లమెల్లగా ధరలు ఆకాశాన్నంటాయి. దానితోపాటు ఆహార పదార్థాలు, మందులు లాంటి నిత్యావసరాల కొరత కూడా ఏర్పడింది.

దేశంలో ప్రజా సేవలు స్తంభించాయి. సామాన్యులకు అక్కడ బతకడం కష్టమైపోయింది.

ఆ సందర్భంలో ఎల్ హెలికాయెడ్ అస్తవ్యవస్తంగా మారింది. ప్రతి రోజూ బస్సుల్లో కుక్కి వందల మంది ఖైదీలను అక్కడకు తీసుకొచ్చేవారు.

ఈ ఖైదీల్లో విద్యార్థులు, రాజకీయ కార్యకర్తలు, సామాన్యులు ఉండేవారు. నిషేధించిన సమయంలో ఉండకూడని చోట ఉన్నారని వారిని అరెస్ట్ చేసేవారు.

ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శల కోసం డబ్బు పోగుచేస్తున్నారని మంటిలాను అరెస్ట్ చేశారు. కానీ ఆయన ఆ ఆరోపణలను తోసిపుచ్చారు.

జైల్లో మాజీ గార్డు మాన్యుయెల్‌కు మంటిలా ఇప్పటికీ బాగా గుర్తున్నారు. "అక్కడ ఉంచాల్సిన అవసరమే లేని ఖైదీల్లో ఆయన కూడా ఒకరు" అని తెలిపారు.

వెనెజ్వేలా జైలు Image copyright Getty Images

ప్రజల మనసులో నిలిచిపోయిన భయం

ఎల్ హెలికాయెడ్‌కు వచ్చే ఖైదీలు విచారణ కోసం వారాలు, నెలలపాటు వేచిచూసేవారు. సెబిన్ ఏజెన్సీ నిఘా సమాచారం సేకరించే పని చేసేది.

కానీ అది కొంతకాలం పాటు అది ఆ దేశ నియంతను కాపాడ్డంలో మునిగిపోయింది.

రెండున్నరేళ్లు జైల్లో గడిపిన మంటిలా ఆ సమయంలో భయంతో బిక్కుబికుమని ఉండేవాడినని చెప్పారు.

అయితే ఎల్ హెలికాయెడ్ జైలుకు తీసుకొచ్చే ఖైదీలను రోజూ పెట్టే చిత్ర హింసల గురించి పుస్తకం రాయాలని అనుకున్నానని చెప్పారు.

దారుణమైన గ్వాంటానమో సెల్

2014లో తను ఎల్ హెలికాయెడ్ జైలుకు వచ్చినప్పుడు అక్కడ 50 మంది ఖైదీలే ఉండేవారని మంటిలా చెప్పారు. కానీ, రెండేళ్లలో ఆ సంఖ్య 300కు చేరిందన్నారు.

ఖైదీల సంఖ్య పెరిగేకొద్దీ జైల్లో గార్డులకు వారందరినీ ఉంచడానికి తగిన ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.

వెనెజ్వేలా జైలు

జైల్ సెల్‌లా ఉపయోగించడానికి భవనంలో ఉన్న ఆఫీసులు, మెట్లు, టాయిలెట్‌లు, ఖాళీగా ఉన్న ప్రాంతాలను సీల్ చేశారు.

ఎల్ హెలికాయెడ్‌లో జైలు గార్డుగా పనిచేసిన విక్టర్ "మొదట ఈ గదులను ఆధారాలు ఉంచడానికి ఉపయోగించేవారు" అని చెప్పారు.

జైల్లో ఖైదీలు ఈ గదులకు ఫిష్ ట్యాంక్, లిటిల్ టైగర్, లిటిల్ హాల్ లాంటి పేర్లు కూడా పెట్టారు. కానీ, వాటిలో ఘోరమైన సెల్ 'గ్వాంటనామో'

ఆ గదులు 12 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉండేవి. అందులో 50 మంది ఖైదీలను ఉంచేవారు.

ఈ గదులు వేడిగా ఉండేవి, అక్కడ గాలి ఆడడం కూడా కష్టమైపోయేది.

"అక్కడ వెలుతురు, టాయిలెట్ ఉండేవి కావు. శుభ్రం చేయడం, పడుకోడానికి ఏ ఏర్పాట్లు ఉండవు. గది గోడలకు ఎండిపోయిన మనుషుల రక్తం, మలం కనిపించేది" అని మంటిలా చెప్పారు.

అక్కడకు తీసుకొచ్చిన ఖైదీలు వారాలపాటు స్నానం చేయకుండా ఉండేవారు.

వారు మూత్రం వెళ్లడానికి ప్లాస్టిక్ బాటిళ్లు ఇచ్చేవారు, ప్లాస్టిక్ సంచుల్లో మల విసర్జన చేసేవారు. ఆ చిన్న సంచులను వాళ్లు 'లిటిల్ షిప్' అనేవారు.

వెనెజ్వేలా జైలు

చిత్రహింసల పరంపర

కానీ ఎల్ హెలికాయెడ్‌కు ఖైదీలుగా వెళ్తున్నాం అంటేనే అందరూ భయంతో వణికిపోయేవారు.

జైల్లో కొంతకాలం గడిపిన కార్లోస్ "వాళ్లు నా నోట్లో ఒక బ్యాగ్ కుక్కి, చాలా కొట్టేవారు. తలపై, మర్మావయాలపై, పొట్టలో కరెంటు షాకులు ఇచ్చేవారు" అని చెప్పారు.

"నేను సిగ్గుతో, ఆ అవమానాలన్నీ భరించాను. ఒక్కోసారి నేను నపుంసకుడిని అయిపోతానేమో అని భయం వేసేది"

జైల్లో ఖైదీగా ఉన్న లూయీ "నా కళ్లకు గంతలు కట్టాక సెబిన్ అధికారులు నిన్ను తుపాకీతో కాల్చేస్తాం అనేవారు. తుపాకీలో ఒకే బుల్లెట్ ఉంది, నువ్వెంత అదృష్టవంతుడివో చూస్తాం అని నాకు తలకు తుపాకీ పెట్టేవారు. ట్రిగ్గర్ లాగిన శబ్దం వినిపించేది. అలా నాకు ఎన్నోసార్లు జరిగింది" అన్నారు.

ఖైదీలను చిత్రహింసలు పెట్టడానికి ఎప్పుడూ ఒకే రకమైన పద్ధతులను ఉపయోగించేవారని మంటిలా చెప్పారు.

"ఒక విద్యార్థి నోట్లో అధికారులు మనిషి మలం ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్ కుక్కి అతడికి ఊపిరి ఆడకుండా చేశారు".

గట్టిగా ఉన్న వస్తువులను మర్మాంగాల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేసేవారు. చాలా మందికి కరెంటు షాక్ ఇచ్చేవారు.

వెనెజ్వేలా జైలు

మానవ హక్కుల ఉల్లంఘన

జైల్లో పనిచేసిన ఇద్దరు గార్డులు ఖైదీలను చిత్రహింసలు పెట్టే పని చేయడానికి నిరాకరించారు. కానీ, వారు ఆ హింసను కళ్లారా చూశామని చెప్పారు.

"నేను ఖైదీలను కొట్టడం చూశాను. వాళ్ల చేతులు కట్టేసి పైకప్పుకు వేలాడదీసేవారు" అని విక్టర్ చెప్పారు.

"వాళ్లు ఒక బాటరీ చార్జర్ తీసుకొచ్చేవారు. దానితో ఖైదీల శరీరాలకు కరెంటు షాకులు ఇచ్చేవారు" అని మాన్యుయెల్ చెప్పారు.

చిత్రహింసలు పెట్టడం అక్కడ రోజూ జరిగేది. అది సర్వసాధారణం.

వీటిలో చాలా కేసులను అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు డాక్యుమెంటేషన్ చేశాయి.

2018 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ మానవహక్కుల ఉల్లంఘన కింద ఈ కేసులో ప్రాథమిక విచారణ ప్రారంభించింది.

వెనెజ్వేలా జైలు Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఎల్ హెలికాయిడ్ జైల్లో ప్రత్యక్షంగా చూసిన హింస గురించి చెబుతున్న మంటిలా

మంటిలా విడుదలకు డిమాండ్

ఎల్ హెలికాయెడ్ జైల్లో రెండున్నరేళ్లు గడిపిన తర్వాత 2016 అక్టోబర్‌లో మంటిలా తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. జైలు అధికారులు అతడిన సర్జరీ కోసం వేరే జైలుకు బదిలీ చేశారు.

అయన్ను కోర్టు విడుదల చేసే ఆఖరి నిమిషంలో సెబిన్ అధికారులు అక్కడకు వచ్చి మంటిలాను ఆస్పత్రి బెడ్ నుంచి కిందికి లాగి తీసుకెళ్లి హెలికాయెడ్‌లో వేరే గదిలో బంధించారు.

గట్టిగా అరుస్తున్న మంటిలాను సెబిన్ అధికారుల వాహనంలో కూర్చోబెట్టే వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆయన విడుదలకు డిమాండ్ చేశాయి

పది రోజుల తర్వాత అధికారులపై ఒత్తిడి రావడంతో మంటిలాను మొదట ఒక సైనిక ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత మరో ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు.

వెనెజ్వేలా జైలు Image copyright Getty Images

2016 నవంబర్‌లో ఆయన్ను అధికారికంగా విడుదల చేశారు. తర్వాత కొన్ని రోజులకే కాంగ్రెస్‌మెన్‌గా మంటిలా ప్రమాణస్వీకారం చేశారు.

ఆ తర్వాత నుంచి ఎల్ హెలికాయెడ్‌లో తను ఏం చూశాడో, ఎలాంటి అనుభవాలు రుచిచూశాడో అన్నిటికీ ఆయన సాక్షిగా నిలిచారు.

కానీ, జైలు నుంచి బయటికి వచ్చినా భయం భయంగానే గడిపిన మంటిలా 2017 జులైలో వెనెజ్వేలా వదిలి ఫ్రాన్స్ వెళ్లిపోవాలని నిర్ణయించారు.

2018లో ఆయన శరణార్థి హోదా కూడా సంపాదించారు.

ఆయన ఇప్పటికీ వెనెజ్వేలాలో ఘటనలను గమనిస్తుంటారు. ఏదో ఒక రోజు తన స్వస్థలానికి తిరిగి వెళ్తాననే అనుకుంటున్నారు.

కానీ, ఆయనపై ఎల్ హెలికాయెడ్ ప్రభావం ఇప్పటికీ ఆయన జీవితంలో భాగమైపోయింది.

వెనెజ్వేలా జైలు

నేను ఎప్పటికీ ముందులా కాలేను. అది చాలా కష్టం. ఎందుకంటే ఎల్ హెలికాయెడ్ రెండున్నరేళ్లుగా నా ఇల్లులా మారింది. నేను దాన్ని ఎంత కాదన్నా నిజం అదే.

మాన్యుయేల్, విక్టర్ ఇద్దరూ ఇప్పుడు వెనెజ్వేలాను వదిలిపెట్టారు. విదేశాల్లో నివసిస్తున్నారు.

2018 మేలో ఎల్ హెలికాయెడ్‌లో బంధించిన ఖైదీలు అక్కడ పరిస్థితుల గురించి చెబుతూ ఆందోళనలు ప్రారంభించారు.

ఆ తర్వాత అక్కడ నుంచి చాలా మంది ఖైదీలను విడుదల చేశారు పరిస్థితిని మెరుగుపరుస్తామని హామీ కూడా ఇచ్చారు.

కానీ జైల్లోకి వెళ్లిన ఎంతోమంది ఎల్ హెలికాయెడ్‌లో ఖైదీల స్థితి మెరుగుపరచడానికి పెద్దగా ఏం చేయలేదనే అంటున్నారు.

బీబీసీ చాలాసార్లు వెనెజ్వేలా అధికారులను ఈ విషయం గురించి సంప్రదించింది. వారిపై వస్తున్న ఆరోపణల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది.

బీబీసీ కరాకస్‌లో ఉన్న కమ్యూనికేషన్ మినిస్ట్రీ, బ్రిటన్‌లో వెనెజ్వేలా ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడింది. కానీ ఇప్పటివరకూ దీనికి సంబంధించి ఎవరూ సమాధానం ఇవ్వలేదు.

(ఈ కథనానికి జైల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలు, వారి ఇచ్చిన వివరాలే ఆధారం. ఇంటర్వ్యూ ఇచ్చిన వారి కోరిక మేరకు వారి పేర్లు మార్చాం.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)