ఇన్‌స్టాగ్రామ్ వల్లే మా అమ్మాయి చనిపోయింది -బ్రిటన్‌లోని ఓ తండ్రి ఆవేదన

  • 26 జనవరి 2019
ఇన్‌స్టాగ్రామ్ ఆత్మహత్యలు

"ఇన్‌స్టాగ్రామ్ వల్లే మా అమ్మాయి చనిపోయింది. ఇందులో నాకు అనుమానం లేదు"... ఇది ఓ తండ్రి ఆవేదన. ఇలాంటి తండ్రులు బ్రిటన్‌లో చాలామందే ఉన్నారు.

బ్రిటన్‌లో ప్రతి సంవత్సరం దాదాపు 200 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. వీరి మరణాలకు కారణం సోషల్ మీడియానే అనేది వారి తల్లిదండ్రుల ఆరోపణ.

నిత్యం సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ అవుతున్న హింస, ఆత్మహత్యలు, స్వీయ హింసలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, గ్రాఫిక్ చిత్రాలు చూస్తున్న పిల్లలు వాటి మాయలో పడిపోతున్నారు. ఈ కంటెంట్‌ను చూస్తున్నవారిని కూడా అలా చేయాలని ప్రేరేపించేలా ఉంటున్నాయి.

ఇలాంటి మాయలో పడి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల్లో మోలీ రసెల్ ఒకరు.

మోలీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆత్మహత్యలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా చూసేది. కొద్దిరోజులకు అదో వ్యసనంలా మారి, దాని మాయలో పడింది.

"నన్ను క్షమించండి. దీనికి వేరెవరూ కారణం కాదు" అని ఓ లేఖ రాసి తన ప్రాణాలను తీసుకుంది.

"మా అమ్మాయిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. అవన్నీ ఆవిరైపోయాయి. దీనంతటికీ కారణం ఇంటర్నెట్, సోషల్ మీడియాలే." అని మోలీ తండ్రి అయాన్ రసెల్ ఆవేదన చెందుతున్నారు.

(ఈ కింది వీడియోలో మిమ్మల్ని కలచివేసే దృశ్యాలుండవచ్చు.)

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఇన్‌స్టాగ్రామ్ ఆత్మహత్యలు

ఎన్నో అకౌంట్లు ఇలాంటి సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది.

"దూకేయండి" అని చూపించే చిత్రాలు, చేతి మణికట్టుపై గాట్లు పెట్టుకుని తమను తాము హింసించుకుంటున్న గ్రాఫిక్ చిత్రాల వంటివి ఇప్పుడు సోషల్ మీడియాలో కోకొల్లలు. కొన్ని వేల అకౌంట్ల ద్వారా ఇలాంటి సమాచారం పోస్ట్ అవుతోందని బీబీసీ పరిశోధనలో తేలింది.

అయితే, "ఆత్మహత్యలు, స్వీయహింస, అతిగా తినమని ప్రోత్సహించడం వంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని మేం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోం. అలాంటి కంటెంట్ ఉంటే దాన్ని తొలగిస్తాం" అని ఇన్‌స్టాగ్రామ్ ప్రతినిధులు బీబీసీకి తెలిపారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)