వెనెజ్వేలా: ఆర్థిక, రాజకీయ సంక్షోభానికి అసలు కారణాలు

  • 26 జనవరి 2019
వెనెజ్వేలా Image copyright AFP
చిత్రం శీర్షిక వెనెజ్వేలాలో మడూరో వ్యతిరేక ఆందోళనలు

ఇప్పుడు వెనెజ్వేలా అధ్యక్షుడు ఎవరు? ఈ ప్రశ్నకు బదులివ్వడానికి ఆ దేశ ప్రజలే అయోమయంగా చూస్తున్నారు. ఆ దేశానికి అధ్యక్షుడు ఎవరనేదానిపై ఇప్పుడు పెద్ద గందరగోళం నెలకొంది.

ఇప్పటికే ఆ దేశం అత్యంత దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుంది. రోజుకు సగటున 5 వేల మంది ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ఈ రోజున్న ధరలు రేపు ఉండట్లేదు. ప్రతి 19 రోజులకు ఒకసారి ధరలు రెట్టింపవుతున్నాయి.

ఇన్ని సమస్యలు ఒకవైపైతే తాజాగా అధ్యక్షుడి విషయంలో ఆ దేశం అట్టుడుకుతోంది. ఐదేళ్లుగా అక్కడ నికోలస్ మడూరో అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ, ఆయన ఎన్నిక చెల్లదని, తానే అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటున్నానని ఆ దేశ ప్రతిపక్ష నేత జువాన్ గ్వాయిడో ప్రకటించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా ఆయనకే మద్దతిచ్చారు. ఆయన స్పందనపై రష్యా మండిపడింది. వెనెజ్వేలా విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాను హెచ్చరించింది. ఇన్ని సంక్షోభాల మధ్య ఆ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి?

Image copyright Getty Images
చిత్రం శీర్షిక నికోలస్ మడూరో, కువాన్ గ్వాయిడో

ప్రస్తుత వివాదం ఏంటి?

వెనెజ్వేలాలో సోషలిస్ట్ నేత హ్యూగో చావెజ్ చనిపోయాక, ఆయన స్థానంలో 2013లో మడూరో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పాలన మొత్తం వివాదాస్పదంగానే సాగింది. దేశం ఆర్థికంగా చాలా దిగజారింది.

ఈ క్రమంలో 2018 మేలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మడూరో మరో దఫా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఆ ఎన్నికలను దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలూ బహిష్కరించాయి. కేవలం 48శాతం పోలింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని, మడూరో ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షుడు కాదని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

గత మేలోనే మడూరో అధ్యక్షుడిగా ఎన్నికైనా, తన మొదటి దఫా పదవి కాలం ముగిశాక... అంటే ఈ ఏడాది జనవరి 10న ఆయన రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రతిపక్షాలకు కొత్త ఆయుధం దొరికింది. అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి కాబట్టి మడూరో ఎంపిక చెల్లదని, దేశంలో అధ్యక్ష స్థానం ఖాళీగా ఉందని వెనెజ్వేలా జాతీయ అసెంబ్లీ ఆరోపిస్తోంది.

ఇంతలో జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జువాన్ గ్వాయిడో జనవరి 23న తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.

డోనల్డ్ ట్రంప్ కూడా గ్వాయిడోను వెనెజ్వేలా అధ్యక్షుడిగా గుర్తించారు.

దాంతో వెనెజ్వేలా మిత్రదేశమైన రష్యాకు కోపమొచ్చింది. రష్యాకు ఆ దేశంలో భారీగా పెట్టుబడులున్నాయి. అందుకే అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దని హెచ్చరించాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హ్యూగో చావెజ్ వారసుడిగా 2013లో అధికారం చేపట్టిన మడూరో

ఈ సంక్షోభం ఎలా ముగుస్తుంది?

ఇప్పటిదాకా వెనెజ్వేలా సైనిక దళాలు మడూరోకే మద్దతుగా నిలుస్తూ వచ్చాయి. ఎప్పటికప్పుడు మడూరో వాళ్ల జీతాలు పెంచడంతో పాటు తనకు అనుకూలమైన వారికే కీలక బాధ్యతలు అప్పగించారు. సైన్యానికి తరచూ పదోన్నతులు కల్పిస్తూ వచ్చారు.

కానీ, సైన్యం మడూరోకు ఎదిరించి నిలబడితే, గతంలో వాళ్లు చేసిన తప్పులన్నింటికీ క్షమాభిక్ష పెడతానని గ్వాయిడో మాటిచ్చారు.

చివరికి దేశంలో సైనిక బలగాలు అనుకూలంగా ఉన్నవారే అధ్యక్ష పదవిని నిలబెట్టుకునే అవకాశం ఉంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న గ్వాయిడో

పరిస్థితి ఇంతలా ఎందుకు దిగజారింది?

వెనెజ్వేలాలో సంక్షోభం ఎప్పట్నుంచో ఉన్నా, మడూరో పాలనలో పరిస్థితి దారుణంగా తయారైందనే విమర్శలున్నాయి.

దానికి ఓ రకంగా మడూరో ప్రవేశపెట్టిన పథకాలే కారణం. ఉదాహరణకు... పేదలను ఆకర్షించేందుకు నిత్యావసరాల ధరలను ఆయన భారీగా తగ్గించారు. దాంతో రైతులు వాటిని పండించడం మానేశారు. ఫ్యాక్టరీలు కూడా ఉత్పత్తిని ఆపేశాయి. ఫలితంగా దాంతో ధరలు ఆకాశాన్నంటాయి.

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు వెనెజ్వేలాలో ఉన్నాయి. ఈ చమురే పరోక్షంగా వారి ఆర్థిక సమస్యలకు కారణమైంది. చమురు ఎక్కువగా ఉండటంతో ఇతర వస్తువుల తయారీని వెనెజ్వేలా పక్కనబెట్టింది. కానీ 2014లో అంతర్జాతీయంగా చమురు ధర క్షీణించడంతో వెనెజ్వేలాలో విదేశీ మారకం కొరత ప్రారంభమైంది. దాంతో ఆ దేశానికి వస్తువులను దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది.

దీనికి తోడు వెనెజ్వేలా ప్రభుత్వం అవసరమైనప్పుడల్లా అధిక కరెన్సీని ముద్రించేది. పేదల్లో పేరు సంపాదించడానికి కనీస వేతనాలను తరచూ పెంచేది. దాంతో డబ్బు విలువ తగ్గుతూ వచ్చింది.

వెనెజ్వేలా ప్రభుత్వానికి అప్పు దొరకడం కూడా కష్టంగా మారింది. బ్యాంకులు వెనెజ్వేలాకు అప్పు ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వం మళ్లీ కరెన్సీని ముద్రించడం ప్రారంభించింది. దాంతో ఆ డబ్బు విలువ మరింత క్షీణించి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక నిత్యం వేల మంది ప్రజలు వెనెజువెలాను వీడి వెళ్లిపోతున్నారు. ఇది కొన్ని నెలలుగా జరుగుతోంది.

ప్రజలు ఎలా స్పందిస్తున్నారు?

ప్రజలు తమ స్పందనను కాళ్లతోనే తెలియజేస్తున్నారు. 2014లో ఆర్థిక సంక్షోభం మొదలైననాటి నుంచి దాదాపు 30 లక్షలమంది ప్రజలు వెనెజ్వేలాను వదిలి వెళ్లారు. కాలి నడకనే సరిహద్దు దాటి పొరుగు దేశాలకు వలస వెళ్తున్నారు.

లక్షలాది ప్రజలు ఒక్కపూట భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. విద్యా వ్యవస్థ పతనమైంది. రోగులకు మందులు దొరకడం కూడా కష్టంగా మారింది. పోషించే శక్తిలేక తల్లులు పసిపిల్లల్ని కూడా అమ్ముకుంటున్నారంటేనే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వీటన్నింటికీ ఎప్పుడు తెరపడుతుందనేది ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్నే.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)