బ్రెజిల్‌లో కుప్పకూలిన డామ్... 300 మంది గల్లంతు

  • 26 జనవరి 2019
బ్రెజిల్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక బ్రెజిల్‌లోని అతిపెద్ద మైనింగ్ కంపెనీ అయిన వేల్‌కు చెందిన డామ్

బ్రెజిల్ దేశంలో ఆనకట్ట కూలిన దుర్ఘటనలో 300 మందికి పైగా గల్లంతయ్యారు. ఆగ్నేయ బ్రెజిల్‌లోని ఓ ఇనుప ఖనిజ గని వద్ద ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

డామ్ పూర్తిగా కుప్పకూలడంతో ఆ ప్రాంతాన్ని బురద ముంచెత్తింది. అక్కడున్న కెఫెటేరియాలో మధ్నాహ్న భోజనం చేస్తున్న కార్మికులందరూ బురద కింద సజీవ సమాధి అయ్యారు.

మినాస్ గెరాయిస్ రాష్ట్రంలోని బ్రూమాడినో పట్టణానికి సమీపంలో ఉన్న ఈ ప్రమాద స్థలానికి సహాయక సిబ్బంది తవ్వకాలు జరిపే వాహనాలతో చేరుకున్నారు.

అయితే, అక్కడ మనుషులను సజీవంగా గుర్తించడమన్నది దాదాపు అసాధ్యమని రాష్ట్ర గవర్నర్ రోమూ జేమా అన్నారు. ఇప్పటివరకు తొమ్మిది మంది చనిపోయినట్లు ధ్రువీకరించారు.

బ్రెజిల్‌లోని అతిపెద్ద మైనింగ్ కంపెనీ అయిన వేల్‌కు చెందిన ఆ ఆనకట్ట కూలిపోవడానికి కారణాలేమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక బురదతో ధ్వంసమైన రోడ్లు

మినాస్ గెరాయిస్ రాష్ట్రంలోని మారియానాలో ఒక ఆనకట్ట మూడేళ్ళ కిందట ఇలాగే కుప్పకూలింది. బ్రెజిల్ దేశంలో సంభవించిన అత్యంత పర్యావరణ విధ్వంసంగా అభివర్ణించిన ఆ ఘటనలో 19 మంది చనిపోయారు.

పెజావో ఐరన్ ఓర్ మైన్ వద్ద ఉన్న ఒక ఆనకట్ట శుక్రవారం నాడు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు పేలిపోయింది. దానివల్ల వరద ముంచెత్తడంతో, దిగువన ఉన్న మరో డామ్ కూలిపోయింది.

దాంతో, ఎగసిపడిన బురద ప్రవాహం డామ్ కాంప్లెక్సును, పంట పొలాలను, అక్కడి ప్రజల ఆవాసాలను పూర్తిగా ముంచెత్తింది. ఇళ్ళు, వాహనాలు ఆ బురద ప్రవాహానికి ధ్వంసమయ్యాయి.

రోడ్లన్నీ దెబ్బతినడంతో ఆ బురదలో చిక్కుకున్న ప్రజలను సహాయక సిబ్బంది హెలికాప్టర్ల సహాయంతో కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

Image copyright AFP/GETTY IMAGES
చిత్రం శీర్షిక సజీవుల జాడ దొరుకుతుందా అని నిరాశలో కూరుకపోతున్న సహాయక సిబ్బంది

ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఆ సమీప ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కంపెనీ సిఇఓ ఫాబియో ష్వార్ట్స్‌మాన్, 300 మంది కార్మికులలో కేవలం మూడో వంతు మంది మాత్రమే కనిపించారని చెప్పారు.

ఈ ప్రాంతంలో 300లకు పైగా ప్రజలు గల్లంతై ఉంటారని స్థానిక అగ్నిమాపకదళ సిబ్బంది చెప్పారు.

ప్రాణాలతో ఉన్న ప్రజలను గుర్తించి కాపాడేందుకు వంద మంది ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగారు. మరో వంద మందిని కూడా అధికారులు సహాయకచర్యల కోసం పంపిస్తున్నారు.

అయితే, పరిస్థితి చూస్తుంటే మృతదేహాలు మాత్రమే దొరికే అవకాశం ఉందని గవర్నర్ జేమా ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)