అవిభక్త కవలలు: ప్రాణాలతో పోరాడుతున్న ఒకే శరీరంతో పుట్టిన ఇద్దరు పాపల కథ

  • 28 జనవరి 2019
మారిమే, ఎన్డీ
చిత్రం శీర్షిక అవిభక్త కవలలు మారిమే, ఎన్డీ

వైద్య శాస్త్రానికే సవాల్‌గా మారిన అవిభక్త కవలలు వీణావాణీల గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే లండన్‌లోనూ మారిమే, ఎన్డీ అనే అవిభక్త కవలలు ఉన్నారు.

తలలు అతుక్కుని ఉన్న వీణావాణీలను ఎలా వేరు చేయాలో ఎవరికీ అంతుపట్టడంలేదు. మారిమే, ఎన్డీల పరిస్థితి కూడా అంతే క్లిష్టంగా ఉంది. వీణా వాణీలకు తల మాత్రమే అతుక్కుని ఉంది. కానీ.. మారిమే, ఎన్డీలకు వేరువేరు తలలు ఉండగా, శరీరం, ఇతర అవయవాలు అతుక్కుని ఉన్నాయి.

మరోవైపు, మారిమే అనే బాలిక గుండె చాలా బలహీనంగా ఉందని, దాంతో ఆమె ఎప్పుడు చనిపోతుందో చెప్పలేమని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరి శరీరాలు అతుక్కుని ఉండటం కారణంగా మారిమే చనిపోతే, మరో చిన్నారి ఎన్డీ కూడా బతికే అవకాశం ఉండదని అంటున్నారు.

Image copyright FACEBOOK/ugc
చిత్రం శీర్షిక వీణావాణీ

రెండేళ్ల వయసున్న ఈ బాలికల స్వదేశం ఆఫ్రికాలోని సెనెగల్‌. ప్రస్తుతం లండన్‌లోని వైద్యుల పర్యవేక్షణలో, తన తండ్రితో కలిసి ఉంటున్నారు.

ఈ చిన్నారుల గురించి వారి తండ్రి ఇబ్రహీమా ఇలా వివరించారు.

"నా భార్య గర్భంతో ఉన్నప్పుడు స్కానింగ్ తీయించాం. కడుపులో ఒకే పిండం ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. కానీ, 2016 మే 18న ప్రసవమైన తర్వాత డాక్టర్ వచ్చి ఒక విషయం మీతో మాట్లాడాలన్నారు. కవలలు జన్మించారని చెప్పారు. దాంతో, ఒక్కసారిగా అవాక్కయ్యాను. స్కానింగ్‌లో కవలలని రాలేదు కదా? ఇప్పుడు డాక్టర్ ఇలా చెబుతున్నారేంటి? అని ఆశ్చర్యపోయాను.

అంతటితో ఆగకుండా.. డాక్టర్ మరో షాకింగ్ విషయం చెప్పారు. వాళ్లు మామూలు కవలలు కాదు, అవిభక్త కవలలన్నారు. దాంతో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. దేవుడు ఇంత పనిచేశాడా? అంటూ బోరున ఏడ్చాను.

నన్ను సముదాయించేందుకు డాక్టర్ ప్రయత్నించారు. తల్లీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. దాంతో, నా మనసు కాస్త కుదుటపడింది. పిల్లలను సులువుగానే వేరుచేసే అవకాశం ఉంటుందనుకున్నాను.

కానీ, వాళ్లను వేరు చేయడం అంత సులువైన పనికాదని తర్వాత తెలిసింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: అవిభక్త కవలలు మారిమే, ఎన్డీ

నా బిడ్డలను కాపాడుకునేందుకు ఎన్నో ఆస్పత్రులకు వెళ్లా. ఎంతోమంది డాక్టర్లను కలిశా. నిరాశే ఎదురైంది.

మారీమే గుండె చాలా బలహీనంగా ఉందని, ఊపిరి తీసుకోవడం కూడా ఆమెకు చాలా కష్టమవుతోందని వైద్యులు చెప్పారు. ఎన్డీ మాత్రం ఆరోగ్యంగానే ఉంది.

ఇద్దరికీ గుండె, మెదడు, ఊపిరితిత్తులు వేరువేరుగా ఉన్నాయి. కానీ, ఇద్దరికీ కలిపి ఒకే కాలేయం, గాల్ బ్లాడర్, జీర్ణవ్యవస్థ ఉన్నాయి.

రెండు జీర్ణాశయాలు ఉన్నాయి కానీ, అవి అతుక్కున్నాయి. ఇద్దరికి కలిపి మూడు మూత్రపిండాలు ఉన్నాయి.

చేతులు, కాళ్లు ఇద్దరి నియంత్రణలో ఉంటాయి. కానీ, హుషారుగా ఉండే ఎన్డీనే వాటిని ఎక్కువగా వినియోగిస్తారు.

నా బిడ్డలను కాపాడే అవకాశం ఉందేమో తెలుసుకునేందుకు అనేకరకాలుగా పరిశోధించాను.

మా స్వదేశం సెనెగల్‌తో పాటు బెల్జియం, జర్మనీ, జింబాబ్వే, నార్వే, స్వీడన్, అమెరికా దేశాల్లోని అనేక ఆస్పత్రులను సంప్రదించాను. కానీ, అవిభక్త కవలలను వేరే చేసే ఆస్పత్రుల జాడ దొరకలేదు.

అమెరికాలోని ఒక్క ఆస్పత్రి మాత్రం మా పిల్లలను చేర్చేందుకు ముందే 10 లక్షల డాలర్ల ఫీజు చెల్లించాలని చెప్పారు. అంత డబ్బు పెట్టే స్తోమత లేక మేము వెనుదిరగాల్సి వచ్చింది.

ఆఖరి ప్రయత్నంగా సెనెగల్ ప్రభుత్వం సాయంతో ఫ్రాన్స్‌లోని ఓ ఆస్పత్రిని సంప్రదించాం. అటువైపు నుంచి కాస్త సానుకూల స్పందన వచ్చింది. పిల్లల స్కానింగులను, మెడికల్ రికార్డులను ఈమెయిల్ ద్వారా వైద్యులకు పంపించాను. కానీ, చివరికి ఆ ఆస్పత్రి కూడా చేతులెత్తేసింది. ఇద్దరూ చనిపోతారని, వారిని వేరు చేసేందుకు వైద్యపరంగా ఎలాంటి అవకాశమూ లేదని తేల్చిచెప్పారు. దాంతో, నా ఆశలు ఆవిరయ్యాయి.

రానురాను మారిమే, ఎన్డీ కాస్త ఉత్సాహంగా కదలుతున్నారు. నవ్వుతుండేవారు. దాంతో నాలో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. మళ్లీ ఆస్పత్రుల కోసం వెతకడం మొదలుపెట్టా.

ఈ క్రమంలో ఇంటర్నెట్‌‌లో ఒక వీడియో కనిపించింది. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రానికి చెందిన అబ్బీ, బ్రిట్టన్నీ అనే అవిభక్త కవలల గురించిన వీడియో అది.

ఆ ఇద్దరు కూడా మా అమ్మాయిల్లాగే అతుక్కుని ఉన్నారు. ప్రస్తుతం 20 ఏళ్ల వయసున్న వాళ్లు టీచర్లుగా పనిచేస్తున్నారు. కారు నడుపుతున్నారు, ఆటలు ఆడుతున్నారు.

ఆ వీడియో చూసిన తర్వాత నాలో ధైర్యం పెరిగింది. అవిభక్త కవలలు బతకడమే కాదు, అద్భుతాలు కూడా సృష్టించగలరని నాకు తెలిసింది.

ఎన్నో ఆస్పత్రులకు వెళ్లాను, ఎంతోమందిని కలిశాను. ఎవరూ నాకు భరోసా ఇవ్వలేదు. కానీ, నాలో స్ఫూర్తినిచ్చింది, ధైర్యాన్నిచ్చింది.. ఆ ఒక్క వీడియో డాక్యుమెంటరీ మాత్రమే.

ఆ వీడియో ద్వారా ఆ తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా కాపాడుకున్నారు? వారికోసం ఎంతగా పోరాడారు? అనేది తెలుసుకున్నాను. వాళ్లు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. అలా నేను కూడా నా బిడ్డల కోసం ఏదైనా చేయగలను అనిపించింది.

ఆ తర్వాత ఇంకా వైద్య సదుపాయాలు ఉన్నాయా? అన్న దిశగా పరిశోధించాను.

చివరికి అవిభక్త కవలలకు సర్జరీ చేయడంలో పేరున్న లండన్‌లోని గ్రేట్ ఆర్మాండ్ స్ట్రీట్ హాస్పిటల్ గురించి తెలిసింది. ఆ ఆస్పత్రిలో పనిచేసే పాలో డే కొప్పి అనే కన్సల్టెంట్‌ను సంప్రదించాను. మా బిడ్డల వివరాలు పంపించారు. ఆయన మమ్మల్ని రమ్మని పిలిచారు. దాంతో, ఇక నా బిడ్డలకు పరిష్కారం దొరికిందన్న సంతోషం కలిగింది.

డాక్టర్ పిలిచారు. కానీ, లండన్‌కు వెళ్లేందుకు కూడా మా దగ్గర డబ్బులు లేవు. అప్పటికే నా బిడ్డల మందులకు, వైద్యానికి, ఆస్పత్రుల ఫీజులకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. నేను పనిచేసే సంస్థ మాకు వైద్య బీమా పాలసీ ఇచ్చింది. కానీ, అది మా పిల్లల చికిత్సకు వర్తించదు.

మా పరిస్థితి గురించి తెలుసుకున్న సెనెగల్ ప్రథమ మహిళ (అధ్యక్షుడి భార్య) తన స్వచ్ఛంద సంస్థ ద్వారా సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

విమాన టికెట్లతో పాటు లండన్‌లో కొన్నాళ్లపాటు ఉండేందుకయ్యే ఖర్చులను కూడా ఆమె మాకు సమకూర్చారు.

2017 జనవరిలో లండన్‌లోని ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ డే కొప్పిని కలిశాం. అంతా తానే దగ్గరుండి చూసుకుంటానని ఆ డాక్టర్ భరోసా ఇచ్చారు.

వైద్య ప్రక్రియ ప్రారంభించారు. కవలలను వేరు చేసేందుకు అవకాశం ఉందేమో తెలుసుకునేందుకు త్రీడీ స్కానింగ్‌లు, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్‌లు తీయించారు.

ఆ రిపోర్టులను విశ్లేషించి వైద్యులు ఒక నిర్ణయానికి రావడానికి చాలారోజులు పట్టింది. మా స్వదేశంలో ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నా భార్య మా స్వదేశం వెళ్లిపోయారు. దాంతో, నా పిల్లలను చూసుకునే బాధ్యత పూర్తిగా నామీదే పడింది.

మరోవైపు, ఇన్నాళ్లూ నా సంపాదనతోనే మా కుటుంబం నడిచేది. కానీ, నేను ఉద్యోగాన్ని వదిలేసి లండన్‌లో ఉండాల్సి వచ్చింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఎ‌న్డీ గుండె ద్వారానే మారిమేకు ఆక్సీజన్ అందుతోంది

నా భార్యతో పాటు, మిగతా బిడ్డలు మా స్వదేశంలో ఉన్నారు. వారికి పూట గడవమే కష్టంగా మారింది. నాకు చేతిలో చిల్లిగవ్వలేక దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

నా బాధను ఎవరికీ చెప్పుకోలేక ఏడ్చేవాడిని. ఎక్కడైనా ఉచితంగా భోజనం దొరికితే తెచ్చుకుని తినేవాడిని.

అలా గడుస్తుండగా.. కొన్నాళ్లకు వైద్యుల నుంచి మాకో షాకింగ్ కబురు వచ్చింది.

మారిమే గుండె చాలా బలహీనంగా ఉందని, సర్జరీ చేసేందుకు ప్రయత్నిస్తే ఆమె చనిపోయే అవకాశాలు ఎక్కువని చెప్పారు.

దాంతో, నేను దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాను. నా బిడ్డలకు క్షమాపణ చెబుతున్నాను. నా బిడ్డలను కాపాడుకునేందుకు ఇన్నాళ్లూ చేయాల్సిందల్లా చేశాను" అని ఇబ్రహీమా ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ఈ చిన్నారులను వేరుచేయడం సాధ్యమయ్యే పరిస్థితి లేకపోయినా, వారి సంరక్షణను తామే చూసుకుంటామని వైద్యులు చెప్పారు.

2018 మార్చిలో వీరికి అధికారులు ఒక ఫ్లాట్‌ను కేటాయించారు. ప్రస్తుతం అందులోనే ఈ తండ్రీబిడ్డలు ఉంటున్నారు.

బాలికల మాటలు మెరుగవుతున్నాయి. ప్రస్తుతానికి నడవలేకపోతున్నారు. కానీ, భవిష్యత్తులో నడిచే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. రోజులు గడిచేకొద్దీ మారిమే గుండె క్రమంగా బలహీనపడుతోంది.

ప్రస్తుతం ఎ‌న్డీ వల్లే ఆ చిన్నారి ప్రాణాలతో ఉండగలుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఎ‌న్డీ గుండె ద్వారానే ఆమెకు ఆక్సీజన్ అందుతోంది.

ఒకవేళ గుండె పూర్తిగా విఫలమై మారిమే చనిపోతే.. ఎన్డీని బతికించడం కష్టమవుతుందని డాక్టర్లు తేల్చిచెప్పారు.

దాంతో, కనీసం ఎన్డీని అయినా కాపాడేందుకు సర్జరీ చేసేందుకు ప్రయత్నించాలా? వద్దా? అన్నది తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒకవేళ ఆ సర్జరీ విఫలమైతే ఇద్దరూ చనిపోయే ప్రమాదమూ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో ఒక బిడ్డను కాపాడటం కోసం మరో బిడ్డను చంపుకోలేనని, ఎటూ తేల్చుకోలేక ఆ తండ్రి పడుతున్న వేదన అంతాఇంతా కాదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు