కాఫీ కనుమరుగు కానుందా?

  • 28 జనవరి 2019
కాఫీ గింజలు, కాఫీ కప్పు Image copyright iStock

కాఫీ కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందా? అంటే, జాగ్రత్తపడకుంటే ఆ పరిస్థితి వస్తుందని అంటోంది తాజాగా జరిగిన అధ్యయనం.

కాఫీ మొక్కల్లో దాదాపు 60% రకాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఏటికేడు కాఫీ వినియోగం భారీగా పెరిగిపోతోంది. ఓ అధ్యయనం ప్రకారం రోజూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 200 కోట్ల కప్పుల కాఫీ తాగుతున్నారు. 2.5 కోట్ల కుటుంబాలు కాఫీ తోటల పెంపకం మీద ఆధారపడి జీవిస్తున్నాయి.

2000 నుంచి 2015 మధ్య కాలంలో కాఫీ వాడకం 43 శాతం పెరిగింది. అయితే, కాఫీ వినియోగం పెరిగిపోతోంది కానీ, కాఫీ తోటలు మాత్రం అంతరించిపోతున్నాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: 2080 నాటికి కాఫీ దొరకదా?

మొత్తం 124 రకాల కాఫీ మొక్కలు ఉంటాయి. కానీ, మనం తాగే కాఫీ కేవలం రోబస్టా, అరబికా అనే 2 రకాల మొక్కల నుంచే వస్తోంది.

ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో 30 శాతం రోబస్టా రకం మొక్కల నుంచి వస్తోంది. మిగతా 70 శాతం అరబికా రకం మొక్కల నుంచే లభిస్తోంది.

అయితే, 2080 నాటికి అరబికా మొక్కల పెంపకం 85 శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందని లండన్‌లోని రాయల్ బొటానికల్ గార్డెన్స్ సంస్థ నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది.

వాతావరణ మార్పులు, కీటకాలు, చీడపీడల వల్ల ఈ మొక్కలకు ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Image copyright JENNY WILLIAMS/RBG KEW

కొత్త వంగడాల అభివృద్ధికి అడవి (వైల్డ్) కాఫీ మొక్కలు చాలా కీలకం. ఆ మొక్కల కణజాలంతో మేలుజాతి వంగడాలు సృష్టిస్తారు.

ఇప్పుడు ఆ మొక్కలకే ప్రమాదం పొంచి ఉంది. ఇథియోపియా లాంటి కాఫీ ఎక్కువగా పండే దేశాల్లో అడవి కాఫీ చెట్ల నరికివేత పెరిగిపోతోంది.

పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Image copyright JENNY WILLIAMS/RBG KEW
చిత్రం శీర్షిక ఇథియోపియాలో స్వదేశీ కాఫీని ఎక్కువగా వినియోగిస్తారు. ఈ దేశంలో ఎక్కడ చూడా కాఫీ షాపులు కనిపిస్తుంటాయి.

ఈ అడవి కాఫీ మొక్కలు పెరిగే ప్రాంతాలను పరిరక్షించాలని.. ఇతర అవసరాల కోసం ఆ మొక్కలను నరికివేయడం మానుకోవాలని సూచిస్తున్నారు.

అంతేకాదు, భవిష్యత్తులో మరింత మేలు రకం వంగడాలు అభివృద్ధి చేసేందుకు ఆ అడవి కాఫీ మొక్కల నమూనాలను భద్రపరచాల్సిన అవసరం ఉందంటున్నారు.

ఈ అధ్యయనం వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌ ప్రచురించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)