వెనెజ్వేలా సంక్షోభంపై రెండుగా చీలిన దేశాలు, ఇది ప్రపంచ సంక్షోభానికి దారి తీస్తుందా?

  • 28 జనవరి 2019
వెనెజ్వేలా అధ్యక్షుడిగా గ్వాయిడో ప్రకటన అంతర్జాతీయ సమాజాన్ని రెండుగా చీల్చింది. Image copyright Getty Images
చిత్రం శీర్షిక వెనెజ్వేలా అధ్యక్షుడిగా గ్వాయిడో ప్రకటన అంతర్జాతీయ సమాజాన్ని రెండుగా చీల్చింది

వెనెజ్వేలాలో రాజకీయ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది.

అధ్యక్షుడు మడూరో రాజీనామా చేయాలంటూ ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రతిపక్ష నేత జువాన్ గ్వాయిడో తనకు తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.

గ్వాయిడోకు అమెరికా, కెనడా, బ్రెజిల్, కొలంబియా, అర్జెంటీనా వంటి దేశాలు మద్దతు తెలిపాయి. అయితే యూరోపియన్ యూనియన్ గ్వాయిడోకు మద్దతు పలుకుతూనే, మళ్లీ ఎన్నికలు జరగాలని కోరుకుంది.

మడూరోకు చైనా, రష్యా మద్దతు

రష్యా, చైనాలు ప్రస్తుత అధ్యక్షుడు మడూరోకు మద్దతు ప్రకటించాయి.

గ్వాయిడో ప్రకటనను 'నేరుగా రక్తపాతానికి దారితీసే చర్య' అని రష్యా గురువారం నాడు వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలను మేం సహించబోమని, దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

వెనెజ్వేలా విషయంలో విదేశీ జోక్యాన్ని సహించబోమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ స్పష్టం చేశారు. తమ సార్వభౌమాధికారం, స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోవడానికి వెనెజ్వేలా చేపట్టే చర్యలకు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యానికి తాము ఎల్లప్పుడూ వ్యతిరేకమేనని అన్నారు.

టర్కీ, ఇరాన్, మెక్సికో, క్యూబా, మరికొన్ని దేశాలు మడూరోకు మద్దతు ప్రకటించాయి.

మేము మీతోటే ఉంటాం అని టర్కీ అధ్యక్షుడు రిసెప్ తాయిప్ ఎర్డోగాన్... మడూరోకు ఫోన్‌లో చెప్పారని టర్కీ అధ్యక్షుడి ప్రతినిధి ఇబ్రహీం కలీన్ తెలిపారు. #WeAreMADURO అని ఓ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా షేర్ చేశారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక అమెరికా తనను వెనెజ్వేలా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ప్రయత్నిస్తోందని మడూరో ఆరోపిస్తున్నారు

అమెరికాతో తెగతెంపులు చేసుకున్న వెనెజ్వేలా

అమెరికా, వెనెజ్వేలాల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు మాత్రం ఇప్పట్లో తగ్గేటట్లు లేవు.

గ్వాయిడోను తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తిస్తూ డోనల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన వెంటనే, అమెరికాతో ద్వైపాక్షిక, రాజకీయ సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నామని మడూరో తెలిపారు. 72 గంటల్లో అమెరికా రాయబారులు, అధికారులు తమ దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు.

దీనికి ప్రతిగా, మడూరో ద్వారా వెనెజ్వేలాతో తాము ఎలాంటి ద్వైపాక్షిక సంబంధాలు నెరపడం లేదని, గ్వాయిడోతో మాత్రమే తాము సంప్రదింపులు జరుపుతామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో వెల్లడించారు.

"సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించే, తమ అధికారులను దేశం విడిచి వెళ్లమనే అధికారం మాజీ అధ్యక్షుడు మడూరోకు లేదు" అని పాంపేయో అన్నారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక వెనెజ్వేలాపై ఆంక్షలు విధించడం ద్వారా మడూరోపై ట్రంప్ ఒత్తిడి పెంచవచ్చని భావిస్తున్నారు

సైనిక చర్యకు అవకాశం లేదు

వెనెజ్వేలాపై సైనికచర్యకు దిగాలని 2017లోనే అనుకున్నానని ట్రంప్ బుధవారం నాడు వైట్‌హౌస్‌లో వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ అన్ని అంశాలనూ పరిగణిస్తున్నాం అని ట్రంప్ అన్నారు.

వెనెజ్వేలాకు ప్రధాన ఆదాయ వనరు అయిన చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఆ దేశ మీడియా అభిప్రాయపడింది.

ఇది రష్యా, చైనాల నుంచి తెచ్చుకున్న బిలియన్ల కొద్దీ డాలర్లను వెనెజ్వేలా తిరిగి ఇవ్వడంపై ప్రభావాన్ని చూపుతుంది.

రష్యా నుంచి గోధుమలు ఎగుమతితోపాటు, చమురు, గనుల రంగాల్లో 6 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులకు మడూరోతో రష్యా అధ్యక్షుడు పుతిన్ గత నెలలో ఒప్పందం చేసుకున్నారు. రష్యా నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాలు, ట్యాంకులు, రాకెట్ లాంఛర్ల వంటి మిలిటరీ సామగ్రిని కొనుగోలు చేసే దేశాల్లో వెనెజ్వేలా కూడా ముఖ్యమైనది. ఈ సమావేశం ముగిసిన కొద్దిరోజులకే వెనెజ్వేలాతో కలసి యుద్ధ విన్యాసాలు చేపట్టేందుకు అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యమున్న టీయూ-160 యుద్ధ విమానాలు రెండింటిని కారకస్‌కు రష్యా పంపించింది.

పశ్చిమార్థగోళంలో తమ సైనిక బలాన్ని చాటేందుకే రష్యా టీయూ-160 యుద్ధ విమానాలను కారకస్‌కు పంపించిందని నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీలో రష్యా, యూరాసియాలకు సీనియర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న మిరియమ్ లాన్స్‌కోయ్ అభిప్రాయపడ్డారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక 2005-17 మధ్యలో చైనా బ్యాంకుల నుంచి వెనెజ్వేలా 62 బిలియన్ డాలర్లను అప్పుగా తెచ్చుకుంది

అమెరికా, రష్యాలు పరస్పర ఆరోపణలను నివారించాల్సిన ప్రధాన బాధ్యత వెనెజ్వేలా పొరుగుదేశాలపై ఉంది. గ్వాయిడోకు ఇంత వేగంగా మద్దతు తెలపడాన్ని చూస్తుంటే ఇదో అసాధారమ కలయికగా ఉందని బీబీసీ ప్రతినిధి వ్లాదిమిర్ హెర్నాండెజ్ అభిప్రాయపడ్డారు.

"ఇది ఊహించని పరిణామం. అమెరికా గ్వాయిడోకు అనుకూలంగా ప్రకటన చేసిన వెంటనే ఇతర దేశాలు కూడా మద్దతు పలికాయి. ఇదో అసాధారణ కలయిక" అని వ్లాదిమిర్ వ్యాఖ్యానించారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక మడూరో తన పదవి నుంచి వైదొలగాలని కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ దూకే వ్యాఖ్యానించారు

తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వెనక నుంచి పావులు కదుపుతున్నారని మడూరో కొలంబియా, అమెరికాలను ఉద్దేశించి ఎప్పటినుంచో విమర్శిస్తున్నారు. గత ఆగస్టులో తనను హత్యచేసేందుకు జరిగిన కుట్రలో కొలంబియా పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.

మడూరో వైదలగాలి, వెనెజ్వేలా ప్రజలకు స్వాతంత్య్రాన్నివ్వాలి అని కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ దూకే స్విట్జర్లాండ్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో మాట్లాడుతూ అన్నారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక కారకస్ చేరుకున్న రష్యా యుద్ధ విమానాలు

సైనిక చర్యకు తావు లేదు.

వెనెజ్వేలాపై సైనిక చర్య గురించి మేం ఆలోచించడం లేదు. దౌత్యపరమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం అని ఓ ప్రశ్నకు సమాధానంగా దూకే వ్యాఖ్యానించారు.

వెనెజ్వేలాపై సైనిక చర్యల్లో తమ దేశం పాలుపంచుకోదని బ్రెజిల్ ఉపాధ్యక్షుడు జనరల్ హామిల్టన్ మౌరావో స్పష్టం చేశారు. అవసరమైతే పునర్నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.

అంతర్జాతీయ శాంతి పరిరక్షణలో భాగంగా బ్రెజిల్ తమ దళాలను వెనెజ్వేలాకు పంపించాలని 2018 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మౌరావో అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)