అంబటి రాయుడు బౌలింగ్‌పై నిషేధం ఎందుకు విధించారు? దాని నుంచి బయటపడేదెలా?

  • 28 జనవరి 2019
రాయుడు Image copyright Getty Images

అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్‌ కారణంగా టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడిపై అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా నిషేధం విధించారు.

జనవరి 12న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో బౌలింగ్ చేశాక రాయుడి బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఆ మ్యాచ్‌లో రాయుడు రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 13 పరుగులు ఇచ్చాడు.

నిజానికి ఈ ఫిర్యాదు చేసిన 14 రోజుల్లోపు జరిగే టెస్టులో అంబటి రాయుడు తన బౌలింగ్ యాక్షన్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. కానీ రాయుడు ఆ పరీక్షకు హాజరుకాలేకపోయాడు.

దాంతో, ఒక ప్రకటన విడుదల చేసిన ఐసీసీ రాయుడి బౌలింగ్ యాక్షన్ పరిశీలించేవరకూ అతడి బౌలింగ్‌పై నిషేధం ఉంటుందని తెలిపింది. ఆ పరీక్షకు హాజరై తను సరైన యాక్షన్‌తోనే బౌలింగ్ చేస్తున్నానని రాయుడు నిరూపించుకోవాల్సి ఉంటుంది.

దేశవాళీ క్రికెట్‌లో నిషేధం లేదు

రాయుడు సాధారణంగా బ్యాట్స్‌మెన్. ప్రస్తుతం న్యూజీలాండ్‌లో ఐదు వన్డేల సిరీస్ ఆడుతున్న టీమిండియాలో ఉన్నాడు.

Image copyright Getty Images

సోమవారం ఈ సిరీస్ మూడో వన్డేలో అతడు 42 బంతుల్లో 40 పరుగులు కూడా చేసి నాటౌట్‌గా కూడా నిలిచాడు.

అయితే రాయుడు బీసీసీఐ దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో బౌలింగ్ చేయచ్చని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది.

రాయుడు ఇప్పటివరకూ భారత్ తరఫున 50 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచుల్లో సుమారు 20 ఓవర్లు బౌలింగ్ చేసి, 3 వికెట్లు కూడా పడగొట్టాడు. 50 పైగా యావరేజితో 1571 రన్స్ కూడా చేశాడు.

రాయుడు కుడిచేతి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, బౌలింగ్ కూడా కుడిచేత్తోనే వేస్తాడు.

మురళీధరన్‌కూ తప్పని పరీక్ష

గతంలో కూడా చాలామంది బౌలర్ల బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు రావడంతో ఐసీసీ వారిని పరీక్షకు హాజరు కావాలని సూచించింది.

వన్డేలు, టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించి టాప్ బౌలర్‌గా నిలిచిన శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ యాక్షన్‌పై కూడా గతంలో ఫిర్యాదులు వచ్చాయి.

కానీ తర్వాత జరిగిన పరీక్షలో మురళీధరన్ బౌలింగ్ యాక్షన్‌లో ఎలాంటి లోపం లేదని ఐసీసీ తేల్చింది.

ఆ తర్వాత పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌కు కూడా ఇలాంటి పరీక్ష జరిగింది.

అతడి బౌలింగ్ అక్రమం అని భావించిన ఐసీసీ అతడిపై కూడా నిషేధం విధించింది. బౌలింగ్ యాక్షన్ మార్చుకోమని సూచించింది. కానీ తర్వాత సయీద్ అజ్మల్ క్రికెట్ నుంచే తప్పుకున్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు