గర్భనిరోధక పిల్ రోజూ వేసుకోవచ్చా? ఇది అందరికీ ఎందుకు పని చేయదు?

  • 31 జనవరి 2019
గర్భనిరోధక మాత్రలు Image copyright Getty Images

‘రోజుకొక గర్భనిరోధక మాత్రను మింగితే పీరియడ్స్ సమయంలో కలిగే రక్తస్రావాన్ని, నొప్పిని నివారించవచ్చు.’ ఇటీవల కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన కథనం ఇది.

అయితే ఇలా రోజూ మాత్రలు మింగాలని తాము చెప్పలేదని, తమ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ దాన్ని ఖండిస్తూ వెంటనే సంబంధిత వర్గాలనుంచి ప్రకటన వచ్చింది.

"కొందరికి ఆశించిన ఫలితాలు ఇచ్చినప్పటికీ మహిళలందరికీ ఇది మంచిది కాదు" అని ది ఫ్యాకల్టీ ఆఫ్ సెక్సువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్‌కేర్ (ఎఫ్ఎస్ఆర్‌హెచ్) తెలిపింది.

ఈ పిల్ వాడేముందు తప్పనిసరిగా డాక్టర్లతో సంప్రదించి, తమకు తగిన వాటిని ఉపయోగించాలని సూచించింది.

Image copyright Getty Images

అసలు ఏమిటి ఈ పిల్?

కంబైన్డ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్... దీన్నే సింపుల్‌గా పిల్ అంటున్నారు. దీనిలో మహిళల్లో గర్భధారణకు అవసరమైన అండం విడుదల కాకుండా నిరోధించే హర్మోన్లు ఉంటాయి. దీన్ని సరైన మోతాదులో తీసుకుంటే 99శాతం ఫలితాలనిస్తుంది.

ఎన్నో బ్రాండ్లు దీన్ని తయారు చేస్తున్నప్పటికీ చాలామంది ఉపయోగిస్తున్న పిల్ ఒక్కో స్ట్రిప్‌లో 21 ఉంటాయి. పీరియడ్స్ తర్వాత రోజుకొకటి చొప్పున మూడు వారాలపాటు దీన్ని వేసుకోవాలి. చివరి వారం ఎలాంటి మాత్రలూ వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాలుగోవారంలో సాధారణంగా మళ్లీ పీరియడ్స్ వస్తాయి.

కొన్ని గర్భనిరోధక సాధనాల్లో ఉండే ఈస్ట్రోజన్ హార్మోనుతో ఇబ్బందులు ఉన్న మహిళలు ప్రొజెస్టిరాన్ హార్మోను ఉన్న మాత్రలను వేసుకోవచ్చు. వీటిని 'మినీ పిల్' అని పిలుస్తారు. ఇది కూడా మూడువారాల పాటు రోజూ వాడాలి.

Image copyright Getty Images

రోజూ ఎందుకు వాడకూడదు

సూచించిన విధానంలో క్రమం తప్పకుండా ఉపయోగిస్తేనే ఈ పిల్ సరైన ఫలితాలనిస్తుందంటున్నారు పరిశోధకులు. సూచించిన సమయానికి 24 గంటలు ఆలస్యంగా ఈ పిల్ వేసుకుంటే, ఇంక వేసుకోనట్లే లెక్క. అయితే ఇది ప్రొజెస్టిరాన్ పిల్‌కు మాత్రం వేరే విధంగా ఉండొచ్చు.

కొంతమంది మూడువారాలు వేసుకుని, ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా రోజూ ఈ పిల్ వాడుతూ ఉంటారు. అయితే వారం ఆపడం వల్ల ఆరోగ్యానికి అదనంగా ఎలాంటి ప్రయోజనాలు కలగవని ఎఫ్ఎస్ఆర్‌హెచ్ చెబుతోంది.

కానీ, కొందరు ఈ వారం రోజుల వ్యవధిని గుర్తుపెట్టుకోలేక, అవాంఛిత గర్భాన్ని నిరోధించడానికి రోజూ ఈ పిల్‌ను తీసుకుంటూ ఉంటారు.

పిల్ వేసుకోవడం మానేసే వారం మొదలు, చివరి రోజులే గర్భధారణకు అవకాశం ఉండే రోజులు అని ఎఫ్ఎస్ఆర్‌హెచ్ ప్రతినిధి డాక్టర్ డయానా మాన్సోర్ తెలిపారు.

"చాలా మంది మూడువారాలు టాబ్లెట్ వేసుకోవడం, ఒకవారం మానేయడం... ఇదే పద్ధతిని పాటిస్తారు. రుతుస్రావం జరిగింది అంటే తాము గర్భం ధరించలేదు అనే నమ్మకాన్ని పొందడానికే ఇలా చేస్తుంటారు" అని ఎఫ్ఎస్ఆర్‌హెచ్ ప్రతినిధి డాక్టర్ జేన్ డిక్సన్ బీబీసీతో చెప్పారు.

అయితే, రుతుస్రావం జరిగినంత మాత్రాన గర్భం రాదు అనుకోవడానికి లేదు. మన శరీరంలో గర్భనిరోధక రసాయనాలు ఏమీ లేవు అనడానికి అదో సంకేతం మాత్రమే అని జేన్ స్పష్టం చేశారు.

ఒకవేళ నెలనెల పీరియడ్స్ రాకపోతే నెలసరిలో పోవాల్సిన రక్తం శరీరంలో నిల్వ ఉండిపోతుంది అనే అపోహలు కూడా ఉన్నాయి. కానీ అది నిజం కాదు. పీరియడ్స్ వద్దు అనుకుంటే ఆపేసుకునే అవకాశం కూడా ఉంది అని డాక్టర్ జేన్ తెలిపారు.

చాలామందిలో ఆ వారంలో తలనొప్పి, మూడ్ బాగోకపోవడం వంటి చెడు ప్రభావాలు కూడా చూస్తుంటామని ఆమె అన్నారు.

Image copyright Getty Images

ఈ పిల్ సురక్షితమేనా?

ఈ కాంట్రసెప్టివ్ పిల్‌తో కొన్ని దుష్పరిణామాలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఇవి లైంగిక సంబంధాల ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని ఏవిధంగానూ అడ్డుకోలేవు.

ఒక్కోసారి రక్తం గడ్డకట్టడం, బ్రెస్ట్ కేన్సర్ వంటి తీవ్ర సమస్యలకు కూడా దారితీయవచ్చు.

మనుషులంతా ఒకేలా ఉండరు. అలాగే గర్భనిరోధక పద్ధతులు కూడా అందరికీ ఒకేరకంగా ఉండవు. వైద్యుల సలహాలు, మహిళల ఆరోగ్య స్థితిని బట్టి వీటిని ఎంచుకోవాలి అని ఎఫ్ఎస్ఆర్‌హెచ్‌కు చెందిన డాక్టర్ సారా హార్డ్‌మన్ అభిప్రాయపడ్డారు.

హార్మోన్లతో కూడిన కాంట్రసెప్టివ్ విధానాల వల్ల ఎంతో కొంత ప్రభావం ఆరోగ్యంపై కూడా ఉంటుందని, అందరికీ ఇవి సరిపడకపోవచ్చని డాక్టర్ సారా తెలిపారు.

35 సంవత్సరాల పైబడిన, పొగ తాగే మహిళలకు లేదా ఇతర అనారోగ్య సమస్యలున్నవారు ఇవి ఉపయోగించకూడదని అన్నారు. అలాగే గర్భవతులు కూడా ఈ పిల్ వాడకూడదని హెచ్చరించారు.

•ఒక రోజు ఆలస్యంగా తీసుకోవడం

•పిల్ వేసుకున్న రెండు గంటల్లో వాంతులు చేసుకోవడం

•తీవ్రమైన డయేరియా

•పిల్ ప్రభావాన్ని తగ్గించే కొన్ని రకాల మందుల వాడకం

ఇలాంటి సందర్భాల్లో ఈ పిల్ సరిగ్గా ప్రభావం చూపించకపోవచ్చు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)