వెనెజ్వేలా సంక్షోభం: ప్రతిపక్ష నేత కువాన్ గ్వాయిడోను దేశం దాటి వెళ్ళవద్దని ఆదేశించిన సుప్రీం కోర్టు

  • 30 జనవరి 2019
గ్వాయిడో Image copyright Getty Images

ప్రతిపక్ష నేత కువాన్ గ్వాయిడో దేశం విడిచి వెళ్ళడాన్ని నిషేధిస్తూ వెనెజ్వేలా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన బ్యాంక్ అకౌంట్లను కూడా స్తంభింప చేసింది.

గతవారం గ్వాయిడో తనను తాను తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటించుకున్న తరువాత ముదిరిన రాజకీయ సంక్షోభంలో భాగంగా ఈ నిర్ణయం వెలువడింది.

గ్వాయిడోకు అమెరికా తదితర దేశాల మద్దతు లభించింది. అయితే, నికొలస్ మడూరోకు రష్యా వంటి దేశాలు అండగా ఉన్నాయి.

మడూరో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, తాను ప్రతిపక్షంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

"ప్రతిపక్ష నేతలతో కలిసి చర్చలు జరపడానికి, వెనెజ్వేలా మంచి కోసం ఏం చేయాలో నిర్ణయించడానికి నేను సిద్ధంగా ఉన్నా" అని ఆయన కరకాస్‌లో రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ ఆర్.ఐఏ నోవోస్టీతో అన్నారు.

అయితే, ముందస్తు అధ్యక్ష ఎన్నికలు జరిగే అవకాశమే లేదని, మళ్ళీ ఎన్నికలు జరగాల్సింది 2025లోనే అని చెప్పిన మడూరో, "రాజకీయ చర్చలకు ఒక మెరుగైన సంకేతం"గా ముందస్తు పార్లమెంటరీ ఎన్నికలు నిర్వహించడాన్ని తాను బలపరుస్తానని కూడా అన్నారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక నికొలస్ మడూరో

యురోపియన్ యూనియన్ శనివారం నాడు ఒక ప్రకటన చేస్తూ, ఎనిమిది రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలని లేదంటే గ్వాయిడోను అధ్యక్షు నిగా గుర్తిస్తామని మడూరోను హెచ్చరించింది.

రెండు గంటల శాంతియుత నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని ప్రతిపక్షం బుధవారం నాడు తన మద్దతుదారులకు పిలుపునిచ్చింది. ఆ నిరసన ప్రదర్శనలో గ్వాయిడో పాల్గొంటారా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.

అదే సమయంలో, వెనెజ్వేలాలో విదేశీ మిలటరీ జోక్యాన్ని ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల బృందం వ్యతిరేకించింది.

కెనెడాతో కలిపి 2017లో ఏర్పాటైన 14 దేశాల లీమా గ్రూప్ వెనెజ్వేలా సంక్షోభానికి శాంతియుత పరిష్కారం సాధించాలని కోరుకుంటోందని, 'సైనిక జోక్యాన్ని' వ్యతిరేకిస్తోందని పెరూ దేశ విదేశాంగ మంత్రి నెస్టర్ పోపోలిజియో చెప్పారు.

చిత్రం శీర్షిక దేశమంతటా కొనసాగుతున్న ప్రజాందోళనలు

ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అన్ని అవకాశాలు చర్చల్లోనే ఉంటాయని అమెరికా అధికారులు అన్నారు.

వెనెజ్వేలా గంత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇటీవలి వారాల్లో అక్కడ హింస కూడా పెరిగింది.

మడూరో జనవరి 10న రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుంచి దేశంలో చాలా చోట్ల నిరసన ప్రదర్శలు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చాలా మంది ప్రతిపక్ష నాయకులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు. మరి కొందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ ఆరోపణల మధ్య జరిగిన ఎన్నికల్లో మడూరో ఎన్నికల్లో గెలిచారు.

ఐక్యరాజ్యసమితి చెప్పిన ప్రకారం జనవరి 21 నుంచి దేశంలో జరిగిన ఘర్షణల్లో 40 మందికి పైగా చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు.

అవధులు దాటిన ద్రవ్యోల్బణం, ఆహారం, మందులు వంటి నిత్యావసరాల కొరత మూలంగా చాలా మంది దేశం విడిచి వలసపోయారు.

సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

గ్వాయిడోకు వ్యతిరేకంగా "ముందస్తు చర్యలు" చేపట్టాలని అటార్నీ జనరల్ టారెక్ విలియం సాబ్ కోరిన వెంటనే సుప్రీం కోర్టు రంగంలోకి దిగింది. మడూరోకు అనుకూలంగా ఉన్న న్యాయస్థానం గ్వాయిడోపై తీసుకోవాల్సిన చర్యల మీద ఆమోద ముద్ర వేసింది.

దేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగించినందుకు ప్రాథమిక విచారణ పూర్తయ్యేంతవరకు ప్రతిపక్ష నేత దేశం విడిచి వెళ్ళడానికి వీలు లేదు అని సుప్రీం కోర్టు అధిపతి మాయికెల్ మోరెనో అన్నారు.

గ్వాయిడో నేషనల్ అసెంబ్లీ లీడర్ కాబట్టి ఆయనపై సుప్రీంకోర్టు ఆదేశిస్తే తప్ప ఎలాంటి విచారణ చేయడానికి వీల్లేదు.

పార్లమెంటు వద్ద గ్వాయిడో విలేఖరులతో మాట్లాడుతూ, ఈ చర్యలేవీ "కొత్త" కాదని వ్యాఖ్యానించారు. "బెదరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. మేం ఇక్కడే ఉన్నాం. మా పని మేం చేస్తున్నాం" అని చెప్పారు.

గ్వాయిడోను దేశాధ్యక్షునిగా గుర్తించిన అమెరికా, వెనెజ్వేలాలోని యూఎస్ బ్యాంకు అకౌంట్ల నియంత్రణాధికారాలను ఆయనకు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది సేపటికే కోర్టు నిర్ణయం వెలువడింది.

దీనిపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ స్పందించారు. "ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీయాలని, గ్వాయిడోకు హాని చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని ఆయన ట్వీట్ చేశారు.

గ్వాయిడో తానే అధ్యక్షుడినని ఎందుకు ప్రకటించుకున్నారు?

రాజ్యాంగం అందుకు అనుమతిస్తోందని గ్వాయిడో అంటున్నారు. అధ్యక్షుడు చట్టవిరుద్ధంగా ఉన్నారని భావించినప్పుడు నేషనల్ అసెంబ్లీ అధినేత తాత్కాలికంగా అధికారాన్ని తన చేతిలోకి తీసుకోవచ్చని ఆయన చెబుతున్నారు.

"అధికార దుర్వినియోగం, నియంతృత్వ పాలన నడుస్తున్నప్పుడు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడమే నా విధి" అని ఆయన గ్వాయిడో అన్నారు.

మడూరో ప్రభుత్వం దేశ వీధుల్లో "యువకులను హతమార్చుతోంద"ని ఆయన ఆరోపించారు.

ఏయే దేశాలు ఎటు వైపు?

గ్వాయిడోను వెనెజ్వేలా అధ్యక్షునిగా గుర్తిస్తున్నట్లు అమెరికా ప్రకటించిన తరువాత 20కి పైగా దేశాలు ఆ అందుకు ఆమోదం తెలిపాయి.

అయితే, రష్యా, చైనా, మెక్సికో, టర్కీ వంటి ఇతర శక్తిమంతమైన దేశాలు బాహాటంగా మడూరోను సమర్థిస్తున్నట్లు ప్రకటించాయి.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్, "అమెరికా ఆంక్షలు అన్ని రకాల అంతర్జాతీయ విధి విధానాలు ఉల్లంఘించాయి. అధ్యక్షుడు మడూరో నాయకత్వంలోని చట్టబద్ధమైన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు చేయాల్సిందంతా చేస్తాం" అని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

మిలిటెంట్ల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన కాంగ్రెస్.. ఈ ప్రచారంలో నిజమెంత

పుల్వామా దాడి: పాకిస్తాన్‌ను దారికి తెచ్చే ఆ ‘మాస్టర్ స్ట్రోక్‌’ను మోదీ కొడతారా

మెక్సికో, అమెరికాల మధ్య గోడ కట్టేందుకు దేనికైనా సిద్ధమే: డోనల్డ్ ట్రంప్

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన భాష తెలుగే: ఆస్ట్రేలియా ప్రొఫెసర్ అధ్యయనం

ఆంధ్రప్రదేశ్: బాల్యవివాహాలను అరికట్టేవారికే నా ఓటు

#BBCSpecial: మసూద్ అజర్‌ను టెర్రరిస్టుగా ప్రకటించాలనే డిమాండ్‌కు చైనా అడ్డుపుల్ల ఎందుకు?

భారత్‌లో కులం-మతం లేకుండా సర్టిఫికెట్ పొందిన మొట్ట మొదటి మహిళ

‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎలా ప్రకటిస్తుంది