గుండెల్ని పిండేసే వ్యథ: జైలుకు వెళ్లేందుకు పదేపదే నేరాలు చేస్తున్న జపాన్ వృద్ధులు.. ఎందుకంటే...

  • 3 ఫిబ్రవరి 2019
తోషియో తకాటా
చిత్రం శీర్షిక ‘‘చేతిలో కత్తి ఉంది కాబట్టి నన్ను వీలైనంత ఎక్కువ కాలం జైల్లో ఉంచుతారని అనుకున్నా''

వయసు మళ్లాక చాలామంది.. మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా కాలం గడపాలనుకుంటారు. వృద్ధాప్యంలో ఆనందంగా జీవించాలనుకుంటారు. కానీ జపాన్‌లోని వృద్ధులు మాత్రం జైళ్లలో గడపాలని అనుకుంటున్నారు. కావాలని చిన్న చిన్న దొంగతనాలు చేసి మరీ జైలుకు వెళుతున్నారు.

నేరాలకు పాల్పడుతున్నవారిలో 65ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య గత 20ఏళ్లుగా పెరుగుతోంది. ఎందుకు?

అలా జైలు శిక్ష అనుభవించినవారిలో కొందర్ని బీబీసీ పలకరించింది. వారు జైలుకు వెళ్లడానికి కారణాలేంటో వారి మాటల్లోనే విందాం..

''నాకు 85 సంవత్సరాలు. ఇంతవరకూ దాదాపు 20నేరాలు చేశాను. ఈ విషయం చెప్పడానికి నాకు చాలా అవమానంగా ఉంటుంది'' అని యొషించి హోసోకవా అనే వృద్ధుడు అన్నారు.

జపాన్ జైళ్లలో ఉన్న ఖైదీల్లో సుమారు 18 శాతం మంది 60 ఏళ్లు, అంతకు మించిన వయసున్నవారే. వాళ్లు చేస్తున్నవన్నీ చిన్న చిన్న దొంగతనాలు, దారి దోపిడీల్లాంటివే.

పదే పదే చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడేవారికి జపాన్‌లో చాలా కఠినమైన శిక్షలుంటాయి. కానీ అలాంటి నేరాల్లో.. వృద్ధులే ముందున్నారు.

ఈ వీడియో చూడండి

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: 'నాకు తోడుగా భార్యాపిల్లలు ఉండుంటే, నేను ఇలా ఉండేవాడిని కాదు..'

పలకరించడానికి నలుగురు మనుషులు కావాలని...

తోషియో అనే మరో వృద్ధుడు మొదటిసారిగా ఓ బైక్ ను దొంగిలించి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆయన చేసిన నేరాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు తోషియోను చాలా రోజులు జైల్లో పెట్టారు.

''నేనో మహిళలను కాస్త భయపెట్టాను. ఆమెకు ఎలాంటి హాని చెయ్యాలని అనుకోలేదు. కేవలం ఆమెకు కత్తి చూపించి భయపెడితే, ఆమె పోలీసులను పిలుస్తుందని భావించాను. చేతిలో కత్తి ఉంది కాబట్టి నన్ను వీలైనంత ఎక్కువ కాలం జైల్లో ఉంచుతారని అనుకున్నా'' అని తోషియో బీబీసీతో అన్నారు.

బయట ఒంటరిగా బతికే కన్నా జైల్లో నలుగురితో కలిసి బతకడమే తమకు హాయిగా ఉంటుందని జపాన్‌లోని వృద్ధులు భావిస్తున్నారు. నిజానికి.. డబ్బు, ఆవాసం వారి కనీస అవసరాలు. వీటికి తోడు పలకరించడానికి నలుగురు మనుషులు కావాలి. తమ చుట్టూ ఉన్న సమాజం సాయం కావాలి.

యోషి జైలు నుంచి విడుదలయ్యాక, కొన్ని స్వచ్ఛంద సంస్థల సాయంతో బతకడం ఆయనకు చాలా కష్టంగా ఉంది.

''స్వేచ్ఛగా బతకలేకపోవడం చాలా కష్టం. బయట ఉంటే రేపు ఎలా బతకాలా.. అని ఆలోచించాలి. చేతిలో డబ్బులుంటే ఏదైనా చెయ్యచ్చు. కానీ అవి లేకపోతే ఏం చేయాలి? ఏదైనా షాపులో దొంగతనం చేస్తే, కొన్నేళ్ల పాటు జైల్లో సుఖంగా ఉండొచ్చు'' అని యోషి అన్నారు.

2014 గణాంకాల ప్రకారం జపాన్ జనాభాలో దాదాపు 30%మంది వృద్ధులు ఉన్నారు.

చిత్రం శీర్షిక జైలు వరండాలో నడుస్తున్న గార్డు

‘ప్రభుత్వ పింఛన్‌తో జీవించడం చాలా కష్టం’

జపాన్ ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తో వృద్ధులు జీవించడం చాలా కష్టం అని జనసంఖ్యాక శాస్త్రజ్ఞుడు మైఖెల్ న్యూమన్ అన్నారు. మైఖెల్ ఆస్ట్రేలియాలో పుట్టి, టోక్యోకు చెందిన అధ్యయన సంస్థ 'కస్టమ్స్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ గ్రూప్'లో పని చేస్తున్నారు.

2016లో ఓ పత్రికలో వచ్చిన సమాచారం మేరకు మైఖెల్ కొన్ని లెక్కలు వేశారు. ఆ ప్రకారం, ఏ ఇతర ఆదాయ మార్గం లేని వృద్ధులు తమ ఇంటి అద్దె, భోజనం, వైద్య ఖర్చులను తీర్చుకోవాలన్నా అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. గతంలో వృద్ధులను వాళ్ల పిల్లలు చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జపాన్‌లోని చాలా ప్రాంతాల్లో ఆదాయ మార్గాలు లేక, ఆర్థిక అవసరాల కోసం పిల్లలు తమ తల్లిదండ్రులను వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

''తాము పిల్లలకు బరువు కాకూడదని వృద్ధులు అనుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వ పింఛన్‌తో బయట జీవించలేకపోతే, వారి వద్ద ఉన్న ఏకైక మార్గం జైలుకు వెళ్లడమే!'' అని మైకెల్ అన్నారు.

జైలులో మూడు పూటలు ఉచితంగా పెట్టే భోజనం కోసం మళ్లీ మళ్లీ నేరాలు చేసి, జైలుకు వెళుతున్నారని ఆయన వివరించారు.

చిత్రం శీర్షిక జైలులో ఒక శిక్షణా తరగతిలో ఖైదీలు, అధికారులు

‘మనుషుల మధ్య సంబంధాలు మారిపోయాయి’

''ఆత్మహత్యలు కూడా చాలా మామూలు అయిపోయాయి. జైలుకు వెళ్లడం కాకుండా, తమ కష్టాల నుంచి విడుదలయ్యే మరో మార్గం ఆత్మహత్యలేనని వృద్ధులు భావిస్తున్నారు'' అని మైఖెల్ అన్నారు.

జపాన్ కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పులతో వృద్ధులు నేరాలకు పాల్పడుతున్నారని 'విత్ హిరోషిమా' అనే పునరావాస శిబిరానికి చెందిన తోషియో టకాటా అన్నారు. కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పుల్లో ఆర్థికపరమైన మార్పుల కంటే, మానసిక సంబంధాల్లో వచ్చిన మార్పుల ప్రభావమే ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

''మనుషుల మధ్య సంబంధాలు మారిపోయాయి. ఈ సమాజంలో బతికేందుకు వారికి చోటు దొరకడం లేదు. అలాగని, ఒంటరిగా జీవించలేకపోతున్నారు'' అని 85ఏళ్ల కనీచీ యెమడా అనే వృద్ధుడు అభిప్రాయపడ్డారు.

హిరోషిమాలో అణుబాంబు పేలిన ఘటనలో, తన ఇంటి శిథిలాల కింద చిక్కుకున్న కనీచీని బయటకు లాగి కాపాడారు.

''వృద్ధాప్యంలో నేరాలకు పాల్పడుతున్నవారికి మధ్య వయస్సులోనే బీజం పడి ఉంటుంది. తమ భాగస్వామిని, లేదా పిల్లల్ని కోల్పోయి ఒంటరి జీవితం గడపలేక, ఈ పరిస్థితికి వచ్చుంటారు. మనకంటూ ఓ తోడు, మనల్ని ప్రేమించేవారు మనతో ఉంటే ఎవరూ నేరాలు చేయరు'' అని ఆయన అన్నారు.

చిత్రం శీర్షిక 'మనుషుల మధ్య సంబంధాలు మారిపోయాయి. ఈ సమాజంలో బతికేందుకు వారికి చోటు దొరకడం లేదు. అలాగని, ఒంటరిగా జీవించలేకపోతున్నారు'

‘తోడుగా భార్యాపిల్లలు ఉండుంటే...’

నేరాలకు పాల్పడటానికి కారణం పేదరికం అన్నది ఓ సాకు మాత్రమేనని, ఒంటరితనమే తన నేర చరిత్రకు అసలు కారణం అని కనీచీ అంటారు. జైళ్లలో లభించే తోటి నేరస్థుల తోడు కోసం నేరాలు చేయడం కూడా మరో కారణం అయ్యుండొచ్చని ఆయన భావిస్తున్నారు.

ఈ ప్రపంచంలో తోషియోకు ఎవరూ లేరు. ఆయన ఒంటరి. ఆయన తల్లిదండ్రులు చనిపోయారు. తన ఇద్దరు అన్నయ్యలతో సంబంధాలు లేవు. తన ముగ్గురు పిల్లలు, విడాకులు ఇచ్చిన తన ఇద్దరు మాజీ భార్యలు ఎక్కడ ఉన్నారో తెలీదు.

తనకంటూ భార్య, పిల్లలు.. ఓ కుటుంబం ఉండివుంటే పరిస్థితులు ఇలా ఉండేవి కావేమోకదా.. అని ప్రశ్నిస్తే..

''నాకు తోడుగా భార్యాపిల్లలు ఉండుంటే, నేను ఇలా ఉండేవాడిని కాదు..'' అని తోషియో అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ఈ కథనం గురించి మరింత సమాచారం