మైక్రోసాఫ్ట్: సత్య నాదెళ్ల వచ్చాక ఈ సంస్థ మళ్ళీ నంబర్ వన్ ఎలా అయింది?

  • 4 ఫిబ్రవరి 2019
సత్య నాదెళ్ల Image copyright Facebook/Microsoft

ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈవో)గా తెలుగు తేజం సత్య నాదెళ్ల నియమితులై ఫిబ్రవరి 4తో అయిదేళ్లవుతుంది.

బాధ్యతలు చేపట్టిన తర్వాత మైక్రోసాఫ్ట్ ఆర్థిక స్థితిగతులను సత్య అసాధారణ స్థాయిలో మార్చేశారు. 2002 తర్వాత తొలిసారిగా ఆయన హయాంలోనే 2018 నవంబరులో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ అవతరించింది. అప్పటి నుంచి ఈ స్థానం కోసం అమెజాన్‌తో పోటీపడుతూనే ఉంది.

మైక్రోసాఫ్ట్ పాతకాలపు సంస్థలా చాలా మందికి అనిపిస్తుంది. కానీ, ఇదే సంస్థ అందించిన ఆపరేటింగ్ సిస్టమ్ 1980వ దశకం ద్వితీయార్ధంలో, 1990వ దశకంలో ప్రపంచాన్ని ఏలింది.

టెక్నాలజీలో ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు, మార్పులు వస్తుంటాయి. వీటిని అవకాశాలుగా మలచుకోవడంలోనే టెక్ సంస్థల విజయం దాగి ఉంటుంది.

1975 నుంచి 2000వ సంవత్సరం వరకు మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న బిల్ గేట్స్ 'పర్సనల్ కంప్యూటింగ్' రూపంలో వచ్చిన విప్లవాత్మక మార్పును అందిపుచ్చుకుని విజయం సాధించారు. కానీ 2000 నుంచి 2014 వరకు సీఈవోగా చేసిన స్టీవ్ బాల్మర్ మొబైల్ రంగంలో వచ్చిన ఇలాంటి అవకాశాన్ని ఒడిసిపట్టలేకపోయారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక స్టీవ్ బాల్మర్ మొబైల్ రంగంలో వచ్చిన మార్పును ఒడిసిపట్టలేకపోయారు.

మైక్రోసాఫ్ట్ తెచ్చిన 'సర్ఫేస్' ట్యాబ్లెట్ ఓ మోస్తరు విజయం సాధించినా, సంస్థ స్మార్ట్‌ఫోన్ల వ్యాపారం విఫలమైంది. నోకియా మొబైల్ వ్యాపారాన్ని ఈ సంస్థ 6.2 బిలియన్ డాలర్లు చెల్లించి కొనుగోలు చేసింది. యాపిల్ ఐఫోన్, గూగుల్ ఆండ్రాయిడ్ కంపెనీలు మొబైల్ వ్యాపారంలో మైక్రోసాఫ్ట్‌ను బాగా దెబ్బతీశాయి.

విజయవంతమైన ఎన్నో టెక్ కంపెనీల మాదిరే మైక్రోసాఫ్ట్ తన ప్రస్థానంలోనూ వివిధ దశలను దాటుకొని వచ్చింది. ఆ దశలు-

1. సరికొత్త ఆలోచనతో వచ్చిన చురుకైన స్టార్టప్

2. శరవేగంగా ఎదుగుతూ, అప్పటికే ఉన్న సంస్థలను నామరూపాల్లేకుండా చేస్తూ, ప్రపంచాన్ని మార్చేస్తున్న సంస్థ

3. సర్వత్రా వ్యాప్తి చెంది, అందరి జీవితాల్లో భాగమైపోయిన సంస్థ

4. చిన్నస్థాయి పోటీసంస్థలను కొనేసే లేదా నియంత్రణలోకి తెచ్చుకొనే గుత్తాధిపత్య సంస్థగా అవతరణ

5. అపరిమితమైన శక్తిగల సంస్థగా మార్పు

6. రాబోయే విప్లవాత్మక మార్పు(బిగ్ వేవ్)కు అనుగుణంగా సత్వరం మారలేని భారీ సంస్థ

కొన్ని విప్లవాత్మక మార్పులకు తగినట్లుగా తాము స్పందించలేకపోయామని, అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయామని మైక్రోసాఫ్ట్ చీఫ్ స్టోరీటెల్లర్ స్టీవ్ క్లేటన్ అంగీకరించారు. అయినప్పటికీ మరింత ఎదిగేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటామని ఆయన చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సత్య నాదెళ్ల

క్లౌడ్ కంప్యూటింగ్: సత్య పట్టుదల

మైక్రోసాఫ్ట్ ఆరో దశలో ఉందనే భావన ఉన్న తరుణంలో మరో విప్లవాత్మక మార్పు వచ్చింది. అదే- 'క్లౌడ్ కంప్యూటింగ్'. దీనిపై సత్యకు ఆసక్తి ఎక్కువ. సత్యను సీఈవోను చేసిన అంశాల్లో- క్లౌడ్ కంప్యూటింగ్‌తో వచ్చే అవకాశాలను మైక్రోసాఫ్ట్ ఒడిసిపట్టుకొని, విజయవంతమవ్వాలనే ఆయన పట్టుదల ఒకటి.

సర్వర్లు, సాఫ్ట్‌వేర్, స్టోరేజీ, డేటాబేస్‌లు, నెట్‌వర్కింగ్, అనలిటిక్స్, ఇతర కంప్యూటింగ్ సర్వీసులను ఇంటర్నెట్ ద్వారా ఎక్కడైనా, ఏ డివైస్‌తోనైనా అందించే టెక్నాలజీయే క్లౌడ్ కంప్యూటింగ్. ఇక్కడ ఇంటర్నెట్‌నే 'క్లౌడ్'గా భావించవచ్చు.

సొంత బ్రాండ్‌ స్మార్ట్ ఫోన్లను తీసుకురావాలనే మైక్రోసాఫ్ట్ నిర్ణయం బెడిసికొట్టిందనే విషయాన్ని పక్కనబెడదాం. కానీ, మైక్రోసాఫ్ట్ మరో అంశంలో విజయవంతమైంది.

మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఆఫీస్ సూట్ ఎన్ని డివైస్‌లలో వాడితే సంస్థకు అన్ని లాభాలు వస్తాయి.

సబ్‌స్క్రిప్షన్ల వాటా సంస్థ రాబడిలో దాదాపు మూడింట రెండొంతులు ఉంది. ఈ ఆదాయానికి మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్ అయిన 'అజూర్'తో వచ్చే ఆదాయాన్ని జోడించి చూస్తే- సత్య సీఈవో అయ్యాక సంస్థ షేర్ విలువ ఎందుకు మూడింతలు అయ్యిందో నెమ్మదిగా అర్థమవుతుంది.

Image copyright Twitter/Satya Nadella

ఆరు దశలను చూసిన మైక్రోసాఫ్ట్‌ ఏడో దశలో ఏమైంది? ఏదైనా టెక్ సంస్థ ఏడో దశలో పతనమవడం లేదా టెక్ మౌలిక సదుపాయాల్లో ఒక భాగంగా మారడం జరగొచ్చు.

టెక్ రంగంలో ఒక 'కూల్ కంపెనీ'గా తాము ఉండదలచుకోలేదని, ఇతరులను కూల్‌గా ఉంచే కంపెనీగా ఉండాలనుకొంటున్నామని సత్య లోగడ వ్యాఖ్యానించారు. ఏడో దశలో తన పరిస్థితిపై మైక్రోసాఫ్ట్ ఆత్మవిశ్వాసంతో ఉంది. అదే సమయంలో, ప్రతి పోటీలోనూ తాము గెలవలేమని, కొన్ని పోటీల్లో ఇతరులు నెగ్గుతారని, వారి విజయాన్ని స్వాగతించాల్సి ఉందని మైక్రోసాఫ్ట్ పరోక్షంగా అంగీకరిస్తోంది.

మైక్రోసాఫ్ట్‌లో కాకుండా ఇతర సంస్థల్లో పురుడు పోసుకున్న కొత్త ఆలోచనలను కూడా ఆకళింపు చేసుకొని, అనుసరించాల్సి ఉందనేది సత్య బాగా నమ్మే సూత్రాల్లో ఒకటి. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ ఓపెన్ సోర్స్‌కు చేరువైంది. క్లౌడ్ సేవలు అందించే తన ప్రత్యర్థి అయిన అమెజాన్‌తోపాటు ఇతర పోటీసంస్థలతోనూ జట్టు కట్టింది.

ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాపిల్ ఐప్యాడ్‌పైనా పనిచేస్తుంది.

''ఏది ముఖ్యమో, ఏం చేయాల్సిన అవసరముందో ఉద్యోగులకు కంపెనీ పెద్దలు చెప్పేందుకు ఉద్దేశించిన సమావేశాలను 2014లో రద్దు చేశాం. వీటి స్థానంలో, ఏది ముఖ్యమో, ఏం చేయాల్సిన అవసరముందో ఉద్యోగులే కంపెనీ పెద్దలకు చెప్పేందుకు వీలు కల్పించే 'హ్యాకథాన్'ను తీసుకొచ్చేందుకే ఇలా చేశాం'' అని మైక్రోసాఫ్ట్ గరాజ్ అనే విభాగం సారథి జెఫ్ రామోస్ తెలిపారు. ఎవరైనా ఉద్యోగులు తమకు ఏదైనా చురుకైన ఆలోచన తడితే, దానికి సంబంధించిన ప్రయోగం చేసేందుకు ఈ విభాగం వీలు కల్పిస్తుంది.

నేను (బీబీసీ ప్రతినిధి) అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో సియాటిల్ నగరానికి సమీపంలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయానికి వెళ్లినప్పుడు అందులో 'బ్యాట్‌కేవ్' అనే ఒక గదిని చూశాను. చూడటానికి ఇది సాధారణ గదిలాగే ఉంటుంది. కానీ, ఇక్కడ అసాధారణ ప్రయోగాలు జరుగుతున్నాయి.

చిత్రం శీర్షిక ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్‌సెట్స్ 'హోలోలెన్స్‌'ను పరీక్షించే గది బ్యాట్‌కేవ్

నేను ఒక ప్రయోగంలో స్వయంగా పాల్గొన్నాను. ఇందులో మైక్రోసాఫ్ట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్‌సెట్స్ 'హోలోలెన్స్‌'ను పరీక్షించాం.

ఈ ప్రయోగం ఎలా సాగిందంటే- నేను, మరో నలుగురం 'హోలోలెన్స్' పెట్టుకున్నాం. మేం ఒకరికొకరం కనిపించాం. పరిసరాలు కూడా కనిపించాయి. మా చుట్టూ కనిపించినవి మాత్రం గాల్లో తేలియాడుతూ ఉన్న చిత్రాలు, 3డీ వస్తువులు, అక్షరాలు, ప్రజెంటేషన్ మెటీరియల్. వీటికి మేం మరో వస్తువును జోడించాలనుకుంటే దాన్ని సెర్చ్‌లో వెతకడానికి బిగ్గరగా చెప్పాలి. అప్పుడు సంబంధిత 'రిజల్ట్స్' ఇమేజ్‌ల రూపంలో కనిపిస్తాయి. ఇలా వచ్చిన చిత్రాన్ని అవసరానికి తగినట్లుగా వాడుకున్నాం.

ప్రయోగంలో పాల్గొన్నవారిలో ఇద్దరు అక్కడ లేనేలేరు. ఒకరేమో న్యూయార్క్ నగరంలో, మరొకరు శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ఉన్నారు. వాళ్లు మాకు, మేం వాళ్లకు యానిమేటెడ్ అవతారాల్లో కనిపించాం. ఈ అవతారాలు రెప్పలు కూడా ఆడించాయి. వీటి పెదాల కదలిక మా మాటలకు తగినట్లుగా ఉంది.

చిత్రం శీర్షిక ఆ టెక్నాలజీ వస్తే ఆగ్మెంటెడ్ రియాలిటీతో కూడిన ప్రదేశమే మన పని ప్రదేశం కావొచ్చు.

ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ మన పని విధానాన్నే మార్చేసింది. ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించి ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది. అది అందుబాటులోకి వస్తే ఆగ్మెంటెడ్ రియాలిటీతో కూడిన ప్రదేశమే మన పని ప్రదేశం కావొచ్చు.

సీఈవో సత్య తమకు దిశానిర్దేశం చేస్తారని, వ్యూహాన్ని రూపొందిస్తారని , సంస్కృతిని అలవర్చుతారని, తదనుగుణంగా తాము పనిచేసుకుపోతామని మైక్రోసాఫ్ట్ చీఫ్ స్టోరీటెల్లర్ స్టీవ్ క్లేటన్ చెప్పారు.

లీనక్స్‌తో జట్టు కట్టిన మైక్రోసాఫ్ట్

లీనక్స్ ఓపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్ క్యాన్సర్‌లాంటిదని మాజీ సీఈవో స్టీవ్ బాల్మర్ ఒక సందర్భంలో చెప్పారు. ''మైక్రోసాఫ్ట్‌కు లీనక్స్ అంటే ప్రేమ'' అని చెప్పే ఒక డిస్‌ప్లే ముందు సత్య నిలబడి, మైక్రోసాఫ్ట్‌ను లీనక్స్ ఫౌండేషన్‌లో ఒక మెంబర్‌ను చేశారు. లీనక్స్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌లు పనిచేయడానికి అవసరమైన చాలా వరకు కంటెంట్‌ను డిజైన్ చేసే వేదిక అయిన కోడ్-షేరింగ్ వెబ్‌సైట్ జిట్‌హబ్‌ను 7.5 బిలియన్ డాలర్లు పెట్టి కొన్నారు.

సత్య సీఈవో అయ్యాక, ఇతర సంస్థల ఆలోచనలను స్వీకరించి, వాటిని అక్కున చేర్చుకునే కంపెనీగా మైక్రోసాఫ్ట్ మారింది. టెక్నాలజీలో విప్లవాత్మక మార్పు అయిన ‘క్లౌడ్ కంప్యూటింగ్'తో వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టిన ఆత్మవిశ్వాసం మైక్రోసాఫ్ట్‌లో తొణికిసలాడుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'

నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం

లోకేశ్ ట్వీట్: ‘జగన్ మాట మార్చడం వల్ల ఒక్కో మహిళకు రూ.45 వేల నష్టం’

కర్ణాటక అసెంబ్లీ: ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ.. కుమారస్వామి రాజీనామాను ఆమోదించిన గవర్నర్

అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే

చంద్రయాన్-2 భూకక్ష్యలోకి చేరింది, దీనివల్ల భారత్‌కు ఏం లభిస్తుంది

టిక్‌టాక్ యాప్‌ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది

బోరిస్ జాన్సన్: బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రి