జనాభా పెరిగితే పురుగులు తినాల్సిందేనా

  • 4 ఫిబ్రవరి 2019
తేలును తింటున్న యువతి Image copyright Getty Images

ప్లేటు నిండుగా మీకు ఇష్టమైన వంటకం ఉంది. తినడానికి మీరు సిద్ధమవుతున్నారు. కానీ, ప్లేటులో ఓ పురుగు కనిపించింది.

వెంటనే, సాధారణంగా, చాలామంది అసహ్యించుకుంటారు.

కానీ, మీకు ఇష్టమైన వంటకంతో కాకుండా, మీ ప్లేటును పురుగులతో నింపేయండని శాస్త్రవేత్తలు చెబుతున్నారు! గ్లోబల్ వార్మింగ్ మరి.

మారుతున్న వాతావరణ పరిస్థితులపై మనుషుల ఆహారపు అలవాట్ల ప్రభావం ఉందని నిపుణులు చెబుతున్నారు. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు మాంసం కూర, మిగతా రోజుల్లో ఆకుకూర పప్పు, వేపుళ్లతో కడుపు నింపుకుని బ్రేవ్‌మని తేన్చుతాం.

మనిషి ఇలా ఎన్నేళ్లు తినగలడు?

2050 నాటికి ప్రపంచ జనాభా 970 కోట్లకు చేరుకుంటుందని ఓ అంచనా. అంతటి జనాభాకు సరిపడా ఆహారం కావాలంటే, ప్రస్తుతం ఉన్న ఆహార ఉత్పత్తి రెట్టింపు కావాల్సిన అవసరం ఉంది.

మరోవైపు మాంసాహారం మాని, దాని ద్వారా వచ్చే ప్రొటీన్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, పురుగులు తినడం.. మీకు ఇబ్బంది అనిపిస్తే కీటకాలను అందాం. అలా కీటకాలను తినడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే ఆహారలోటును భర్తీ చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ వీడియోను చూడండి

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionపురుగులు తింటే ప్రపంచం బాగుంటుందా?

పురుగులనే ఎందుకు తినాలి?

2017లో తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ కాంబోడియా వెళ్లారు. అక్కడ ఆమె తేళ్లను ఫ్రై చేస్తూ, సాలీడు కాలిని చప్పరిస్తూ ‘నిజం చెప్పాలంటే రుచి ఎంతో బాగుంది’ అన్నారు.

మరికొందరు హాలీవుడ్ నటులు కూడా ఇలా కీటకాలను తిన్నవారి జాబితాలో చేరారు.

మాంసాహారంలోని ప్రొటీన్లను ‘యానిమల్ ప్రొటీన్’ అంటారు. మీరు మాంసాహారం మానేశాక, అందుకు ప్రత్యామ్నాయంగా కీటకాల్లోని ప్రొటీన్లతో సరిపెట్టుకోవచ్చు.

మనిషి తినదగిన కీటకాలు ఆరోగ్యవంతమైనవి. వాటిల్లో మంచి పోషక పదార్థాలు, ప్రొటీన్లు ఉంటాయి. అంతేకాదు, అవి మనకు అందుబాటులో ఉంటాయి, ఎక్కువగా దొరుకుతాయి కూడా. ప్రపంచంలో కీటకాల సంఖ్య 10 క్వింటిలియన్ (ఒకటి పక్కన 18 సున్నాలు ఉంచితే వచ్చే సంఖ్య) ఉంటుందని చెబుతారు.

కీటకాల పెంపకం ద్వారా వెలువడే కర్బన ఉద్గారాలు కూడా చాలా తక్కువ. చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా మనిషికి చెందిన మొత్తం కర్బన్ ఉద్గారాల్లో వ్యవసాయం నుంచి మాత్రమే 25% ఉద్గారాలు విడుదల అవుతున్నాయి.

వ్యవసాయంతో పోలిస్తే, కీటకాల సాగు ద్వారా చాలా తక్కువ ఉద్గారాలు వెలువడతాయి.

Image copyright Getty Images

కీచురాళ్లను చీకట్లో వినవచ్చు, వెలుతురులో తినవచ్చు..

చీకట్లో కీచురాళ్ల శబ్దం మీకందరికీ పరిచయం ఉండే ఉంటుంది. ఆ కీచురాళ్లు.. జంతువులు, పశువులతో పోలిస్తే 12 రెట్లు తక్కువ ఆహారం తీసుకుంటాయి.

కానీ, జంతువులు, పశువులతో సమానంగా మనకు ప్రొటీన్లను అందిస్తాయి.

Image copyright Getty Images

200కోట్ల మంది పురుగులను తింటున్నారు

పురుగులను ఆహార పదార్థాలుగా ఊహించుకోవడానికే చాలామంది ఇష్టపడరు. వెంటనే ‘యాక్...’ అనే ఫీలింగ్ వస్తుంది. అవి మురికిగా ఉంటాయని, రోగాలను వ్యాప్తి చేస్తాయనే భావన ఉంటుంది.

2017 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 200కోట్ల మంది ప్రజలు తమ సంప్రదాయంలో భాగంగా పురుగులను తింటున్నారని ఒక అంచనా. ఇప్పుడిప్పుడే పాశ్చాత్య దేశాల్లో దీని గురించి చర్చ జరుగుతోంది.

నెదర్లాండ్స్, ఆఫ్రికాల్లో కీటకాల పెంపకం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాపారం 2023 నాటికి రూ.8,575 కోట్లకు చేరుతుందని ఒక ఫుడ్ మేగజీన్ పేర్కొంది.

కీటకాలే అసలైన సూపర్ ఫుడ్ అని మనుషులు తినగలిగే కీటకాల వ్యాపారి షామి రాడియా అన్నారు.

‘‘కీటకాలు అసలైన సూపర్ ఫుడ్. వాటిల్లో ప్రొటీన్, మినరల్స్, అమైనో యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. వాటిని తినడంలో అర్థం ఉంది’’ అని ఆమె అన్నారు.

మాంసాహారం తినడం కంటే కీటకాలను తినడం పర్యావరణానికి మంచిది. వీటికి జీవ వ్యర్థాలను ఆహారంగా ఇవ్వవచ్చు. జంతువుల పెంపకంతో పోలిస్తే.. కీటకాల పెంపకానికి తక్కువ స్థలం, తక్కువ నీరు అవసరం అవుతుంది.

సాధారణంగా జంతువులు బలంగా తయారవ్వడానికి ఎక్కువ దాణా లేదా ఆహారం అవసరం.

ఉదాహరణకు ఏదైనా జంతువు కేజీ బరువు పెరగాలంటే దానికి 8 కేజీల దాణా అవసరం. కానీ, కీటకాలు అలా కాదు. వాటి రక్తం వేడిగా కాకుండా చల్లగా ఉండటంతో, సగటున 2 కిలోల ఆహారానికి 1 కిలో ‘కీటక ద్రవ్యరాశి’ వస్తుంది.

ప్రపంచంలో మనిషి ఆహారానికి 1,900 రకాల కీటకాలు ఉపయోగపడతాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ తెలిపింది.

చీమలు, ఈగలు, కందిరీగ, తేనెటీగ, గొంగళి పురుగు, కుమ్మరి పురుగు, మిడతలు, కీచురాళ్లు, తూనీగ లాంటి కీటకాలను వివిధ ప్రాంతాల ప్రజలు అత్యంత సాధారణంగా తింటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)