ట్రంప్, కిమ్‌ భేటీ: వియత్నాంలో ఫిబ్రవరి 27న రెండో సమావేశం

  • 6 ఫిబ్రవరి 2019
ట్రంప్ Image copyright Getty Images

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో ఈ నెలలో 'అణు సమావేశం' నిర్వహించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వెల్లడించారు.

జాతినుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అమెరికా సరిహద్దుల్లో గోడ నిర్మించి తీరుతానని కూడా చెప్పారు.

అమెరికాలో రాజకీయ ఐక్యత అవసరమని ఆయన అన్నారు. ఎగువ సభలో డెమొక్రటిక్ పార్టీ నేత గురించి మాట్లాడుతూ అనుచిత పదజాలం వాడిన కొద్దిగంటల్లోనే ట్రంప్ ఇలా రాజకీయ ఐక్యతకు పిలుపునివ్వడం చర్చనీయమవుతోంది.

Image copyright AFP

వియత్నాంలో భేటీ

ఫిబ్రవరి 27, 28 తేదీల్లో కిమ్ జోంగ్ ఉన్‌తో వియత్నాంలో సమావేశమవుతున్నానని ట్రంప్ ప్రకటించారు.

మంగళవారం రాత్రి జాతినుద్దేశించి మాట్లాడిన ఆయన.. అణు పరీక్షలు ఆగాయని, గత 15 నెలల్లో కొత్తగా క్షిపణి ప్రయోగాలూ జరగలేదని అన్నారు.

తాను కనుక అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికకాకుంటే ఈసరికి ఉత్తరకొరియాతో యుద్ధం జరిగేదని కూడా ట్రంప్ అభిప్రాయపడ్డారు.

కిమ్‌తో మంచి సంబంధాలే ఉన్నాయి.. చేయాల్సింది ఇంకా చాలా ఉందని ట్రంప్ అన్నారు.

కాగా గత ఏడాది జూన్‌లో సింగపూర్‌లో ఈ ఇద్దరు నేతల మధ్య తొలిసారి సమావేశం జరిగింది.

Image copyright Getty Images

రాజకీయ ఐక్యతపైరగడ

గత ప్రసంగాల్లో పిలుపునిచ్చినట్లే ఈసారి కూడా ట్రంప్ రాజకీయ ఐక్యతపై మాట్లాడారు. ''కలిసి నడిస్తే దశాబ్దాల ప్రతిష్టంభనకు ముగింపు పలకగలం'' అన్నారాయన.

'దూరాలను చెరిపేసుకుంటూ కొత్త వంతెన నిర్మించగలం మనం. పాత గాయాలను నయం చేసుకోగలం, కొత్త బంధాలను ఏర్పరుచుకోగలం, సరికొత్త పరిష్కారాలను కనుగొనగలం, అన్నిటికీ మించి అమెరికా భవిష్యత్‌కు గట్టి హామీ ఇవ్వగలం. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది మనమే'నని ట్రంప్ అన్నారు.

వివిధ అంశాలపై సయోధ్యకు సంకేతాలిస్తూ విపక్ష డెమొక్రాట్లకు ట్రంప్ స్నేహహస్తం చాచారు. మౌలిక వసతుల అభివృద్ధి, వైద్యుల చీటీపై విక్రయించే మందుల ధరలు తగ్గించడం, ఆరోగ్యసేవలకు సంబంధించిన అంశాలపై పరస్పర అంగీకారానికి అవకాశమిచ్చేలా మాట్లాడారు.

అదే సమయంలో 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి సంబంధించి డెమొక్రాట్లు చేస్తున్న విమర్శల విషయంలో మాత్రం ఎప్పటిలానే ఘాటుగా స్పందించారు. వాటిని పనికిమాలిన ఆరోపణలుగా కొట్టిపారేశారు.

కాగా ట్రంప్ ఉపన్యాసానికి కొద్దిసేపటి ముందు సెనేట్‌లోని డెమొక్రటిక్ నేత చక్ షూమర్ పలు విమర్శలు చేశారు. ''అధ్యక్షుడు ట్రంప్ ఏడాదికోసారి నిద్ర లేచి రాజకీయ ఐక్యత గురించి మాట్లాడుతారు. మిగతా 364 రోజులూ విభేధాలు రగిలించడంలోనే నిమగ్నమవుతారు'' అన్నారు. దీంతో ట్రంప్ ఆయన్నుద్దేశించి మీడియా వద్ద అనుచిత వ్యాఖ్యలు చేశారని 'న్యూయార్క్ టైమ్స్' పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)