సెక్స్ సమయంలో శరీరంలో చేరి ప్రాణాలకే ముప్పు తెచ్చే ఈ బ్యాక్టీరియాలు మీకు తెలుసా?

ప్యాంటు విప్పుతున్న పురుషుడు

ఫొటో సోర్స్, iStock

ఫొటో క్యాప్షన్,

ఓరల్ సెక్స్ వల్ల ప్రాణాంతకమైన నైస్సీరియా మెనింజిటిడిస్ వ్యాపిస్తుంది.

ఎప్పుడూ ఏవో కొత్త వ్యాధులు పుట్టుకొస్తూనే ఉంటాయి. అందుకు సెక్స్ వల్ల సంక్రమించే వ్యాధులు మినహాయింపు కాదు. జనజీవనానికి ప్రాణాంతకంగా మారిన 4 బ్యాక్టీరియాల గురించి ఈ కథనంలో చూద్దాం.

1. నైస్సీరియా మెనింజిటిడిస్

నైస్సీరియా మెనింజిటిడిస్‌ను.. మెనింగోకోకస్ సూక్ష్మజీవి అని అంటారు. ఇది మనిషి మెదడు, వెన్నెముక చుట్టూ ఉన్న రక్షణ పొరలపై దాడి చేసి, ప్రాణాంతకంగా మారుతుంది. మూత్రనాళం, జననాంగాలకు సోకే ఇన్ఫెక్షన్‌ల ద్వారా నైస్సిరియా మెనింజిటిడిస్‌ సోకుతుంది.

స్వీయ ముఖమైథునం(auto fellatio) వల్ల ఒక మగ చింపాజీకి, తన ముక్కు, గొంతు ద్వారా మూత్రవాహిక ఇన్ఫెక్షన్ ఏవిధంగా సోకిందో 1970లలోని ఓ అధ్యయనం వివరించింది.

''ఈ జంతువు తరచూ స్వీయ ముఖమైథున ప్రక్రియలో పాల్గొంటుంది'' అని ఆ అధ్యయనంలో ప్రముఖంగా ప్రస్తావించారు.

పెద్దల్లో సాధారణంగా 5-10%మందిలో ముక్కు, గొంతు వెనుక భాగంలో నైస్సీరియా మెనింజిటిడిస్ ఉంటుంది. ఇలాంటివారు, గాఢ చుంబనాలు, ఓరల్ సెక్స్, ఇతర పద్దతుల్లో శృంగారం చేయడం ద్వారా తమ భాగస్వాములకు ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది.

అయితే.. ఈ వ్యాధి బారినపడ్డ యూరప్, కెనెడా, అమెరికా దేశాల్లోని గే, బైసెక్సువల్ పురుషులకు ఈ బ్యాక్టీరియా ఎలా సోకిందో అధ్యయనకారులకు కూడా స్పష్టత లేదు.

ఓ హెటరో సెక్సువల్(గే, బైసెక్సువల్ కాని వ్యక్తి) మూత్రవాహికకు నైస్సీరియా మెనింజిటిడిస్ సోకడానికి 'ఓరల్ సెక్స్' కారణం అని మరో అధ్యయనం తెలిపింది.

5 రకాలుగా విభజించిన ఈ నైస్సీరియా మెనింజిటిడిస్‌.. ప్రపంచంలోని ఎక్కువ ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణం. అదృష్టవశాత్తు ఈ బ్యాక్టీరియా నుంచి కొంత రక్షణ కల్పించేందుకు 2రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.

ఫొటో సోర్స్, iStock

ఫొటో క్యాప్షన్,

మైకోప్లాస్మా జెనిటేలియమ్ వల్ల వంధ్యత్వం, గర్భస్రావం, నెలలు నిండకముందే ప్రసవం అవ్వడం, కొన్నిసార్లు మృతశిశువు జన్మించడం లాంటి సమస్యలు కూడా కలగొచ్చు.

2. మైకోప్లాస్మా జెనిటేలియమ్

మైకోప్లాస్మా జెనిటేలియమ్ అన్నది అత్యంత చిన్న బ్యాక్టీరియా. కానీ శృంగారం వల్ల సంక్రమించే ఇన్ఫెక్షన్‌గా(S.T.I) ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది.

ఈ సూక్ష్మజీవిని మొదటిసారి 1980లో గుర్తించారు. 1-2శాతం మనుషులకు దీనివల్ల ఇన్ఫెక్షన్ కలుగుతోంది. టీనేజ్, యవ్వనస్థులు, పెద్దల్లో ఈ సూక్ష్మజీవి ఉండటం సాధారణం.

మైకోప్లాస్మా జెనిటేలియమ్ ఇన్ఫెక్షన్ సోకినపుడు లక్షణాలు ఎక్కువగా కనిపించకపోయినా, గనేరియా ఉండటం, మూత్రవాహిక, కంఠంపై దురద ఎక్కువగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ ఇన్ఫెక్షన్ వల్ల మహిళల పెల్విక్ ప్రాంతంలో తీవ్రమైన మంట కలగవచ్చు. ఈ ఇన్ఫెక్షన్‌ వల్ల వంధ్యత్వం, గర్భస్రావం, నెలలు నిండకముందే ప్రసవం, మృతశిశువు జన్మించడం లాంటి సమస్యలు కూడా కలగొచ్చు.

కండోమ్స్ వాడకం వల్ల దీన్ని కొంతవరకు నివారించొచ్చు. కానీ, ఈ మైకోప్లాస్మా జెనిటేలియమ్ నిరోధక శక్తి అంతకంతకూ పెరుగుతోందని, అజిథ్రోమైసిన్, డాక్సీసైక్లిన్ లాంటి యాంటీబయాటిక్స్‌ను కూడా సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

''ఈ సూక్ష్మజీవులు మరింత సమర్థవంతంగా తయారైతే, ఇవి వ్యాప్తి చెందడం కూడా అంతకంతకూ పెరుగుతుందని ఆందోళనగా ఉంది'' అని సీటిల్ అండ్ కింగ్ కౌంటీ ఎస్.టి.డి/ఎయిడ్స్ ప్రోగ్రామ్ హెల్త్ డైరెక్టర్ మ్యాథ్యూ గోల్డన్ అన్నారు.

అందుబాటులో ఉన్న మూత్ర పరీక్ష, సర్వైకల్ లేదా స్త్రీ జననేంద్రియాల వ్యాధి నిర్ధరణ పరీక్షల ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించొచ్చు.

ఫొటో సోర్స్, iStock

ఫొటో క్యాప్షన్,

షిగెల్లా ఫ్లెక్సినరి వల్ల తీవ్రమైన కడుపునొప్పితోపాటు చీము-రక్తంతో విరేచనాలు కలిగి, ఈ బ్యాక్టీరియా మరింత ప్రబలంగా వ్యాప్తి చెందుతుంది.

3. షిగెల్లా ఫ్లెక్సినరి

ఇద్దరి ముఖాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అత్యంత దగ్గరగా వచ్చినపుడు.. షిగెల్లోసిస్ లేదా షిగెల్లా డిసెంటరీ అన్నది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది.

ఈ ఇన్ఫెక్షన్ వల్ల తీవ్రమైన కడుపునొప్పితోపాటు చీము-రక్తంతో విరేచనాలు కలిగి, ఈ బ్యాక్టీరియా మరింత ప్రబలంగా వ్యాప్తి చెందుతుంది.

తక్కువ, మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాల్లోని చిన్నపిల్లలు, ప్రయాణాలు చేసేవారిలో ఈ వ్యాధి సాధారణమే. కానీ 1970లో అధ్యయనకారులు షిగెల్లోసిస్‌ను స్వలింగ సంపర్కులు, బైసెక్సువల్స్‌లో కూడా గుర్తించారు.

అప్పటి నుంచి, ఈ బ్యాక్టీరియా ‘యానల్ సెక్స్’, ‘ఓరల్ సెక్స్’ ద్వారా వ్యక్తులకు సోకి, అది పలురకాల ఇన్ఫెక్షన్లకు(S.T.I) దారితీస్తోంది.

ఫొటో సోర్స్, iStock

ఫొటో క్యాప్షన్,

కండోమ్స్ వాడకం వల్ల శృంగారం వల్ల సంక్రమించే చాలా వ్యాధులను నివారించవచ్చు.

4. లింఫోగ్రాన్యులోమా వెనెరియమ్ (LGV)

శృంగారం వల్ల సంక్రమించే వ్యాధుల్లో ఇది ఒకటి. క్లామిడియా ట్రాకోమ్యాటిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది.

ఈ వ్యాధి.. జననేంద్రియాలపై తాత్కాలిక పులిపుర్లను కలుగజేసి, పొక్కులు కట్టి, అది పుండుగా మారి, శరీరంలోని శోషరస వ్యవస్థపై దాడి చేస్తుందని శాన్‌ఫ్రాన్సిస్కో లోని 'వన్ మెడికల్ క్లినిక్‌'కు చెందిన క్రిస్టోఫర్ షీస్ల్ అన్నారు.

జీర్ణాశయ వ్యవస్థలో మంట కలగడం ద్వారా మలద్వార ఇన్ఫెక్షన్ ఏర్పడి, అది దీర్ఘకాలిక వ్యాధిగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి. మలద్వారం వద్ద ఫిస్టులా ఏర్పడటం, మలద్వారం కుంచించుకుపోవడం జరుగుతాయి.

గత పదేళ్లలో యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లోని గే, బైసెక్సువల్ మగవాళ్లలో ఎల్.జి.వి కేసులు పెరగడం సాధారణంగా మారింది. క్లామిడియా వల్ల ఎల్.జి.వి వ్యాధి ఎయిడ్స్‌కు దారి తీస్తుంది.

యోని, మలద్వారం ద్వారా సెక్స్ చేస్తున్నపుడు కండోమ్స్ వాడకం ఈ ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదాన్ని కాస్త తగ్గిస్తుంది.

ఈ వ్యాధికి 3వారాల వైద్యం అవసరం అవుతుంది. ఇందులో డాక్సిసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్‌ను వాడుతారు.

(సైన్స్ అండ్ హెల్త్ వెబ్‌సైట్ 'మొజాయిక్'లో అచ్చయిన ఈ వ్యాసం, 'క్రియేటివ్ కామన్స్ లైసెన్స్' ద్వారా సేకరించడం జరిగింది.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)