ఆర్కిటిక్‌లో కరుగుతున్న మంచు.. ఆహారం కోసం జనావాసాలపై ధ్రువపు ఎలుగుబంట్ల దాడులు... రష్యా దీవుల్లో ఎమర్జెన్సీ

  • 10 ఫిబ్రవరి 2019
ధృవ ఎలుగుబంట్లు Image copyright PA

రష్యాలోని ఓ మారుమూల ప్రాంతంలో జనావాసాల మధ్యలోకి ధ్రువపు ఎలుగుబంట్లు రావడంతో అక్కడ అత్యయిక స్థితి విధించినట్లు అధికారులు తెలిపారు.

ఐదు వేల జనాభా ఉన్న నొవయా జెమ్ల్యా దీవిలోకి ఎలుగుబంట్లు వచ్చి దాడులకు దిగుతున్నాయని, నివాస ప్రాంతంలోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయిని స్థానిక అధికారులు తెలిపారు.

వాతావరణ మార్పుల ప్రభావం ధృవ ఎలుగుబంట్లపై తీవ్రంగా పడింది. ఆహారం దొరక్క తమ నివాస ప్రాంతాల నుంచి జనావాసాలకు వస్తున్నాయి.

రష్యాలో ధ్రువపు ఎలుగుబంట్లను వేటాడంపై నిషేధం ఉంది. వాటిని కాల్చి చంపేందుకు లైసెన్స్ ఇవ్వడానికి ఫెడెరల్ ఎన్విరాన్‌మెంటల్ ఏజెన్సీ అనుమతి నిరాకరిస్తోంది.

జనావాసాల్లోకి వచ్చిన ఎలుగుబంట్లను నివారించడంలో పోలీసుల చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో వాటిని అదుపు చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.

రష్యా గురించి మరిన్ని కథనాలు:

ఈ దీవి ప్రధాన ప్రాంతమైన బెలుస్యా గుబా సమీపంలో ఇప్పటివరకు 52 ధ్రువపు ఎలుగుబంట్లు వచ్చాయి. జనావాసాలపైకి తరచుగా ఆరు నుంచి 10 ఎలుగుబంట్లు వస్తున్నాయి.

''ఇక్కడి మిలిటరీ పరిధిలోకి ఐదు ఎలుగుబంట్లు వచ్చాయి. ఈ ప్రాంతంలోనే వైమానిక దళం, రక్షణ బలగాలున్నాయి'' అని స్థానిక అధికారి విగ్నశా మసిన్ తెలిపారు.

''1983 నుంచి నేను నొవ్యా జెమ్ల్యాలోనే ఉన్నా. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా ఎలుగుబంట్లు నివాస ప్రాంతాలపై దాడి చేయలేదు'' అని ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

వీటి కారణంగా ప్రజాజీవితానికి భంగం కలుగుతోందని ఆయన తెలిపారు.

''ప్రజలు భయపడుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావడానికి వణికిపోతున్నారు. వారి రోజూవారి పనులకు అంతరాయం కలుగుతోంది. పిల్లలను స్కూల్‌కు పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు'' అని స్థానిక అధికారి అలెగ్జాండర్ తెలిపారు.

అర్కిటిక్ సముద్రంలో మంచు కరుగుతుండటంతో తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ధ్రువపు ఎలుగుబంట్లు ఆహారం కోసం జనావాసాల వైపు రావాల్సి వస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)