మెనోపాజ్: చన్నీటి స్నానంతో ఉపశమనం కలుగుతుందా?

  • 12 ఫిబ్రవరి 2019
మెనోపాజ్, మహిళలు

చల్లని నీటిలో మునగడం వల్ల మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుందని కొంతమంది మహిళలు అంటున్నారు.

కేవలం 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో మునగడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడిందని యూకేలోని వేల్స్‌కు చెందిన కొందరు చెబుతున్నారు.

"నాకు ఇప్పుడు 49 ఏళ్లు. మెనోపాజ్ మొదలయ్యే దశలో చల్లటి నీళ్లలో మునిగేదాన్ని. దాంతో, నేను మెనోపాజ్ దశలోకి చేరిన విషయం కూడా తెలియలేదు" అని అలిసన్ ఓవెన్ అనే మహిళ వివరించారు.

"మెనోపాజ్ దశ మొదలవగానే.. చాలామందికి ఒళ్లంతా చెమటలు పట్టడం.. మానసిక ఆందోళన, చిరాకు, కోపం, కుంగుబాటు, అకారణంగా ఏడుపు వస్తుందని చాలా సార్లు చదివాను. కానీ, నేను ఆ సమయంలో చన్నీళ్లలో ఈత కొట్టేదాన్ని కాబట్టి, నాకు ఆ సమస్యలేవీ రాలేదు" అని ఆమె చెప్పారు.

అప్పటి నుంచి తాను తరచూ చల్లని నీటిలో ఈత కొడుతున్నట్లు అలిసన్ తెలిపారు.

ఆమె ఒక్కరే కాదు.. మరికొందరు మహిళలను కూడా తన వెంట తీసుకెళ్తున్నారు. అందరూ బృందంగా వెళ్లి సముద్రంలో ఈత కొడుతున్నారు.

Image copyright Getty Images

"ఈత కొడుతుంటే చాలా సరదాగా.. ఉత్సాహంగా అనిపిస్తుంది. చిన్న పిల్లలా మారిపోయినట్లు అనిపిస్తుంది. దాంతో, చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. నాతో పాటు మరికొందరు మహిళలు వస్తున్నారు. వాళ్లు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు" అని ఆమె చెప్పుకొచ్చారు.

ఇలా ఈత కొట్టే మహిళలు సంఘం కూడా ఏర్పాటు చేసుకున్నారు. వెళ్లినప్పుడల్లా 20 మంది దాకా బృందంగా బీచ్‌కి వెళ్లి సముద్రంలో మునిగి వస్తారు.

తాను 91 సెకన్ల దాకా నీటిలో మునిగి ఉండగలనని అలిసన్ చెప్పారు.

"నేను ప్రస్తుతం మెనోపాజ్ దశలో ఉన్నాను. నాకు పెద్దగా ఇబ్బందిగా అనిపించడంలేదు. రాత్రి వేళలో చెమటల సమస్య కూడా ఎక్కువేమీ లేదు. గతంతో పోల్చితే చిరాకు తగ్గింది" అని మరో మహిళ 53 ఏళ్ల పట్రీషియా వుడ్‌హౌజ్ వివరించారు.

Image copyright Getty Images

మెనోపాజ్ అంటే ఏమిటి?

మహిళలకు 45--50 సంవత్సరాల వయసులో వరసగా పన్నెండు నెలలు నెలసరి రాకుండా ఆగిపోతే దానిని "మెనోపాజ్" అంటారు.

ఇది శాశ్వతమైన, సహజమైన మార్పు. ఇది జబ్బుకాదు. ఇది ఒక దశ. మన దేశంలో ఏటా పది మిలియన్ల మంది "మెనోపాజ్" దశకు చేరుకుంటున్నారు.

45 - 50 ఏళ్ల మధ్యలో అది ఎప్పుడయినా ఆగిపోవచ్చు. నలభై ఏళ్లకే ఆగిపోతే "ప్రిమెచ్యూర్ మెనోపాజ్" అంటారు.

చిన్న వయసులో గర్భసంచి తొలగించిన వారికి కూడా తొందరగా, అంటే తొలగించిన సంవత్సరానికే "మెనోపాజ్" లక్షణాలు కనపడతాయి.

కొన్ని లక్షణాలు:

  • కొంతమందిలో నెలసరి ఆగిపోతుంది.
  • తొందరగా అలసి పోవడం
  • ఒళ్లంతా వేడి ఆవిర్లు రావడం - హాట్ ఫ్లషెస్
  • ఒళ్లంతా చెమటలు పట్టడం
  • రాత్రుళ్లు నిద్రలో ఒళ్లంతా చెమటలు పట్టి మెలకువ రావడం (నైట్ స్వెట్స్)
  • గుండెదడ
  • నిద్ర పట్టక పోవడం
  • మానసికమైన ఆందోళన, చిరాకు, కోపం, డిప్రషన్, కారణం లేకుండా ఏడుపు రావడం
  • తలనొప్పి
Image copyright Getty Images

చన్నీళ్లు ఎలా పనిచేస్తాయి?

చన్నీళ్లలో మునగడం ద్వారా ఉపశమనం కలుగుతోందని చెప్పడం అసాధారణ విషయమేమీ కాదని ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్‌మౌత్‌కు చెందిన ప్రొఫెసర్ మైక్ టిప్టన్ అన్నారు. చల్లని నీటిలో ఈత కొట్టడంలో ఆయనకు చాలా అనుభవం ఉంది.

"చల్లని నీటిలో స్నానం లేదా ఈత కొట్టడం ద్వారా కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయని చాలామంది అనుభవపూర్వకంగా చెబుతుంటారు. కానీ, అది ఎలా సాధ్యం అన్నదానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు" అని ఆయన అన్నారు.

"సాధారణంగా చన్నీళ్లతో స్నానం చేసేటప్పుడు నీళ్లు శరీరం మీద పడగానే ఒక్కసారిగా వణికిపోతాం. అలాంటప్పుడు స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతాయి. దాంతో, ఉపశమనం లభించినట్లు అనిపిస్తుంది. అయితే, అలా చేయడం అన్నిసార్లూ మంచిది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చన్నీళ్లలో మునిగినప్పుడు ఊపిరి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది." అని ప్రొఫెసర్ టిప్టన్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)