ఆన్‌లైన్ రొమాన్స్ స్కామ్: రూ.95 లక్షలు కొట్టేసిన రోమియోలు

  • 12 ఫిబ్రవరి 2019
ఆన్‌లైన్ మోసం Image copyright Getty Images

ఇంటర్నెట్‌లో తారసపడిన వ్యక్తుల మాయమాటలు నమ్మి ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ఇద్దరు యువతులు మోసపోయారు. వీరిద్దరూ దాదాపు. రూ. 95.56 లక్షల సొమ్ము పోగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు.

10 నెలల్లో ఇలాంటి కేసులు దాదాపు 39 వరకు తమ వద్దకు వచ్చాయని పోలీసులు వెల్లడించారు.

''ఇలాంటి ఘటనలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అయితే, చాలా సందర్భాల్లో బాధితులు మోసపోయినప్పటికీ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడం లేదు'' అని పేర్కొన్నారు.

''వలపు వలలో పడి మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లు మేం భావిస్తున్నాం'' అని పోలీసుల అధికారి ఒకరు తెలిపారు.

ఇటీవల జరిగిన రెండు ఘటనల్లో, ఓ వ్యక్తి తాను అమెరికా సైన్యంలో పనిచేస్తున్నాని చెప్పి ఐర్లాండ్ యువతితో ఆన్‌లైన్‌లో స్నేహం చేశాడు. వారి రోమాన్స్ ఒక నెల వరకు సాగింది.

మే 2018లో ఆ వ్యక్తి తాను ఆఫ్రికాలో చిక్కుకున్నానని, డబ్బులు పంపించాలని యువతిని కోరాడు.

అతని మాటలు నమ్మిన యువతి దాదాపు రూ. 60 లక్షలు అతడికి పంపింది.

''ఆమె అతడిని పూర్తిగా నమ్మింది. ఆన్‌లైన్‌లో ఉన్న వ్యక్తిగత వివరాలు నిజమనుకొని మోసపోయింది'' అని పోలీసులు తెలిపారు.

Image copyright Getty Images

మరో ఘటనలో ఓ వ్యక్తి అమెరికాలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నానంటూ ఐర్లాండ్ యువతితో ఆన్‌లైన్‌లో స్నేహం చేశాడు.

నవంబర్ వరకు వారి స్నేహం బాగానే సాగింది. దాన్ని ఆసరాగా చేసుకున్న ఆ వ్యక్తి దఫదఫాలుగా ఐర్లాండ్ యువతి నుంచి రూ. 36 లక్షలకు పైగా వసూలు చేశాడు. తర్వాత అతని నుంచి ఏలాంటి సమాచారం అందలేదు.

''మోసపోయిన ఇద్దరు యువతులు తమ డబ్బును వెనక్కి తెచ్చుకోలేకపోయారు. వారు స్వచ్ఛందంగా డబ్బులు పంపండంతో వాటిని వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి లేకుండా పోయింది'' అని పోలీసు అధికారి సూపర్ సిమన్ చెప్పారు.

మోసగాళ్లు ప్రజల దుర్భలత్వం, నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని ఎలా మోసాలకు పాల్పడుతున్నారో ఈ రెండు ఘటనలు రుజువు చేస్తున్నాయని అన్నారు.

''మోసగాళ్లకు మీ కులం, మతం, జాతి, లింగం, రంగు అవసరం లేదు. మీ నుంచి డబ్బులు లాగడమే వారి పని. కాబట్టి జాగ్రత్తగా ఉండండి'' అని ఐర్లాండ్ వాసులను పోలీసులు హెచ్చరిస్తున్నారు.

రోమాన్స్ కోసం ఇంటర్నెట్ వినియోగించుకునేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.

ఈ సలహాలు పాటించండి

ఇంటర్నెట్ వినియోగదారులు కొన్న సూచనలు పాటించి మోసపోకుండా ఉండాలని అక్కడి అధికారులు సూచించారు.

  • విశ్వసనీయత ఉన్న వెబ్‌సైట్లనే ఉపయోగించుకోండి.
  • మీ గురించి అన్ని విషయాలు రాబడుతూ వారి విషయాలను ఏ మాత్రం చెప్పని వారిని నమ్మకండి.
  • ఆన్‌లైన్ పరిచయస్తులకు మీ డబ్బును, ఇతర వస్తువులను పంపించకండి.
  • మీ బ్యాంకు అకౌంట్ నుంచి తెలియని వ్యక్తులకు నగదు బదలాయింపులు జరపకండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)