సైస్స్ ఆఫ్ లవ్: ప్రేమంటే ఏమిటి? మీరిప్పుడు ప్రేమలో ఉన్నారా?

  • 14 ఫిబ్రవరి 2019
ప్రేమికులు Image copyright iStock

చాలా మంది ప్రేమలో పడతారు. ప్రేమించిన వ్యక్తి ఒక క్షణం కనిపించకపోయినా తపించి పోతారు. అయితే, ఆ ప్రేమ అనే ఆ రెండక్షరాల వెనుక ఉన్న అసలు గుట్టు మీకు తెలుసా?

అసలు ప్రేమ ఎలా పుడుతుందో, దానికి కారణం ఏమిటో ఎప్పుడైనా తెలుసుకోవాలని అనిపించిందా?

ఎవరైనా ప్రేమలో పడ్డారంటే, అందులో మూడు దశలు ఉంటాయి. ఈ మూడు దశలో వేరు వేరు హార్మోన్లు వారిని ప్రేమలో ముందుకు నడిపిస్తాయి.

మనం ప్రేమలో పడ్డప్పుడు మెదడులో జరిగేవన్నీ ఒక మానసిక వ్యాధిలాగే ఉంటాయి.

మనల్ని ఒకరు ఆకర్షిస్తున్నారు అంటే, మనకు తెలీకుండానే మనం వారి జన్యువులను ఇష్టపడడం కూడా ఒక కారణం కావచ్చు.

లైంగిక ఆకర్షణ విషయానికి మన రూపురేఖలతోపాటు వాసనకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది.

ప్రేమ బంధం సుదీర్ఘ కాలం కొనసాగుతుందా లేదా అనేది నిర్ధరించుకోడానికి కూడా సైన్స్ సాయం చేయగలదు.

Image copyright Getty Images

ఈ రసాయనాలు-మన్మథ బాణాలు

బుగ్గలు ఎరుపెక్కితే, గుండె వేగంగా కొట్టుకుంటుంటే, చేతులు జిగురులా అతుక్కుంటుంటే కచ్చితంగా మీరు ప్రేమలో పడ్డారనే లెక్క. ప్రేమలో పడిన ఎవరికైనా మొదట బయటకు కనిపించే లక్షణాలు ఇవే.

కానీ, ఆ మన్మథ బాణం మనసులో గుచ్చుకోగానే శరీరం లోపల రకరకాల రసాయన సంకేతాలు వెలువడడం మొదలవుతుంది.

ఇక ప్రేమ విషయానికి వస్తే అది మన జీవరసాయన శాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై పరిశోధనలు చేసిన ప్రముఖుల్లో న్యూజెర్సీలోని రుట్జెర్స్ యూనివర్సిటీకి చెందిన హెలెన్ ఫిషర్ ఒకరు.

ఎవరైనా ప్రేమలో పీకల్లోతు మునిగిపోవడానికి మూడు దశలే కారణం అని ఆమె చెప్పారు. అయితే ప్రతి దశలో వేరు వేరు రసాయనాల ప్రమేయం ఉంటుందని తెలిపారు.

ప్రేమలో ఆ మూడు దశలు...

Image copyright Getty Images

మొదటి దశ- వ్యామోహం

వ్యామోహం అనేది సెక్స్ హార్మోన్లు, ఈస్ట్రోజెన్ వల్ల కలుగుతుంది. టెస్టోస్టిరాన్ అనేది పురుషుల్లో మాత్రమే ఉండదు.

మహిళల్లో సెక్స్ కోరికలు పెరగడానికి కూడా అది కీలక పాత్ర పోషిస్తుంది. హెలెన్ ఫిషర్ చెప్పినట్టు ఈ హార్మోన్లు "మీరు బయట దేనికోసమో వెతికేలా" చేస్తాయి.

Image copyright Getty Images

రెండో దశ-ఆకర్షణ

ఈ దశలో 'లవ్ అటాక్' మొదలవుతుంది. ఎవరైనా ప్రేమలో పడితే, వాళ్లు ఇక దేనిగురించీ ఆలోచించరు. ఏదీ తినాలనిపించదు, సరిగా నిద్రపట్టదు.

ఎప్పుడూ తమ జీవితంలోకి కొత్తగా అడుగుపెట్టిన వారి గురించే ఆలోచనలు. పగటి కలలు కంటూ, వారి ఊహల్లో తేలిపోతూ గంటలు, రోజులు, వారాలు, నెలలు గడిపేయాలని అనిపిస్తుంది.

ఈ ఆకర్షణ దశలో 'మోనోమైన్స్' అనే ఒక న్యూరో ట్రాన్సిమిటర్ల గ్రూప్ కీలక పాత్ర పోషిస్తుంది.

  • డోపమైన్- ఇది కొకైన్, నికోటిన్ వల్ల కూడా యాక్టివేట్ అవుతుంది.
  • నోరెపినోఫ్రీన్-లేదా దీన్ని అడ్రినలిన్ అని కూడా అంటారు. ఇది మనకు చెమటలు పట్టేలా, గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది.
  • సెరొటోనిన్-ప్రేమకు అవసరమయ్యే అతి ముఖ్యమైన రసాయనాల్లో ఇది ఒకటి. ఇది నిజానికి మనకు తాత్కాలికంగా పిచ్చెక్కిస్తుంటుంది.
Image copyright Getty Images

మూడో దశ-అనుబంధం

ప్రేమబంధం ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే ఆకర్షణ దశను దాటాక ప్రేమికులు ఈ దశలోకి అడుగుపెడతారు.

ఒక జంట సాధారణంగా ఆకర్షణ దశలో ఎక్కువ కాలం ఉండదు. అలా ఉంటే, వారు ఏ పనినీ పూర్తి చేయలేరు.

అనుబంధం అనేది జంటలో సుదీర్ఘ కాలం కలిసి ఉండాలనే అంకితభావం కలిగిస్తుంది. పిల్లలు కావాలనుకునేవరకూ ఈ బంధం ఇద్దరినీ కలిపి ఉంచుతుంది.

ఈ దశలో మన నాడీ వ్యవస్థలో రెండు రసాయనాలు విడుదల కావడం చాలా కీలకం. సామాజిక బంధంలో అవి కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.

  • ఆక్సిటోసిన్- ఇది పిల్లలు పుట్టే సమయంలో హైపోథాలమస్ గ్రంథి నుంచి విడుదలవుతుంది. ఇది పిల్లలకు స్తన్యం పట్టేలా తల్లిని సన్నద్ధం కూడా చేస్తుంది. ఇది తల్లీబిడ్డల మధ్య బంధం దృఢంగా ఉండేలా కూడా చేస్తుంది. ఇది స్కలనం సమయంలో స్త్రీ, పురుషుల్లో కూడా విడుదలవుతుంది. సన్నిహితంగా ఉన్నప్పుడు జంటలో ఇది బంధాన్ని మరింత బలంగా చేస్తుందని భావిస్తున్నారు. ఒక సిద్ధాంతం ప్రకారం జంట ఎంత ఎక్కువ సెక్స్ జీవితం గడిపితే, వారి మధ్య అంత గాఢమైన బంధం ఏర్పడుతుంది.
  • వాసోప్రెస్సిన్- సుదీర్ఘ కాలం కలిసి కొనసాగే దశకు ఇది మరో ముఖ్యమైన రసాయనం. ఇది ముఖ్యంగా మూత్ర పిండాలను అదుపు చేసే కంట్రోలర్‌లా ఉంటుంది. ప్రయిరీ వోల్‌ అనే జంతువులపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు స్త్రీ, పురుషుల సుదీర్ఘ బంధాల్లో దీని పాత్ర ఉందని గుర్తించారు.
Image copyright Getty Images

ఉత్సాహానికి చిరునామా ప్రయిరీ వోల్

మగ, ఆడ మధ్య సుదీర్ఘ బంధం గురించి చెప్పడానికి ప్రయిరీ వోల్ అనే ప్రాణి సమాజ జీవితం, సెక్స్‌ను ఒక చిరునామాగా చెబుతారు.

ప్రయిరీ వోల్స్ మిగతా జంతువుల్లా పునరుత్పత్తి అవసరం అయినపుడు మాత్రమే సెక్స్‌లో పాల్గొనకుండా సుదీర్ఘ కాలం పాటు సంభోగంలో పాల్గొంటాయి.

వాసోప్రెస్సిన్, ఆక్సిటోసిన్ అనే రెండు హార్మోన్లే దీనికి కారణం అని భావిస్తున్నారు. కలయిక తర్వాత వాటిలో విడుదలయ్యే ఈ హార్మోన్లు ఆ జంట మధ్య బంధం మరింత దృఢంగా మారుస్తున్నాయి.

ఒక ప్రయోగంలో భాగంగా మగ ప్రయరీ వోల్‌కు వాసోప్రెస్సిన్ ప్రభావాన్ని తగ్గించే మందును ఇచ్చారు. తర్వాత వెంటనే దానికి తన భాగస్వామిపై ఆసక్తి తగ్గిపోయింది. అంతకు ముందులా ఉండడం మానేసింది.

అది కొత్తగా వచ్చిన మగవాటి నుంచి తన భాగస్వామిని కూడా కాపాడుకోలేకపోయింది.

Image copyright Getty Images

భాగస్వామి జన్యువుల ప్రభావం

భాగస్వామిని ఎంచుకునే విషయానికి వస్తే, మనం మనకు తెలీకుండానే వారి వైపు ఆకర్షితులవుతామని కూడా చెబుతున్నారు.

ఆకర్షణ వెనుక సైన్స్ ప్రభావం గురించి అధ్యయనం చేసిన పరిశోధకులు మనుషులు తమ భాగస్వాములను ఎలా ఎంపిక చేసుకుంటారు అనేదానిపై ఒక పరిణామ సిద్ధాంతం రూపొందించారు.

అత్యుత్తమ జన్యువులు ఉన్న ఎవరితోనైనా సంభోగం వల్ల మనకు ప్రయోజనం లభిస్తుంది. తర్వాత వాటినే మనం మన పిల్లలకు కూడా అందిస్తాం, వారు ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటాం. అలా మనం మన ఆరోగ్యకరమైన జన్యువులను రాబోవు తరాలకు కూడా అందిస్తుంటాం.

మనం ఒక సమర్థమైన భాగస్వామిని చూసినపుడు, మన పిల్లల్లో వారి జన్యువులు ఉండాలని కోరుకుంటున్నామా, లేదా అని మనం అంచనా వేస్తాం.

అలా చేయడంలో కూడా రెండు పద్ధతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాటిపై ప్రస్తుతం విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

ప్రేమ వెనుక, అనుబంధం వెనుక ఉన్న గుట్టును పూర్తిగా విప్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)