వాలంటైన్స్ డే: ప్రేమికుల రోజు వెనకున్న కథేంటి?

  • 14 ఫిబ్రవరి 2019
వాలెంటిన్ Image copyright Getty Images

ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజు జరుపుకుంటారు. ఇష్టపడిన వ్యక్తికి ఈరోజే లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. ఇంతకీ ప్రేమికుల రోజు ఎలా మొదలైంది? వాలెంటైన్ ఎవరు? ఫిబ్రవరి 14నే ఎందుకు జరుపుకోవాలి? ప్రేమికుల రోజుకి ఉన్న చరిత్ర ఏంటి?

సెయింట్ వాలెంటైన్ ఎవరు?

వాలెంటైన్ పేరు ప్రేమికుల రోజుకు పర్యాయపదంగా మారిపోయింది. ఇంతకీ వాలెంటైన్ ఎవరు?

నిజానికి వాలెంటైన్ ఎవరన్న దానిపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే.. సెయింట్ వాలెంటైన్ ఒక కైస్తవ ప్రవక్త. మూడవ శతాబ్దంలో రోమ్‌ నగరంలో ఉండేవాడు.

ఆ కాలంలో రోమ్‌ని రెండో క్లాడియస్ అనే చక్రవర్తి పాలిస్తూ ఉండేవారు. ఆయన తన రాజ్యంలో పెళ్లిళ్లను నిషేధించారు. మగవాళ్లు పెళ్లి చేసుకుంటే మంచి సైనికులు కాలేరన్న అభిప్రాయంతో రోమ్ చక్రవర్తి పెళ్లిళ్లను నిషేధించారు.

Image copyright Getty Images

వాలెంటైన్‌ను ఎందుకు చంపేశారు?

మగవాళ్లు పెళ్లిళ్లు చేసుకోవద్దన్న రోమన్ చక్రవర్తి ఆదేశాలు వాలెంటైన్‌కు నచ్చలేదు.

దాంతో రోమ్ చక్రవర్తి ఆదేశాలను అతను ధిక్కరించి రహస్యంగా పెళ్లిళ్లు జరిపించారు.

ఈ విషయం తెలుసుకున్న క్లాడియస్ వాలెంటైన్‌ని జైల్లో పెట్టి, మరణశిక్ష విధించారు. అయితే, జైల్లో జైలర్ కుమార్తెతో వాలెంటైన్ ప్రేమలో పడ్డారు. ఫిబ్రవరి 14న మరణశిక్ష అమలు చేయడానికి ముందు వాలెంటైన్ జైలర్ కుమార్తెకు లవ్ లెటర్ పంపించారు.

Image copyright Getty Images

వాలెంటైన్ డే ఎలా మొదలైంది?

వాలెంటైన్స్ డేకి చాలా చరిత్ర ఉంది. ఫిబ్రవరి మధ్యలో రోమన్లు లుపర్‌కాలియా అనే వేడుక చేసుకునేవాళ్లు. అది వారికి వసంతకాలం.

ఈ వేడుకల్లో భాగంగా ఒక్కో కాగితంపై ఒక్కో అమ్మాయి పేరు రాసి వాటిని ఒక బాక్సులో వేసేవారు.

తర్వాత అబ్బాయిలు వచ్చి ఆ బాక్సులోంచి చిటీలు తీసేవారు. ఆ స్లిప్‌లో ఏ అమ్మాయి పేరైతే ఉంటుందో ఆ అమ్మాయి ఆ ఫెస్టివల్‌లో అతనికి ప్రేయసిగా ఉండాలి. ఇలాంటి జంటలు కొన్నిసార్లు పెళ్లి కూడా చేసుకునే వాళ్లు.

ఈ రోమన్ల సంప్రదాయం నుంచే వాలెంటైన్స్ డే వచ్చిందని భావిస్తున్నారు.

Image copyright Getty Images

ఫిబ్రవరి 14నే ఎందుకు జరుపుకుంటారు?

రోమన్ల ఫెస్టివల్‌ని క్రైస్తవ సంప్రదాయంగా మార్చాలని చర్చి భావించింది. ఫిబ్రవరి 14న సెయింట్ వాలెంటైన్‌ చనిపోయారు. అతనికి గుర్తుగా ఈ ఫెస్టివల్‌ని జరుపుకోవాలని చర్చి సూచించింది.

తమ ప్రేమని వ్యక్తం చేయడానికి ప్రజలు క్రమంగా సెయింట్ వాలెంటైన్ పేరు వాడటం మొదలుపెట్టారు.

క్రమంగా అది వాలంటైన్స్ డేగా స్థిరపడిపోయింది. వాలెంటైన్స్ డేని తొలిసారిగా 496 సంవత్సరంలో జరుపుకున్నారని చెప్తుంటారు.

Image copyright IAN MILLWATERS

ఈ దేశాల్లో ప్రేమికుల రోజుపై నిషేధం

వాలెంటైన్స్ డేకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. కానీ కొన్ని దేశాలు ప్రేమికుల రోజుని వ్యతిరేకిస్తున్నాయి.

పాకిస్తాన్‌లో వాలెంటైన్స్ డైపై నిషేధం ఉంది. ప్రేమికుల రోజు ఇస్లాంకు వ్యతిరేకం అని సౌదీ అరేబియా కూడా దీన్ని నిషేధించింది.

ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఇండోనేషియాలోనూ దీనిపై వ్యతిరేకత పెరుగుతోంది.

భారతదేశంలోనూ ప్రేమికుల రోజున జంటగా కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని కొన్ని సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

వాలెంటైన్స్ డేతో విచ్చలవిడి శృంగారం, మద్యపానం పెరుగుతుందని వాళ్లు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు