‘తమిళనాడులో టిక్‌టాక్’ యాప్‌ను నిషేధించాలని నిర్ణయం’ : ప్రెస్‌రివ్యూ

  • 14 ఫిబ్రవరి 2019
Image copyright Tiktak/youtube

దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకున్న చైనా బేస్డ్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సాక్షి పేర్కొంది.

ఈ యాప్‌ బ్లూవేల్‌ గేమ్‌ కన్నా ప్రమాదకరమైనదిగా తమిళనాడు రాజకీయనాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ మంత్రి ఎం. మనికందన్‌ టిక్‌టాక్‌ యాప్‌ వల్ల తలెత్తుతున్న దుష్పరిణామాల గురించి అసెంబ్లీలో చర్చించాడు.

ఈ యాప్‌ వాడకం వల్ల తమిళ సంస్కృతే కాక శాంతిభద్రతలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని మణికంఠన్‌ అభిప్రాయపడ్డారు.

అసభ్యకర నృత్యాలకు, ఫోర్నోగ్రఫికి టిక్‌టాక్‌ వేదికగా నిలిచిందని.. ఫలితంగా యువత తప్పుదోవ పడుతున్నారని మణికందన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ యాప్‌ను బ్యాన్‌ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. అనతి కాలంలోనే టిక్‌టాక్‌ యాప్‌ దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుంది. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. దాంతో యువత తమలో ఉన్న యాక్టింగ్ టాలెంట్‌తో వీడియోలు చేసి పోస్ట్‌ చేస్తున్నారు.

ఇదే క్రమంలో టిక్‌టాక్ యాప్ చాలా సందర్భాల్లో దుర్వినియోగం కూడా అవుతోంది. ఇటీవల తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా కలెక్టర్ రోహిణి పర్సనల్ ఫోటోలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సినిమా పాటలతో యాడ్ చేసి టిక్‌టాక్ యాప్‌లో పోస్టు చేశారు. ఆమెతోపాటు ఆమె కుమారుడి ఫోటోలను కూడా వివిధ రకాల సోషల్ మీడియా నెట్ వర్క్ లలో షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రోహిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సైబర్‌క్రైం పోలీసులు ఈ ఫోటోలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.

గత ఏడాది జనవరిలో కూడా ఇలాంటే సంఘటనే చోటు చేసుకుంది. నలుగురు యువకులు పోలీసులను అవమానిస్తూ ఓ ఫన్‌ వీడియోను రూపొందించి ఇబ్బందులకు గురయ్యారు. ప్రతి చోట ఇలాంటి తలనొప్పులు ఎదురవుతున్నప్పటికీ ఈ యాప్ విషయంలో ఏ రాష్ట్రం కూడా తమిళనాడు తరహా నిర్ణయం తీసుకోలేదని సాక్షి వెల్లడించింది.

Image copyright chandrababu/fb

‘‘మోదీని గద్దె దించాల్సిందే’’

బీజేపీతో ప్రజాస్వామ్యానికి ముప్పు అని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాల్సిందేనని విపక్ష పార్టీల నేతలు అన్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ప్రధాని మోదీ పాలనలో రాజ్యాంగ విలువల పైనా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బుధవారం ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీలోని జంతర్‌ మంతర్‌లో నిర్వహించిన భారీ ధర్నాలో పాల్గొని మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రులు చంద్రబాబు, మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌, ఎల్‌జేడీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌, సీపీఐ నేత డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్‌వాది పార్టీ నేత రాంగోపాల్‌ యాదవ్‌, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు హాజరయ్యారు.

మరోసారి అంతా ఒకే వేదికపైకి వచ్చి ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ..దేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ కన్నా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడి ఎన్డీయేను గద్దె దించాలని పిలుపునిచ్చారు.

బీజేపీది కౌరవసేన అని, వారి నుంచి దేశాన్ని కాపాడేందుకు పాండవుల్లాంటి విపక్షాలు వారిని ఓడిస్తాయని సీతారాం ఏచూరి అన్నారు. అయితే వేదిక వద్దకు మమతా బెనర్జీ రావడానికి కొద్ది నిమిషాల ముందే వామపక్షాల నేతలు అక్కడినుంచి వెళ్లిపోవడం గమనార్హం. మరోవైపు మోదీ ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోందంటూ తృణమూల్‌ ఎంపీలు పార్లమెంటు వెలుపల నిరసన చేపట్టారు. రాఫెల్‌ ఒప్పందంలో అవినీతికి బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

Image copyright Getty Images

తెలంగాణ 6.. ఆంధ్రప్రదేశ్‌ 13

విమాన ప్రయాణికుల రాకపోకల్లో తెలుగు రాష్ట్రాల్లో వృద్ధి కనిపిస్తోంది. ప్రయాణికుల సంఖ్యపరంగా దేశంలో తెలంగాణ 6, ఆంధ్రప్రదేశ్‌ 13వ స్థానాల్లో నిలిచాయి. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా బుధవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారని ఈనాడు తెలిపింది.

2017తో పోలిస్తే 2018లో ఏపీలో ప్రయాణికుల వృద్ధి 36.3% మేర ఉంది. ఇదే సమయంలో తెలంగాణలో 26.4% మేర వృద్ధి నమోదయింది. ఏపీలో 2016లో 35.62 లక్షల మేర ఉన్న ప్రయాణికుల సంఖ్య 2018 నాటికి 52 లక్షలకు చేరగా, తెలంగాణలో 1.16 కోట్ల నుంచి 1.88 కోట్లకు పెరిగింది.

అత్యధిక తాకిడి ఇలా...

1. దిల్లీ 5.19 కోట్లు

2 . మహారాష్ట్ర 4.77 కోట్లు

3. కర్ణాటక 3.01 కోట్లు

4 . పశ్చిమ బంగా 2.19 కోట్లు

5 . తమిళనాడు 2.14 కోట్లు

తెలంగాణలోని కొత్తగూడెంలో విమానాశ్రయ నిర్మాణానికి స్థల అనుమతి ఇచ్చినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ప్రభు తెలిపారు. రాజ్యసభలో టీఆర్ఎస్ సభ్యుడు బండ ప్రకాశ్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో దగదర్తి, భోగాపురం, ఓర్వకల్లు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలకు సూత్రప్రాయ అనుమతులిచ్చినట్లు వెల్లడించారు. వీటి నిర్మాణానికి ముందుకొచ్చేవారికి ప్రభుత్వం తొలుత స్థల అనుమతి, తర్వాత సూత్రప్రాయ ఆమోదం ఇస్తుందని తెలిపారని ఈనాడు వెల్లడించింది.

తెలంగాణ Image copyright Telangana forest department/fb

అటవీశాఖకు కొత్త బలగం

తెలంగాణ అటవీశాఖకు త్వరలో కొత్తశక్తి రానున్నది. దాదాపు రెండువేల మంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్ల నియామకాలతో అటవీశాఖ మరింత పటిష్ఠం కానున్నదని నమస్తే తెలంగాణ తెలిపింది.

టీఎస్‌పీఎస్సీ తాజాగా 1,856 మంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల ఫలితాలు విడుదల చేయడంతో వీరంతా త్వరలో విధుల్లో చేరనున్నారు. వీరితోపాటు, ఇప్పటికే నియామకమైన 66 మంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 90 సెక్షన్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది మొత్తం కలిపి 2,012 మంది అధికారులు, సిబ్బంది అటవీశాఖకు అందుబాటులోకి రానున్నారు.

ఇప్పటికే విధుల్లో చేరిన 66 మంది రేంజ్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లకుకూడా రెండువారాలపాటు శిక్షణనిచ్చి పోస్టింగ్‌లిస్తామని అధికారులు పేర్కొన్నారు. కొత్త సిబ్బంది రాకతో అటవీశాఖ మరింత పటిష్ఠంకానున్నది. అటవీశాఖలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల హోదాను తొలగించి.. ఆ హోదాలో ఉన్న 1305 మందికి బీట్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించారు.

అడవులను కాపాడటానికి ప్రత్యేక డ్రైవ్ నడుస్తున్న క్రమంలో కొత్త సిబ్బంది, అధికారుల నియామకం తమకు ఎంతో బలాన్నిస్తున్నదని ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీసంఖ్యలో అధికారులు, సిబ్బంది నియామకంపై జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు నాగేంద్రబాబు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకి కృతజతలు తెలిపారు.

సిబ్బంది నియామకం వల్ల అడవులను కాపాడటంతోపాటు హరితహారం వంటి కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. గోదావరిని ఆనుకుని ఉన్న జిల్లాల్లో సమర్థులైన అధికారులను నియమించాలనే ముఖ్యమంత్రి ఆదేశాలను కొందరు అధికారులు పక్కదారి పట్టించి అధికారదుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. పీసీసీఎఫ్ మార్గదర్శకాలను కూడా తుంగలో తొక్కి ఎఫ్‌డీవో, డీఎఫ్‌వోలు ఇష్టానుసారం వ్యవహరించారని.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)