మాంసాహారం: మన నైతిక సందిగ్ధాలు

  • జూలియా షా
  • బీబీసీ కోసం
మాంసాహారం విషయంలో నైతిక సందిగ్ధత

ఫొటో సోర్స్, Getty Images

చాలామంది ఒకవైపు జంతువుల పట్ల క్రూరత్వాన్ని అసహ్యించుకుంటూనే మరోవైపు ఫ్యాక్టరీ ఫార్మ్‌లలో ముస్తాబై వచ్చే మాంసాన్ని ఏ మాత్రం ఇబ్బంది పడకుండా తినడాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రముఖ మనస్తత్వ శాస్త్రజ్ఞురాలు డాక్టర్ జూలియా షా ఈ 'వైరుధ్యాన్ని' ఉదాహరణగా తీసుకుని మనం తీసుకునే అనేక నైతిక నిర్ణయాల వెనక ఎటువంటి పరస్పర వైరుధ్యాలతో కూడిన ఆలోచనలు ఉంటాయో తన కొత్త పుస్తకంలో చర్చించారు.

ఆ పుస్తకం ఆధారంగా రూపొందించిన వ్యాసం ఇది.

నైతికతతో మనకుండే సంబంధాన్ని మార్చగల శక్తి డబ్బుకు ఉంది. డబ్బుతో పాటు మనకూ, మనం వాడే వస్తువులు తయారయ్యే ప్రదేశాలకు మధ్య సంక్లిష్టమైన వ్యాపార, పంపిణీ వ్యవస్థలు చాలా ఉండడం వల్ల కూడా ఆయా ప్రదేశాల్లో ఏం జరుగుతోందో మనకు తెలియకుండా పోతోంది. దాని వల్లే ఘోరమైన అనైతిక పనులెన్నో మనం అనాలోచితంగా చేయగలుగుతున్నాం.

దీన్ని నేను రుజువు చేయగలను.

జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం గురించి మీరు ఏమనుకుంటారు, తప్పు అనే కదా అనుకుంటారు! మరి మీరు ఫ్యాక్టరీలో తయారై వచ్చే మాంసాన్ని తినకుండా ఉంటున్నారా?

లేదు.

సూత్రప్రాయంగా జంతువుల పట్ల క్రూరత్వాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా... జంతువులను దారుణమైన పరిస్థితుల్లో కోసి తయారు చేస్తున్న మాంసాన్ని ఎటువంటి ఆలోచనా లేకుండా తినగలుగుతున్నారు.

దీని గురించి నాకు ఒకళ్ళు చెప్పక్కరలేదు. నాకే స్పష్టంగా తెలుసు. ఎందుకంటే నేను సాధారణంగా శాకాహారమే తింటాను కాని ఎక్కువ మంది పాశ్చాత్యులలా కేవలం శాకాహారానికే పరిమితమవను.

ఒక విషయాన్ని వేరే పరిభాషలోకి పరకాయ ప్రవేశం చేయించి, దానికొక ధర జోడిస్తే చాలామందికి అవి అంత అభ్యంతరకరంగా అనిపించవు. వాటిని మనం ప్రత్యక్షంగా చూడం కాబట్టి అవి పరస్పర సంబంధం లేని అంశాల్లా కనిపిస్తాయి. మనం చూడగలిగింది ధర ఒక్కటే.

ఎందుకని? ఈ ప్రశ్నకు జవాబు ఎప్పుడు దొరుకుతుందంటే దుర్భరమైన పరిస్థితుల్లో తయారైన జంతు మాంసమని తెలిసీ దాన్ని మనం ఎందుకు తింటున్నామో అర్ధం చేసుకోగలిగిన నాడు దొరుకుతుంది. అది దొరికినప్పుడే అనేక ఇతర అంశాలలో కూడా మనం గాడంగా నమ్మే నైతిక సూత్రాలకు విరుద్ధంగా ఎందుకు ప్రవర్తిస్తామో అర్ధం చేసుకోగలుగుతాం.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

వినియోగదారులుగా మనం మన నిర్ణయాల పర్యవసానాల గురించి పెద్దగా ఆలోచించం.

అంతర్గత సంఘర్షణ

ఈ 'మాంసాహార వైరుధ్యాన్ని' "ప్రజల్లో మాంసాహారం పట్ల ఉండే ఇష్టానికి, జంతు హింస పట్ల ఉండే వ్యతిరేకతకు మధ్య జరిగే ఒక మానసిక సంఘర్షణ' గా అర్ధం చేసుకోవాలని దీని మీద ఆస్ట్రేలియాలో అధ్యయనం చేస్తున్న మానసిక శాస్త్రవేత్తలు బ్రాక్ బాస్టియన్, స్టీవ్ లోనన్ అంటారు.

"ఇతరులకు హాని చేయాలనుకోవడం నీతిమంతులమని మన పట్ల మనకుండే అభిప్రాయంతో ఏ మాత్రం పొసగదు.

అందుకే మాంసాహార సేవనం మాంసాహారులకు కూడా ఇబ్బందికరమైన విషయమైపోయి తమ దృష్టిలో తామే చెడ్డ వాళ్ళుగా కనిపించే ప్రమాదం ఉంది. నేను మంచివాడిగా ఉంటూ కూడా మాంసం తినడం ఎలా అనే సమస్య వస్తుంది.

ఈ నైతిక సంఘర్షణ మాంసాహారం తినడంలోని మన ఆనందాన్ని మాత్రమే కాదు హరించేది, మన గురించిన మన గుర్తింపుకే ప్రమాదం కలిగిస్తుంది. ఆ ప్రమాదం రాకుండా ఉండడానికీ, మన గుర్తింపును మనం భద్రంగా కాపాడుకుని ఎటువంటి మానసిక అలజడీ లేకుండా బతకడానికీ అందరం కొన్ని రకాల అలవాట్లను, సామాజిక కట్టుబాట్లను ఏర్పరచుకుంటాం. ఉదాహరణకు మాంసాహారం తినడాన్ని కొన్ని ఆచారాలకు ముడిపెడతాం.

ఫొటో సోర్స్, iStock

ఉదాహరణకు పండగలను, సెలవులను కుటుంబంతో, స్నేహితులతో మాంసాహారం తింటూ గడిపే రోజులుగా నిర్వచించుకుంటాం.

కొందరేమో మాంసాహారం తినడం పురుషత్వానికి చిహ్నమని నమ్ముతారు. మాంసాహారమే అసలైన మగవాడిని తయారు చేస్తుందని చెప్తారు. లేదా మానవ జాతి స్వభావసిద్ధంగానే మాంసాహార జాతి అని వాదిస్తారు. ఇలాంటి ఎన్నో రకాల సమర్ధనలను తయారు చేసి పెట్టుకుంటాం మనం.

మనకొచ్చే చాలా రకాల అనారోగ్యాలకు జంతువుల ఉత్పత్తులు తినడమే కారణమని తెలిసినప్పటికీ మనమెవరైనా వెగాన్ (పాలు, పెరుగుతో సహా జంతు ఉత్పత్తులేవీ తినని వాళ్ళు)గా మారాలని అనుకుంటున్నాము అని అనగానే మనం మొట్టమొదట ఎదుర్కొనే ప్రశ్న "మరి శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు ఎక్కడినుంచి వస్తాయి?" ఆ తర్వాత ఇంకేముంది, స్నేహితులు విందులకు పిలవడం "మరిచిపోతుంటారు."

ఒక్క మాంసాహారం విషయంలోనే కాదు, ఇతర చాలా నిర్ణయాల్లో కూడా మనం ఆ పని చేసిన తర్వాత దానికో సమర్ధన వెతుక్కుంటాం.

ఆ నిర్ణయం ఎందుకు సరైనదో, మళ్ళీ మళ్ళీ చేసినా ఎందుకు తప్పు కాదో మనకు మనమే నచ్చజెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు కొన్ని నెపాలు కావాలి. లేకపోతే మన దృష్టిలోనే మనం చెడ్డవాళ్ళై పోతాం.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రపంచవ్యాప్తంగా విందులు వినోదాల్లో మాంసంతో వండిన కూరలే ప్రధాన ఆకర్షణ

ఇవి కూడా మీకు నచ్చొచ్చు

ఇప్పుడు మనం తింటున్న మోతాదులో మాంసకృత్తులు మన శరీరానికి నిజంగా అవసరమా?

ఒకినావాలో మనుషులు దీర్ఘకాలం బతకడానికి పిండి పదార్ధాలు ఎక్కువగా తినడమే కారణమా?

ప్రపంచ జనమంతా హఠాత్తుగా శాకాహారులుగా మారిపోతే ఏమవుతుంది?

మనం ఒకటి మాట్లాడుతూ ఇంకోటి చేస్తూ ఉంటే, అంటే పరస్పరం పొంతన లేని అభిప్రాయాలను కలిగి ఉంటే ఆ స్థితిని మానసిక శాస్త్రవేత్తలు 'వైరుధ్య మనః స్థితి' అని పిలుస్తారు.

లియోన్ ఫెస్తింగర్ 1957లో మొదట ఈ పదాన్ని వాడారు. ఫెస్తింగర్, జేమ్స్ కార్ల్ స్మిత్ కలిసి దీని గురించి 'ఈ రంగంలో జరిగిన ఒక గొప్ప ప్రయోగం' పేరుతో ఒక వ్యాసం రాశారు.

"ఒక మనిషి తన వ్యక్తిగత అభిప్రాయానికి భిన్నమైన పని చేయాల్సి వచ్చినప్పుడు లేదా మాట్లాడాల్సి వచ్చినప్పుడు అతని వ్యక్తిగత అభిప్రాయం ఏమవుతుంది?" అని వారు అందులో ఒక ప్రశ్నను లేవనెత్తారు.

వారు ఆ ప్రయోగాన్ని మొత్తం 71 మంది పురుషులతో చేశారు. అందులో ప్రతి ఒక్కరికీ రెండు పనులు అప్పగించారు.

మొదటి పని - ప్రతి వ్యక్తీ ఒక ట్రేలో 12 చెక్క చుట్టలను పెట్టి, తీసేసి, మళ్ళీ పెట్టి, తీసేసి...ఇలా అరగంట సేపు ఆపకుండా చేయాలి.

ఆ తర్వాత 48 చదరపు శీలలు ఉండే ఒక చెక్క బోర్డు వాళ్లకు ఇచ్చి ప్రతి శీలను గడియార దిశలో ముందు పావు వంతు తిప్పి, తర్వాత మరో పావు వంతు తిప్పి... ఇలా అరగంట సేపు చేయమన్నారు. ఒక పరిశోధకుడు చాలా శ్రద్ధగా వాళ్ళు చేస్తున్నది చూసి రాసుకున్నాడు. కావాలనే వాళ్లకు ఇటువంటి పనులు ఇచ్చారు. నిజంగానే చాలా విసుగు పుట్టించే పనులు అవి.

తాము చేస్తున్న పనిని బేరీజు వేస్తున్నారని వారందరూ అనుకున్నారు. కానీ నిజానికి పరిశోధకులకు ఆసక్తి ఉన్నది ఆ తర్వాత వాళ్ళ చేత చేయించిన దాని మీద. ఈ రెండు విసుగు పనుల తర్వాత వాళ్ళను ఒక వెయిటింగ్ రూమ్‌లోకి తీసుకెళ్ళారు.

అక్కడ వేచి ఉన్న ఒక వ్యక్తిని తర్వాత ఈ ప్రయోగంలో పాల్గొనబోయే వ్యక్తిగా పరిచయం చేశారు. మూడింట ఒక వంతు మందికి అంతకంటే ఇంకేమీ చెప్పకుండా కూర్చోబెట్టారు. మిగతా రెండొంతుల మందిని పరిశోధకుడు ఒక ప్రశ్న అడిగాడు... కొత్తగా వచ్చినతనితో మీరు ఒక అబద్ధం చెపుతారా అని. ఊరికే చెప్పనక్కరలేదు, దానికి కొంత డబ్బు కూడా ఇస్తామని చెపుతాడు. సగం మందికేమో అబద్ధానికి ఒక డాలర్ ఇస్తామని చెపుతాడు, మిగతా సగం మందికేమో 20 డాలర్లు ఇస్తామని చెపుతాడు. (1950లలో 20 డాలర్లంటే చాలా ఎక్కువే.) వాళ్ళు సరే అన్నాక పరిశోధకుడు వారికి ఒక కాగితం ఇస్తాడు. అందులో "బాగా నచ్చింది", "చాలా సరదాగా అనిపించింది", "భలే ఆస్వాదించాను", "మహా ఆసక్తిగా ఉంది", "మరింత తెలుసుకోవాలనిపించింది", "ఉత్తేజకరంగా ఉంది" లాంటి వాక్యాలున్నాయి. వాటిల్లో ఏదో ఒక దానికి టిక్ పెట్టమని చెపుతాడు.

ఆ డబ్బు వాళ్ళ రేటింగ్ మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుందో తెలుసుకోవడమే ఈ ప్రయోగం అసలు ఉద్దేశం. బాగా విసుగు పుట్టే పనిని 'చాలా సరదాగా చేశాము' అని అబద్ధం చెప్పడమనేది వారి మనస్సుల మీద ఎటువంటి ప్రభావం వేస్తుంది? ఆ అబద్ధాన్ని తామే నమ్మేలా చేస్తుందా! ఒక అబద్ధాన్ని నిజమని నమ్మడంపై డబ్బు ప్రభావం ఎంత ఉంటుంది? ఇవీ వాళ్ళు తెలుసుకోవా లనుకుంటున్న జవాబులు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సాధారణంగా మనం ఉపయోగించే రకరకాల చిన్న, పెద్ద వస్తువులను తయారుచేసిన వారి జీవన స్థితిగతులు గానీ, పని ప్రదేశంలో వారి స్థితిగానీ మనకి తెలిసి ఉండవు.

ఇంతకీ ఆ ప్రయోగం చేయడం తమకు భలే సరదాగా అనిపించిందని అన్నవాళ్లెవరో తెలుసా!

అబద్ధం గురించి, డబ్బుల గురించి ఏమీ తెలియని మొదటి బృందం పూర్తి నిజాయతీగా ఆ ప్రయోగం చాలా విసుగ్గా ఉందని, మరోసారి అలాంటి పని చేయబోమని చెప్పారు.

అబద్ధం చెప్పడానికి డబ్బు తీసుకున్న వాళ్ళందరూ ఆ ప్రయోగం తమకు చాలా నచ్చిందని, భవిష్యత్తులో మళ్ళీ అటువంటి ప్రయోగాల్లో పాల్గొనే అవకాశం వస్తే అంగీకారం తెలపడానికి సుముఖంగా ఉంటామని చెప్పారు.

చెప్పారే గాని అబద్ధం చెప్పడానికి ఒక డాలరు తీసుకున్న వాళ్లకు అది ఇబ్బందిగా ఉంది. "ముష్టి రూపాయి కోసం నేను అంత అబద్ధం ఎందుకు చెప్పాను" అని వాళ్ళు చాలా అంతర్మథనం చెందారు. కానీ వెనక్కి వెళ్లి వేరే జవాబు ఇచ్చే అవకాశం లేదు. ఏం చేయాలి? ఆ 'వైరుధ్య మనః స్థితి'లో వాళ్ళు చేయగలిగింది ఒక్కటే. ఆ పని నిజంగానే సరదాగా ఉండి ఉండాలి, లేకపోతే నేనెందుకలా అంటాను? అని తమను తాము సమాధానపరచుకోవడం.

ఆ పనే చేశారు వాళ్ళు. 20 డాలర్లు తీసుకున్న వాళ్లకు ఆ సమస్య రాలేదు. ఎక్కువ డబ్బు ఇచ్చారు కాబట్టి అబద్ధం చెపితే మాత్రం ఏమిటి అనుకున్నారు వాళ్ళు. వాళ్లకు తమ మనఃసాక్షితో ఎటువంటి ఇబ్బంది రాలేదు.

తర్వాత జరిగిన ఎన్నో ప్రయోగాల్లో కూడా మన ప్రవర్తనకు తగ్గట్టుగా మనం మన విశ్వాసాలను మలచుకుంటామని, అలా చేయడంలో డబ్బు ప్రభావం చాలా ఉంటుందని వెల్లడైంది.

1962లో ఫెస్తింగర్ తాను తెలుసుకున్న విషయాల గురించి మరింత స్పష్టంగా రాశారు. సాధారణంగా మనం మన విశ్వాసాలకు, ప్రవర్తనకు తేడా ఏమీ లేదని భావిస్తుంటాం. కానీ, అది ఎల్లప్పుడూ నిజం కాదని ఆయన అంటారు. కొన్నిసార్లు మనం దారి తప్పుతామని అంటారు. ఆయన భాషలో చెప్పాలంటే 'రోగ్'గా మారిపోతాము. ఈ పొంతన లేని తనాన్నే ఆయన వైరుధ్యం అంటున్నారు. ఆయన దాన్ని ఈ విధంగా సూత్రీకరిస్తున్నారు.

• ఆలోచనకు, చేతలకు మధ్యన ఏర్పడే వైరుధ్యం ఏ మనిషికైనా మానసికంగా ఇబ్బందికరమే. అందువల్ల దాన్ని తగ్గించుకోవడానికే ప్రయత్నిస్తారు.

• తగ్గించుకోవడానికి ప్రయత్నించడంతో పాటు ఆ వైరుధ్యాన్ని పెంచే సమాచారం తెలుసుకోకుండా ఉండడానికి కూడా ప్రయత్నిస్తారు. వైరుధ్యాన్ని పెంచే అవకాశం ఉన్న పరిస్థితి ఎదురైనప్పుడు వీలైనంత వరకు దాన్నించి తప్పించుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు.

ఫొటో సోర్స్, AFP

వైరుధ్యానికి అందమైన ముసుగు

ఆకలి ఎలాగైతే దాన్ని తగ్గించుకోవడానికి ఆహారాన్ని వెతుక్కునేలా చేస్తుందో, అభిజ్ఞా వైరుధ్యం (కాగ్నిటివ్ డిసొనెన్స్) కూడా దాన్ని తగ్గించే పరిస్థితుల కోసం వెతుక్కుంటుందని ఆయన వివరిస్తారు.

మాంసం తినే విషయంలో దీన్ని సాధించడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి మన ప్రవర్తన మార్చుకోవడం, రెండు మన విశ్వాసాన్ని మార్చుకోవడం.

అంటే మాంసం తినడమైనా మానేయాలి లేదా మాంసం తినడం నైతికంగా ఎందుకు సరైనదో కారణాలైనా వెతుక్కోవాలి.

'మాంసాహార వైరుధ్యాన్ని' జయించేందుకు మనం సొంతంగా చేసే ప్రయత్నాలను అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్ శాఖలు కొంతవరకు బాగా సులభతరం చేస్తున్నాయి.

ఏ జంతువు నుంచి ఆ మాంసం వచ్చిందో చెప్పకుండా దాన్ని అమ్మడం వాళ్ళు అనుసరిస్తున్న ఒక పద్ధతి. ఆ విధంగా మాంసాహారం తినడాన్ని ఆమోదయోగ్యం చేసే ప్రయత్నం జరుగుతోందని 'ప్రజా సంస్కృతిలో జంతు రూపాల'పై పరిశోధన చేసిన సోషియాలజిస్ట్ లిజ్ అంటారు.

మనం దీన్ని ఎలా అంతర్గతం చేసుకుంటామంటే "మొదట జంతువులు ప్రేమించదగ్గవి, మాంసం తినదగ్గది అని అనుకోవడం ప్రారంభిస్తాం. ఆ తర్వాత జంతువులను, మాంసాన్ని పరస్పర సంబంధం లేని వేరు వేరు విషయాలుగా చూడడం ప్రారంభిస్తాం" అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, AFP

అందుకే మనం పేర్లు మార్చి లేత ఆవు దూడ మాంసాన్ని 'వీల్' అని, పంది మాంసాన్ని 'హామ్' అని, అడవి జంతువును చంపడాన్ని 'వేట' అని పిలవడం మొదలుపెట్టాం. భౌతికంగా, మౌఖికంగా, భావనాపరంగా మనం మన ఆహారపు మూలాలను గుర్తించకుండా ఉండడానికి మృత జంతువులను అందంగా ప్యాకేజీల్లో అమర్చడం మొదలుపెట్టాం.

మాంసం విక్రయాల విషయానికి వస్తే ఇది రెండు పద్ధతుల్లో జరుగుతోందని లిజ్ తెలిపారు.

మొదటి పద్ధతి ఏమిటంటే - మాంసాన్ని పూర్తిగా శుభ్రం చేసి, ముక్కలు కొట్టి, ప్లాస్టిక్ కవర్లలో అమ్మడం. దీని వలన ఆ కవర్లలోది అసలు ఒక జంతువు నుంచే వచ్చిందనేది నమ్మశక్యమే కాదు.

రెండోది.. జంతువులను ఉన్న దాని కంటే ఎక్కువ అందంగా చూపెట్టే పద్ధతి. దీన్ని ఇంగ్లిష్‌లో క్యూటిఫికేషన్ అంటున్నారు. మిగతా చోట్ల కంటే ఆసియాలోని కొన్ని దేశాల్లో, ముఖ్యంగా జపాన్‌లో దీన్ని ఒక ఎత్తుగడగానే వాడుతున్నారు.

పెద్ద కళ్ళు, గుండ్రటి నోరు, చిన్న అవయవాలు... ఇంకో రకంగా చెప్పాలంటే పిల్లల కథల పుస్తకాల్లో కనిపించే బొమ్మల్లా జంతువులను చూపెట్టే పద్ధతి. అడ్వర్టైజర్లు ఉపయోగించే ఈ పద్ధతికి మానవ అధ్యయన శాస్త్రవేత్త కాన్రాడ్ లోరెంజ్ 'బేబీ స్కీమా' అని పేరు పెట్టారు. అంటే సూక్ష్మ యుక్తి అనే అర్ధంలో.

మనం తినే జంతు మాంసం అలాంటి సంతోషకరమైన, ఊహాజనితమైన జంతువుల నుంచి వస్తోందని చెప్పడమే వాళ్ళ ఉద్దేశమట. మొత్తం మీద రెండు పద్ధతులూ జంతువుల పట్ల మన క్రూరత్వాన్ని కనబడకుండా చేయడానికి లేదా కప్పి పెట్టడానికి జరుగుతున్నవే.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

చాలాసార్లు మన నైతిక నిర్ణయాలు ఇతరుల అభిప్రాయాల ఆధారంగా రూపొందుతాయి.

ఇది ఒక్క మాంసాహారానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఒకసారి మనం జంతువులను గానీ, మనుషులను గానీ వస్తువులుగా చూడడం ప్రారంభిస్తే, తద్వారా మనం ఉపయోగించే వస్తువుల తయారీ వెనకున్న కష్టాలను మన మనస్సుకు తాకకుండా చూసుకుంటే క్రూరంగా ఉండడం మనకు చాలా తేలికవుతుంది.

అందుకే మాంసం విషయంలో మనం చేస్తున్న ఆలోచనల లాంటివే నైతికంగా ఆమోదయోగ్యం కాని, డబ్బుతో సంబంధమున్న అనేక ఇతర విషయాలలో కూడా చేయగలుగుతున్నాం.

పేదరికం చాలామందికి తిండి లేకుండా చేస్తున్నదని మనకు తెలుసు. అయినా మన సంపదను వాళ్ళతో పంచుకోవాలను కోకుండా బజారుకు వెళ్లి మరో ఖరీదైన చెప్పుల జతను కొనుక్కుంటాం. బాల కార్మికుల చేత పని చేయించుకోవడం గాని, కార్మికులు దుర్భర పరిస్థితుల్లో పని చేయాల్సి రావడం గాని మనకెవరికీ సుతరామూ ఇష్టమైన విషయం కాదు. అయినా మనం డిస్కౌంట్ షాపులకు వెళ్లి వస్తువులు కొనుక్కుంటాం.

వెరసి మనం మన సున్నితమైన 'గుర్తింపులను' భద్రంగా కాపాడు కోవడానికి, మనం నైతికంగా మంచి మనుషులమే అనే భ్రమల్లో బతకడానికి చీకటినే ఎంచుకుంటాం.

పొంతన లేని ప్రవర్తనను సమర్ధించుకోవడానికి చేసే అనైతిక ఆలోచనలను మనం క్రమేణా ఇతరులకు కూడా వ్యాప్తి చేసే ప్రమాదముంది. క్రమేణా అది కలగజేసే అసౌకర్యాన్ని సాధ్యమైనంత తక్కువ చేసే సమాజాలను, మన వైరుధ్యాలను మనకు గుర్తు చేయని సమాజాలను రూపొందించుకోవడం ప్రారంభిస్తాం.

మన తప్పును ఎవరైనా నిరంతరం గుర్తు చేయడం ఏం బాగుంటుంది? 'పొంతన లేని తనం' లోని అసంబద్ధతను జయించడానికి మనం కొత్త రకమైన సమర్ధనలు వెతుక్కునే క్రమంలో కొన్ని విషయాల్లో అనైతికం అనే భావనే అదృశ్యం కావొచ్చని బాస్టియన్, లోనన్ లు అంటారు.

హిపోక్రసి (రెండు నాల్కల ధోరణి) కొన్ని సామాజిక, సాంస్కృతిక వాతావరణాలలో చాలా తేలిగ్గా వృద్ధి చెందుతుంది. కొన్ని రకాల ప్రవర్తనను సాధారణీకరించడం ద్వారా లేదా కనబడకుండా చేయడం ద్వారా నైతిక ఘర్షణలను కప్పి పెట్టి మార్పు రాకుండా అడ్డుకోగల శక్తి 'సామాజిక అలవాట్ల' (social habits) కు ఉంది.

మనం మన రెండు నాల్కల ధోరణిని గుర్తించి, మనుషుల గురించి, జంతువుల గురించి, భూమి గురించి మాట్లాడుకునే పద్ధతిలో విప్లవాత్మక మార్పులను చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన అనైతిక ప్రవర్తనను సమర్ధించుకోవడానికి మానసికంగా సర్కస్ ఫీట్లు చేయడం మానేసి ఆ ప్రవర్తననే మార్చుకునే ప్రయత్నం చేయాలి.

మనకు అపరాధభావం కలిగే అనైతిక అంశాలలో కొన్నిటినైనా గుర్తించి, మార్చుకునే ప్రయత్నం చేస్తే మనుషులుగా మనం మరింత సంతోషంగా బతకగలుగుతాం. ఒక గ్రహంగా భూమి మరింత నివాసయోగ్యంగా మారుతుంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)